మీరిద్దరూ చెరొక చోటా బ్రతుకుతుంటే నేను సంతోషించగలనా!"
"మేం కలిసి బ్రతకడం నువ్వు చూడలేదుగా? ఇది కొత్త అనుభవం కాదే!"
"కొత్త అనుభవం. అదే -- మీ ఇద్దరి మధ్యా ఓ ఇంట్లో తిరిగే కొత్త అనుభవం, ఆ అదృష్టం నాకు కావాలి."
"అసంభవం!"
"నేను వివాహితుడ్ని అవడం కూడా అసంభవమే."
"ఏమిటా మొండి వాదన?' చిరాకుపడి పోయాడు ప్రసాదరావు.
"ఎదిరిస్తున్నానని బాధపడకండి. ఎవరిది మొండి వాదన? ఎవరిది మొండి పట్టుదల? ఎవరిది పగ పేరుకున్న మనసు?"
"నువ్వు లక్ష చెప్పు. ఏమన్నా అను. మా మనస్సులు విరిగిపోయాయి."
"లేదు."
"నీ మొహం!"
"అలా అన్నంత మాత్రాన సరిపోదు. మనస్సు విరిగిపోతే మీరు మళ్ళీ ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? ఆమె పువ్వులు, ముడవదు, సినిమాలు చూడదు. పేరంటాలకి , విందు లోకి వెళ్ళదు. అందమైన చీరల కట్టదు. మొండిగా , హాయిగా బ్రతక్క క్రుంగి పోతుందెందుకు? లేదు. నేను నమ్మను. పగల చాటున మమతలు ఉన్నాయి."
తల విసురుగా అడ్డం గా తిప్పి, "ఛ ఛ! ఏమీ లేవు. ఆమెకున్నా నాకు లేవు. ఇప్పుడెందుకు , బాబూ మమ్మల్ని కలిసి బ్రతకమనడం! ఎన్నాళ్ళు బ్రతకాలి? ఏమనుభవించాలి? ఎందుకనవసర వాదన?' అన్నాడు ప్రసాదరావు.
"నాకేం తెలియదు. అవసరమో, అనవసరమో! మీరు ఇద్దరూ కలిసి ఓ చోట బ్రతికిన నాడు...."
"వద్దు, వద్దు. అదోక్కటీ తప్ప మరేమన్నా అడుగు." అతని మాట కడ్డు వచ్చాడు ప్రసాదరావు.
"పోనీ, మీ ఇష్ట ప్రకారమే ఉండండి. నామీదేగా మీ ఇద్దరూ కసి తీర్చు కుంటున్నారు? నేనేగా ఇద్దరి మధ్యా నలిగి పోతున్నాను! బాల్యం లోని అనుభవాలు ఆమె నాశనం చేసింది. మిగతా జీవితం మీరు నాశనం చెయ్యండి."
"కొన్ని నిజాలు నీకు తెలిస్తే మళ్ళీ కలిసి బ్రతకమని చెప్పవు, బాబూ!"
"ఏమిటా నిజాలు! తాతయ్య ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అమ్మ మీద మీకెందు కింత పగ! మీరు వదిలి వచ్చిన నాటికి అమ్మ వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు. అవునా? ఆమె అవివేకంగా మిమ్మల్ని నిరాకరించింది. పౌరుషంగా ఇంట్లోంచి వచ్చేశారు. దేవుడి మొహం చూసి నిజం చెప్పండి. ఆమెను మీరు మరిచిపోలేదు. క్షణక్షణం గుర్తు వస్తుంది. ఆమె మీకు కావాలి. కాని ఆమెను...."
"ఛీ ఛీ! నోర్మూయ్!' అరిచాడు ప్రసాదరావు. నవ్వొచ్చింది వాసుకి. నవ్వలేదు.
"నీకు తెలియదు, వాసూ! మీ అమ్మ తరపున ఇప్పటి వరకూ వాదిస్తూ వచ్చావు. కాని, నా గురించి కూడా కొంత న్యాయంగా ఆలోచించు. నా గుండెల్ని రాజేసే నిప్పు తునకలు , నేను మరిచి పోలేని రెండు సంఘటనలు చెపుతాను, విను....." అంటూ రెండు క్షణాల మౌనం తరవాత -- 'అప్పటికి నువ్వు పుట్టి మూడు నెలలైందనుకుంటాను. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి నేరుగా నువ్వు ఉన్న గదిలోకి వచ్చాను. తొట్టిలో నిద్రపోతున్నావు నువ్వు. మృదువుగా నీ బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకున్నాను. నువ్వు కదిలి కళ్ళు విప్పి బద్దకంగా ఒళ్ళు విరిచావు. నిన్ను చూస్తున్న నా మనస్సు సంతోషంగా ఉంది. సుకుమారంగా, అందంగా రబ్బరు బొమ్మలా ఉన్న నిన్ను మృదువుగా గుండెల కదుముకుని పట్టులా ఉన్న నీ తల ముద్దు పెట్టుకున్నాను. గదిలోకి వచ్చిన మీ అమ్మ విసురుగా నా చేతుల్లో ఉన్న నిన్ను లాక్కుంటూ -- "సిగ్గు లేకపోతె సరి. వాణ్ణి ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? మీకన్నా మా టామీ నయం' అంది పెద్ద గొంతుతో. 'సిగ్గెందుకు నా బిడ్డను నేను ఎత్తుకోవడానికి , అని గొణుక్కుంటూ ఇవతలికి వచ్చేశాను. ఆ తరువాత మళ్ళీ విడిపోయి వచ్చే రోజున నిన్నెత్తుకున్నాను. మళ్ళీ ఐదేళ్ళ తరవాత బస్సులో నిన్ను ఎత్తుకున్నాను. నిజమే, నాకు సిగ్గులేదు.' అంటూ నవ్వి, 'ఇక సిగ్గెందుకు! నువ్వు పుట్టిన నాలుగు నెలల తరవాత-- నిజంగా, దైవ సాక్షిగా చెపుతున్నాను, వాసూ! నువ్వు పసివాడివి కావు కాని అనుభవం లేని వాడివి కావు. ఇప్పుడు చెప్పాలేమో? అప్పటివరకూ జరిగిన వాగ్వాదాలు మరిచి పోదామనీ, మీ అమ్మతో హాయిగా సంసారం చెయ్యాలనీ నిశ్చయించుకున్న నేను-- ఆఫీసు నుంచి వస్తూ, సన్నజాజుల మాల కొన్నాను. అప్పటికి మా గదులు వేరై ఆరు నెలలైంది. రాత్రి పది గంటల వేళ ఆమె గదికి వెళ్ళాను. ఆమె తలలో పూల చెండు ముడిచాను. చివాలున వెనుదిరిగి విసురుగా ఆ పూలు నా మోహన కొట్టింది. నాలో ఆమెను ఎలా అన్నా ఆరోజు అనుభవించాలనే పట్టుదల. బలవంతంగా ఆమెను దగ్గరికి తీసుకున్నాను. అంతే . క్షణం లో నా చెంప చెళ్ళుమంది. దిమ్మెర పోయాను. ఆమెను చుట్టుకున్న నా చేతులు వాలిపోయాయి. ఆమె నన్ను కొట్టిందా! నిజమో, కలో నమ్మలేక పోయాను కొన్ని క్షణాలు. తరవాత అటువంటి ప్రయత్నం, అసలు ఆమెతో మాట్లాడ్డం మానేశాను. ఒక్క నెలే కదూ! నేను ఇంట్లోంచి వచ్చేశాక -- ఏ స్త్రీ కూడా చెయ్యని పని....." అన్నాడు ప్రసాదరావు.
'అమ్మ....ఏం చేసింది? మీకు ద్రోహం చేసిందా? వ్యభిచరించిందా?' అసహనంగా, తొందరపాటుగా అన్నాడు వాసు.
"వాసూ!" అంతకంటే సహించలేనట్టుగా అరిచాడు ప్రసాదరావు.
"మరి? చెప్పండి నాన్నా. పాతికేళ్ళ కొడుక్కి భార్య అవసరం అనుకునే మీరు. ఇరవై మూడేళ్ళ అమ్మకి భర్త అక్కర్లేదనుకున్నారా? పైగా, ఆమె పై అపవాదులు వేస్తారా?"
'అక్కర్లేనిది కాబట్టే మంగళసూత్రం తెంపి పారేసింది."
"ఎవరు చెప్పారు మీకు?" కంపించి పోయాడు వాసు.
"ఎవరు చెబితే ఏం? ఆమె మంగళసూత్రం ...భర్త బ్రతికి ఉండగా ఏ హైందవ స్త్రీ చెయ్యని పని, మంగళసూత్రం తీసేసింది."
'అబద్దం! లేదు. నేను అమ్మ ఉదయం, సాయంత్రం మంగళసూత్రం కళ్ళ కద్దుకుని నమస్కరించడం చాలాసార్లు చూశాను."
"మీ అమ్మ మంగళసూత్రం కళ్ళకద్దుకుని నమస్కరిస్తుందా!' నిరసనగా నవ్వాడు ప్రసాదరావు.
"పోనీండి, నాన్నా! పెళ్ళి చేసుకుని నాన్న వదిలిన అమ్మని నలుగురి కీ పరిచయం చెయ్యలేను. చిన్నబోయిన అమ్మ మొహం నేను చూడలేను."
"అయితే నన్నేం చెయ్య మంటావ్?" విసిగిపోయిన ప్రసాదరావు కొన్ని క్షణాలు తీవ్రంగా అలోచించి ఏమీ తోచక అడిగాడు.
'అమ్మను మీ దగ్గరకు పిలవండి."
"పిలిస్తే మీ అమ్మ వస్తుందా! నలుగురూ నవ్వి పోతారు!"
"ఎందుకు నవ్వడం?"
"జుట్టు పట్టుకు ఈడ్పిస్తే కుక్కలా మళ్ళీ చేరాడని...."
"ఎందుకు నాన్నా, అంత అన్యాయంగా మాట్లడతారు? తాతయ్య ఏనాడో పోయారు. మామయ్యల కేం కావాలి ఇప్పుడు మిమ్మల్ని అనడానికి? వాళ్ళెందుకు ఇన్సల్ట్ చేస్తారు? సరే, తొందరేముంది? రేపు అమ్మ దగ్గరికి వెళతాను. నన్నేం చేయ్యమంటారో!.... మనం అందరం -- అంటే మనం ముగ్గురం కలిసి ఉండాలంటే నేనేం చెయ్యాలో లెటరు వ్రాయండి. తరవాత మీ ముచ్చటలు. నా పెళ్ళి... మీ క్కూడా ఇష్టమైన సంబంధమే చేద్దురు గాని..." అంటూ మరి నిలుచోకుండా వెళ్ళిపోయాడు వాసు. పేపరు గబగబా తిరగేశాడు. కూర్చో బుద్ది కాలేదు. గబగబా డ్రెస్ మర్చి, "అలా పార్కు వైపు వెళ్లొస్తాను" అంటూ వెళ్ళిపోయాడు.
గమ్యం లేని ఆలోచనలు. నిలకడ లేని నిశ్చయాలు. హృదయం తీవ్రంగా స్పందిస్తుంటే మనస్సు కకావికలై పోతుంది. విసురుగా పచార్లు చేస్తున్న ప్రసాదరావు పనివాడు గదిలో స్విచ్ వేసేసరికి , చేతి వాచీ చూసుకున్నాడు. ఏడున్నర. "బాబూ వచ్చాడా? చిన్న బాబు?' అని కలవరపాటుగా ప్రశ్నించాడు.
