
21
ఆనంద్ ఇంటికి వచ్చేటప్పటికి పుల్లేటి కుర్రు నుంచి అప్పుడే వచ్చిన వీరి గాడితో మాట్లాడుతున్నది విశాలాక్షి. "ఏమిటి వీరిగా విశేషాలు?' అని పలకరించి ఇంకో గదిలోకి వెళ్ళబోతుంటే వెనక నుంచి విశాలాక్షి అంది. "ఇప్పుడే వచ్చాడు జున్నూ, తేగలూ పట్టుకొని. రెండు మూడు రోజుల్లో కుప్ప నూరుస్తారుట. చెప్పడానికి వచ్చాడు."
"చెప్పడం ఎందుకు? కుప్ప నూర్చేసి మనకి వచ్చే ధాన్యం అమ్మేసి డబ్బు పంపించమను."
"అమ్మమ్మ! కామందులు దగ్గర లేకుండా కుప్ప నూర్చడం చాలా తప్పండి! అలా ఒక్కనాటికి సేయ్యను."
"నాకు కాళీ లేదు. సరే, అన్నయ్య సంగతి అడగక్కరలేదు కదా? వీసం ఎత్తు పని ఉండదు క్షణం తీరిక ఉండదు. ఇంక ఎవరొస్తారు?"
"ఆఖరికి అక్కడ జానికమ్మ గారిని నిలబెట్టినా సరే. మాట వరసకి కామందుల మనిషి అంటూ ఒకరుండాలి. కుప్ప నూర్చే టప్పుడు."
"నువ్వే మా మనిషివి."
వీరిగాడు కళ్ళు ఒత్తుకొని ఆనందంతో "అవుననుకోండి " అన్నాడు.
"సరేలే. మా అక్కయ్యో, జానకో వస్తారు."
"నేను ఒక్కత్తే నూ వెళ్ళలేను మామయ్యా! అమ్మ వెళితే నేనూ వెళ్తా" అంది జానకి.
"సరే, ఏదో చూద్దాములే " అంటూ విశాలాక్షి వీరిగాడితో వాళ్ళ కుటుంబ యోగ క్షేమాలు మాట్లడసాగింది. సుందరమ్మకు ఆడపిల్ల పుట్టిందని, లక్ష్మీ అనిపేరు పెట్టారనీ, సత్తేయ్యా, సుందరమ్మా ఒక్క నిమిషం లక్ష్మీని వదిలి ఉండరనీ, అందుకే కాకినాడ తను రావలసి వచ్చిందని , లేకపోతె సత్తెయ్య వచ్చి ఉండుననీ చెప్పి వీరిగాడు వెక్కివెక్కి ఏడవసాగాడు. వాడిని సముదాయించి "ఏమిటి సంగతి?" అంటే సత్తెయ్య చైనా యుద్ధం లోకి వెళ్ళిపోతా నంటున్నాడనీ, అందుకు సుందరమ్మ కూడా 'సై' అంటున్నదనీ , మీరెవరైనా చెబితే వింటాడెమోననీ అన్నాడు వీరిగాడు. "అలాగే చెప్పచ్చు లే" అని విశాలాక్షి భరోసా ఇచ్చాక వీరిగాడు ఊరుకున్నాడు. మర్నాడు విశాలాక్షి, జానకీ ప్రయాణం కావాలని నిర్ణయం అయింది. వీరిగాడితో కలిసి వాళ్ళు పుల్లేటి కుర్రు వెళ్ళిపోయారు.
రామచంద్రాపురం నుంచి వచ్చి రెండు రోజులయినా, ఆనంద్ జ్యోతి దగ్గరికి వెళ్ళలేదు. ఈలోగా, తిలక్ ఆనంద్ వెనకాలే కాకినాడ వచ్చేసి మర్నాడు ఆనంద్ ను కలుసుకున్నాడు. అన్ని కాలేజీ ల వాళ్ళూ డిటెన్షన్స్ కు నిరసనగా సమ్మె చేసి, ఊళ్ళో హర్లాళ్ చెయ్య బోతున్నారని చెప్పి అందులో తను కూడా పాల్గొంటున్నానని సూచించాడు.
"మీది మరి ప్రొఫెషనల్ కాలేజీ కదా? సమ్మె చేస్తే మీ భవిష్యత్తు కి దెబ్బ కదూ?' అన్నాడు ఆనంద్.
"ఇది ఏ వ్యక్తినీ ఉద్దేశించి చేస్తున్న సమ్మె కాదు కదా? విధానం మంచిది కాదని చేస్తున్నది. మా స్టాప్ కూడా సానుభూతి తో చూస్తారని మా ఆశ" అన్నాడు తిలక్.
"సరే, వెళ్ళి రండి" అని అతన్ని పంపించి ఆనంద్ ఆలోచించ సాగాడు. "ఇంతకంటే మంచి అవకాశం రాదు. తిలక్ భవిష్యత్తు ను సర్వనాశనం చెయ్యడానికి. జాగ్రత్తగా కేసు కంకాక్ట్ చేసి తగిలించేస్తే హాయిగా ఏడెనిమిదేళ్ళు పడుతుంది శిక్ష. దానిలో భవిష్యత్తు అంతా అంధకారమయి పోయి, విచారిస్తూ కూర్చుంటాడు. బాబయ్య కు కూడా తెలియాలి. తన కొడుకు ఇలా ఎందుకూ పనికి రాకుండా అయిపోయాడని, అప్పుడు అర్ధం అవుతుంది తను నా మనస్సు ను ఎంత క్షోభ పెట్టినది. జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీసుకోడానికి ఇది మంచి అదను. ఈ అవకాశం పొతే మళ్ళీ ఇలాంటిది లభించదు. పూర్తిగా ఉపయోగించు కోవాలి ఈ అవకాశాన్ని. ఈ దెబ్బతో తిలక్, తిలక్ మీద ఆశలు పెట్టుకొన్న కౌసల్య, ఇతరులకు అపకారం చెయ్యడమే కాని తనకు అపకారం జరుగుతుందని ఊహించకుండా ధీమాగా ఉన్న బాబయ్య -- అందరూ సాఫీ."
సమ్మె ప్రదేశంలో కావాలని డ్యూటీ వేయించుకున్నాడు. విద్యార్ధులను రెచ్చగొట్టాడు. వాళ్ళు పారిపోతుంటే తరిమాడు. "రైల్వే స్టేషన్ తగలబెట్టడానికి వెళ్ళుతున్నారు . అపుచేయ్యండి." అంటూ అరిచి అన్యాపదేశంగా వాళ్ళను రైల్వే స్టేషను వైపు వెళ్ళేలా చేశాడు. స్టేషను లోకి స్టూడెంట్స్ ప్రవేశించబోతుంటే, "అదిగో, అంటించేస్తున్నా"రని వంక పెట్టి దొరికిన కుర్రాణ్ణి ప్రతి వాడినీ అరెస్టు చేశాడు. ఆ గుంపు లో తిలక్ ఎక్కడా కనిపించలేదు అతనికి. గదికి వెళ్ళాడు. అక్కడా లేడు. ఇద్దరు పోలీసులను మాత్రమే తీసుకుని వాన్ లో కాలేజీ వైపు బయలుదేరాడు. దారిలో ఎదురయ్యాడు తిలక్. "మోటారు సైకిలు కాన్ స్టేబుల్ చేత గదికి పంపించేస్తాను. ముందు మీరు వాన్ ఎక్కండి. అర్జంటు విషయం మాట్లాడాలి.' అని నమ్మించి తీరా వాన్ ఎక్కాక కస్టడీ లోకి తీసుకుని రైల్వే స్టేషను కు తీసుకు వెళ్ళాడు.
అక్కడికి గుంపుగా చేరిన వాళ్ళందరి తో "రైల్వే స్టేషను గోడ కింద గొయ్యి తవ్వి, డైనమైట్లు పెట్టి పారిపోతుండగా , తరిమి పట్టుకున్నా" నన్నాడు. తిలక్ తెల్లబోయాడు. వెంటనే కోపంతో "అబద్దం. నేను స్ట్రైక్ లో నుంచి రెండు గంటల క్రితమే విదిపోయాను. మా లెక్చరర్ ను క్లాసులో ప్రశ్నలు కూడా అడిగాను. కావలసి వస్తే వాకబు చెయ్యండి. నేనుకాలేజీ నుంచి వస్తుంటే మోసం చేసి అరెస్టు చేశారు" అని అరిచాడు.
"షటప్. నువ్వూ, నేనూ చెప్పక్కరలేదు. ఈ డైనమైట్లే చెబుతాయి సాక్ష్యం." అంటూ రైల్వే గోడ వారనున్న గోతిలో నుంచి డైనమైట్ లు తీయించి చూపించాడు. అక్కడ మూగిన జనం అంతా ముక్కు మీద వేలేసుకున్నారు.
తిలక్ మీద మోపబడిన కేసు బలమైనది. వివరంగా పత్రికలలో పడింది. అది చూసి నెత్తీ నోరు మొత్తుకుంటూ కౌసల్య కాకినాడ వచ్చింది. జైలు సూపరింటెండెంట్ ధర్మమా అని కటకటాల వెనక ఉన్న కొడుకును కలుసుకుంది. ఇంత చేసింది ఆరోజున రామచంద్రాపురం లో తమ ఇంటికి వచ్చిన ఇన్ స్పెక్టర్ అనీ, తన తప్పేమీ లేదని తిలక్ చెప్పాడు. ఆ ఇన్ స్పెక్టర్ ఇల్లు తెలిస్తే, వెళ్ళి అయన కాళ్ళూ, కడుపూ పట్టుకుంటానంది కౌసల్య. లాభం లేదని నచ్చజెప్ప ప్రయత్నించాడు తిలక్. కాదని కౌసల్య పట్టుపట్టడం తో ఆనంద్ ఇల్లు అనమాలు చెప్పి, దానితో పాటు తన గది అనమాలు కూడా చెప్పి తాళం ఇచ్చాడు తిలక్.
కౌసల్య వెళ్ళేటప్పటికి ఆనంద్ ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. కాళ్ళా వెళ్ళా బతిలామింది కౌసల్య. కొంగు చాపి పుత్ర బిక్ష పెట్టమంది. "లాభం లేదు. చేసింది చాలా పెద్ద నేరం. అయినా ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. చార్జి షీటు పెట్టేశాను." అని చెప్పాడు.
కౌసల్య ఎంత ప్రాధేయపడినా ఉపయోగం లేకపోయింది. ఏడుస్తూ విధిని నిందించుకుంటూ , చేసేదేమీ లేక నెమ్మదిగా తిలక్ గది చేరింది. తెల్లవారితే విచారణ. ఏమి జరుగుతుందో? తన చెవులతో తను వినలేదు. అందువల్ల ఆ గదిలోనే ఉండిపోయింది ఇవతలకు రాకుండా.
ఈలోగా పత్రికలు చూసి సర్పవరం నుంచి వెంకట్రామయ్య రావడం, తిలక్ గది తాళం వేసి ఉండటం చూసి తిన్నగా జేయిలుకు వెళ్ళి పోవడం జరిగింది. అసిస్టెంటు కలెక్టరు గా ఉన్న తన స్నేహితుడి పలుకుబడితో జైలు లోకి వెళ్ళి తిలక్ ద్వారా అన్నీ వివరంగా తెలుసుకున్నాడు. "నీకేమీ భయం లేదు. ఆ లెక్చరర్ సాక్ష్యం తీసుకువచ్చి నువ్వు ఆ సమయంలో అయన క్లాసులో ఉన్నావని అయన చేత చెప్పించి కేసు కొట్టేయించే పూచీ నాది" అన్నాడు వెంకట్రామయ్య.
ఊళ్ళో అందరూ అనుకుంటున్న కబురుకు తోడు పేపరు కూడా చూసి కంగారుగా ఆనంద్ ఇంటికి పరిగెత్తింది జ్యోతి. ఆనంద్ ను చూసి ఆగిపోయి, "ఇది చూశారా? మన తిలక్ మీద కేసు పెట్టారుట మీ పోలీసు వాళ్ళు." అంది.
"మన తిలక్ ఏమిటి? గర్జించాడు ఆనంద్.
వెంటనే జ్యోతి కంతా అర్ధం అయింది.
"అయితే ఇందులోమీ చలవ కూడా ఉందన్న మాట!"
"కూడా ఏమిటి? అంతా ఉంది. ఏం?"
"అబ్బే! ఏం లేదు. మీ పోలీసు బుద్ది పొనిచ్చు కున్నారు కాదు. జానకి కి కాబోయే వరుడినేనా మీరు జెయిలు లో వేయిస్తా?"
"జానకి వరుడని ఎవరన్నారు?"
"అయింది! అది కూడా అయిందీ! నేననుకుంటూనే ఉన్నాను, మీరెంత కైనా తగుదురని."
"అసలు నువ్విప్పుడిక్కడి కెందు కొచ్చావు?"
"మీరు రామచంద్రాపురం నుంచి వచ్చి ఎన్నాళ్ళయిందో తెలుసుకుందామని."
"ఎన్నాళ్ళైనా అయింది. ఏం?"
"అవునులెండి. ఇలాంటి ఘన కార్యాలన్నీ చేస్తూ కూచున్న వారికి ఇల్లెక్కడ కనిపిస్తుంది?"
"నీ వెటకారాలు కిది సమయం కాదు. వెళ్ళు."
"ఇది వెటకారం అని అర్ధం అయింది కదా? అయితే జ్ఞానం ఇంకా నశించలే దన్నమాట, పూర్తిగా? ఎంత అదృష్టం!"
"జ్యోతీ! నోరు మూసుకుని మర్యాదగా నడుస్తావా , నడవ్వా ఇక్కడ నుంచి?"
"మీరు తిలక్ కి చేసిన అన్యాయాన్ని జానకి చెవిని వెయ్యకుండా ఈ నోరు మూతపడదు."
"నీ ఇష్టం వచ్చినవాళ్లకి చెప్పుకో పో."
"పోతాను. కాని మీరనుకున్నంత సులభంగా పోను. మీరు చేస్తున్న దురాగతం ఏమిటో, మీ అహంభావంతో ఎన్ని ప్రాణాలను ఉసురు పెట్టారో లోకానికి బహిరంగ పరిచి మరీ పోతాను."
"వీపున డప్పు కట్టుకొని ఊరేగు. నాకేం భయమా?"
"మీకేమీ భయం లేదు . హూ!"
"అవును. నాకేమిటి భయం? నేనేమైనా ఒకణ్ణి పెళ్ళి చేసుకొని, ఇంకో కుర్రాడితో కులుకుతున్నానా?"
"ఏమిటి మీరనేది?"
"ఏమిటా? నువ్వు రహస్యంగా చేస్తున్న పనే, నేను బహిరంగంగా అంటున్నాను. నువ్వు తిలక్ ను సమర్ధిస్తూ వెనకేసుకు రావడానికి గల కారణాన్ని నేను ఆ మాత్రం ఊహించుకోలేనా?'
"ఆనంద్!"
"ఏం, అలా హుంకరిస్తావు? నీ రహస్యం నాకు తెలిసి పోయిందనా?"
"ఛీ, నీ నోటికి మంచీ చెడ్డా లేదు. నీ అంత సంకుచిత స్వభావుడి లోకంలో ఎక్కడా ఉండడు."
"నీ అంతటి మహా పతివ్రత మాత్రం ఉంటుంది లే!"
"పెద్దమనిషినని నువ్వు తిరుగుతున్నట్టు, పతివ్రతనని నేనేమీ లోకంలో తిరిగి మోసం చెయ్యటం లేదు."
"ఇంకా మాట్లాడి నీమీద నాకు అసహ్యం తెప్పించకు."
"అసహ్యం రావడం కూడా మంచిదే, సుఖంగా విడిపోడానికి."
"జ్యోతీ!"
"మళ్ళీ కలుసుకుందాములే కోర్టులో."
ఆనంద్ నిశ్చేష్టుడై ఉండిపోయాడు , జ్యోతి వెళ్ళిపోయిన దిక్కు చూస్తూ.
అప్పుడే పుల్లేటి కుర్రు నుంచి వస్తున్న విశాలాక్షి, జానకి తాము విన్నది నిజమేనా అని ఆనంద్ ని ప్రశ్నించారు. "ఎలాగేనా అతనిని రక్షించు" అని జానకి ప్రాధేయపడింది. "వాడిని మరిచిపో. వాడితో నీ పెళ్ళి జరగడం అసంభవం." అని నిష్కర్షగా చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్.
మర్నాడు కోర్టు లో ఆనంద్, వెంకట్రామయ్య లు ఒకరి నొకరు చూసుకున్నారు. తనను పలకరించబోయిన వెంకట్రామయ్య ను చూసి ఈసడించుకున్నాడు ఆనంద్. వెంకట్రామయ్య ఒక్క నిట్టుర్పు వదిలి ఊరు కున్నాడు. తను తిలక్ కు చేసిన వాగ్దానం ప్రకారం అతి ప్రయత్నం మీద ఆ లెక్చరర్ ను కోర్టుకు తీసుకు వచ్చి సాక్ష్యం ఇప్పించాడు. ఆ సాక్ష్యంతో జడ్జి కేసు కొట్టివేసి, తిలక్ నిర్దోషి అని తీర్పు చెప్పి విడుదల చేశాడు.
కోర్టు లో నుంచి ఇవతలకు వస్తూనే తల్లి కోసం వెతికాడు తిలక్. ఎక్కడా కనిపించలేదు.
ఇంక అక్కడ తనకు కావలసిన వాళ్ళలో బాబుగారు ఒక్కరే ఉన్నారు. "మీరు చేసిన మేలు ఈ జన్మలో మరిచిపోలేను." అని వంగి, కాళ్ళకు నమస్కారం చెయ్యబోయాడు. "తప్పు నాయనా! నీకు జరిగిన మేలుకు కృతజ్ఞత లర్పించుకోవలసింది ఆ భగవంతుడి కి. తప్పితే మీ లెక్చరర్ గారికి. పుత్ర వాత్సల్యం తో వచ్చి నిన్ను కాపాడారు." అన్నాడు వెంకట్రామయ్య. తిలక్ లెక్చరర్ కు నమస్కరించాడు.
వెంకట్రామయ్య కూడా ఆ లెక్చరర్ గారికి నమస్కరిస్తూ "మీ మేలు ఎన్నటికీ మరిచి పొలేమండి. శిష్యా వాత్సల్యం చూపించి దయతో వచ్చారు.' అన్నాడు.
"అదేమిటండి! రావడం నా విధి. అన్యాయంగా ఒక నిరపరాదికి శిక్ష పడుతూ ఉంటె చూస్తూ ఊరుకోవడం కంటే ఘోరం ఏముంది? నాకెప్పుడూ కోర్టులు అలవాటు లేకపోవడం వల్ల మొదట్లో కొంచెం తటపటాయించాను. అంతే కాని...."
"అయ్యా, ఇంకా మీలాంటి నిజాయితీ పరులూ, ఋజుమార్గ పర్తనులూ ఉన్నారు కనుకనే , ఇంకా దేశం ఇలా ఉంది. లేకపోతె దేశం ఏనాడో పూర్తిగా పతనం అయిపోను. పూర్వం ఋషులుండి, న్యాయం, ధర్మం పరిపాలనలో అమలు జరుగుతుందో లేదో చూసేవారు. ఈ రోజుల్లో ఆ బాధ్యత జడ్జీలదీ, ఉపాద్యాయులదీను. వీళ్ళు కూడా డబ్బుకీ స్వార్ధానికి లొంగి పొతే ఇంకా జాతికి ముక్తి ఉండదు. ఆ జాతి కింక భవిష్యత్తు లేదు" అన్నాడు వెంకట్రామయ్య.
