"అమలు పరుస్తే ఇంకా బాగుంటుంది సృజన్ బాబు గారూ. మనదేశంలో నిరుద్యోగ సమస్య సగానిక సగం తగ్గిపోతుంది ....."
"యెంత చేసినా మన దేశం లాంటి అత్యధిక జనాభా కల దేశానికి ప్రతిదీ సమస్యగానే వుంటుంది !" అన్నాడు సృజన్ బాబు.
"అది కూడా నేనాలోచించాను! ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కనకూడదు. విడో మారేజేస్ మన పూర్వెకులు ఎందుకు నిషేధించారనుకొన్నారు! జనాభా పెరగాకూదడనే ఉద్దేశ్యంతోనే. మగాడు కానీ, ఆడది గానీ రెండో పెళ్ళి చేసుకోకూడదు. అంతే! అప్పుడు జనాభా కంట్రోల్ ఎందుక్కాదు చూడండి -------"
శాంతి అక్కడి నుంచి లోపలకు వెళ్ళిపోయింది. ఆమె మనసు గాయపడిందేమోనని తల్లడిల్లిపోయాడు సృజన్ బాబు. అతనికి వినోద్ మీద విపరీతమయిన కోపం వచ్చింది.
"వితంతువులకు వివాహం కాకూడదనేది మానవత్వం లేని వాదన....... " అన్నాడు కోపంగా.
"ఎందుకనంటారు?" సౌమ్యంగా అడిగాడు వినోద్.
"లేకపోతే ఏమిటి? భర్త చనిపోయినంత మాత్రాన ఆడదాని జీవితం అక్కడితో అంతమయి పోవాల్సిందేనా? ఆ మాట కొస్తే మగాడు మాత్రం "పిల్లలను చూడానికి " అనే నెపంతో ద్వితీయ వివాహం చేసుకోవటం లేదూ? ఆడది మాత్రం అలా ఎందుకు చేసుకోకూడదు ? ఆడా మగా ఎవరయినా సరే తమ జీవిత భాగస్వామి పోయినప్పుడు -- ఆ గాయం మరచిపోవడానికి , మాములు జీవితంలోకి తిరిగి ప్రయాణించడానికి ద్వితీయ వివాహం ఎంతో అవసరం ...."
వినోద్ ఆలోచనలో పడ్డాడు.
"ఈ విధంగా నేనెప్పుడూ ఆలోచించలేదు. సృజన్ బాబు గారూ! మరోసారి ఆలోచించాలనుకుంటున్నానిప్పుడు" నవ్వుతూ అన్నాడు కొద్ది సేపటి తర్వాత.
తన కోపానికి తనే సిగ్గుపడ్డాడు సృజన్ బాబు. అతనంత నెమ్మదిగా సౌమ్యంగా మాట్లాడుతుంటే తనేందుకంత ఆవేశపడిపోయాడు? శాంతినే అతనలా అంటున్నాడని ఊహించుకొని అలా ,మాట్లాడేశాడతను. నిజానికి వినోద్ కి శాంతి గురించి ఏమీ తెలీదు. తెలిస్తే అలా మాట్లాడే వాడు కాదేమో! హటాత్తుగా స్వరూప గుర్తుకొచ్చింది సృజన్ బాబుకి.
ఆమె తప్పు చేసింది. నిజమే! కాని తప్పు చేసినంత మాత్రాన ఆమెను ఓ నేరాస్తురాలిగా - దోషిలా- తిరిగి సంస్కరింపబడడానికి వీలులేని దానిలా భావించడం- శిక్షించడం, దారుణం! తను ఆమె వివాహం రోజున ఇంత తెలివిగా ఆలోచించలేకపోయాడు . కుంచించుకుపోయిన మనసుతో -- తన స్నేహితుడికేదో అన్యాయం జరిగిపోతున్నదన్న అక్రమ భావనతో ఆ వివాహం చెడగొట్టాడు. సురేంద్ర మనసు కూడా పాడు చేశాడు. ఒకవేళ అతని కేమయినా విశాల భావాలున్నా -- వాటిని కూడా కుంచించుకుపోయేట్లు చేశాడు. తన నెవరు క్షమిస్తారు? స్వరూప మాత్రం క్షమించదు.
ఈ విషయం తెలిసిన మరుక్షణం తనని అసహ్యించుకొంటుంది.
మరి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు వినోద్.
మర్నాడు ఆఫీసులో సృజన్ బాబు పేరుతొ ఒక కవరు వచ్చింది. కవరు మీద దస్తూరి అంతకు ముందేక్కడో చూసినట్లు కనిపించింది. కాని ఎక్కడో గుర్తుకు రాలేదు అతనికి.
వుత్తరం బయటకు తీసి చదవటం మొదలు పెట్టాడు.
డియర్ సృజన్.
మనుషుల మధ్య సంబంధాలు భలే తమాషాగా ఉంటాయ్! మనిద్దరం ప్రాణ స్నేహితులం! నిజానికి మనిద్దరి మధ్యా ఎలాంటి రహస్యాలు లేవు ......"
చదవటం ఆపి కింద సంతకం చూశాడు సృజన్ బాబు. శ్రీపతి సంతకం కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. రెండు రోజుల క్రితమే కనిపించిన శ్రీపతికి ఇంతలోనే ఇలా ఉత్తరం రాయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఒకవేళ ఏదయినా ఊరి కెళ్ళాడా? ఉత్తరం మీద అదే వూరి పేరు రాసి వుంది. మళ్ళీ ఆత్రుతగా వుత్తరం చదవసాగాడతను.
"ఈ మధ్యన నీకు తెలీకుండా నేనోపని చేశాను! అందుకు నువ్వు నన్ను క్షమించాలి! శాంతిని నువ్వు పరిచయం చేసిన రోజే నేనామెను ప్రేమించాను. కాని నాకూ ఈ సంగతి చాలా రోజులవరకు తెలీలేదు. ఒకటి రెండుసార్లు శాంతిని రోడ్డు మీద కలుసుకొన్నాను. ఇద్దరం హోటల్లో కూర్చుని మాట్లాడుకొన్నాము. శాంతి కూడా నన్ను ప్రేమిస్తోందన్న నిర్ణయానికొచ్చాకే నీ దగ్గర ఈ విషయం చెప్పాలని అనుకున్నాను, అందుకే మొన్న మీ ఇంటి కొచ్చాను. కానీ ఎంచేతో ముఖాముఖి ఈ విషయం నీతో చెప్పటానికి భయపడ్డాను. నిజానికి భయం కూడా కాదది! విచిత్రమయిన పరిస్థితి! నేనేమీ తప్పు చేయటం లేదని నాకు తెలుసు! నువ్వేమీ అభ్యంతరం చెప్పావని కూడా పూర్తీ నమ్మకం వుంది. నేను శాంతిని వివాహం చేసుకొంటాను. వివాహమయిన తర్వాత కూడా ఆమె చదువుకోవచ్చు. ఈ విషయం శాంతికి కూడా చెప్పాను. అమెకేమయినా అభ్యంతరం వుంటే తెలియ చేయమని అడిగాను. ఆమె ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు.
ఇంకా వ్రాసేందు కేముంది ?
ఇదంతా కాగితం మీద పెట్టాక ఇప్పుడు నా మనసు తేలికయినది. మనిద్దరం రెండు రోజుల తర్వాత కలుసుకొన్నప్పుడు అన్ని విషయాలు సావకాశంగా మాట్లాడుకోవచ్చు. ఈ రెండు రోజులూ నీకు ఆలోచించుకోడానికి టైమిస్తున్నాను . వుంటానిక----
అన్యధా భావించవని ఆశిస్తూ --- నీ శ్రీపతి.
ఆ ఉత్తరం చదివి చాలా సేపటివరకూ ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు సృజన్ బాబు. తనకు తెలియకుండానే ఇంత గొడవ జరిగిందన్న మాట అనుకొన్నాడు నవ్వుకొంటూ.
ఇంతకూ శ్రీపతికి శాంతినిచ్చి పెళ్ళి చేయడానికి శాంతి తల్లిదండ్రులు ఒప్పుకొంటారా లేదా !
