"అలాగా ! అయితే ఇవాళ మనిద్దరం వెళ్దాం పదండి లంచ్ కి ...." అన్నాడతను.
అతన్ని వెంబడించింది స్వరూప.
అతను గేటు బయటకు నడవబోతోంటే "ఇటేక్కడికి ?" అని అడిగింది ఆశ్చర్యంగా.
"కాంటిన్ కెప్పుడూ వెళ్ళను నేను! బయట హోటల్ కి ...."
మౌనంగా అతనితో పాటు నడిచిందామె.
హోటల్ చేరుకొని కూర్చున్నారిద్దరూ.
"మీ గురించి ఏమీ చెప్పరేమిటి , ఎప్పుడూ?" అన్నాడతను నవ్వుతూ.
"ఏముందని చెప్పను?" తనూ నవ్వుతూనే అడిగిందామె.
"ప్రతి మనిషికీ ఓ కధ వుంటుంది కదా! నా కధంతా మొన్నే చెప్పేశాను మీకు. బ్రహ్మచారిననీ- అమ్మా, నాన్నలను కనిపెట్టుకొని ఉన్నాననీ- నాతొ మా బాబాయి కూతురు శాంతి కూడా ఉందనీ- ఆ అమ్మాయికి భర్త పోవడం చేత నా దగ్గరే వుంచుకొని -- పాలిటెక్నిక్ లో చేర్పించాననీ అంతే! అలాగే మీకూ కుటుంబ గాధ ఏమీ లేదా?"
కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయింది స్వరూప. తలుచుకుంటే గుండెలు బరువెక్కిపోతున్నాయ్! తన కధ ఏమని చెప్పగలదు? ఎలా చెప్పగలదు? తన కధంతా కన్నీళ్ళతోనే గడిచిపోతోంది.
"ఊహూ , ఇప్పుడు కాదు! మరోసారి చెబుతాలెండి!" అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ.
"దట్సాల్ రైట్! దాన్దేముంది కానీ సాయంత్రం మా ఇంటికి రాకుదడూ? మా శాంతిని పరిచయం చేస్తాను మీకు...."
అతన్ని కాదనడానికి మనసొప్పలేదు స్వరూపకి.
"మళ్ళీ మిమ్మల్నీ మీ ఇంటివరకూ దిగాబెదతాను లెండి...."
తలూపిందామే.
సాయంత్రం ఇద్దరూ ఆటోలో అతనిల్లు చేరుకొన్నారు.
"ఇలా కూర్చోండి!" అంటూ ఆమెకి సోఫాలు చూపి అతను ఇంట్లోకి నడిచాడు. ఇల్లంతా కలియజూసింది స్వరూప.
ఖరీదయిన ఫర్నిచర్ ఆ ఇంటి కలిమిని చూపుతోంది.
మరుక్షణంలో "నమస్తే!" అంటూ పొట్టిగా అందంగా వున్నా అమ్మాయి దగ్గరగా వచ్చింది లోపల్నుంచీ .
ప్రతి నమస్కారం చేసింది స్వరూప.
"మీరు శాంతి గారేనా ?" అడిగింది స్వరూప.
"అవును! అన్నయ్య ముందే చెప్పేశాడన్నమాట నా గురించి!" అంది శాంతి నవ్వుతూ.
ఈలోగా తను కూడా వచ్చి ఆమె కేదురుగ్గా కూర్చున్నాడు సృజన్ బాబు.
ముగ్గురూ ఏవేవో మాటల్లోకి దిగారు.
శాంతి "టీ" తేవడానికి లోపలికెళ్ళగానే గొంతు తగ్గించి నెమ్మదిగా అన్నాడతను. "త్వరలోనే శాంతికి మళ్ళీ వివాహం చేస్తున్నాం. ఎవరు చేసుకుంటున్నారో తెలుసా? మన ఆఫీస్ లో పబ్లిక్ రిలేషన్ సెక్షన్ లో శ్రీపతి అనే అతను పనిచేస్తున్నాడు! నాకు మంచి స్నేహితుడు లెండీ! అతనే చేసుకుంటున్నాడు ."
"చాలా సంతోషం! అలాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు !" అంది స్వరూప.
నిజమే అనిపించింది స్వరూపకి. అంతా తనలాంటి దురదృషవంతురాళ్ళే ఉంటారా?"
తన తల్లిని కూడా తీసుకొచ్చి పరిచయం చేశాడు సృజన్ బాబు.
"మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి" అంటూ చెప్పాడు గానీ మరే వివరాలూ తెలియజేయలేదు. పొద్దుగూకి పోతుండగా ఇంటికి బయల్దేరింది స్వరూప! తనూ ఆమె వెంబడి బయల్దేరాడు సృజన్ బాబు.
ఆటోలో పావుగంటకల్లా చేరుకున్నారక్కడికి.
"లోపలికి రండి ! మా రూము చూద్దురు గాని ...." అంది అతనిని ఆహ్వానిస్తూ.
"మరోసారి వస్తాలెండి! పొద్దుపోయిన తర్వాత ---- ఇప్పుడు రావడం చూసేవారికి బావుండదేమో!"
నాలిక కరుచుకుంది స్వరూప. నిజమే! తానా విషయం అలోచించనేలేదు.
అతను వెళ్ళిపోయాడు.
గదిలోకి నడిచి లైటు స్వేచ్ వేసి కొద్దిసేపు మంచం మీద కూర్చుండిపోయింది స్వరూప! సృజన్ బాబు ఎంతో మంచి మనిషిలా కనిపించాడామెకి. రాను రాను అతను తనకి ముఖ్యమయిన స్నేహితుడిగా రూపొందుతున్నాడు.
అంత నిర్మలంగా, నిష్కల్మషంగా మాట్లాడగలగడం అతనిక్కడికే చేతనవుననిపించింది.
మిగతా గుమాస్తాలు కూడా కొంతమంది తనతో మాట్లాడతారు కాని మనస్పూర్తిగా కాదు. మర్నాడు సాయంత్రం అఫీసవగానే సృజన్ బాబుతో పాటు తనూ బయటకు నడిచింది స్వరూప.
"ఇంటికేనా?" అడిగాడు సృజన్ బాబు గేటు దగ్గర ఆగి.
"అవును!" అంది స్వరూప.
"కాసేపు టాంక్ బండ్ దగ్గర కూర్చుని వెళ్దాం రాకూడదు?"
కొద్ది క్షణాలు త్వరత్వరగా ఆలోచించసాగిందామె.
వెళ్ళడం మంచిదేనా? అడుగుతోంది మరొకరూ మరొకరూ కాదుగా సృజన్ బాబే! సరోజ తర్వాత ఈ సిటీలో తనతో ఇంచుమించుగా అంత స్నేహం గల వ్యక్తీ అతనొక్కడే!
"పోనీ - వీల్లేకపోతే వద్దులెండి" ఆమె ఆలోచనల్ని గమనిస్తూ అన్నాడతను.
"వీల్లేకపోవడానికేముంది !" నవ్వుతూ అందామె.


