టిన్ తెరిచి చూస్తూ, "మీ అమ్మ చేసిందా ఈ మిఠాయి ?' అని అడిగాడు ప్రసాదరావు.
"అమ్మ చేసినవి ఈయన తినరా?' వాసు హృదయం కదిలిపోయింది. బాధగా క్షణం లో ఏమైతే అవనీ నిజమే చెబుతాను.' అనుకున్నాడు వాసు. అవును, నిన్న పద్మజ పుట్టిన రోజు . అత్తయ్య మీకిస్తానని బాగ్ లో పెట్టారు. అమ్మ చేసినదే ఆ మిఠాయి. ఏమలా అడుగుతున్నారు?' వాసు గొంతు చిన్నగా కంపించింది.
"ఆహా...ఏం లేదు. మీ అమ్మ మిఠాయి బాగా చేసేది.' అంటూ ఒక్క మిఠాయి ఉండ తీసుకుని కిటికీ వైపు నడిచి శూన్యం లోకి వాసు పుట్టక పూర్వం ఆ గతంలోని తియ్యని రోజుల వైపు చూస్తూ, ఆప్యాయంగా ఆ ఉండ కొరికి నమలసాగాడు. వర్తమానం విస్మరించి గతాన్ని తవ్వే మనస్సు తేలిగ్గా ఉంది. గతంలోని కొన్ని స్మృతులు మధురంగా ఉన్నాయి. "ఇంకొకటి తినండి నాన్నా!" అతని గతం చెదిరిపోయింది. యాంత్రికంగా వాసు చేతిలో ఉండ తీసుకుంటూ, "చాలా బాగుంది. మిఠాయి నాకెంతో ఇష్టం" అనేశాడు ప్రసాదరావు.
తృప్తిగా, సంతోషంగా తండ్రి వైపు చూశాడు వాసు.
తరవాత "వంట బాగా చేస్తున్నాడంటావా! నీకు నచ్చిందా! ఈ ఇల్లెలా ఉంది?' అని అడిగాడు ప్రసాదరావు.
"హోటలు కన్నా నయంగా! ఇల్లు బాగుంది, నాన్నా! అద్దె ఎంత? ఇంత ఇల్లెందుకు తీసుకున్నారు?"
"అద్దె ఇల్లు కాదు. మన ఇల్లే. ఇలా చాన్సు వచ్చింది. కొన్నాను."
నమ్మలేనట్టు ఆశ్చర్యంగా ప్రసాదరావు వైపు చూస్తూ, "ముప్పై నలభై వేలన్నా ఉండవచ్చు- అవునా?" అన్నాడు వాసు.
"వేలం పాడారు.. ఇరవై వేలే....బాగుంది కదూ?"
"బాగుంది."
"మీ అమ్మ వచ్చాక వాళ్ళింట్లో వాళ్ళకీ, మీకూ మధ్య పొరపొచ్చాలు రాలేదు కదా?' అంటూ ఒక్కో విషయమూ, విపులంగా వారి కుటుంబ సభ్యులేలా మసలుకుంటారో అడిగి తెలుసుకుని తృప్తిగా నిట్టూర్చాడు ప్రసాదరావు.
రెండు రోజుల తరవాత ప్రయాణమవుతున్న వాసుకి సపోటకాయల సంచీ చూపిస్తూ, "వెళ్ళేటప్పుడు మరిచిపోకు, పిల్లలు తింటారు." అన్నాడు ప్రసాదరావు.
"ఎక్కడివి? కొన్నారా?' అడిగాడు వాసు.
"ఓహ్! అయితే ఇల్లంతా నువ్వు చూడలేదన్న మాట. పెరట్లో ఉంది సపోటా చెట్టు. ఓసారి ఇల్లు బాగా చూడు. నచ్చకపోతే ఎలా లేదన్నా పదివేలు లాభం వచ్చేలా అమ్మేస్తాను." అన్నాడు ప్రసాదరావు నవ్వుతూ.
వ్యాపార లక్షణాలన్నీ వంటబట్టి ధన మార్జించి తృప్తిగా, గర్వంగా మెరిసే తండ్రి కళ్ళలోకి లోతుగా చూశాడు వాసు.
రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత "ఏమంటావు?" అని ప్రశ్నించాడు ప్రసాదరావు.
"పాపం ! ఎవరో ఆ నిర్భాగ్యుడు! ఆ పదివేలూ, మరొక పదివేలూ వారికిచ్చి కొంటేనే సరిపోయేది.... పోనీ, నన్ను కలిసి వస్తుందని అద్దె కివ్వకండి. ఎక్కువైతే ఎవరన్నా పేదవారికి ఉచితంగా ఇవ్వండి."
కొడుకు మాటలు నచ్చని ప్రసాదరావు నవ్వేస్తూ, "ఎక్కువేలా అవుతుంది? బిల్డింగు లేవో కాంట్రాక్టు తీసుకుంటూ ఉంటానుగా? సిమెంటూ, కలపా అవీ.... ఎన్ని గదులున్నా చాలవు" అన్నాడు.
"ఇవన్నీ తీసుకు వెళితే అక్కడ అందరూ సవాలక్ష ప్రశ్నలు. అంతా మనది చిదంబర రహస్యం!" గొణిగినట్టు అన్నాడు వాసు.
విననట్టు మౌనంగా ఉండిపోయాడు ప్రసాదరావు.
స్టేషను కి వెళుతున్న రిక్షా లో సపోటకాయల సంచీ కూడా కూర్చుంది.
చిరాకనిపించినా ఏమీ అనలేకపోయాడు వాసు. ట్రెయిన్ లోంచి విసిరేద్దామనుకున్నాడు. కాని మనస్సు ఒప్పలేదు. అలవాటు పడ్డాడు అబద్దాలు చెప్పటానికి! ఎక్కడి వంటే ఏదో జవాబుగా ఎలాగా తడుతుంది అని నవ్వుకున్నాడు- చదువు పూర్తయేదాకా ఈ అజ్ఞాతం తప్పదు కాబోలనుకుంటూ.
* * * *
"ఎక్కడి విన్ని సపోటాలు? కొన్నావా?....ఎక్కడిది, వాసూ, డబ్బు? మొన్న ఖరీదున చీర తెచ్చావు." సంచీ మూతి విప్పి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది పద్మజ.
"ఎక్కడి నుంచి వస్తుందా? నా ఖజానా లో అప్పు.'
'అంటే?"
"అటువంటి ఋణం ఎలా అన్నా తీర్చవలసి ఉంటుంది."
"ఎలా తీరుస్తావు?"
"నువ్వు ట్యూషన్ ఫీజు చాలా ఇవ్వాలి."
"నేనేం ట్యూషన్ కి రావడం లేదు. మహా చెబుతావు కాని...." బుంగమూతి పెట్టి కోపం నటించింది పద్మజ.
"పోనీ ఇదివరకుదే!' కొంటెగా నవ్వాడు వాసు. ఏమో అనబోయినట్టు ఆమె పెదవులు కదిలాయి కాని, మళ్ళీ మూతి బిగించుకుంది.
"స్కూటర్ అద్దె కూడా!' కవ్వించాడు వాసు.
రోషంగా వాసు వైపు చూసింది పద్మజ. ఆమె వైపు చూసిన అతనిలో చిలిపితనం హెచ్చింది.
"ఎక్కడివి సపోటాకాయలు?" వెక్కిరించినట్టు అని, "నోరు మూసుకుని చక్కా ఇంట్లో పెట్టు. మా ఫ్రెండు కి పెద్ద సపోటా చెట్టు ఉంది, ఇచ్చాడు, సరా!" అన్నాడు వాసు.
'అలా మొదటే ఎందుకు చెప్పకూడదు! నీకు గర్వం.' ఉడికిపోయిన పద్మజ మొహం ఎర్రగా కందింది.
"కాదా మరి!' గబగబా బట్టలు మార్చుకున్నాడు వాసు.
"ప్చ్! లాభం లేదు. ఇద్దరి మధ్యా చనువు హెచ్చి పోయింది. అయినా, వాసూ, అదేదో తెలియక అడిగితె అలా కసురు కుంటా వేమిటి?" వరండా లోంచి గదిలోకి వస్తూ అంది మధుమతి.
"ఎక్కడివి, ఎవరిచ్చారు? ఈ ప్రశ్న వింటే నా గొంతులో వెలక్కాయ కొట్టి నంత బాధ. ఫరవాలేదు. ఓరోజు లెక్క చెబుతూ విసుక్కున్నానని నన్నసలేమీ అడగడం మానేసింది. ఎవరో ఏమో అంటున్నారని స్కూటర్ మీద రావటం మానేసింది. ఇటుపైన అలా అడగడం మానేస్తుంది.' నిర్లక్ష్యంగా నవ్వాడు వాసు.
ఉదాసీనంగా వెళ్ళిపోయింది పద్మజ.
డాబా మీద ఏకాంతంగా వాసుతో మాట్లాడుతున్న గోపాల్రావు , సపోటాపండు తొక్క వలిచి తింటూ, "చాలా బాగున్నాయి. మీ నాన్న కొన్న ఇంటి పెరట్లో సపోటా చేట్టుందా?' అన్నాడు.
"లేకపోతె కొన్నాననుకున్నావా?' అన్నాడు నవ్వేస్తూ వాసు.
"సపోటాపళ్ళు చాలా బాగున్నాయి కదూ!" అడిగాడు పద్మజ ని వాసు.
"నేను తినలేదు. నాకేం అక్కర్లే." దురుసుగా అంది పద్మజ.
ఆమె కోపం పోగొట్టాలనే ఉద్దేశ్యంతో బలవంతాన అమెనోట్లో సపోటా పండు వలిచి కూరాడు వాసు.
అతని ఆ చేష్ట ఆమె కెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆమె తనువూ పులకించింది. మత్తుగా కనురెప్పలు వాలిపోయాయి.
* * * *
ఎమ్. ఎ ఫస్టు క్లాసులో పాసయ్యాడు వాసు. బి.ఎ పాసయింది పద్మజ. ఎమ్.ఎ పూర్తయ్యే లోపున మరొక్క రెండు సార్లు ప్రసాదరావు దగ్గరకు వెళ్ళి వచ్చాడు వాసు. జానికమ్మ, రాజశేఖరం , మిగతా వాళ్ళని కూడా చూడాలని వెళ్ళి అక్కడ నాలుగు రోజులు ఉన్నాడు. జయ అందం, గానం ఓ రకంగా వాసు నాకర్షించాయి.
రిజల్ట్స్ తెలిసిన రోజున - "ఇంకా పైకి చదువు తావా?' అని సంతోషంగా పద్మజ వైపు చూస్తూ అడిగాడు వాసు.
"తమరు?" ఎదురుప్రశ్న వేసింది పద్మజ.
"మీ పెద్ద నాన్న దీవించాడుగా -- ఐ.ఎ.ఎస్ . ఆఫీసరవాలని? సెలక్షనయితే ట్రెయినింగు కి!' గర్వంగా నవ్వాడు వాసు.
క్షణం తరవాత "నన్నింకా చదవ మంటావా, వాసూ?' అని ఏదో సిగ్గు గొంతు నొక్కుతూ ఉంటె నెమ్మదిగా అడిగింది పద్మజ.
పకపకా నవ్వాడు వాసు. 'అది నీ ఇష్టం. చదివించే మీ నాన్న ఇష్టం."
"ఆహా , కాదు, చదవగలనా?' అతని మాట కడ్డు వస్తూ అంది పద్మజ.
"పెళ్ళి మీద దృష్టి పోతుంటే ...ఎంచక్కా ఇంట్లో కూర్చో. లేదంటే ఎమ్. ఎ. చదువు పాసవుతావు.... చదివితే సుమా!" మళ్ళీ నవ్వాడు వాసు.
"ఛ ఫో, అన్నీ హస్యాలే!"
"ఎలాగా పోతాగా?" అని అంటున్న వాసు వైపు బాధగా చూసి తల వాల్చి వెళ్ళిపోయింది పద్మజ.
"నాకు స్పెషల్ పార్టీ ఇవ్వాలి." ఆమెకు వినిపించేలా అరిచాడు వాసు.
వాసు రిజల్ట్స్ తెలిసిన రోజు మధుమతి అనందాశ్ర్రువులు రాల్చింది. తరవాత.... కొన్ని క్షణాలు అందరూ కలిసి సంతోషం వ్యక్తం చేసిన తరవాత ఆమె హృదయం లో సన్నని బాధ. "మధూ, నాకు నాన్నా అని తియ్యగా పిలిచే బాబు కావాలి!' ఎంత తపన ఉంది ఆ గొంతులో! అయన ఒక్కసారి వాసుని చూస్తె ఎంత బాగుండును! ఎంత కఠిన మాయన హృదయం! తిని పారేసిన ఆకులా భార్య బిడ్డల్ని విసర్జించి, మరొక భార్యా పిల్లలూ, సంసారం ....ఛీ ఛీ!' ఆమె గుండెలు మండి పోయాయి. మనసు విలవిలా తన్నుకుంది. ఆ పూట ఆమెకు అన్నం సహించలేదు.
"వదినా! అప్పుడే కడుపు నిండితే ఎలా!... ఉద్యోగం, పెళ్ళీ, కోడలూ, మనవలూ -- ఈ సంతోషానికి కూడా కాస్త జాగా ఉంచండి. "హాస్యం చేసింది లక్ష్మీ.
"నా పార్టీ అని గోల చేసి రెండు ప్లేట్ల బజ్జీలు దమాయించావు. నిన్ను పార్టీ ఇమ్మంటే ఈవేళా, రేపూ! వట్టి పిసినారి. రేపు ఊరికి చెక్కేస్తావుటే. హబ్బ! ఎంత గడుసు!' కొంటెగా నవ్వుతూ అంది పద్మజ.
"రేపు వెళ్లి పోతున్నానని ఎవరు చెప్పారు? అయినా ఎప్పుడన్నా రాకపోతానా?" నవ్వుకుంటూ మొహం చాటు చేసుకున్నాడు వాసు.
"ఓహో! ఈసారి వచ్చినప్పుడు ఇస్తావన్న మాట. అయినా అడుగడుగునా నిన్ను తన ఇంటికి రప్పించుకుంటూ, తానోక్కసారి నీ గదికి రాని.... ఎవరబ్బా ఆ సపోటకాయల ఫ్రెండు!"
పకపకా నవ్వి, "సపోటా అంత తియ్యగా ఉంటాడా ఫ్రెండు" అన్నాడు వాసు.
"ఇంతకీ....బోయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా-- అన్నాడు వాసు.
"అత్తయ్య కి చెబుతాను, ఉండు. కాళ్ళు కట్టి ఇంట్లో కుదేస్తుంది."
"ఇంట్లోనే ఉందిగా ఓ గర్ల్ ఫ్రెండ్!"
"ఛ ఫో..పార్టీ ఎగ్గొట్టడానికి కేవో ప్లాన్లు వేస్తావు!"
ఆ మాటా ఈ మాటా నవ్వుతూ మాట్లాడి , "అబ్బే! అలా ఎలా కుదురుతుంది? ఈవేళ నిన్నూ, శ్రీను ని సినిమాకి తీసికెళ్ళి, అటునుంచి హోటల్లో నీ డబ్బులతో డిన్నర్ అయ్యాక" అన్నాడు వాసు.
"నా దగ్గర డబ్బెం లేదు..." వెళ్ళబోయింది పద్మజ.
