Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 31


    "నిజం, నిజంగానా!" తమ్ముడు విస్తుపోయాడు.
    "ఛీ! ఛీ! సిన్నపిల్ల పాపం ఎంత బయపడతాందో?" సుజాత తిరస్కారంగా అంది.
    "అంతేకాదురా, రెండు రోజుల క్రితం ఎవరితోనో ఫోనులో సెప్తుంటే ఇన్నా 'సక్కని సుక్కనాగుంటుంది. లక్షన్నరకి తగ్గేది లేదు. కావలిస్తే సెప్పండి. లేదంటే మరో బేరం సూసుకుంటా' అంటూ ఏదో మాట్లాడుతుంటే ఏటోనని నేను సరిగా ఇనుకోలేదు. వంట సేసుకుంటాంటే, ఈయాల పొద్దుటే ఎవడో ఫోను. 'ఆ... సూసుకోండి. సెలవలే గందా, ఇంటికాడే వుంటుంది. లచ్చన్నర! బేరం తగ్గేది లేదు. అసలు ఇంకోళ్లంటే రెండుకి తక్కువ సెప్పను. తెల్సినోడివని... ఆ పదకొండు గంటలేళ రా' అంటూ మాటలాడుతున్నాడు. బయట గుమ్మంకాడ నిల్చుని మొత్తం వినేసరికి నాకు కాళ్లు సేతులు ఆడనేదురా. వీడి నోట బండపడ, పిల్లదాన్ని అమ్మకానికి పెట్టాడురా. పిల్లది సక్కగా వుంటుందని, డబ్బెక్కువని బేరాలాడుతున్నాడురా. పిల్లని కన్నాడు. తాగుడు, డబ్బుకాశపడి పిల్లదాన్ని బేరం పెట్టాడు. నేనేం సెయ్యాలిరా? సెప్పు. ఆణ్ణి తన్నినా, తిట్టినా బుద్ధి రాదురా. ఇంక పిల్లనెట్టా కాపాడుకోనురా? ఏ నిమిషాన ఏం సేస్తాడో? నేనింట్లో లేనప్పుడు పిల్లని ఎవరికో అమ్మేస్తే నేనేం సేయాలి? పనికెళ్లందే కుదరదు. పిల్లని ఎలా కాపాడుకోవాలి? ఆడు తాగి పిల్లమీద అఘాయిత్యం చేస్తే దాని బతుకెం కావాలి సెప్పు. అందుకే ఇంకో దారినేక నీ కాడకి తీసుకొచ్చా."
    "నిజంగా పిల్లని అమ్మకానికి పెట్టాడా? ఓరి తాగుబోతు ఎదవా! పోలీసులకి పట్టించాల్సిందే."
    "ఏమోరా! నాకేం తోచలేదు. భయపడి పరుగెత్తుకొచ్చా" కళ్లు తుడుచుకుంటూ అంది.
    "ఊరుకో అక్కా, పిల్లదాన్ని నేను సూస్తాలే!" హామీ ఇచ్చాడు తమ్ముడు.
    ఆడి చేతులు పట్టుకుని "పిల్లదాన్ని నీచేతిలో పెడుతున్నాను. నీదే భారం. దాన్ని సదివించు చక్కగా, డబ్బులంపూతా. రేపొద్దుటే నే పోతా. ఆడు అక్కడ ఏం చిందులేస్తున్నాడో!"
    "బావకేం సెపుతావు? పిల్ల ఏది అంటే ఏం చెప్తావు?"
    "అదంతా నే సూసుకుంటా. నీవు మాత్రం అది నీ దగ్గర లేదని సెప్పు ఎవరడిగినా."
    "సరే, దాని స్కూలుకెళ్లి సర్టిఫికెట్లు పంపు" అన్నాడు తమ్ముడు.

                                                   *  *  *

    ఇంటికొస్తూనే గుమ్మంలో కూలబడి తల బాదుకుంటూ ఏడుపు లంకించుకుంది శోభమ్మ. ఏడబోయిందో నా కూతురు? ఈ తాగుబోతు సచ్చినోడికి భయపడి ఇంట్లోంచి పారిపోయిందిరో దేముడో! ఏడ బోను? ఏడనెతకను? తమ్ముడింటికి బోయిందని ఊరెళ్లి ఎతికొచ్చా. సిన్నపిల్ల ఎటు పోయిందో జాడనేదు. నేనేటి సెయ్యను దేముడో!"
    గుడిసె ముందు నులకమంచంలో నిద్రపోతున్న రాజన్న పెళ్లాం ఏడుపూ, చుట్టుపక్కలవాళ్ల పరామర్శలూ చూసి బిత్తరపోతూ "ఏటే? ఏటైంది?" అన్నాడు.
    "ఏడైందా దొంగసచ్చినోడా, నా పిల్లదాన్నేం చేశావు చెప్పు, ఎంత కమ్మేశావురా దాన్ని? పిల్లది ఫోనులో నీ మాటలన్నీ ఇంది, ఏడుపు లంకించుకుంది, నేను పనికిపోడం సూసి ఇల్లొదిలి ఎటో పారిపోయింది."
    "ఏటి పిల్లనమ్మేస్తానన్నాడా?"
    "అవునమ్మా! లక్షన్నరకి బేరం పెట్టాడు తాగుబోతు ముండాకొడుకు! ఆడి తాగుడు డబ్బుకి పిల్లనే అమ్మేస్తానన్నాడు. అది విని పిల్ల బెదిరిపోయి సెప్పకుండా ఎటో పోయింది" అంటూ తల బాదుకుని, మొగుడు తల బాదింది.
    తన గుట్టు బయటపడినందుకు కలవరపడ్తూ "ఏటే పేల్తుండావు? నా కూతురిని అమ్మడవేటి, నోర్ముయ్! అంటూ చిందులు వేసి లోపలికి వెళ్లాడు. నలుగురు నాలుగు మాటలు, నాలుగు సలహాలు ఇచ్చి వెళ్లారు. శోభమ్మ లేచి లోపలికి నడిచింది.

                                                  *  *  *

    రెండేళ్లు గడిచాయి. కవితకి పదిహేనేళ్లు. చక్కగా విరిసీ విరియని మొగ్గలా, నునుపు తేలి, పట్నం పోకడలతో చక్కగా తయారైంది. మాటతీరు అన్నీ బాగయ్యాయి. ఇంట్లో అత్తకి గిన్నెలు కడిగి, ఇల్లూడ్చి, వంటపనిలో సాయం చేస్తూ, సాయంత్రం ఇంటికొచ్చి ఐదేళ్ల బుజ్జిని చూసుకుంటూ, వాడికి చదువు చెబుతూ బుద్ధిగా ఉందని సుజాతకి సంతోషంగా ఉంది. సగం పనిభారం, కొడుకు ఆలనాపాలనా చూసుకుంటూ, చెప్పిన పనల్లా చేసిపెట్టే కవితని అభిమానంగానే చూస్తోంది సుజాత.
    రెండునెల్లకోసారి కూతురిని చూసుకోడానికి తమ్ముడింటికి వస్తోంది శోభమ్మ. వచ్చినప్పుడల్లా కూతురిలో మార్పు చూసి సంబరపడిపోతూ 'దాని బతుకు ఓ గాడిలో పడింది' అని నిశ్చింతగా ఉంది. మొగుడికి అనుమానం రాకుండా మధ్య మధ్య ఓ రాగం తీస్తూ, మొగుణ్ణి తిడుతూ, కనపడని కూతురు కోసం దిగులుపడ్డట్టు నటిస్తూ కాలం వెళ్లదీస్తోంది. ఈ ఏడాది పదో క్లాసు అయితే, బ్యాంకి మేనేజరమ్మతో చెప్పి ఏదన్నా ఉద్యోగం చూపిస్తానని భరోసా ఇచ్చింది సుజాత.
    "ఏటే సిలకలా తయారయ్యావు. సినిమా స్టారులా ఎలిగిపోతుండావు. కాస్త చిన్నదానివయ్యావు, లేకపోతే మీ అత్త బదులు నిన్నే సేసుకునేవాడిని" అంటు ఎంకటేశు హాస్యాలాడేవాడు.
    "నీ కళ్లు దానిమీద పడ్డాయి. కాళ్లిరగొడ్తాను దానివైపు సూస్తే" అని అత్త బెదిరించేది. రోజులలా గడిచిపోతే చాలనుకుని దేముడికి దండాలు పెట్టేది శోభమ్మ.

                                                                                     *  *  *

    అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది?
    ఓ రోజు సాయంకాలం గుమ్మం ముందు కూర్చుని బియ్యం బాగుచేసుకుంటున్న శోభమ్మ ఇంటిముందు ఆటో ఆగడం, దాన్లోంచి కవిత దిగడం చూసి బిత్తరపోయి చాట కింద పడేసి "ఏటే, ఎందుకొచ్చినావు? మీ అయ్య సూస్తే మనం పడ్డ కట్టం అంతా పోతుంది. ఎందుకె సెప్పా పెట్టకుండా దిగడ్డావు? సూడాలని సెపితే నేనే వచ్చేదాన్ని గదా!" అంటూ కలవరపడి పోయింది. కవిత రెండు బ్యాగులు దింపి, ఆటోకి డబ్బిచ్చి లోపలికొచ్చింది. "ఏటే మాటాడవు? మీ అత్తతో కొట్లాడావా?"
    "నేనేం కొట్లాడలేదు. అత్తే లాక్కొచ్చి, బస్సెక్కించి పంపించేసింది."
    "ఎందుకు... ఏటిసేశావు?" కవిత తల్లివంక కోపంగా చూసి "నన్నేం అనకు. పోయి నీ తమ్ముడిని అడుగు ఏటి జరిగిందో? నీ తమ్ముడు, నా అయ్యలాగే తయారయ్యాడు తెలుసా?" చీదరింపుగా అంది. పట్నం వెళ్లాక మాటలు నేర్చి, లోకజ్ఞానం అబ్బిన కవిత మాట విని నిర్ఘాంతపోయింది శోభమ్మ.
    "అమ్మా! నేనింక ఆడికి బోను. 'ఇంక ఇక్కడుండద్దు, నీ అమ్మ దగ్గరే వుండు. నా మొగుడిని అడ్డుకోలేను, నిన్ను కాచుకోలేను. ఇంటిపట్టునుండి ఏం జరిగేది నేను సూసుకోలేను, నాకు కొలువుంది. రేపు మీ అమ్మ నన్ను తిడ్తాది. వెళ్లు' అంటూ అత్తా లాక్కొచ్చి బస్సెక్కించేసింది."
    "ఏమయిందే? సారిగా చెప్పే. వెంకటేశు ఏం చేశాడో?" వణుకుతున్న గొంతుతో అడిగింది శోభమ్మ.
    "నీ తమ్ముడు అయ్య కంటే దరిద్రుడు. కొన్నాళ్లు బాగానే ఉన్నాడే, నన్ను బాగానే చూసుకున్నాడు. 'కవితా! మంచినీళ్లు తే, చాయ్ పట్రా, ఇది ఇస్త్రీ చేసిపెట్టవే' అంటూ సక్కంగా అత్తకి పనులు చెప్పకుండా అన్నీ నాకే సెప్పేవాడు. దగ్గర కూకుని ముచ్చట్లాడేవాడు. అమ్మా, ఒక్క ఏడు సరింగా ఉన్నాడే, తరువాతేటో ఎకిలేసాలు, ఎకిలి నవ్వులు, దగ్గరగా రాసుకుంటూ కూకోడం, మీద సెయ్యేసి లాక్కోడం, అత్త లేనప్పుడు ఏదన్నా పనిచేస్తా వుంటే అంటుకుంటూ ఎనక ఎనక తిరుగుతూ భుజం పట్టి లాగడం... అమ్మా, నేను ఏం సెయ్యాలే, ఇదిలించేదాన్ని. ఏటే అంత భయం? నీ మావనే, సరసమాడరాదా అనేవోడు, సరసాలాడేవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS