"నిజం మీరు చెప్పింది. లోకాన్ని సక్రమ మార్గంలో పెట్టవలసిన వీళ్ళే నీచమైన పద్ధతులకి దిగిపోతే ఇంకేముంది? వస్తానండీ " అంటూ లెక్చరర్ గారు వెళ్ళిపోయారు.
"వద్దు, వద్దు , తర్వాత చూసుకుందాము" అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా తను తెచ్చిన అయిదు వందలూ తిలక్ జేబులో పెట్టేసి, "నేను నీ దగ్గర ఎనార్ధం క్రితం బదులు తీసుకున్నవి ఇవి. నీకు వచ్చిన ఇబ్బందిని పేపరు లో చూసి, అవసరం ఉంటుందని ఈ డబ్బు తీసుకుని వెంటనే బయలుదేరాను. మీ లెక్చరర్ గారి ధర్మమా అంటూ ఇంత కేసూ మంచు విడిపోయినట్లు ఒక్క మాటతో విడిపోయింది. ఇంక నేను వెళ్ళొస్తా" అన్నాడు వెంకట్రామయ్య.
"ఎక్కడికి? మీరు ఎక్కడికీ వెళ్ళడానికి వీలులేదు. నాతొ మీరు నా గదికి రావలసిందే! మిమ్మల్ని చూసి మా అమ్మ ఎంతగానో సంతోషిస్తుంది."
"కాదు. ఇప్పుడు నాకు టైము లేదు. నాలుగు గంటలకి నేను సామర్ల కోట వెళ్ళి మెయిలు ఎక్కాలి. రేపు మద్రాసు లో సర్వోదయ సమ్మేళనం . నేనింకా సర్పవరం వెళ్ళి బట్టలూ, అవీ సర్దుకోవాలి."
"అలాగా? అయితే సరే! మరి మళ్ళీ మిమ్మల్నేప్పుడు కలుసుకోవడం?"
"నేను ఏడెనిమిది రోజుల దాకా తిరిగి రాను."
"అయితే ఓ పని చేస్తా. అప్పుడు నేనే మా అమ్మని తీసుకుని మీ దగ్గర కోస్తా, సర్పవరం."
"తప్పకుండా రండి. నా కుటీరం తలుపు లెప్పుడూ మీకోసం తెరిచే ఉంటాయి."
తిలక్ తన గది చేరుకోనేటప్పటికి జానకి కౌసల్య ను ఓదారుస్తూ కనిపించింది. జానకి మాటలు వింటూ, కన్నీళ్ళూ కారుస్తూ శూన్య దృక్కులతో నిర్జీవంగా కూర్చుని ఉన్న తల్లిని చూసి "అమ్మా నేను వచ్చేశానమ్మా" అన్నాడు తిలక్. అప్పటిదాకా అతి కష్టం మీద అణిచి పెట్టుకొన్న ఆవేదన, అప్పుడే కలిగిన సంభ్రమాశ్చర్యాలతో మిళితమై కౌసల్య లోని గంబీర్యాన్ని కూకటి వేళ్ళతో పెరికి వేసింది. ఒక్కమారుగా లేచి కౌగలించుకొని "నాయనా, వచ్చావా." అంటూ బావురుమంది. ప్రకృతే పులకరించేటంతటి ఆ మాతా పుత్రుల గాడశ్లేషాన్ని చూసి జానకి రుద్ద కంఠమయింది.
సావకాశంగా తిలక్ వల్ల జరిగినదంతా విని "ఎవరు నాయనా ఆ భగవంతుడు? ఆయనను చూసి నమస్కరించి వద్దాము . నడు అంది కౌసల్య.
"ఉండు. తొందరపడకు. అయన ఇప్పుడు ఊళ్ళో లేరు. నన్ను రక్షించడం కోసం సర్పవరం నుంచి ప్రత్యేకం వచ్చి అర్జంటు పని మీద మద్రాసు వెళ్ళారు. తిరిగి అయన ఏడెనిమిది రోజుల్లో వస్తారు. తర్వాత వెళ్ళి ఆయన్ని కలుసుకుందాము."
"సరే, అయితే. అందాకా ఈ ఊళ్ళో ఎందుకు నేను? రామచంద్రాపురం వెళ్ళి మళ్ళీ వస్తా. నువ్వు కూడా రాకూడదు? రెండు రోజులు నా దగ్గర ఉంటె నాకూ కొంచెం మనస్థిమితం చిక్కుతుంది."
'అలాగే. రెండు మూడు రోజుల్లో వస్తాను తప్పకుండా. నాకూ ఈ గొడవల వల్ల బుర్ర చికాకుగా ఉంది."
"అయితే ఇవాళ సాయంత్రం నన్ను కారేక్కించు. అన్నట్టు ఈ అమ్మాయి ఎవరురా? పొద్దుటి నుంచి నాకు ధైర్యం చెబుతూ, నాచేత బలవంతంగా కాఫీ తాగించి నా సేవ చేస్తోంది!"
తిలక్ నవ్వుతూ 'అంతసేపు సేవచేసి, తన పేరే చెప్పలేదూ? ఈమె పేరు జానకి" అన్నాడు.
"పేరు కాదు నేనడుగుతున్నది. అసలు ఎవరి అమ్మాయి, ఏమిటి అని."
"{ఎవరి అమ్మాయో చెబితే, ఆ అమ్మాయి మీద ఉన్న సదభిప్రాయం కాస్తా పోతుంది నీకు."
"పోదు. ఒక్కనాటికీ పోదు. నువ్వు కారాగారం లో మ్రగ్గుతూ ఉంటె, ఎవరిని ప్రాధేయ పడాలో తెలియక, ఏ దేవుడికి మొక్కుకోవాలో అర్ధం కాక, దేవుడి మీదే భారం వేసి ఏకాకిగా ఈ గదిలో దుఃఖిస్తున్న నన్ను ఆదుకుని కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రేమ చూపించిన ఈ కరుణామయి మీదనా నాకు దురభిప్రాయం రావడం ?"--
"అయితే విను. ఏ ఇన్ స్పెక్టరయితే నన్ను నాశనం చెయ్యాలని చూశాడో, ఆ ఇన్ స్పెక్టర్ ఆనందానికి కీమె మేనగోడలు.
"ఆ!" అని ఆశ్చర్యపోయింది కౌసల్య.
జానకి కంగారుగా భయపడుతూ ఆమె కేసి చూసింది.
వెంటనే కౌసల్య సర్దుకుని "ఆహా! అంతే కదా? అంత మాత్రంలో ఈమె మీద సదభిప్రాయం పోవడం ఎందుకు? ఎంతమంది ఇళ్ళల్లో చూడటం లేదు మనం -- దేవతలూ, దానవులూ కలిసి ఉండటం? మంచితనం అనేది వ్యక్తీ నిష్టం కాని కుటుంబం మీద ఆధారపడి ఉండదు." అంది.
"అయితే నీకు ఈమె బాగా నచ్చిందన్న మాట!"
"ఆహా!"
"అయితే మనతో ఈమెని తీసుకు పోదామా, మన ఊరు?"
కౌసల్య అతని మాటల్లోని అర్ధాన్ని గ్రహించి సన్నగా నవ్వుతూ "ఎందుకురా అబ్బాయ్ అంత కంగారు? నెమ్మదిగా వస్తుందిలే, పెద్దవాళ్ళ అనుమతి తీసుకొని, ఎమామ్మాయీ , అంతేనా?" అంది.
జానకి సిగ్గుతో తల వంచేసింది.
"శిక్ష పడితే ఇంకేమైనా ఉందా? భవిష్యత్తు పూర్తిగా భస్మీ పటలమై పోను. సమయానికి ఆ సర్పవరం అయన వచ్చి ఆదుకున్నాడు కనుక కాని, లేకపోతె తన గౌరవం, ప్రతిష్ట గంగలో కలిసిపోయి ఉందును! తన ఆశల ఆలయం శిధిలం అయిపోయి ఉండును! తన కాంక్షల కల్ప తరువు కూలిపోయి ఉండును! భగవంతుడులా అయన అడ్డుపడ్డాడు. ఎప్పుడు వెళ్ళి అయన దర్శనం చేసి కృతజ్ఞత లర్పించుకుంటుంది తను?"-- అనుకుంది కౌసల్య.

22
అన్న ప్రకారం విడాకుల కోసం కోర్టులో అర్జీ పడేసింది జ్యోతి. సమన్లు చూసుకుని ఆనంద్ విస్తుపోయాడు. అతని కొక్కక్షణం మతిపోయినట్లయింది. 'చివరకు ఎంత ఘాతకానికి ఒడిగట్టింది! రహస్యాన్ని బట్ట బయలు చేసి తన గౌరవ మర్యాదలు మట్టిపాలు చేసింది. సరే . ఇంతా అయాక రాజీ బేరానికి దిగడం కన్నా , ఎలాగో అలా ఈ పరిస్థితిని ఎదుర్కొనడమే ఉత్తమం." అనుకున్నాడు ఆనంద్.
ఆ నోటా ఆ నోటా ఈ సంగతి జానకి కి తెలిసింది. ఆమె విశాలాక్షి కి చెప్పింది. ఆమెకు నెత్తి మీద పిడుగు పడినట్లయింది. నోట మాట రాలేదు.
"ఏమిటి, ఆనంద్ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడా? తమ కెవ్వరికీ తెలియకుండానే! రామ రామ! ఎంతటి నీచస్తితికి దిగజారిపోయాడు! జ్యోతి తో స్నేహం చివరికి ఇలా దారితీసిందా? లేకపోతె-- వయస్సు లో ఉన్న మగాడికీ, ఆడదానికి స్నేహం ఏమిటి? ఛీ ఛీ! "ఏమండీ! ఏమిటి, మీ తమ్ముడు ఆ అమ్మాయి నెవరినో రిజిస్టర్ మారేజీ చేసుకున్నాడటగా?" అని ఎవరైనా పలకరిస్తే మొహం ఎలా ఎత్తేది? "ఇందుకా ఇన్నాళ్ళూ పిల్లను కాపురానికి తీసుకు వెళ్ళలేదు?' అని రామదాసు గారు ఎత్తి పొడిస్తే యేమని సమాధానం చెప్పేటట్టు? తనకు ఈ సంగతి ఇప్పటి దాకా తెలియలేదంటే ఎవరైనా నమ్ముతారా? భగవంతుడా! ఈ కుటుంబాన్ని ఎంత నవ్వులు పాలు చేస్తున్నావు! భార్య బతికి ఉండగా రెండవ పెళ్ళి చేసుకోవడమే అవమానం. అది సరిపోక, నువ్వు నాకు అక్కరలేదు -- అని ఆ అమ్మాయి కోర్టు కెక్కడం! రామ రామ! తలుచుకుంటే మతి పోతోంది.' అనుకుంటూ మనస్సులోనే కుమిలి పోయింది విశాలాక్షి.
'ఎంత పని చేసింది జ్యోతి! చివరకి తను అనుమానించినట్లే అయింది. జ్యోతి చిన్న మామయ్య మీద కన్ను వేసిందని తను ఏనాడో పసికట్టింది. కాని పరిస్థితులు ఇంత దూరం వస్తాయనీ, వాళ్ళ అనుబంధం వివాహం దాకా పెరుగుతుందని, తను ఊహించలేదు. సరే, అయింది ఏదో అయింది. మళ్ళీ ఈ విదాకులేమిటి? ఇలా కోర్టు కు ఎక్కడం తనకు మాత్రం ఏం గౌరవం? వెళ్ళి నాలుగూ అడిగి వస్తాను జ్యోతిని.' అని బయలుదేరింది జానకి.
జానకి చెప్పినదంతా పూర్తిగా విని జ్యోతి ఇలా అంది. "సరే, నువ్వు చెప్పిందేదో నువ్వు చెప్పావు. నా మాటలు కూడా కొద్దిగా విను. ఈ ప్రపంచంలో మనుష్యులంతా ఒకే తత్త్వం వాళ్ళు ఉండరు. నీ కొకటి ఇష్టం అయితే, నా కింకొకటి ఇష్టం అవుతుంది. నీకు తీవ్రమైన కారుణ్యాలూ లేవు; అతి తీవ్రమైన కార్పాణ్యాలు లేవు. ఎవరైనా ఒకమాట అంటే అది బలంగా నీమీద పని చెయ్యదు. సరిపెట్టుకుపోవడం నీ స్వభావం. అదే మంచిదనీ, అందులోనే సుఖం ఉందనీ నీ అభిప్రాయం కావచ్చు. కాని నీలాగా అందరూ ఉండమంటే ఉండరు.
"నాది పూర్తిగా భిన్నమైనప్రకృతి . నాకు నిజంగా కోరిక అనేది రానేరాదు. వస్తే చాలా ఉదృతంగా వస్తుంది. ఆనంద్ ఫోటో మొదటి సారి చూసినప్పుడు అతణ్ణి వివాహం చేసుకోవాలనుకున్నాను. కాని కుదరలేదు. నాలో జనించిన ఈ వాంఛను నాలోనే అంతమొందించుకోవాలని ప్రయత్నించాను; లాభం లేకపోయింది. కొన్నాళ్ళు గడిచాయి. నాలో చెలరేగిన భావాలను నేను అదుపులోకి తెచ్చుకున్నానని అనుకున్నాను. కాని ఆరోజున మీ ఇంట్లో అతణ్ణి మళ్ళీ చూసినప్పుడు నాలోని కోర్కెలు తిరిగి తలఎత్తాయి. నన్ను హాస్టల్లో దిగబెట్టడానికి అతడు వచ్చినప్పుడు అతడిని పరీక్షించి చూశాను. ఫరవాలేదు, అతడిని లొంగదీసు కోవచ్చు అనుకున్నాను. అయినా నాకు పూర్తిగా నమ్మకం కుదరలేదు. అనుకూలంగా ఉంటాడని అనిపించలేదు. అందువల్ల నా దృష్టి తిరిగి తిలక్ వేపు మళ్ళింది."'
"తిలక్? అతడిని కూడా నీ వలలో వేసుకున్నావా?" అంది భయంతో జానకి.
"భయపడకు. నాకు అతని మీద అభిప్రాయం ఏమీ లేదు. ఊరికే ఒక బలహీనమైన నిమిషం లో అలా అనుకున్నాను. నేనే కనక అతడిని వలలో వేసుకోవడం అంటూ వస్తే, ఆనంద్ కంటే చాలా సులభంగా అతడు నాకు చిక్కి ఉండును. కాని, ఏమిటో నాకు అతని మీద మనసు పోలేదు. దృడమైన వ్యక్తిత్వం ఉన్న వాడు కాదతను. ఉత్త పసివాడు.
"తన వ్యక్తిత్వం నిలబెట్టు కుంటూ, నాకు అనుకూలంగా కూడా మసులుకొనే మనిషి కావాలి నాకు. ఈ రెండూ ఆనంద్ లో ఉన్నాయని అనుకున్నాను. అందుకే అతణ్ణి వివాహం చేసుకున్నాను. కాని రాను రాను నా ఊహ తప్పు అని తెలిసింది. అతనికి వ్యక్తిత్వం ఉన్న మాట నిజమే. కాని, నేను చెప్పిన మాట వినడు. అహంకారి, ధూర్తుడు . పైగా నేనేమైపోయినా అతనికి అవసరం లేదు. సమయం వస్తే నన్ను అవమానించడానికయినా జంకడు. వీటన్నిటికి తోడూ నన్నీ మధ్య అనుమానించడం కూడా ప్రారంభించాడు. చూడగా చూడగా ఆనంద్ ప్రవర్తన పట్ల నాకు అసహ్యం వేసింది. మొన్న తిలక్ పట్ల అతను ప్రవర్తించిన విధానంతో అది పరాకాష్ట చెందింది. ఒక్కమాటు నాకు అసహ్యం అనిపించాక ఇంకా నేనా మనిషితో ఉండలేను. సరిపెట్టుకుని అతనితో కాపురం చెయ్యలేను. వీటన్నిటికి తోడు, మా వివాహ విషయం రహస్యంగా ఉంచాలంటాడు. లేకపోతె ఉద్యోగం పోతుందంటాడు. నాకేం ఖర్మ వచ్చిందనీ-- నిక్షేపం లా వివాహం చేసుకుని కూడా కులట లాగ బ్రతకడం? పైగా ఎంత ఆలోచించినా అతని వల్ల నాకు కాని, నావల్ల అతనికి కాని సుఖం ఉంటుందని పించడం లేదు. అందుకు భిన్నమైన మా మనస్తత్వాలే కారణం."
"బాగానే ఉంది. పోనీ, అతనితో సంప్రదించి మీ సంబంధాన్ని విచ్చిత్తి చేసుకోవచ్చు గదా? ఇలా కోర్టు లకి ఎక్కడం నీకు మాత్రం ఏం గౌరవం?"
"ఏం? ఎందుకంత రహస్యం? నేను చేసేది తప్పు అయితే నాకు రహస్యమూ, భయమూను."
జ్యోతి పెంకితనం చూసి జానకికి ఒళ్ళు మండుకొచ్చింది. 'అలా అయితే మీ వివాహాన్ని ఇన్నాళ్ళూ ఎందుకు రహస్యంగా ఉంచావు? బహిరంగ పరచక పోయేవూ?"
"అప్పుడతను ప్రాధేయపడ్డాడు."
"ఇప్పుడు కూడా అతను ప్రాధేయపడితే మానేస్తావా?"
"ఇప్పుడతని ప్రార్ధన తో నాకు నిమిత్తం ఏమిటి? నాకు అతనితోనే నిమిత్తం లేదు ఇప్పుడు."
"సరే. కానియ్యి. నీకు ఎవరు సాక్ష్యం పలుకుతారో చూస్తాను. ఆనంద్ అసలు నిన్ను పెళ్ళే ఆడలేదు."
"పిచ్చి జానకీ! రిజిస్ట్రారు సంతకమే సాక్ష్యం. అంతకంటే బలమైన సాక్ష్యం ఏం కావాలి? పొతే, అతని మీద కార్పణ్యం వహించి ఉన్న తిలక్ ఉన్నాడు. అతడు చెబుతాడు సాక్ష్యం."
"తిలక్ ఒక్కనాటికీ చెప్పడు. నేను చెప్పనియ్యను."
"మన ఆదేశాలూ, అంక్షలూ , ప్రణయకోపాలూ, శాసనాలూ, కన్నీళ్ళూ పురుషులకు కొంతవరకే వశ పరుచుకోగలవు. వాటి బలం, ప్రభావం కొంతవరకే. ఆపైన వాటికీ శక్తి ఏమీ ఉండదు. అందులో ముఖ్యంగా పురుషుడు అహంకారం, ప్రతీకారం, అనుమానం మొదలైన దృడ భావాలకు వశ్యుడై ఉన్నప్పుడు మనకు ఉన్న ఆ ఆయుధాలు పూర్తిగా నిరుపయోగం అవుతాయి."
