Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 35

 

    బాబాయికేమీ అభ్యంతరం వుండదు. కానీ ------ పిన్నీ పురాతన ఆచారాలు వదలనంటుంది.
    ఆమెకు నచ్చ చెప్పటమే కష్టం.
    హటాత్తుగా గుర్తుకొచ్చింది సృజన్ బాబుకి.
    శాంతికి అంతకుముందు వివాహం అయిందనీ, భర్త చనిపోయాడనీ తను శ్రీపతికి చెప్పనే లేదు. అతని కలాంటి పట్టింపులేమీ వుండవు కాని -- అతని తల్లిదండ్రుల మాటేమిటి? వాళ్ళెందుకొప్పుకొంటారు అలాంటి అమ్మాయిని కొడలుగా చేసుకోడానికి? వారికి మాత్రం ఆచారాలూ పట్టింపులూ వుండవూ?
    ఏమయినా ఈ విషయం ముందు శ్రీపతికి తెలియజేయాలి. అతని తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నాక-- అప్పుడు బాబాయికి పిన్నీకీ నచ్చచెప్పవచ్చు.
    లేచి శ్రీపతి పనిచేసే సెక్షన్ లోకి నడిచాడు సృజన్ బాబు. అతని సీటు ఖాళీగా కనిపించింది.
    "రెండు రోజులు సెలవు పెట్టాడండీ!" అన్నాడు పక్కసీటతను.
    తిరిగి తన టేబుల్ దగ్గరకు నడిచాడు సృజన్ బాబు. అతనికి లోలోపల చాలా ఆనందంగా వుంది. శాంతికి వివాహం చేయాలన్నదే మొదట్నుంచీ తన వుద్దేశం. అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. ఇలాంటి విషయాల్లో జాప్యం చేయడం కూడా మంచిది కాదు. ఎంత త్వరగా వారిద్దరికీ వివాహం జరిపించేస్తే అంత మంచిది. శాంతి కూడా తను అనుకున్నంత అమాయకురాలేమీ కాదు. ఇన్ని విషయాలు అతనితో ఎలా మాట్లాడగలిగిందో బహుశా తనతో చెప్పడానికి సిగ్గుపడి వుంటుంది.
    మధ్యాహ్నం ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటికి చేరుకొన్నాడు సృజన్ బాబు వెళ్తూనే ఈ వార్త తల్లిదండ్రుల చెవిన వేశాడు. శాంతి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడింట్లో . నాలుగింటికే వచ్చేసింది శాంతి.
    ఆమెను చూస్తూనే "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు నవ్వుతూ.
    "ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగింది శాంతి.
    "నువ్వు వివాహం చేసుకోబోతున్నందుకు!"
    ఆమె ముఖం గంభీరంగా తయారయింది. బహుశా శ్రీపతి అంతా చెప్పి వుంటాడు అనుకుంది.
    "కాని ....... ఇదంతా శ్రీపతి గారి ప్రోద్భాలమే అన్నయ్యా!" గోడకు చేరగిలబడి జడ ముందుకేసుకొని కొసలు మెలిపెడుతూ అన్నది శాంతి.
    "ఎవరిదయితేనేమమ్మా! నాక్కావలసింది -- నీకు వివాహం జరగడం. అదీ శ్రీపతి లాంటి ఆధునిక భావాలు కల వ్యక్తితో .....!"
    శాంతి ఏమీ మాట్లాడలేకపోయింది.
    ఎందుకో ఆమె మనసు సంపూర్తిగా శ్రీపతిని అంగీకరించలేకపోతుంది. వినోద్ అంటే ఎంత కోపమున్నా అతనంటేనే ఎక్కువ ఇష్టపడుతోంది. అతని భావాలూ- అభిప్రాయాలు తనకు నచ్చకపోయినా , అతనిలో మరేదో ఆకర్షణ వుంది. బహుశా అది అతని వ్యక్తిత్వమే అయి వుంటుంది.
    "నేను రెండు మూడు రోజుల్లో ఇంటికెళ్ళి బాబాయికీ, పిన్నీకీ కూడా ఈ విషయం నచ్చచెప్పివస్తాను! వివాహం కూడా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీసులో జరిపిద్దాం . ఏమంటావ్?"
    అయోమయంగా తల ఊపింది శాంతి.
    మర్నాడు కాలేజీలో శాంతి చెప్పిన వార్త విని ఆశ్చర్యపోయింది సరస్వతి. వితంతువు అయిన స్త్రీకి ఇంత తేలిగ్గా వివాహం జరుగుతుందంటే నమ్మలేక పోయిందామే.
    ఆరోజే తన ఇంట్లో అందరికీ చాటించెసిందా విషయం వినోద్ ఆ వార్తా వింటూనే నిరుత్సాహపడిపోయాడు. శాంతికి వివాహం జరగకూడదని అతనికి లేదు. కాని అతనింత అకస్మాత్తుగా అలాంటి వార్తవిని తట్టుకోలేకపోతున్నాడు. ఎందుచేతో శాంతి ఎప్పటికీ తన స్నేహితురాలిగానే వుండి పోతుందనుకున్నాడు. అమెకిక ఎప్పటికీ వివాహం కాదనే అభిప్రాయంతో వున్నాడు.
    కాని తన అభిప్రాయం తప్పని ఋజువయిపోయింది. శాంతిని వివాహం చేసుకోవడమంటే సామాన్యమయిన విషయం కాదు. ఆ యువకుడు ఎంతో గుండె నిబ్బరం , ఎంతో విశాల హృదయం కలవాడయి వుంటాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది వుంటారు? వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.
    తనూ ఉన్నాడు. తనకూ యెన్నో ఆలోచనలున్నాయ్, యెన్నో విప్లవాత్మకమైన భావాలున్నాయ్ వితంతు వివాహాలు జరగటం మంచిదే అని ఒకప్పుడు తనూ అనుకొన్నాడు. కాని ఏ ఒక్కటీ ఆచరించెంత ధైర్యం లేదు.
    అలాంటి ధైర్యమే వున్నట్లయితే శాంతి ఇలా మరొకరి సొత్తు అయేది కాదు. తనే సొంతం చేసుకొనేవాడు. అంత అందం- అంత అణకువా , అంత తెలివీ -- తనకు తెలిసిన అమ్మాయిలలో ఎవరికీ లేవు.
    తనమీది తనకే అసహ్యం కలిగిందతనికి.
    జనాభా పెరుగుదలను అరికట్టాలంటే వితంతు వివాహాలను ప్రోత్సహించరాదన్న తన అభిప్రాయం కూడా తప్పనిపించింది.


                                       18


    సరోజ సెలవు తీసుకుని తల్లిదండ్రులను చూడటానికని ఊరు బయల్దేరింది. స్వరూపను కూడా రమ్మని బలవంతం చేసింది కాని స్వరూప ఒప్పుకోలేదు. కొంత కాలం పాటు తనేక్కడికీ కదలదల్చుకాలేదని చెప్పేసింది.
    సరోజ ఒక్కర్తే ఆరోజు రాత్రి బస్ కి వెళ్ళి పోయింది.
    మర్నాడు సరోజ లేందే ఇంట్లో వంట చేయబుద్ది కాలేదు స్వరూపకు. హోటల్లో కాఫీ టిఫిన్ చేసి ఆఫీస్ కెళ్ళి పోయింది.
    మధ్యాహ్నం లంచ్ టైం లో సరోజ రాకపోవడం చూసి "ఇవాళ సరోజ గారు రాలేదేమిటింకా?" అని అడిగాడు సృజన్ బాబు.
    "ఆమె నిన్న రాత్రే వూరు వెళ్ళింది. వారం రోజులు సెలవులో ----"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS