తాను ఐ.ఎ.ఎస్ సెలెక్ట నయినట్టూ, ట్రెయినింగ్ కి వెళ్ళబోతున్నట్టు మధుమతి కీ, మిగతా వారందరి కీ చెప్పాడు వాసు. "నా బంగారు తండ్రీ! కలక్టరయిపోతున్నావు!" అంటూ అతని తల ముద్దు పెట్టుకుంది జానికమ్మ.
అలా వాసు తల వంచి ముద్దు పెట్టుకుంటున్న జానికమ్మ వైపు చూసి కిలకిలా నవ్వి, "నేను పాసయ్యానని చెపితే, సరిలే, మంచి మొగుణ్ణి తెచ్చి పెళ్ళి చెయ్యమని మీ నాన్నకి చెప్పు' అంది నా వైపు చురచుర చూస్తూ బామ్మ. ఈవేళ నిన్ను ముద్దు పెట్టుకుంటుంది." అంది జయ.
'అవును , తల్లీ, ఎమ్.ఎ చదివి కూర్చుంటే నీకు సంబంధం తెగలడే నాన్న!"
"ఛ, ఫో! ఎప్పుడూ పెళ్ళి, పెళ్ళంటూ ఒకటే గోల!" విసుక్కుంది జయ.
"ఏం రోయ్! మొత్తం మీద ఐ.ఎ.ఎస్ . ఆఫీసరవైపోతున్నావే!' వ్యగ్యంగా నవ్వాడు రాజశేఖరం.
"నీ ఆశీర్వచనం!' టక్కున అన్నాడు వాసు.
"చిన్న మామయ్య బాగా సర్దుతున్నట్టున్నాడే!" మళ్ళీ అదే నవ్వుతో అన్నాడు రాజశేఖరం.
"మరేం?' అని ఇంకా ఏమో అనబోతున్న వాసు -- "వాసూ!" అన్న మధుమతి మందలింపు కి మౌనంగా ఉండిపోయాడు.
వాసు కిష్టమైన పాయసం చేసి భోజనం పెట్టింది జానికమ్మ. సాయంత్రం చాలాసేపు జయ పాటలు వింటూ గడిపాడు వాసు.
ఏదో అడిగి తెలుసుకోవాలనే అత్రతతో అందుకు అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్న మధుమతి, రాత్రి పది గంటల వేళ నిద్రపోతున్న వాసు దగ్గరికి వచ్చి అతని నిర్మలమైన వదనంలోకి చూస్తూ నిలుచుంది.
"ఎందుకు బాబూ, నీ అమ్మకి నిజం చెప్పడానికి భయపడుతున్నావ్? ఈ సూట్లూ, వాచీ, ఉంగరం, ఖరీదైన పుస్తకాలూ, -- ఇవన్నీ నీకెలా వస్తున్నాయ్? తండ్రి వదిలిన నిర్భాగ్యుడివి నువ్వు! దరిద్రురాలి కొడుకువి నువ్వు! ఐ.ఎ.ఎస్ ఆఫీసరు కాబోతున్నావు నేను నమ్మలేను. నేను నమ్మను. ఇందులో ఏదో మోసం ఉంది. నా కొడుక్కెవరో మప్పి పెడుతున్నారు . చదువు పూర్తయి ప్రయోజకుడైన తరువాత నాకు కనుపించకుండా తీసుకుపోతారు. నూనూగు మీసంతో తండ్రి రూపం పుణికి పుచ్చుకుంటున్న నా బాబు నెవరో మోసం చేస్తున్నారు. డబ్బిచ్చి అతని చుట్టూ ఉచ్చులు బిగిస్తున్నారు. గోపాలానికి తెలుసుంటే-- ఏమిటి తెలుసు? వాడూ చెప్పడు. ఇన్నాళ్ళూ వాడి కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తాడు, అందుకే చదివిస్తున్నాడనుకుని ఐ రకంగా సంతోషిస్తూ వచ్చాను . ఊహూ. పద్మజ కి సంబంధాలెందుకు చూస్తారు? -- వాళ్ళకి ఉద్దేశ్యముంటే?" అనేక కోణాల్లో పరుగులెత్తే మనస్సు నదుపులో పెట్టుకుంటూ , "వాసూ?" అని తట్టి లేపింది మధుమతి.
.jpg)
"ఏమమ్మా? ఎందుకు?" కంగారుగా లేచి కూర్చున్నాడు వాసు.
"ఏం లేదు. కంగారు పడకు. ఓ సంగతి అడిగి తెలుసుకోవాలని?' అతని పక్కలో కూర్చుంది మధుమతి.
"ఏమిటమ్మా? అది?" చిన్నగా నవ్వాడు.
"పద్మజ ని పెళ్ళి చేసుకోనని చెప్పావా?"
తెల్లబోయి తల్లి వైపు చూస్తూ, "ఏమంటున్నావమ్మా!" అన్నాడు వాసు.
"అదే! పద్మజ కి సంబంధాలు చూస్తున్నాడు చిన్న మామయ్య. నీకు చదువు చెప్పిస్తున్నాడు కదా?" అంటూ ఆగి వాసు మొహంలోకి చూసింది మధుమతి.
ఒక్కసారిగా అతని మొహం జేవురించి కందింది. "నా చదువుకీ , పద్మజ పెళ్ళికీ సంబంధం లేదు. నువ్విలాటి విషయాల్లో దయచేసి నోరు జారకు?" తీవ్రంగా ద్వనించిందతని గొంతు.
కోపంగా మాట్లాడే ప్రసాదరావు రూపం వాసులో ద్యోతకమయి చలించింది మధుమతి.
'అదేమిటో!బొత్తిగా అర్ధం కాకుండా పోతున్నావు! కావాలని టిఫిను తెమ్మనే నువ్వు టేబిలు ముందుంచిన ఉప్మా అలానే వదిలేశావు" అంటూ వెళ్ళిపోయింది మధుమతి.
"అవును! పాపం! ఏం అర్ధం చేసుకుంటుంది? టేబిలు మీదుంచిన ఉప్మా మరిచి పోయాను' అనుకున్న వాసు ఎదలో గతంలోని టిఫిను వేళలు కొన్ని కదిలి పోయాయి.
"వాసూ నువ్విలా వ్రాసుకో. టైము వేస్టేలా అవుతుంది? చేతులు కడుక్కో అక్కర్లే. ఇలా తినెయ్' అంటూ నోటికే టిఫిన్లందించే పద్మజ . మంచినీళ్ళ గ్లాసు నోటి దగ్గర పెడుతూ , "ఇప్పుడెం తిన్నావ్? చెప్పు చూద్దాం." అని కవ్వించే పద్మజ. 'ఫో, ఫో నన్ను డిస్టర్బ్ చెయ్యకు' అని కసురుకునే తను. 'అంత ఏకాగ్రత మనబోటి వాళ్ళకి పనికి రాదు' అని చిలిపిగా నవ్వే పద్మజ. ఏయ్, వాసూ! ఇది క్లాసు రూమ్ కాదు. నీ ముందున్నది పేపర్స్ కావు' అంటూ ప్లేటు మీద చెమ్చా తో గీస్తున్న తన వైపు చూసిన పద్మజ కిలకిలా నవ్వు -- అన్నీ గబగబా కలిపి తిని లేచే తను. 'అబ్బ! ఎంత హాయిగా గడిచాయి అక్కడి రోజులు!" ఇప్పుడే ఆ గతించిన గతంలోకి ఓసారి జారిపోయి, మళ్ళీ అలాంటి అనుభవాలు వస్తే ఎంత బాగుండును!, అనుకున్న వాసు పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
'పద్మజ కి సంబంధాలు చూస్తున్నారు. మంచి హృదయమున్న అమ్మాయి. మంచి సంబంధమే వస్తుంది. పెళ్ళి సంబంధం అనుకునే సరికి రంగనాధం గుర్తు వచ్చాడు వాసుకి. 'వాళ్ళమ్మాయి - అబ్బ! ఎంత అందంగా ఉంది!' నిద్ర తేలిపోయిన వాసుని మంజుల రూపం, జయ గానం మురిపించాయి. సౌందర్యవతి మంజుల. మధుర గాయని జయ. గుర్తుకొస్తున్నారు, బాగుంది. కాని క్షణం క్షణం మనస్సులో ఎందుకు దోబూచులాడుతుంది పద్మజ? తానోచ్చే రోజు ఉబ్బిన కనురెప్పల్లోంచి ఎర్రని కళ్ళతో తనవైపు పెన్నిధి కోల్పోయిన పెదలా దీనంగా చూసిన పద్మజ రూపం గుర్తు వచ్చిన వాసు. 'ప్చ్.... ఈసారి నే వెళ్ళేసరికి కల్యాణం బొట్టుతో ఎదురవుతుంది కాబోలు!' అనుకుంటూ నిద్రపట్టని వాసు, మధుమతి పని గట్టుకు లేపినందుకు విసుక్కుంటూ, చిరాగ్గా జుట్టు పీక్కున్నాడు.
* * * *
వాసు ట్రెయినింగ్ కి వెళ్ళాడు. మధుమతి గోపాల్రావు ఇంటికి వచ్చింది. కాలం దొర్లిపోతుంది. పద్మజ కి చాలా సంబంధాలు వచ్చి వెళ్ళాయి. చూపుల కోస్తున్నారంటే పద్మజ నలన్కరించే మధుమతి మనస్సు విలవిలలాడింది. 'తండ్రి పోలిక కొడుక్కి వస్తుందనే భయం. వాసు కెందు కిస్తారు?' అనుకుని సమాధాన పడేది.
"ఏ సంబంధమూ వద్దు, పొమ్మంటుంది. పోనీ వాసుని చేసుకుంటుందేమో అడగనా?' అడిగింది లక్ష్మీ, గోపాల్రావుని.
"వద్దు. తల్లీ కొడుకూ ఎవరైనా వారడిగితే సరే దాన్నడుగుదాం. అంతేకాని మనమేమీ తెలవద్దు. సంబంధాలు చూస్తున్నామని ఇద్దరికీ తెలుసు. అలా ఇష్టముంటే అడిగేవారుగా? అధమం అక్కయ్య అనవచ్చుగా వాసుకి ఇయ్యమని? మన మడిగితే ఏమనుకుంటారో తెలుసా? ఇందుకే చేరదీసి అదుకున్నారంటారు. వద్దు. అలా తెలివితక్కువగా ఎవరినీ అడక్కు.' మందలించాడు గోపాల్రావు.
"ఊరికనే కాదు కదా? పైవాళ్ళ కిచ్చే పాతిక వేలూ వీళ్ళకే ఇద్దాం."
"వాడేమన్నాడు -- మనింటికి వచ్చిన రోజు? డబ్బుకి అమ్ముడు పోనని....గుర్తుందా? అక్కయ్య వినగలదు. మరా సంగతి మాట్లాడకు.' కసురుకున్నాడు గోపాల్రావు.
* * * *
దీర్ఘాలోచనలో చేతులు వెనక్కి కట్టుకు పచార్లు చేస్తున్న ప్రసాదరావు , ఏదో నిశ్చయానికి వచ్చినట్టు టక్కున నిల్చుని, "వాసూ బాబూ!' అని పిలిచాడు.
చేతిలో ఉన్న న్యూస్ పేపరు మడిచి టేబిలు మీద పెట్టి ప్రసాదరావు దగ్గిరికి వస్తూ, "పిలిచారా నాన్నా?" అన్నాడు వాసు.
'అ రా. ఇలా కూర్చో. నీతో కొంచెం మాట్లాడాలి." అంటూ తానొక కుర్చీలో కూర్చుంటూ తన ఎదుటి కుర్చీ వాసుకి చూపించాడు ప్రసాదరావు.
కూర్చుంటూ చిన్నగా నవ్వి, ప్రశ్నార్ధకంగా ప్రసాదరావు వైపు చూశాడు.
ఉపోద్ఘాతం లా చిన్నగా దగ్గి, ఓ సారి కదిలి మళ్ళీ సర్దుకు కూర్చుంటూ , "మనం అనుకున్నట్టూ దైవానుగ్రహం వల్ల అనుకున్న చదువు అయిపొయింది. మరే మైన పైకి ఇంకా చదువుతావా?" అని అడిగాడు ప్రసాదరావు.
"చదువుకి అవతలి గట్టుందా? ఇంకేం లేదు. తొందర్లోనే ఆర్డర్స్ వస్తాయి. ఎక్కడో ఓ పోస్టు ఇస్తారు. అమ్మా, మీరు నా దగ్గిరికి వచ్చేద్దురు గాని' అంటూ ప్రసాదరావు వైపు చూసి నవ్వాడు చిన్నగా వాసు.
"ఓ...బాగుంది... మళ్ళీ మీ అమ్మా, నేనూ కలిసి బ్రతకడమా!' అంటూ ఘోల్లున నవ్వి, "దాని మాటకేం గాని -- నీకు పెళ్ళి కూడా చేసేస్తే నా బాధ్యత నిర్వర్తించినట్టవుతుంది. మీ అమ్మనోక్క సారి కలిసి జరిగిన కధ చేపెస్తాను. ఏమంటావ్? నీ ఉద్దేశ్యం?" అన్నాడు ప్రసాదరావు.
రోషంతో కందిన మొహం చాటు చేసుకోబోతూ , ":నాకు పెళ్ళేమిటి, నాన్నా!" అన్నాడు వాసు.
"అదేమిటి? నీకు పెళ్ళెందుకు జరగకూడదు?" నవ్వబోయాడు ప్రసాదరావు.
"ప్చ్! అప్పుడే నాకు పెళ్ళేమిటి?" తేలిగ్గా నవ్వేశాడు వాసు.
"నీకు పెళ్ళి ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు కనక ఇప్పుడు చెయ్యవచ్చు ననుకుంటున్నాను. పెళ్ళి చేసుకుని మీ అమ్మనూ, భార్యనూ, తీసుకెళ్ళి కాపురం పెట్టుకుందువు గాని."
"వద్దు. ఈ ఒక్క విషయం లో నన్ను వదిలి పెట్టెయ్యండి!"
"అంటే?" ప్రసాదరావు కనుబొమలు ముడి పడ్డాయి.
"పెళ్ళి విషయంలో!"
"నీకు నచ్చిన అమ్మాయినే చేస్తాను, బాబూ! ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరడ్డుగా నిలిచినా నువ్వు కోరిన అమ్మాయినే చేస్తాను. సరా! ఇప్పుడు చెప్పు -- ఎవరా అమ్మాయి?"
గబగబా ఉద్య్వేగంతో అడుగుతున్న ప్రసాదరావు వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసి నవ్వి , "ఏ అమ్మాయీ లేదు. అసలు నాకు పెళ్ళి వద్దు" అన్నాడు వాసు.
"ప్చ్! అందరూ అలానే అంటారులే" అనేసి తేలిగ్గా నవ్వేస్తూ "మీ మామయ్య కూతుళ్ళేవరి కన్నా మనసిచ్చావేమో! ఆహా కాదు. వారు ఇస్తామని, నువ్వు చేసుకుందామని ఉద్దేశ్యాలేమైనా ఉంటె నాకు సంతోషమే. అలా కాదంటే ..... అతను చాలాసార్లు నన్ను అడిగాడు లక్ష రూపాయల ఆస్తితో వస్తుంది కోడలుగా మంజుల నా ఇంటికి" అన్నాడు ప్రసాదరావు.
"నాన్నా!..."
"పోనీ అదీ కాదంటే గోపాలానికి వ్రాస్తాను-- ఏదన్నా మంచి సంబంధం చూడమని."
"అసలు ఈ జీవితంలో పెళ్ళి చేసుకోను."
"బాబూ!"
"అవును నాన్నా! మీ మాట నిలబెట్టటానికీ అమ్మను పోషించడానికీ చదువుకున్నాను. ఉద్యోగం చేస్తాను. అమ్మని పోషిస్తాను. ఆమెను సంతోష పెడతాను."
"నువ్వు అవివాహితుడైతే, అలాగే జీవితాంతం ఉండి పోతానంటే మీ అమ్మ సంతోషిస్తుందా, బాబూ!"
