Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 33

 

    బలవంతంగా తల్లిని గురించి ఆలోచించడం మానడానికి ప్రయత్నం చేయసాగాడు.
    మర్నాడు ఉదయమే ఇల్లు చేరుకున్నాడతను.
    తల్లి గదిలో మంచం మీద పడుకొని వుంది. రమణి అతని కెదురుగా వచ్చింది.
    "రాత్రి ఎక్కడి కెళ్ళావన్నాయ్?"
    "ఫ్రెండింటికీ...."
    "అమ్మకి నిన్న సాయంత్రం నుంచీ జ్వరం! నీకోసం ఎదురు చూసి ఎంతకూ రాకపోయేసరికి నేనే వెళ్ళి రాత్రి డాక్టర్ ని తీసుకొచ్చాను...."
    తల్లి దగ్గరకు నడిచాడు సురేంద్ర.
    "ఎలా ఉందమ్మా?"
    "కొంచెం ఒళ్ళు వెచ్చగా వుందంతే ! రాత్రి ఇంటికి రాలేదేం బాబూ!"
    "మా ఫ్రెండింటి కెళ్ళి.....అక్కడే ఉండిపోయానమ్మా ...." ఆమె వేపు నుంచి చూపులు మరల్చుకొని అన్నాడతను.
    "పాపం - రమణి భయపడిపోయింది !" అని అందామె నీరసంగా.
    "భోజనం - అదీ టయిముకి చేయకుండా -- ఈ జ్వరం తెచ్చుకున్నావమ్మా! నా కోసం ఎదురు చూడవద్దూ అంటే వినవు. నాకేం రోగం? ఏ ఫ్రెండ్ ఇంట్లోనో భోజనం చేస్తూనే వుంటాను లేదా హోటల్లోనో తింటానుగానీ -- మాదిపోను కదా" అన్నాడు ఆమె మట్టాడలేదు.
    "నిన్న ఎంతసేపటికీ నువ్  ఇంటికి రాకపోయేసరికి - నీకోసం మీ ఆఫీసు కొచ్చానన్నాయ్. అక్కడ ఒకాయన కూర్చుని రాసుకొంటున్నారు. నీ సంగతడిగితే మీ ఆఫీస్ లో పనిచేసే మాధురి ఇంట్లో వుంటావని చెప్పారు" అతని ముఖం వంకే చూస్తూ అంది రమణి.
    ఉక్కిరిబిక్కిరయ్యాడు సురేంద్ర.
    తమ విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట! ఇప్పుడు ఇంట్లో కూడా తెలిసిపోయింది. చెల్లాయ్ ఈ విషయం అమ్మకు చెప్పకుండా వుండి వుంటుందా? అమ్మ ఎమనుకొంటుంది తన గురించి? అప్పుడప్పుడు రాత్రుళ్ళు ఇంటికి రాకపోవడానికి -- వచ్చినా ఆలస్యంగా రావడానికీ - భోజనం ఫ్రెండింట్లో చేశాననడానికీ -- కారణం మధురీనని తెలిసి పోయుంటుందా?
    భగవాన్!
    ఎంతపని జరిగింది?
    ఇప్పుడేమిటి చేయడం?
    తల్లికి మాధురి విషయమంతా చెప్పెయ్యాలా? తను మనసులు ఒకటయ్యాయనీ- ఒక్క వివాహం కాలేదే తప్ప ఇద్దరూ భార్యాభర్తలేననీ ఎలా తెలియజేయటం ? ఇలాంటి భాందావ్యాన్ని ఆమె ఎలా అంగీకరిస్తుంది? ఆమె కోసమయినా తను మాధురిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది.
    కాని స్వరూపకు విడాకులువ్వందే అది సాధ్యమేలా అవుతుంది? ఆరోజు ఆఫీసుకి శెలవు పెట్టి ఇంట్లో వుండిపోయాడతను. టేబుల్ మీద తనూ, సృజన్ బాబూ కలిసి  తీయించుకున్న ఫోటో -- ప్రేములో కనిపించింది. తన జీవితం ఇలా సర్వ నాశనమయిపోవడానికీ అతనూ కొంతవరకు కారణమే! నిజానికి తనకు అతని మీద ద్వేషమేమీ లేకపోయినా, ఎందుచేతనో రాను రాను అయిష్టత పెరిగిపోతోంది! అలా యెందుకు జరుగుతుందో తనకే తెలియడం లేదు. కేవలం తనను ప్రాణ స్నేహితుడిగా భావించ బట్టే స్వరూప గురించిన నిజాలు బయట పెట్టాడు. ఆ సంగతి లోలోపల తనకు తెలుసు! అయినా గాని -- ఏదో బలహీనత -- అతని మీద వ్యతిరేఖ భావాన్ని కలిగిస్తోంది.
    నాలుగు రోజుల పాటు ఆఫీస్ కెళ్ళడం సాధ్యం కాలేదతనికి . తల్లిని కనిపెట్టుకొని ఇంట్లోనే వుండిపోయాడు.

                                         17


    ఆరోజు సృజన్ బాబు తో శ్రీపతి చాలాసేపు మాట్లాడాడు. ఆఫీస్ విషయాలూ- యూనియన్ గొడవలూ- రవీంద్ర భారతిలో జరగబోతున్న మరో నాటికల పోటీగురించి ఏవేవో మాట్లాడినా నిజానికతను మాట్లాడదల్చుకొండి అవేవీ కాదు . ఆరోజు అతను రావడంలో ఉద్దేశం కేవలం శాంతికీ, తనకూ మధ్య ఏర్పడ్డ ప్రేమ గురించి సృజన్ బాబుకి తెలియజేయడమే! కాని ఎంచేతో ఆ విషయం చెప్పడానికి సంకోచంగా ఉంది. రెండు మూడు సార్లు శాంతి గురించి మాట్లాడే సందర్భం వచ్చింది కాని ధైర్యం చేయలేకపోయాడు.
    చాటు నుంచీ శ్రద్దగా వాళ్ళ మాటలు వింటోన్న శాంతి అతను వెళ్ళిపోయాక గుండెల మీద చేయి వేసుకొంది.
    మర్నాడే వినోద్ వచ్చాడు ఇంటికి.
    అతనిని సృజన్ బాబుకి పరిచయం చేసింది శాంతి.
    "ఈయనే అన్నాయ్ -- స్త్రీ ద్వేషి " అంది నవ్వుతూ.
    "ముందే నా మీద చెడు అభిప్రాయం కనిగించేయకండి శాంతిగారూ! నేనేం స్త్రీ ద్వేషిని కాదు" నవ్వుతూ అన్నాడు వినోద్.
    చాలాసేపు ఏవేవో విషయాలు మాట్లాడారిద్దరూ. మధ్యమధ్యలో శాంతి కూడా భాగం పంచుకొంది.
    చివరకు స్త్రీ గురించి చర్చలోకి దిగిపోయారు.
    వినోద్ అభిప్రాయాలు కొన్నిటితో తనూ ఏకీభవించాడు సృజన్ బాబు.
    "స్త్రీకి వుద్యోగం ఇవ్వకూడదని నేనటం లేదు. భార్యా భర్తలలో ఒకరికే వుద్యోగం వుండలంటాను. భర్తకే వుద్యోగం వుండాలని కూడా నేనేనను. భార్యకి వుద్యోగం ఇచ్చేట్లయితే భర్తకి వుద్యోగం చేయడానికీ వీల్లేదు. అలాగే భర్తకే వుద్యోగం ఉండాలనుకొంటే భార్యకి వుద్యోగం ఇవ్వకూడదు. ఇలా చేయడం మూలాన ఒకే కుటుంబంలో పదిమంది ఉద్యోగాలు చేయడం -- మరో కుటుంబంలో పదిమంది వుద్యోగం లేక అడుక్కుతినడం-- ఈ పరిస్థితి పోతుంది.... దీనికే మంటారు మీరు ?"
    "వినడానికీ బాగానే వుంది ! కాని ------"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS