Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 31

 

    టక్కున ఆమె చెయ్యి పట్టుకుంటూ, "నిజం పద్మజా, అయిదున్నరాయేసరికి తయారవు. శ్రీను హాలు దగ్గరికి వస్తానన్నాడు. మనిద్దరం స్కూటర్ మీద వెళ్ళిపోదాం.....ప్లీజ్, కాదనకు! ఇక వెళ్ళిపోతానుగా? ఇన్నాళ్ళు, ఇన్ని సంవత్సరాలు మీ అందరితో కలిసి మీతో సమానంగా ఆదరణ పొందా నీ ఇంట్లో.....అందరం వెళదాం రమ్మన్నాను. పెద్ద వాళ్ళెవరూ రానన్నారు. ఎవరేమనుకుంటే మనకేం? ఏం, వస్తావు కదూ?" అని అడిగాడు వాసు.
    మౌనంగా నిలుచున్న పద్మజ కళ్ళు చప్పున నీళ్ళతో నిండాయి. గబగబా కళ్ళు తుడుచుకుంటూ, "వాసూ, నీకేం బాధ అనిపించటం లేదా ఇక్కడి నుంచి వెళ్ళి పోవడమంటే!" అంది. ఆమె గొంతు తడిగా ఉంది.
    ఆమె బాధపడి రోదిస్తుందని గ్రహించిన వాసు "ప్చ్! చదువు, ఉద్యోగం కావలసి వచ్చినప్పుడు ఒక్క ఊరూ, ఓ ఇల్లూ వీటి మీద మమకారం పెంచుకు బాధపడితే ఎలా? మీరు ఎక్కడ ఉన్నా నాకు కావలసిన వాళ్ళే! మీకు నేను దూరమేలా అవుతాను?' అని తన హృదయం కూడా సన్నని బాధకు గురి అయినా, ఆ బాధ గొంతులో వ్యక్తం కాకుండా అన్నాడు వాసు.
    సినిమా నుంచి రాత్రి పది గంటలకి గలగలా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు వాసూ, పద్మజా. మరో పావుగంట కి రిక్షాలో వచ్చాడు శ్రీను.
    బద్దకంగా ఒళ్ళు విరిచి పక్క మీద వాలబోతున్న వాసు మధుమతి రావడంతో లేచి కూర్చున్నాడు. "ఏమమ్మా! ఇలా వచ్చావు?" అంటూ.
    "ఏదో హస్యాని కంటున్నారు కాబోలు అందరూ అనుకుంటున్నాను. నిజంగా ఐ.ఎ.ఎస్ . ఆఫీసరవాలనుకుంటున్నావా?" ఆశ్చర్యంగా , నమ్మలేనట్టుగా వాసు వైపు చూస్తూ అంది మధుమతి.
    "రా, కూర్చో. నేననుకోవడ మేమిటమ్మా! అదృష్టముంటే అవుతాను. ఇంకా సెలక్షవాలిగా?' అన్నాడు చిన్నగా నవ్వుతూ.
    "సరే. అది తెలుసుకోవాలనే వచ్చాను.... ఇదంతా ఏదో గారడీ లా ఉంది. కానీయ్.... రాజు ఉత్తరం వ్రాశాడు. అమ్మమ్మ నోసారి చూద్దామనుకుంటున్నాను. వచ్చే శుక్రవారం నువ్వు కూడా ఓసారి అక్కడికి రా." అని మరి నిలుచో కుండా వెళ్ళిపోయింది మధుమతి.
    ఆమె వైపు చూసిన వాసు బాధగా నిట్టూర్చాడు.
    అమెకా రాత్రి  'తనకి తెలియకుండా వీళ్ళంతా ఏదో దాస్తున్నారు. ఎక్కడిదీ డబ్బు? ఎవరు పెడుతున్నారు వాసుకి? ఛీ ఛీ! నేనో నిర్భాగ్యురాలను. ఆనాడు భర్తా, ఈనాడూ కొడుకూ -- ఇద్దరూ నన్ను మనసిచ్చి ప్రేమించలేదు. భర్తకి మమకారం లేదు. కొడుక్కి విశ్వాసం లేదు. అందరూ నన్ను మోసగిస్తున్నారు.' అనుకుంటే ఉప్పెనలా వచ్చింది దుఖం. కళ్ళలో నీరు ఇగిరే పర్యంతం ఏడ్చి అలసి నాలుగవ జామున నిద్రపోయింది మధుమతి.
    వాసు వెళుతుంటే , ఆ కుటుంబ సభ్యులందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతున్నట్టు మొహం వేలేసింది లక్ష్మీ. తలుపులు బిగించి, మంచం మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది పద్మజ. 'అబ్బా! ఏం తోచడం లేదు!" అంటూ ఇల్లంతా తిరిగిన శ్రీనూ చిన్నగా నవ్వుతూ , "వాసు వాళ్ళ ఫ్రెండింటికనో, బామ్మను చూడాలనో అప్పడప్పుడు వెళ్ళేవాడు. అప్పుడీవేళ అనిపించినంత వెలితి ఉండేది కాదు. ఎందుకమ్మా ఇప్పుడిలా చిన్న బోయింది ఇల్లు?" అని అడిగాడు లక్ష్మీని.
    నవ్వింది లక్ష్మీ. "ఇల్లు కాదు . బాబూ, చిన్న బోయింది . మన మనస్సులు. ఇదివరకు వెళ్ళే వాడంటే మళ్ళీ వస్తాడు, ఇక్కడే ఉంటాడని అనుకోవడం లో తృప్తి ఉండేది. ఏదో మన ఇంటికి వచ్చిన అబ్బాయి ఎమ్. ఎ. పాసై , ఇంకా పైకి చదవబోతున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది. ఆ అబ్బాయి మనస్సు మంచిది. నలుగురి లో అరమరికలు లేకుండా కలిసిపోతాడు. అతనిలా నువ్వూ శ్రద్దగా చదవాలి."
    మరక్కడ నిలుచోకుండా వెళ్ళిపోయాడు శ్రీను.
    'అక్కయ్యా! ఎందుకే అలా ఏడుస్తున్నావు? జ్వరం వచ్చిందా? తలనొప్పా?" కంగారుగా పద్మజ చెంప లపై చెయ్యి వేశాడు శ్రీను.
    "ఉష్! గొడవ చెయ్యకు.... తలనొప్పే.... దయచేసి వెళ్ళవతలకి.' విసుక్కుంది పద్మజ.
    "తలనొప్పి కాదు, నాకు తెలుసు, ఎందు కేడుస్తూన్నావో? కొంటెగా నవ్వాడు శ్రీను.
    "ఏమిట్రా నీకు తెలిసింది!" చిరాగ్గా అంది పద్మజ.
    "పెళ్ళి వద్దని, పెళ్ళి కొడుకు రేపు వస్తున్నాడని."
    "పోతావా, లేదా నా గది లోంచి?" అరిచింది పద్మజ.
    "టాటా....బైబై!" నవ్వుతూ వెళ్ళిపోయాడు శ్రీను.
    నిజంగానే మరునాడు గోపాల్రావు పెళ్ళి వారోస్తున్నారని చెప్పిన మాటకి తుళ్ళి పడింది పద్మజ. చాటుగా తల్లితో -- "వద్దమ్మా, నేను పెళ్ళి చేసుకోనని చెప్పింది. "అందరూ అలానే అంటారులే" అని నవ్వేసింది లక్ష్మీ.'తాను ఊహిస్తున్నదానికి వ్యతిరేకంగా ఇదేమిటి?' అని దిమ్మెర పోయింది మధుమతి. పద్మజ కెవరో చూపుల కొస్తున్నారంటే ఆమె మనస్సెందుకో విలవిలలాడింది.
    ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో , వచ్చిన పెళ్ళి వారి ఎదుట పది నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయింది పద్మజ. వాళ్ళు వెళ్ళిన క్షణం లో "నాకా అబ్బాయి నచ్చలేదు" అని ఎవరూ తనని అడగకుండానే చెప్పేసింది.
    షాపుకి వచ్చిన వాసుని కళ్ళజోడు సరిజేసుకుంటూ పరిశీలనగా చూసిన ఓనర్ రంగనాధం -- "పంతులు గారి అబ్బాయి కదూ! మీరు" అన్నాడు.
    "అవునండి. మా నాన్న రాలేదా?"
    "వస్తారు. కూర్చోండి...ఏయ్! ఓ కాఫీ పట్రా." మర్యాద చేశాడు రంగనాధం.
    మొహమాటం గానే కాఫీ తీసుకున్నాడు వాసు.
    "మీరు?..." అంటూ ఆగాడు రంగనాధం.
    "ఎమ్.ఎ పాసయ్యాను. ఐ.ఎ.ఎస్ ఇంటర్వ్యూ కి వెళతాను. అంతా మీ దయ. మా నాన్నగారికి, మీకూ ప్రాణ స్నేహం."
    "ఆహా నా దయకేముంది? నాన్నగారెంత తెలివైన వారూ! అతన్ని మించిన వారు మీరూ!"
    వాసు మాట కడ్డు వస్తూ అని గలగలా నవ్వేశాడు రంగనాధం.
    "మా వాసుని ఇక్కడ ఉంచేశారా! ఎదురుచూస్తూ ఇంటి దగ్గర కూర్చున్నాను" అన్నాడు ప్రసాదరావు నవ్వుతూ.
    "మీరు వచ్చే టైమైయిందిగా? చెరొక త్రోవా అవుతారని. ఆ ఇంటికి ఫ్యూన్ చేత కబురు చెయ్యండి వంట చెయ్యద్దని. మీరిద్దరూ ఈవేళ మా ఇంటికి దయచేయ్యాలి."
    తెల్లబోయి ఆశ్చర్యంగా చూశాడు ప్రసాదరావు. ఇన్ని సంవత్సరాల్లో తన నెప్పుడూ అతని ఇంటికి భోజనానికి ఆహ్వానించలేదు, అప్పుడప్పుడు ఏమైనా టిఫిన్లు పంపడం తప్ప. క్షణంలో తేరుకుని, "ఆహా వద్దండీ. ఈవేళేగా వచ్చాడు?" అని ఇంకా ఏమో అనబోతున్న ప్రసాదరావు -- "మరింకేం అడ్డు చెప్పకండి. ఒరేయ్, సత్యం పంతులు గారూ వారి అబ్బాయి మనింటికి భోజనానికి వస్తున్నారని చెప్పు" అన్నాడు రంగనాధం.
    ఇబ్బంది గానే వెళ్ళారు ప్రసాదరావు, వాసూ ధనవంతుల ఇల్లు. బార్ లైట్ల వెలుతురూ లో వెండి కంచాలు, తళతళ మెరుస్తున్నాయి. వాల్చిన పీటలకి నాలుగు మూలలా వెండి పూలు. ఖరీదైన చీరల్లో, ఒంటి నిండా నగలతో వడ్డన చేస్తూన్న ఇద్దరు నడి వయస్సు స్త్రీలు.నాలుగు రకాల స్వీట్లు, ఇంకా కూరలు ప్రత్యేకమైన విందని చెబుతున్నాయి.
    'అబ్బాయి కేమైనా సంబంధాలు చూస్తున్నారాండీ!' ముసిముసిగా నవ్వుతూ అడిగాడు రంగనాధం.
    "ఇంకా ఇంటర్వ్యూ లో సెలక్టవ్వాలి. తరవాత ట్రయినింగ్ ఉంది. కానీయండి....ఉద్యోగంలో ప్రవేశించాకే పెళ్ళి ఆలోచన" అన్నాడు ప్రసాదరావు.
    వెండి పళ్ళెం లో ఆకులూ, వక్కలూ, సున్నం, ఇంకా సోపూ , కుంకుం పువ్వూ అన్నీ అమర్చి తెచ్చిన అమ్మాయిని చూస్తూ, "రా, అమ్మా. సిగ్గెందుకు? మామ్మయ్యగారే! ఇక పొతే వారబ్బాయి కొత్తవారు.... మీ పేరు వాసు కదూ? ఇదిగో మా అమ్మాయి మంజుల. ఏదో మామూలు చదువు పి.యు.సి పాసైంది. రా, అమ్మా. ఇలా కూర్చో" అన్నాడు రంగనాధం.
    తలఎత్తి ఆమె వైపు చూసిన వాసు రెండు క్షణాలు చూపులు తిప్పుకోలేక పోయాడు. ఒకసారికి పదిసార్లు చూడాలనిపించే రూపం అమెది. "నమస్తే ....' నెమ్మదిగా అంది ఆమె. 'నమస్తే!' తడబాటుగా అన్నాడు వాసు.
    పదినిమిషాలు ప్రసాదరావు , రంగనాధం వాళ్ళ వ్యాపార విషయాలేవో మాట్లాడుకుంటూ ఉంటె మౌనంగా కూర్చుని వెళ్ళిపోయింది మంజుల. ఆ పది నిమిషాల్లో పదిసార్లు చూశాడేమో ఆమె వైపు వాసు.
    తిరిగి వెళ్ళేటప్పుడు -- "వాళ్ళు షావుకార్లు కాదా, నాన్నా!" అని అడిగాడు వాసు.
    "షావుకార్లె. కాని వాళ్ళంతా అందంగానే ఉంటారు. ఆ అమ్మాయి చూడు, ఎంత బాగుంటుందో!" అన్నాడు ప్రసాదరావు చిన్నగా నవ్వుతూ.
    మౌనంగా ఉండిపోయాడు వాసు.
    ఐ.ఎ.ఎస్ కి వాసు సెలక్షనయినట్టు విన్న ప్రసాదరావు ఆనందాతిశయం తో వివశుడయ్యాడు.
    ట్రెయినింగ్ కి వెళ్ళబోతున్న వాసు -- "మరి టైం లేదు, నాన్నా! అమ్మ అమ్మమ్మ గారింట్లో ఉంది. ఓసారి చూసి ఆమెకు చెప్పి వెళతాను." అన్నాడు.
    "సరే, అలానే చెయ్యి. చిన్న మామయ్యకు లెటరు వ్రాశావా, సెలక్టయినట్టు? నే వ్రాశానులే" అన్నాడు ప్రసాదరావు.
    "ఆ వ్రాశాను. వెళ్ళాక అడ్రెసిస్తాను. లెటర్స్ వ్రాస్తూ ఉండండి.
    "నే వ్రాయడాని కేముంది! నువ్వు జవాబివ్వాలి కాని!"
    "ఎందు కివ్వను నాన్నా!' నవ్వుకున్నాడు వాసు.
    కదిలిపోతున్న రైలు పెట్టెతో గబగబా నడుస్తూ "తొందరగా చిన్న మామయ్యా ఇంటికి వెళ్ళిపొమ్మను మీ అమ్మని" అన్నాడు ప్రసాదరావు.
    "అలాగే. మరి మీరు ఉండండి" అన్నాడు వాసు సంతోషంగా.

                          *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS