16
సురేంద్ర జీవితంలోకి ఉత్సాహం, అనందం జొరబడిపోయినవి. మాధురి సాంగత్యంలో అతనిలో కొత్త ఆశల్నీ ఊహల్నీ చిగురింపజేసింది.
ప్రతిరోజూ కొద్దిసేపయినా ఆమె ఇంట్లో గడపందే వుండలేకపోతున్నాడతను.
ఆ రోజు ఆఫీస్ లో నుంచి బయటికొచ్చి ఆమె ఇంటి వేపు నడవసాగారిద్దరూ.
"నీతో ఓ విషయం చెప్పాలి....." అంది మాధురి నవ్వుతూ.
"ఏమిటది ?"
"మనిద్దరం ఇలా కలిసి రోడ్డు మీద నలుగురి దృష్టిలో పడటం మనిద్దరకూ మంచిది కాదూ. ఎవరి త్రోవన వాళ్ళు బయల్దేరి ఎక్కడో ఓచోట కలుసుకుందాం."
"నీ ఇష్టం! రోజూ ఎక్కడ కలుసుకొందాం మరి ?" ఆత్రుతగా అడిగాడతను.
"నాకేం తెలుసు? నువ్వే చెప్పాలి...."
కొంతసేపు ఆలోచించాడతను.
"పోనీ ..... మీ ఇంటి దగ్గరే కలుసుకుంటే? ఆ తరువాత ఆలోచించుకొని ఎక్కడో చోటికి పోవచ్చు ."
"సరే- నువ్వు ఆఫీసు వదలిన కాసేపటి తర్వాత నేను బయలుదేరతాను."
ఇల్లు చేరుకొన్నారిద్దరూ.
పడకకుర్చీలో కూర్చున్నాడతను. "టీ" తీసుకొచ్చి అతనికోకప్పు ఇచ్చి తనూ అతని కెదురుగా తాగుతూ కూర్చుంది మాధురి.
"ఇవాళ ఓ మంచి ఇంగ్లీష్ సినిమా ఉంది వెళ్దామా అడిగాడతను.
"ఎక్కడికయినా సరే -- నేను రెడీ!" అందామె నవ్వుతూ.
"త్వరగా రెడీ అవాలి మరి. పెందలాడే మొదలెడతారది...."
ఆమె లేచి లోపలి కెళ్ళి మొఖం కడుక్కొని టవల్ తో తుడుచుకుంటూ వచ్చింది.
"నువ్ కూడా బాత్ రూమ్ లో కెళ్ళి మొఖం కడుక్కురా....." అంటూ అతని మీదకూ విసిరేసింది. అందుకొని లోపలకు నడిచాడతను.
ముఖం కడుక్కొని తిరిగి ఆ గదిలో కెళ్ళేసరికి ఆమె చీర మార్చుకుంటూ కనిపించింది.
"కొంచెం సేపు కళ్ళు మూసుకో!" అంది అతని వంక చూసి నవ్వుతూ.
అతను కళ్ళు మూసుకొన్నట్లు నటిస్తూ ఆమె దగ్గిరకు వెళ్ళి వెనుక నుంచి తన గుండెలకు బలంగా హత్తుకున్నాడు.
"ఇంక సినిమాకు వెళ్ళినట్లే ......" చిరుకోపంతో వదిలించుకోడానికి ప్రయత్నిస్తూ అందామె.
"మన అనందం కంటే సినిమా ఎక్కువా?" మరింత గాడంగా కౌగలించుకొని ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకొంటూ అన్నాడు సురేంద్ర.
అతని కౌగలి ఆమెకూ పరవశత్వం కలిగించింది. నెమ్మదిగా అతని వైపు తిరిగి అతని గుండెల మీద తల వాల్చింది.
ఆమెను అలాగే మంచం మీదకు చేర్చి ఆమె ప్రక్కనే ఒరిగిపోయాడతను. అతనిని గుండెల మీదకు లాక్కొని ఆవేశంతో అతని ముఖం నిండా ముద్దులు పెట్టుకొందామే. గదిలో గడియారం తొమ్మిది గంటలు కొట్టింది.
"ఇంకా లేద్దామా ?" అడిగిందామె అతని కౌగిలి నుండి విడివడడానికి ప్రయత్నిస్తూ.
"అప్పుడేనా?"
"ఏం? ఇంటి కెళ్ళావేంటి ?" నవ్వుతూ అందామె.
"ఇలా ఎన్నాళ్ళూ మాధురి! మనం శాశ్వతంగా ఒకటి అవకూడదూ?" ఉద్రేకంగా అన్నాడతను.
"అంటే ఎలా?" చిలిపిగా చూస్తూ అడిగిందామె.
"మనం ఎందుకు వివాహం చేసుకోకూడదు?"
"మరి నీ భార్యనేం చేస్తావ్?" హేళనగా అడిగిందామె.
అతని ముఖం పాలిపోయింది.
అవును! తను స్వరూపను వివాహం చేసుకొన్నాడు. విడాకులివ్వకుండా ఆమెను దగ్గిరకు రానీకుండా చేయడమే తన ప్రతీకారం అని చెప్పాడు. ఇప్పుడు ఆమెకు విడాకులివ్వందే-- మాధురిని వివాహం చేసుకోవడం సాధ్యం కాదు. కాని ఆమెకు విడాకులిస్తే ఎలా? తను ఓడిపోయినట్లే అవుతుంది. ఊహు అలా మాత్రం జరక్కూడదు స్వరూప ఎప్పటికీ తనకు బందీ గానే ఉండాలి! విడాకులిస్తే ఆమె మరో వివాహం చేసుకొంటుంది. హాయిగా తనను మర్చిపోయి జీవితం గడుపుతుంది ! తనకిష్టం లేదు.
"ఊరికే అన్నాలే! అయినా మనకి వివాహం అవసరం ఏముందిప్పుడు?" అంది మాధురి, జీవం లేకుండా నవ్వాడు సురేంద్ర.
"అవును మాధురీ! అన్ని విధాలా మనం భార్యా భార్తలమే! వివాహం అనేది కేవలం ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగటానికే కదా! లేకపోతే దాని అవసరమేముంది ?"
మాధురి లేచి లోపలికి వెళ్ళింది.
"ఇంకా లేవండి భోజనం వడ్డిస్తాను...." అంది మాధురి కొద్ది సేపటి తర్వాత తిరిగి వస్తూ.
"మా ఇంటి కెళ్ళాద్దూ?" అడిగాడతను.
"ఇది మాత్రం మీ ఇల్లు కాదా?" నవ్వుతూ అందామె.
ఇద్దరూ భోజనం ముగించారు.
ఆమెను వదిలి ఇంటి కెళ్ళడం అయిష్టంగానే ఉందతనికి.
"వెళ్ళనా ?" అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
"పోనీ -- ఈ రాత్రికి ఇక్కడే ఉండకూడదూ?"
అలా అడిగినప్పుడు ఆమె అందం మరింత విజ్రుంభించినట్లనిపించిందతనికి.
తలుపులు మూసివేసి ఆమె దగ్గరకు నడిచాడు.
తన కోసం - భోజనం చేయకుండా ఎదురు చూసే తల్లి గుర్తుకొచ్చిందతనికి.
