"మావా, నా జోలికి రాకు. నన్ను సదూకోని' అనేదాన్ని. ఏమంటే కోపం వస్తుందేమోనని నెమ్మదిగానే చెప్పేదాన్ని. అయినా ఇనుకోలేదు. ఆడి వరస, ఆడి సూపులు అత్త కనిపెట్టింది. 'ఏటి పిల్లదానితో ఆ సరసాలేటి? ఆ సూపులు, ఎకిలేసాలు సూస్తండ. ఏం నీకు ఆడి అయ్య బుద్ధి సోకిందా? పిచ్చేసాలెయ్యబోక. నా సంగతి తెలుసుగా, సిన్నపిల్ల దాని బతుకు దాన్ని బతకనీండిరా, సదూకోనీ. మీ మగబుద్ధి మండ! ఆడపిల్ల కాస్త నదురుగా కనిపిస్తే ఏటా ఏసాలు? ఇట్టాగైతే దాన్ని పంపేస్తా జాగ్రత్త!' అంది. గట్టిగా నాలుగు రోజులు సరిగా ఉన్నాడు. అత్త ఉన్నప్పుడు దొంగసూపులు సూసేవాడు. నేను ఒంటరిగా ఉన్నానంటే ఏదో మొదలుపెట్టేవాడు. అమ్మా! అయ్యకీ, ఈడికీ తేడా ఏటో తెలుసా? అయ్య మోటోడు, ఈడు కాస్త నాజూకు. అంతే తేడా... అత్త లేకపోతే బయపడి సచ్చేదాన్ని. అత్తతో చెప్దాం అనుకున్నా. చెపితే ఆగం అవుతుంది. సదువు మధ్యలో ఆగిపోతుందని అలాగే ఓర్చుకున్నా" పూసగుచ్చినట్టు చెప్పింది కవి.
నిర్ఘాంతపోయి నోట మాట రానట్టుండిపోయింది శోభమ్మ. 'తనకి కొడుకులాంటోడు తన తమ్ముడు. నమ్మి ఆడికి బిడ్డని అప్పగిస్తే ఆడూ ఇంతేనా?' ఏడుపు తన్నుకొచ్చింది. "మరిప్పుడేటైంది? అత్త ఎందుకంపేసింది?"
కవిత చెప్పడానికి ఇబ్బందిపడ్తూ తల్లివంక చూసింది. "ఏవే బుజ్జీ! ఏటి సేసాడే?" భయంగా అడిగింది.
"అమ్మా, అత్త ఇంట్లో లేనప్పుడు మావ మద్దాన్నం ఆఫీసునుంచి వచ్చేశాడు. నాతో సరసాలాడుతూ, వాటేసుకుని ముద్దులెట్టాడు. నేను గింజుకుంటూ వదులు అత్తతో సెపుతా అని బెదిరించా, ఇనుకోలేదు. ఇంత సక్కని సిలకని ఎలా వదలాలె. ఒక్క ముద్దెట్టు, ఇలా తిరుగు అంటూ నలిపేస్తూ పక్కమీదికి తోశాడే. నేను గట్టిగా అరిచి ఆడ్ని తోసేసి గుమ్మం బయటికి పరుగెత్తా. ఆడు మల్లీ లాక్కెళుతూంటే గట్టిగా అరిచా. నా జోలికి వచ్చావంటే అందరినీ పిలుస్తా అని గట్టిగా అరిస్తే భయపడి లోపలికి పోయాడే అమ్మా! అత్త వచ్చేవరకూ బయట గట్టుమీద కూకుండా. అత్త రాగానే నా మొహం చూసి, బయట కూకోడం చూసి అడిగింది. నేను భయపడి జరిగింది చెప్పా. అత్త, మామ పెద్దగా పోట్లాడుకున్నారు. అత్త తిట్టిపోసింది ఆడ్ని. 'నీ కూతురులాంటి పిల్లరా అది, ఆడి బాబుకి నీకూ తేడా ఏంటి? ఆడపిల్ల కనిపిస్తే వదిలిపెట్టర్రా? ఛీ పాడు బతుకు. దాన్ని ఈడ కూడా బతకనీయవా?' అని అడిగింది. 'ఏటి ఏదో సిన్న సరసం ఆడితే తప్పేంటి?' అంటూ బుకాయించాడు. నేను కోపంగా జరిగిందంతా చెప్పగానే నోర్మూసుకుని బయటికి పోయాడు. అత్త ఏదో ఆలోచించి నా బట్టలు, పుస్తకాలు సర్దేసి 'నీవింక ఇక్కడ ఉండద్దు' అని బస్సెక్కించేసింది. అమ్మా, ఆ రోజు అత్త ఆఫీసులో ఎవరో సచ్చిపోనారని సెలవిస్తే తొందరగా ఇంటికొచ్చేసింది. అత్త ఉండదనే ఆడు ప్లానేసుకొచ్చాడు. అత్త మధ్యలో వచ్చేసరికి బిత్తరపోయాడు."
కవిత జరిగిందంతా వర్ణించి చెప్తుంటే హతాశురాలైంది శోభమ్మ. దిక్కుతోచని దానిలా కింద కూలబడింది.
రాత్రి రాజన్న తూలుకుంటూ ఇంటికొచ్చి కవితని చూసి "నా బంగారుతల్లీ, ఏడకి బోనావ్, ఎందుకి బోనావ్?" అంటూ సంబరపడిపోయాడు.
"పిల్లది తిరిగి వచ్చింది. మళ్లీ అమ్మకానికి పెడతావా?" హుంకరించింది.
"ఇదిగో ఇనుకో, దాని జోలికి పోతే నే పోయి పోలీసోల్లకి సెప్పి నిన్ను జైల్లో తోయిస్తా" అని బెదిరించింది గట్టిగా.
రాజన్న నవ్వుకుంటూ మంచంలో కూలబడ్డాడు.
* * *
తను పనిచేసే చోట అఫీసరమ్మ ఇంట్లో కూతురి గురించి మొరపెట్టుకుంది శోభ.
అంతా విని "పోనీ గవర్నమెంటు సంక్షేమ హాస్టల్లో చేర్పించు" అని సలహా ఇచ్చింది విజయలక్ష్మి.
"హాస్టల్లో అసలు తిండితిప్పలు సరిగా ఉండవటగదమ్మా! నీళ్లుండవు, పాయిఖానాలు దరిద్రంగుంటాయి అంటూ మా అత్త కూతురు మూడు నెల్లకే పారిపోయి వచ్చింది తిండిలేక. మంచి హాస్టల్లో చేర్పించాలంటే అంత డబ్బు నాకాడ ఏడుందమ్మా?" అంది శోభమ్మ.
"అవునులే, అయినా అక్కడ కూడా ఎన్ని కథలు వింటున్నాం. గతిలేని ఆడపిల్లలు అన్నీ భరిస్తూ బతుకీడుస్తున్నారు. పోనీ ఒక పనిచెయ్యి. ఓసారి పోలీసు స్టేషనుకెళ్లి నీ మొగుడి గురించి చెప్పు. 'పిల్లదాని జోలికెడితే, తన్ని జైల్లో పడేస్తాం' అని నీ మొగుణ్ణి బెదిరించమని బతిమిలాడు" సలహా విని శోభమ్మ తలూపింది.
* * *
"చూడమ్మా, నీ పేరేమిటి? శోభమ్మా, నీ మొగుడేం నేరం చెయ్యలేదు గదా, జైల్లో ఎలా పెడతాం. తాగుతాడు, నిన్ను తంతాడు, డబ్బు లాక్కుపోతాడు, ఇలాంటి తాగుబోతు ఎదవల్ని జైల్లో పెట్టాలంటే ఎన్ని జైళ్లున్నా చాలవు. వాడేదో పిల్లని అమ్మేస్తానని బేరం ఆడాడు. కాని అమ్మలేదు కదా! మరే నేరం మీద ఆడ్ని తన్ని తీసుకురమ్మంటావు చెప్పు?" అడిగింది ఇన్ స్పెక్టరు శకుంతల.
"ఏటమ్మా, కన్నోడు పిల్లదానిమీద అఘాయిత్యం సేయబోవడం నేరం కాదా? బిడ్డని అమ్మకానికి పెట్టడం నేరం గాదా? తాగొచ్చి పెళ్లానికి, కూతురికి తేడా లేకుండా కన్నబిడ్డ బతుకు బండలు సేయాలనుకోవడం నేరం కాదా? సంపుతేనే, దొంగతనాలే నేరాలా? మరి మాలాంటోళ్లు ఎవరికి సెప్పుకోవాలి? మాకెవరు దిక్కు? మీరు ఆడోళ్లు, పోలీసోళ్లు. ఓ ఆడకూతురు కట్టం ఇనుకోరా, నాబోటి దానికి సాయం సేస్తారని వచ్చా. ఆడపిల్లకి ఇంట్లో కన్నతండ్రి, తోడబుట్టినోడి దగ్గర కూడా బతికే వెసులుబాటు లేదా? ఇంట్లో బతకనీరు, స్కూల్లో బతకనీరు, ఆస్టల్లో సదూకోనీరు, రోడ్డుమీద ఒంటరిగా ఎలితే భయం, ఊరికంపితే భయం, సదూకునే పిల్లగాళ్ల దగ్గరనుంచి ఆటోవాడు, బస్సువాడు, ఆస్టల్లోవాళ్లు, పనిచేసే చోట, ఏడ ఆడపిల్ల భయం నేకుండా బతికే వీలులేదా? ఇంటికాడ తండ్రే బతకనీయకపోతే ఆడపిల్ల ఏడకి చేరాలి, ఏడ బతకాలి? ఎన్నాళ్లు తల్లి కాపు కాచుకుంటది? మీరేటి సేస్తారో, ఆడ్ని ఏటి సేస్తారో, కొట్టి, తిట్టీ బెదిరించో మల్లీ ఎదవపని సేయకుండా సేయండి. మీ కాలు మొక్కుతా. కాదంటే నేనీడ కూకుంటా. కదలను" అంటూ ఇన్ స్పెక్టరు కాళ్లు పట్టేసుకుంది.
"వదులమ్మా! అలా కాళ్లమీద పడకూడదు. లేచి కూర్చో ముందు" అంటూ కాళ్లు లాక్కుంది. "సరే, బెదిరించడం వరకు చేస్తా గానీ, ఆణ్ణి జైల్లో పెట్టాలంటే నేరాలు, సాక్ష్యాలు చూపాలి" అంటూ కాసేపు ఆలోచించి లేచి నిల్చుని "కానిస్టేబుల్స్ ఇద్దరు నాతో రండి. లాఠీ దెబ్బలకి దెయ్యం దిగుతుందేమో చూద్దాం! ఈ తాగుబోతు నాయాల్ల ఆగడాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి" అంటూ జీపు ఎక్కింది. శోభమ్మని కూడా జీపులో కూచోమంది.
"ఓరి నాయనో, అమ్మో! ఈ దొంగముండ అన్నీ అబద్ధాలు సెప్పింది. కూతురిని ముద్దు సేస్తే తప్పా? నా కూతురు నా ఇట్టం. తాగుతా. ఇదెవర్తి సెప్పు?" నులకమంచంలో పడుకున్న రాజన్న ఇన్ స్పెక్టరు వచ్చి లాఠీతో రెండు దెబ్బలేయగానే తాగినమత్తులో పొగరుగా అన్నాడు.
"అలాగా, పెళ్లాం అయితే తంతావా? కూతురైతే దాని బతుకు బండలు చేస్తావా? దాన్ని అమ్మకానికి పెడతావా? ఏట్రా ఆ పొగరు మాటలు?" అంటూ మరో రెండు దెబ్బలు వేసింది.
"పద, నాలుగు రోజులు చిప్పకూడు తిని లాఠీ దెబ్బలు రుచిచూస్తే తల్లెవరో, కూతురెవరో తెలుస్తుంది. తాగుబోతు ఎదవల్లారా! ఇంట్లో కన్నబిడ్డల్ని కూడా బతకనీయర్రా, దాన్ని అమ్మడానికి నీకెవరిచ్చార్రా అధికారం? పద, కానిస్టేబుల్! ఈణ్ణి జీపులో పడేయండి" అంది ఇన్ స్పెక్టర్.
"అమ్మా! ఇన్ స్పెక్టరుగారూ, ఇదిగో ఈళ్లని కూడా నాలుగు తన్నండి" మిగతా ఆడవాళ్లంతా బయటికి వచ్చి మొగుళ్ళని తిట్టిపోశారు.
బిక్కచచ్చి కింద కూలబడ్డ రాజన్నని మరోటి తగిలించి "ఇదిగో, నీ పెళ్లాం పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. మొదటిసారి అని లాఠీ దెబ్బలతో సరిపెట్టా. మరోసారి నీ కూతురి జోలికి, నీ పెళ్లాం జోలికి వెళ్లావని తెలిస్తే జైల్లో పడేస్తాను. కానిస్టేబుల్, ఇదిగో వీడి పేరు, ఇంటి నెంబరు, పెళ్లాం పేరు, కూతురి పేరు... అన్నీ రాసి ఫైల్లో పెట్టండి. మళ్లీ ఈమెగాని వచ్చి కంప్లైంట్ చేస్తే ఈణ్ణి లాక్కొచ్చి జైల్లో పడేయండి" అంటూ బెదిరించి శోభమ్మ భుజం తట్టి "ధైర్యంగా వుండు. మళ్లీ ఏదన్నా జరిగితే చెప్పు" అంటూ జీపెక్కింది. శోభమ్మ దండాలు పెడుతూ చీరకొంగుతో కళ్లు తుడుచుకుంది.
(నవ్య, జూలై 2018)
* * * *
