దీపభ్రమర న్యాయం
"హాయ్... గుడ్ మార్నింగ్..."
"ఎవరు? మీరెవరు మాట్లాడుతున్నారు?"
"మీ ఫ్రెండ్ ని... మిమ్మల్ని అభిమానించేవాడిని."
"ఇదిగో,మీరెవరో మీ పేరు చెప్పండి ముందు."
"పేరా... నీ పేరు రాధ గదా, నా పేరు రాధాకృష్ణ. భలే కలిశాయి గదా మన పేరు... హా...హా..."
"చూడు, నీవెవరో నాకు తెలీదు. పెట్టేయ్ ఫోను."
"పెట్టేయడానికా చేసింది. కాసేపు మాట్లాడుకుంటే స్నేహితులం అయిపోతాం గదా! నీతో మాట్లాడాలని, స్నేహం చెయ్యాలని ఆశగా చేస్తే..."
"ఇదిగో నీతో మాట్లాడాలని, నీలాంటి పోకిరీగాళ్లతో స్నేహం చెయ్యాలని నాకేం లేదు."
"అబ్బ! అంత కోపమే... కాస్త తియ్యగా మాట్లాడమ్మా. నేనేం పోకిరీని కాదు."
"చూడబ్బాయి, నీవెవరో నాకు తెలియదు. నీతో నాకు స్నేహమేమిటి? పిచ్చెక్కి మాట్లాడుతున్నావా?"
"అవును, పిచ్చెక్కింది. ఫేస్ బుక్ లో నిన్ను చూసి పిచ్చెక్కి... మతి పోగొట్టుకొని ఆ జారిన గుండె ఎక్కడుందో వెతుక్కుంటూ, నీ ఫోను నెంబరు వెతుక్కు పట్టుకుని... యింత కష్టపడి ఫోను చేస్తే, రెండు నిమిషాలు మాట్లాడితే నీ సొమ్మేం పోయిందమ్మా?"
"ఏమిటి, ఫేస్ బుక్ లో చూశావా? నువ్వెవరు, నన్నెలా చూశావు? నీవు నా ఫ్రెండ్ లిస్ట్ లో వున్నావా? లేవు గదా, తెలీనివాళ్లతో నేను స్నేహం చెయ్యను.
"మాట్లాడుకుంటే గదా తెలిసేది. రెండు రోజులు మాట్లాడుకుంటే స్నేహితులవుతాం గదా, నీకు మంచి స్నేహితులక్కరలేదా? నిన్నభిమానించే స్నేహం వద్దా? నీవు కావాలనుకునే మనిషి వద్దా... మాట్లాడుకుని, అభిప్రాయాలు పంచుకుంటూ, ఆలోచనలని మెచ్చుకుంటూ, అభిరుచులని చర్చించుకుంటుంటే స్నేహం జతకడ్తుంది. మనసులని దగ్గర చేస్తుంది. మనసులు కలిస్తే మనుష్యులు దగ్గరవుతారు.
"చాల్చాలు, కవిత్వం బాగా వచ్చులా వుంది నీకు. మాటలు భలే చెప్తున్నావు. గొప్ప మాటలు వర్ణిస్తున్నావు."
"గొప్ప మాటలు కావు... మనసులో మాటలు. నేనేం గొప్పవాడిని కాను తల్లీ! నీలాంటివాడినే, ఈడు జోడే కాదు, తాహతులెరిగి, సరితూగే వాళ్లమే గదా అని నిన్ను ఇష్టపడి, స్నేహం కోసం వెతుకులాడుతూ నీ ముందుకు వచ్చానని లోకువ కట్టేయకు."
"చాలా వివరాలు సేకరించావులా వుంది. నా గురించేం తెలుసు, ఎలా తెలుసు? ముందు చెప్పు..."
"ఇష్టం కలిగితే, కష్టపడి వెతికి పట్టుకోవద్డా? నీ గురించి వివరాలు రాబట్టకుండానే నీతో స్నేహానికి వచ్చాననుకున్నావా?"
"అబ్బే... నా గురించేం తెలుసో చెప్పు వింటాను."
"నీవు ఇంటర్ పరీక్ష రాశావు. లోవర్ మిడిల్ క్లాసు అమ్మాయివి. మీ నాన్న బ్యాంక్ లో అటెండర్. నీకో తమ్ముడున్నాడు. చిన్న ఇల్లు. అతి మామూలు సంసారులు. చాలా? ఇంకేమన్నా చెప్పాలా?"
"మరి నాలో ఏం చూసి స్నేహం చెయ్యాలనుకున్నావు? నేనేం పెద్ద అందగత్తెను కాను, పెద్ద చదువులు లేవు. ఉద్యోగాలు లేవు, డబ్బులు లేవు. ఏం చూసి వెంటపడ్డావు?"
"ఇదిగో అలా మాట్లాడకు. వెంటబడలేదు. నచ్చావు, మెచ్చాను, కావాలనుకున్నాను. నేనేం నీకంటే గొప్పవాడిని కానుగా, నేనూ లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయినే. మా నాన్నది గవర్నమెంటు జాబు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో చిన్న ఉద్యోగి. నాకో చెల్లెలు. అమ్మ బ్యాంక్ లో అటెండర్ పనిచేస్తుంది. నేను బికాం ఫస్టియర్ చదువుతున్నా... ముందే చెప్పాగా.... అన్నీ సరిచూసుకునే సరిజోడి అనుకున్నానని. నే చెప్పినవన్నీ కరెక్ట్ గదా!"
"ఓహో... బికాం చదువుతూనే ఉద్యోగం అది కాకుండానే అమ్మాయిలు కావాల్సి వచ్చారా? ఏం అప్పుడే పెళ్లి చేసేసుకుంటావా నచ్చిన అమ్మాయి కనిపిస్తే?"
"పెళ్లి తర్వాత చేసుకుంటాం. ముందు మనం కలవాలి, ముచ్చట్లాడుకోవాలి... ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎంత తతంగం వుంది. ఊరికే అలా పెద్దవాళ్లు తెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసేసుకుని తర్వాత మనసులు కలవక, ప్రేమలేని సంసారం... అవన్నీ నాకు సరిపడవు. నాక్కావలసిన అమ్మాయిని నేనే చూసుకుంటాను అని చెప్పేశాను అప్పుడే యింట్లో. చదువయి, ఉద్యోగం వచ్చేలోగా చక్కగా యిద్దరం స్నేహంగా కబుర్లాడుకుంటూ, తిరుగుతూ, పార్కులలో కలుసుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని..."
"చూడు... అంతా బాగానే వుంది. నీవు చాలా బాగా మాట్లాడుతున్నావులే. కాని మా యింట్లో అలా వప్పుకోరు. అబ్బాయిలతో తిరిగితే వూరుకుంటారా? అదేం కుదరదులే..."
"ఇదిగో, నీవు యీ కాలం పిల్లలా మాట్లాడడం లేదు. ఎవరన్నా పెద్దవాళ్లకి తెలిసేట్టు బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతారా? మనకి మనం నచ్చే స్నేహితులని వెతుక్కోవాలి. ఇవన్నీ యింట్లోవాళ్లకి చెప్పక్కరలేదు. చెప్పరు - లైఫ్ లో... ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సరదాలు? ఫ్రెండ్స్ తో కబుర్లు, షికార్లు యివన్నీ యిప్పుడు అందరూ చేస్తారు. ఇదేం కొత్త విషయం కాదు. ఎవరూ ఆశ్చర్యపోయే విషయం కాదు. నీ ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ లేరా, వున్నారు గదా! అలాగే నీకూ వద్దా?"
"చూడు... అసలు నిన్ను చూడకుండా, నీవెవరో నాకు నచ్చకుండా ఫ్రెండ్ ఏమిటి?"
"అందుకే కలుసుకుందాం అంటున్నా. ఇద్దరం కలిస్తే కదా ఒకరికొకరు నచ్చేది లేనిది తెలిసేది."
"ఏమో! ఇదంతా నాకేం తెలీడం లేదు. ఎప్పుడూ తెలీని మనిషితో స్నేహం మాటలు ఏమిటి? వద్దు బాబూ! వదిలేయ్ నన్ను..."
"ప్లీజ్, ఒక్కసారి కలుద్దాం. నీకిష్టం లేదంటే అప్పుడింక నిన్ను యిబ్బంది పెట్టను. ప్రామిస్... ప్లీజ్, మాట్లాడు. ఎంతో కష్టపడి నీ నెంబరు పట్టుకుని ఫోను చేసి యింతసేపు మాట్లాడిందెందుకు? నీవంటే నచ్చి కదా! ఒకసారి కలిస్తే నీ సొమ్మేం పోతుంది? రా, నేను నచ్చితే మాట్లాడుదువుగాని, లేదంటే వెళ్లిపోదువుగాని. ఇందిరా పార్క్ దగ్గరకి రా... గేటు దగ్గిర నిన్ను గుర్తుపట్టి పలకరిస్తాను, చేతిలో చిన్న గులాబీ గుత్తి పట్టుకొంటా... ఏం వస్తావా? ప్లీజ్... ఒక్కసారి....."
"ఓ... అర్థం అయింది కథ..."
"మరి వెళ్లావా? ఆ మాటలకి పడిపోయావా... ఆ ఆకర్షణకి లొంగిపోయావా? చెప్పు. దాచకుండా నిజం చెప్పాలి. అమ్మాయిలంతా చేసే తప్పే నీవూ చేశావు. అంతేగదా! అలా కన్నీళ్లు కారిస్తే ఏం లాభం ఇప్పుడు. నాకు తెలుసు, వెళ్లకుండా వుండలేని ఆ వయసు ఆకర్షణ..."
