Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 31

 

    ఇద్దరూ రోడ్డు మీదకొచ్చి నెమ్మదిగా ఇంటివేపు నడవసాగారు.
    "ఏమంటున్నాడు సృజన్ బాబు?" నవ్వుతూ అడిగింది సరోజ.
    "అయన చాలా మంచి మనిషి!" అంది స్వరూప.
    "అదెప్పుడు తెలిసింది?" ఆశ్చర్యంగా అడిగిందామె.
    "పొద్దుట్నుంచీ అలా మూగగా వున్నందుకు సారీ చెప్పాడు. అంతేకాదు నాకేం సహాయం కావాల్సి వచ్చినా తననడగాలిట!" ఇద్దరూ నవ్వుకొన్నారు.
    ఆ రాత్రి చాలా సేపటివరకూ ఆఫీస్ పని గురించీ, డ్రాప్ట్ , లెటర్స్ రాయడం గురించి వివరంగా చెప్పింది సరోజ.
    అవన్నీ తెలుసుకోనేసరికి చాలా దైర్యం కలిగింది స్వరూపకి. సృజన్ బాబు కూడా తనకి సహకరిస్తే తను స్వతంత్రంగానే ఆఫీసు పని చేసుకోగలదు.
    ఆ రాత్రి చాలా సేపటివరకూ సృజన్ బాబుకి నిద్ర పట్టలేదు. ఆఫీస్ లో స్వరూపని చూసిన దగ్గర్నుంచీ ఎడతెరిపి లేని ఆలోచనలు! ఆమె గురించి తెలుసుకోవాలనే కుతూహలం!
    కాలేజీలో చదివేరోజుల్లో ఆ మిలటరీ ఆఫీసర్ ని ప్రేమించి- అతనిని వివాహం చేసుకోవాలని అనుకోని -- మరెందుకు అతనిని వివాహం చేసుకోలేదు? మళ్ళీ సురేంద్రను వివాహం చేసుకోవడానికి ఎందుకు తయారయింది? ఆ వివాహం తర్వాత ఏం జరిగింది ?వీటన్నిటికీ సమాధానం కావాలి! ఏ ప్రశ్నకి సమాధానం దొరకకపోయినా తనకి మనశ్శాంతి కరువయిపోతుంది. ఆ చరిత్రంతా తెలియాలంటే తను స్వరూపకి అత్యంత సన్నిహితుడయిపోవాలి. తన మీద ఆమెకి ఎంతో గొప్ప సదభిప్రాయం కలగాలి! అప్పుడే ఆ విషయాలన్నీ బయటపడతాయ్. ఆమె యెడల తనకి గౌరభిమానాలున్నట్లు ఆమె అనుకోవాలి!
    మర్నాడు పదినిముషాల ముందే చేరుకొంది స్వరూప.
    అయితే అప్పటికే సృజన్ బాబు సీట్లో వుండటం చూసి ఆశ్చర్యపోయింది.
    "గుడ్ మాణింగ్!" నవ్వుతూ అన్నాడతను.
    "గుడ్ మాణింగ్!" సిగ్గుపడుతూ అంది స్వరూప.
    "కూర్చోండి! ఇదిగో! ఈ ఫైల్స్ డీల్ చేద్దాం ముందు....." అంటూ అవన్నీ వివరంగా చెప్పసాగాడతను.
    మధ్యాహ్నం లంచ్ టైం లో సరోజ వచ్చేవరకూ ఆమెతో ఆఫీస్ వర్క్  గురించి మాట్లాడుతూనే వున్నాడతను.
    ఆ తరువాత సాయంత్రం వరకూ అతన్నేమీ అడక్కుండానే కొన్ని ఫైల్స్ తనే పుటప్ చేసిందామె.
    "మీకు నేను గుర్తున్నానా?" అడిగాడు సృజన్ బాబు హటాత్తుగా . స్వరూప కర్ధం కాలేదు.
    "మీరు నన్ను గుర్తుంచారా - అనడుగుతున్నాను !" నవ్వుతూ అన్నాడతను.
    "ఊహూ....." తల అడ్డంగా తిప్పుతూ అందామె.
    "ఇంతకూ ముందేక్కడా నన్ను చూసిన గుర్తులేదా ?"
    "ఎక్కడో చూసి నట్లనిపించింది కానీ - ఎక్కడో మాత్రం గుర్తుకి రాలేదు ....."
    "హిందూ కాలేజీలో చదివారు కదూ మీరు ?"
    "అవును . మీకెలా తెలుసు ?"
    "నేను అక్కడే చదివాను...."
    అతనా విషయం చెప్పేసరికి ఒక్కసారిగా అతని మీద అభిమానం పుట్టుకొచ్చింది స్వరూపకి.
    "మీరూ బి.యెస్సే ఏనా?"
    "ఊహూ! బి.ఏ చదివాను--"
    "అందుకే గుర్తించలేకపోయాను. బి.ఏస్సీ స్టూడెంట్స్ అందరినీ ఇంచుమించుగా గుర్తించగలను. మరి సరోజ కూడా అక్కడే చదివింది కదా. ఆమెని చూడలేదా మీరూ?"
    "ఆమె కూడా బి,యేస్సీ చదివిందా?" ఆశ్చర్యంగా అడిగాడు సృజన్ బాబు.
    "ఊహు! ఇంటర్మీడియట్ చదివి మానేసింది....."
    "అందుకే నాకు తెలీదు! ఇంటర్మీడియట్ మా వూళ్ళోనే చదివాను."
    ఇద్దరూ కాలేజీ విషయాలు గుర్తు చేసుకోవటంలో నిమగ్నమయిపోయారు. సరోజ వాళ్ళ టేబుల్ దగ్గరకొచ్చి పకలరించేవరకూ అయిదు దాటి పోయిందన్న సంగతే గుర్తుకు రాలేదు.
    "ఏమిటి ? అంత మైమరచి మాట్లాడేసుకుంటున్నారు?" అడిగింది సరోజ త్రోవలో.
    "ఇంతకూ సృజన్ బాబు ఎవరో తెలుసా? మన కాలేజ్ మేట్! నేను బి.యేస్సీ చదువుతోండగా అయన బి ఏ చదివారట! ఆయనే నన్ను గుర్తుపట్టి అడిగారు! అంతే! అక్కడ నుంచీ కాలేజీ విషయాలన్నీ గుర్తుకొచ్చేసినాయ్ ఇద్దరికీ....." ఉత్సాహంగా నవ్వుతూ చెప్పింది స్వరూప.
    "బాగుంది చివరకు మనకి బంధువే నంటారేమో?" తనూ నవ్వుతూ అంది సరోజ.
    "ఇవాళ నాతోనే కొన్ని ఫైల్స్ పుటప్ చేయించారు! తప్పుల్లేకుండా చేశానవి" ఇద్దరూ  బస్ స్టాప్ చేరుకొని బస్ కోసం ఎదుర్చుస్తూ నిలబడ్డారు.
    "మళ్ళీ అతని విషయాలేమయినా తెలిసినయ్యా?" అడిగింది సరోజ .
    "ఎవరివి ?"
    "అదే నిన్ను వివాహం చేసుకొన్నతను."
    "ఊహూ ! అతనికీ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు! ఉండదు కూడా. ఒకవేళ ఇప్పుడు అతను అంగీకరించినా నేను వప్పుకోను. అతని గురించి తలచుకోవడమే నాకిష్టం లేదు...." కోపంతో మొఖం ఎర్రబారిపోయింది ఆమెకి.
    సరోజ ఇంక ఆ విషయం మాట్లాడటానికి భయపడి పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS