20
రామచంద్ర పురం లో కోర్టు పని పూర్తీ చేసుకుని బయలుదేరుదా మనుకుంటున్న ఆనంద్ కు హోటల్లో తిలక్ తారసపడ్డాడు. దగ్గరకు వస్తూనే ఆశ్చర్యంగా "ఏమిటి, ఇలా వచ్చారు?'అన్నాడు. ఆనంద్ నవ్వుతూ "కోర్టులో కొంచెం పని ఉంటె, మీరిలా వచ్చారేమిటి?' అన్నాడు.
"మాది ఈ ఊరేగా? ఆ పక్క వీధిలోనే మా ఇల్లు. రండి మా ఇంటికి వెళదాము" అన్నాడు తిలక్,
వెళ్లిపోవాలి అంటూనే , తిలక్ బలవంతం మీద ఆనంద్ అతని ఇంటికి బయలుదేరాడు. పెద్ద వీధిలో రెండంతస్తుల మేడ. మెడకు తగ్గ అందమైన ప్రహరీ , ప్రహరీ మీద నుంచి తొంగి చూస్తున్న గులాబి, బంతి మొక్కలు -- ఇవన్నీ చూసి 'తిలక్ చాలా ధనవంతుడే' అనుకున్నాడు ఆనంద్.
"మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు?" అన్న ఆనంద్ ప్రశ్నకు, తాత్త్వికమైన ముఖం పెట్టి, వేదాంతి లా నవ్వుతూ "అదేమో? అయన సంగతి మాత్రం నాకు తెలియదు. మా అమ్మ మాత్రం , పాపం, రాత్రీ పగలూ అనకుండా క్రమశిక్షణ కోసం తెగ కృష్టి చేస్తుంది.' అన్నాడు. ఆనంద్ నవ్వుకున్నాడు. ఆనంద్ ను హల్లో కూర్చోబెట్టి తిలక్ తల్లితో చెప్పాడు -- 'ఇన్ స్పెక్టర్ గారు వచ్చా'రని.
కౌసల్య వచ్చి తలుపు చాటున నిలబడి "నమస్కారం బాబూ!" అంది. ఆనంద్ ప్రతి నమస్కారం చేశాడు.
"మీ గురించి అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. మీరు చాలా మంచి వారనీ, స్నేహ పాత్రులనీ, తనకో అన్నగారి లాగ అన్ని సలహాలు ఇస్తూ ఉంటారనీను."
"అదంతా తిలక్ మంచితనం గాని, నాలో ఉన్న గొప్పతనం ఏమీ కాదండీ."
"అలా అనకండి, మీ వినయం మీ గొప్పతనాన్ని రెట్టింపు చేస్తోంది."
"అదంతా మీ మనస్సులో నామీద ఉన్న అభిమానం. అంతకు మించి మరేమీ లేదు."
"పోనీ అలాగే అనుకోండి. అబ్బాయ్, ఇన్ స్పెక్టర్ గారికి పళ్ళూ, కాఫీ పట్టుకురా."
"అబ్బే! ఇప్పుడే ఫలహారం చేసి వచ్చానండి" అని ఆనంద్ ఎంత చెబుతున్నా వినిపించుకో కుండా సంచి పుచ్చుకుని బయలుదేరాడు తిలక్.
'అయితే మీకీ ఊళ్ళో చుట్టాలున్నారా అండీ?" అంది కౌసల్య.
"ఆ. ఉండాలండీ . "జ్ఞాపకం తెచ్చుకుంటూ అన్నాడు ఆనంద్.
"ఎవరు?"
"జ్ఞాపకం లేదు. మా పిన్ని గారు కాబోలు ఉండాలి. అయినా నేనిప్పుడు చుట్టాలింటికి రాలేదు. కోర్టు పని మీద వచ్చాను."
"బాబూ, మీరు చిన్నవారు. ఒక్క విషయం చెబుతాను, వినండి. మనం చుట్టాలు, చుట్టాలు అనుకోవడమే కాని, ఈ రోజుల్లో వాళ్ళ కంటే స్నేహితులు నయం."
"నిశ్చయంగా . మీరన్నది అక్షరాలా నిజం."
"నేనిది ఊరికే అంటున్నది కాదు. అనుభవం వల్ల కనిపెట్టిన సంగతి. ఇప్పుడు మా తిలక్ విషయం చూడండి. తండ్రి వైపు వాళ్ళు కావలసినంత మంది ఉన్నారు. అంతమంది ఉండి కూడా ఏకాకే అయిపోయాడు. ఇప్పుడు వాడికి కాస్త మంచీ చెడు అయినా, చేదోడు, వాదోడు అయినా మీలాంటి స్నేహితులే."
"దాని కేమిటి లెండి? అతను చాలా మంచి కుర్రవాడు. వృద్ది లోకి వస్తాడు. మీరేమీ బెంగ పెట్టుకోకండి. అతని తరపున ఎంతమందో ఉన్నారు-- అన్నారు. వాళ్ళంతా దయాదులే కదా? దాయాదులు దొంగలు అని లోకోక్తి."
"నిజమే!"
"మాకూ ఓ దాయాది ఉండేవారు. మా నాన్నగారి అన్నదమ్ములలో అయన. పెద్దవాడు గదా అని నమ్మి ఆయనకి పెత్తనం ఇస్తే, మా నెత్తినే చెయ్యి పెట్టడానికి చూశాడు."
"చూశారా? అలా ఉంది కాలం.
"అందుకని చుట్టాలను ఈ రోజుల్లో నమ్మమని లేదు. స్నేహితులే నయం."
"చుట్టాలు, దాయాదుల సంగతి అలా వదిలేయండి. కన్నకొడుకు లా మాట్లాడుతున్నారు. కనుక చెబుతున్నాను. కడుపు లో ఉంచుకోండి. కొడుకును చూసుకోవాలనే కాంక్షే తండ్రికి లేకపోయింది. తండ్రికి -- కన్నతండ్రికి!"
"ఆ!"
"నమ్మండి. ఇప్పటికి తిలక్ తన తండ్రిని చూడలేదు."
"నిజంగా!"
"ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు."
"ఎంత ఆశ్చర్యంగా ఉంది! ఎవరండీ అయన? ఏ ఊరు?"
వెంటనే కౌసల్య తన్ను తాను సంబాళించుకొని 'ముఖమెరగని మనిషికి తన వివరాలన్నీ చెప్పడం అంత వివేకం కాదు. ఇప్పటికే చాలా చెప్పేసింది తను' అనుకుంది. "ఎవరైతే ఏమిటి లెండి? నేనీ విషయాలేవీ తిలక్ కు కూడా చెప్పలేదు. దయ తలచి ఈ విషయలేప్పుడూ వాడి దగ్గర అనకండి."
"ఎంత మాట! మీకా భయం అక్కరలేదు. ఎక్కడ విషయాలు అక్కడ మరిచిపోయే తత్త్వం నాది. పైగా మీరు వద్దన్నాక ఎందుకు చెబుతాను? నేనూ తిలక్ క్షేమం కోరేవాడినే."
"అవును . మీరూ, మా అబ్బాయీ ఉంటున్న పద్దతి చూస్తుంటే నాకూ ఆ నమ్మకం దృడం అవుతోంది. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. అక్కడ, పట్నం లో మీరు మావాడిని కొంచెం కనిపెట్టి చూస్తూ ఉండాలి. స్వతహాగా మంచి వాడె అయినా, ఈ స్నేహాలూ, పరిసరాలూ ఉన్నాయి చూశారా -- అవి కొంత వాడిని పాడు చేస్తాయేమో నని భయం. మీరు కనక వాడికి అక్కడ గార్డియన్ గా ఉంటూ కొంచెం చూస్తూ ఉంటానని మాట ఇస్తే నా కెంతో ధైర్యంగానూ, బలంగా నూ ఉంటుంది."
'అలాగే నండి."
"ఇంకొక్క ప్రార్ధన. అది కాకినాడ కనుక అన్ని వేపుల జనం అక్కడికి వస్తూ ఉంటారు. ఆ రావడం లో కోనసీమ నుంచి మావాడి తండ్రి వైపు వాళ్ళేవరైనా రావచ్చు. ఒక్కొక్కప్పుడు వారే రావచ్చు. వాళ్ళ బారి నుంచి మాత్రం మావాడిని మీరేలాగైనా రక్షించాలి. ఏమంటే కుర్రాడిని వశ పరుచు కుంటే నేను లొంగిపోయి నట్టే. నా ఆశలన్నీ వాడి మీద ఉన్నాయి. వాడికి కూడా తన తండ్రి వైపు చూట్టాలని చూడాలని ఒకోరిక బయలుదేరినట్లు చూచాయగా కనిపెట్టాను. అందువల్ల వాళ్ళెవరూ కుర్రాడి దరికి చేరి, వాడి మనస్సు తిప్పకుండా మాత్రం చూడండి." అంది కౌసల్య.
ఆనంద్ నవ్వి "మీరు చెప్పింది బలేగా ఉందండోయ్ ! వాళ్ళెవరో తెలియకుండా వాళ్ళ బారి నుంచి తిలక్ ని ఎలా నేను రక్షించడం ?' అన్నాడు.
ఆమె లోపలికి వెళ్ళి ఒక ఫోటో పట్టుకు వచ్చి దాన్ని గడప మీద పెట్టి చెబుతున్నది: "ఇరవై ఏళ్ళ క్రితం-- అంటే తిలక్ పుట్టక పూరం ఫోటో ఇది. వాళ్ళ నాన్నగారిది...."
ఆనంద్ ఆ మాటలు పట్టించు కోలేదు. తన కళ్ళను నమ్మలేక పోతున్నాడు ఆనంద్. అవే కళ్ళు, అదే నుదురు. అదే ముక్కు, నవ్వే పెదిమలు కూడా అవే. 'ఏమీ అనుమానం లేదు. తను గుర్తించలేకపోవడం ఏమిటి? అది తన బాబయ్య ఫోటో యే. ఈమె బాబయ్య భార్య అన్నమాట. తిలక్ బాబయ్య కొడుకు. తనకు ఈ జీవితంలో అన్యాయం చేసిన బాబయ్య కు వీడు కొడుకు! ఆహా! భగవంతుడి లీల ఎంత చిత్రంగా ఉంది! తన ఆస్తికి , డబ్బుకూ ఎసరు పెట్టాలని చూసి, తన చదుకు స్వస్తి చెప్పించి, జీవితాంతం నరకం అనుభవించు అంటూ ఓ కురూపి ని తీసుకు వచ్చి పెళ్ళి చేసి, తన జీవితాన్ని కసిగా ముక్కలు, ముక్కలుగా విరిచి మాడ్చి మసి చేసేసిన బాబయ్య కొడుకు మీద తనిప్పుడు ఈగ వాలకుండా చూడాలి. చూస్తాడు! చూడడూ?'
"చూశారా?' అంది కౌసల్య.
వెంటనే తనలో వచ్చిన వికారాలు పైకి తెలియకుండా, కక్షను లోపల్లోపలే అదిమి పెడుతూ "చూశానండి. మీరు చెప్పినట్లు అలాగే చేస్తాను.' అంటూ ఫోటో మళ్ళీ గడప మీద పెట్టేశాడు. కౌసల్య ఫోటో లోపల దాచేసి వచ్చింది.
ఇంతలో తిలక్ పళ్ళూ, కాఫీ పట్టుకు వచ్చాడు. అయిష్టంగా రెండు మూడు ముక్కలు తిని "వస్తానండీ " అంటూ బయలుదేరాడు ఆనంద్.
"నేను చెప్పిన సంగతి మరిచి పోకండి. ఇంక తిలక్ మీవాడు. మీ చేతుల్లో పెడుతున్నా. ఎలా చూస్తారో" అంది వెనకాల నుంచి కౌసల్య.
"అలాగే" అంటూ తెచ్చి పెట్టుకున్న మందహాసం తో ఆనంద్ గడప దాటాడు. తిలక్ అతన్ని అనుసరించాడు. ఆనంద్ దీర్ఘంగా ఆలోచిస్తూ నడుస్తున్నాడు.
"నేను వచ్చేటప్పటికి ఏమిటి మా అమ్మ చెబుతోంది?' అన్నాడు తిలక్.
"ఆ! ఏమీ లేదు."
"మా అమ్మదంతా వట్టి చాదస్తమండీ! నేనేదో డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాననీ, పాడాయిపోతున్నాననీ అనుకుంటుంది. అయిదేళ్ళ కుర్రాడప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉండాలంటుంది."
తన మాటలు ఆనంద్ సరిగా వింటున్నట్లు తోచలేదు తిలక్ కు. అందువల్ల మానివేశాడు.
బస్ కదిలే దాకా ఉండి వెళ్ళిపోయాడు తిలక్.
