ఈ విషయం వినేటప్పటికి విశాలాక్షి ఒంటి మీద తేళ్ళూ, జేర్రులూ పాకినట్లయింది. 'ఎంత అవస్థ వచ్చి పడిందిరా దేవుడా! ఇదేదో ప్రళయానికి దారి తీయకముందే, రామదాసు గారికి కబురు పెట్టి అన్నపూర్ణ ను కాపురానికి తీసుకురావడం మంచిది. అసలు ఇప్పటికే పొరపాటు జరిగిపోయింది. పాపం, అన్నపూర్ణ ఆ పెద్దాపురం లో ఏం శోకిస్తుందో? ఈ పాపంలో తనకూ పాలు ఉంది. చేసిన పాపానికి పరిహారంగా అన్నపూర్ణ ను వీలైనంత త్వరలో తీసుకు వచ్చెయ్యాలి. ముకుందం భార్య ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయింది. పట్టుదల వల్ల కౌసల్య పిన్ని పుట్టింట్లోనే ఉండిపోయింది. తాము చేసిన అన్యాయానికి దుఃఖిస్తూ అన్నపూర్ణ పెద్దా పురం లోనే ఉండిపోయింది. ఈ ఇంటి కోడళ్ళ కు ఇదేమి యాతన? సుఖం లేదా, భగవంతుడా? వాళ్ళ జీవితాలతో పోలిస్తే తన జీవితమే నయం. బతికినన్నాళ్ళూ ఆయనతో ఏ చీకూ చింతా లేకుండా కాపరం చేసింది. అటు అత్తవారింట్లో ఎంతో అనురాగంగా చూసుకొనే అయన, ఇటు పుట్టింట్లో నేల నడవనీయకుండా చూసుకొనే నాన్నా, బాబయ్యా. తను సుఖపడిన దానిలో వీళ్ళు ఎన్నవ వంతు సుఖ పడ్డారు?
"బాబయ్యే కనక ఇంట్లో ఉంటె ముకుందం ఇంత విచ్చలవిడిగా తిరిగి ఉండక పోను. ఆనందం కూడా ఎంతో వినయ విదేయలతో ప్రవర్తిస్తూ, ఈపాటికి హాయిగా అన్నపూర్ణ తో కాపురం చేస్తూ ఉండును. అయన లేకపోవడం వచ్చింది కొంపకు ముప్పు. తను ఆడది. వాళ్ళను ఎలా అదుపులో పెట్టగలదు? చిన్నవాళ్ళు కనకనా? అందుకే ఇంటికి యజమాని ఉండాలంటారు.
'అయినా బాబయ్య ఎందు కంటాడు? ఆయనను తాము ఉండనిస్తే కదా? సరిగా మాట్లాడక పోవడం, మాట్లాడిన రెండు మాటలూ పుల్ల విరిచి పొయ్యిలో పెట్టినట్లు , మాట్లాడడం తో అయన మనస్సు విరిగిపోయింది. ఎంత దయగా పెన్చాదు౧ ఎంత ప్రేమగా చూశాడు! అన్న పిల్లలు అనే తేడా లేకుండా తన పిల్లల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. అసలు తనకో కొడుకు రామచంద్ర పురం లో ఉన్నడన్న సంగతే మరిచి మసిలాడు. తమ మధ్య. అటువంటి ఉత్తముడిని, అంతటి మహితాత్ముడ్ని , ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే దాకా నిద్ర పోలేదు తనూ, తమ్ముళ్ళూనూ. భోజనం చెయ్యకుండా మధ్యాహ్నపు ఎండలో చెప్పులు కూడా లేకుండా తల వాలేసుకుని బాబయ్య వెళ్ళిపోతే హాయిగా భోజనాలు చేశారు. ఆ తర్వాత అతడిని మరిచి పోయారు. ఇదీ తాము చూపిన కృతజ్ఞత ఆ త్యాగశీలి కి. ఇంతటిది తమ కార్పణ్యం.
ఇలా ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న విశాలాక్షి ఆనంద్ మాటలు విని కన్నీళ్లు తుడుచుకుంది.
"నేను డ్యూటీ మీద రామచంద్రపురం వెళ్ళుతున్నాను. అక్కడ కోర్టులో డిపార్ట్ మెంటు తరపున సాక్ష్యం చెప్పాలి." అన్నాడు ఆనంద్.
"వెళ్ళు, నాయనా . మీరు పెద్దవాళ్ళు అయ్యారు. ఊరు వెళ్ళినా సరే, వెళ్ళుతున్నానని చెప్పి ఊళ్ళో ఉన్నాసరే నాకు తెలియకుండా -- మీ ఇష్టం."
ఆమె ధోరణి ఆనంద్ కు నచ్చలేదు. కటువుగా అన్నాడు : "అవును, ఊరికే అబద్దాని కంటున్నాను. సరా?" ఇలా అంటూనే బూట్లు చప్పుడు చేసుకుంటూ గబగబా వెళ్ళిపోయాడు.
ఆ వెళ్ళడం వెళ్ళడం తిన్నగా ఆఫీసుకు వెళ్ళి అవసరమైన ఫైల్స్ తీసుకొని అక్కడ నుంచి బస్ స్టాండు కు పోతూ జ్యోతి లాడ్జి దగ్గర ఆగాడు. జ్యోతి ఇవతలకు వస్తూ "ఎంతకీ రాకపోతే మీరింకా వెళ్ళిపోయారనుకున్నాను." అంది.
"నీతోటి చెప్పకుండా ఎలా వెడతాను జ్యోతీ!" అన్నాడు గడపదాటి లోపలికి వస్తూ.
"ఆహా! కబుర్ల తోటి ఏం కడుపు నింపుతారండీ? అక్కడికి నా అజ్ఞ లేకుండా ఏ పనీ చెయ్యనట్టు!"
"ఏం చేశాను చెప్పు పోనీ?"
"అసలు నేను కట్టడి ఏమైనా పెడితే కదా?"
"అందుకు నేనేం చెయ్యను? ఫలానా పని మీరు చెయ్యండి . అని నువ్వు అన్నాప్పుడు నేను చెయ్యకపోతే, అప్పుడు కదా నువ్వు నా మీద నెపం వెయ్యవల్సింది? చెప్పు, ఏం చెయ్యాలో."
"చెప్పనా?"
"ఊ!"
"మీరివాళ ఈ ప్రయాణం మానేయ్యండి."
"అదేమిటి జ్యోతి? ఇవాళ కోర్టు హియరింగ్ . డిపార్ట్ మెంటు తరపున నేను కోర్టు కి హాజరు కాకపొతే ఎలా?"
"చూశారా ? అప్పుడే నాలుక మడతేశారు."
"ఇది కాదు. ఇంకేదైనా అడుగు."
"సరే, నేనొకటి చెబుతాను. ఒప్పుకుంటారా?"
"నిరభ్యంతరంగా . చెప్పు."
"మన వివాహం అయి, ఇప్పటికి దాదాపు ఆరునెలలు దాటిపోయింది. మనమో వెడ్డింగ్ పార్టీ కూడా ఇవ్వలేదు. అసలు పెళ్ళి అయిందనే విషయమే చెప్పలేదు. ఎవరికీ. అటువంటప్పుడు మీరు నాతొ ఇంత చనువుగా తిరగడం చూసి స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళూ ఎన్నో ఇబ్బంది అయిన ప్రశ్నలు రకరకాలుగా వేస్తున్నారు. వాళ్లకి నేనేం సమాధానం చెప్పేది?"
"ఏదో ఒకటి చెప్పు. నాకు కావలసిన వాడనో, ఆత్మ బందువనో, ముఖ్య స్నేహితుడనో , అలాంటి ప్రశ్నలకి సమాధానమే దొరకదా?"
"ఏమంత కర్మ వచ్చిందని? మన వివాహం విషయం చెబితే వచ్చే ప్రమాదం ఏమిటి?"
"తొందరపడకు. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను."
"ఎందుకీ దొంగ బతుకు? ఏమైనా సరే నేనీ రహస్య జీవితం భరించలేను. ఏం కర్మం వచ్చిందని? నిక్షేపం లాంటి భర్తా, పుష్కలంగా చేతి నిండా డబ్బూ -- నాకేమిటి లోటు? నేనెందుకు వీటన్నిటినీ భయం లేకుండా అనుభవించ కూడదూ? నన్నే శక్తీ ఆపలేదు. రేపే ఒక పెద్ద మారేజీ పార్టీ ఏర్పాటు చేస్తాను."
"జ్యోతీ!" గట్టిగా అరిచాడు ఆనంద్.
"ఏం?"
"అలా తొందరపడి నిర్ణయాలు చేసుకోకు. తర్వాత విచారించవలసి వస్తుంది."
"ఏమిటండి , విచారించేది ? మీరు నా భర్త అని ప్రపంచానికి చెప్పుకుంటే ప్రమాదం వస్తుందా? ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది?"
"ఒక భార్య జీవించి ఉండగా ఇంకో భార్యని ప్రభుత్వం అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం నేరం. అందుకు శిక్ష గా ఉద్యోగం తీసేస్తారు."
"పొతే పోయింది ముష్టి ఉద్యోగం. అది లేకపోతె మనకేమీ గడవకపోదు. నాది బోలెడు ఆస్తి ఉంది. దానితో హాయిగా బతకచ్చు."
"హు! అది నీకు ముష్టి ఉద్యోగమే కావచ్చు. ఆ ముష్టి కోసం ఎంత తాపత్రయ పడ్డానో, ఎన్నాళ్ళు ఆశతో ఎదురు చూశానో నాకు తెలుసు. నీ దృష్టి లో ఈసడింపు గా ఉన్న ఆ ఉద్యోగం నాకొక మహావరం. పైగా ఏదో ఉద్యోగం చేస్తూ , నీ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడినప్పుడే నా ఉద్యోగమూ, సంపాదన నీకు ఇంత ఈసడింపుగా ఉంది కదా, నేను ఈ మాత్రమూ సంపాదించక పూర్తిగా నీమీదే ఆధారపడి కూర్చుంటే నామీద నీకింకా ఎంత చిన్న చూపు ఏర్పడుతుంది! అందుకోసమైనా నేను ఉద్యోగం చెయ్యాలి. అందుకోసమే మన వివాహం కూడా రహస్యంగా ఉండాలి, అన్నపూర్ణ తో బహిరంగంగా విడాకులిచ్చుకొనేదాకా."
"మీ వ్యవహారాలన్నీ పరిష్కార మై , మీ ఉద్యోగానికి మెప్పం రాని దృడ పరిస్థితి వచ్చేదాకా నేనీ నికృష్ణ జీవితం అనుభవించాలన్నమాట! అది నావల్ల కాదు. వివాహం అయి కూడా నేనిలా బతకలేను. మీకు తెలియదు -- అందరూ నన్ను ఎంత హేళనగా చూస్తున్నారో."
"అయితే రెండు నెలలు ఓపిక పట్టు. ఉగాది నాటికి నా ఆఫీసు తొందరలన్నీ కొంత తగ్గి స్థిమిత పడతాను. అప్పుడు సావకాశంగా మన సంగతి ఆలోచిద్దాము."
"రెండు నెలలు కాదు, రెండు నిమిషాలు కూడా లాభం లేదు. ఇప్పుడే తేల్చాలి."
"ఏమిటి తేల్చేది? నాకు అవతల బస్సుకు టైము అవుతోంది. నే వెళ్తున్నా " అంటూ వెళ్ళిపోయాడు ఆనంద్.
అవమానంతో ఒళ్ళంతా వేడెక్కి సెగలు, పొగలు కక్కుతూ ఉంటె దుఖంతో బుసలు కొడుతూ "హు! ఎంత అహంకారం! ముష్టి ఉద్యోగం అన్నానని పౌరుషం వచ్చింది కాబోలు. ముష్టి ఉద్యోగం కాక మరేమిటి? రాత్రి లేదు, పగలు లేదు. సెలవు రోజు లేదు, సమయాసమయాలు లేవు. ఇరవై నాలుగు గంటలు , మూడు వందల అరవై రోజులూ బండ పడ్డ గాడిద లాగ వాళ్ళిచ్చే నూటయాభై రూపాయల కోసం చాకిరీ చెయ్యడం. సంతోషంగా షైరు వెళ్ళడానికి గాని, సరదాగా సినిమాకు వెళ్ళడానికి గాని నోచుకోలేదు కదా? ఎప్పుడైనా ముచ్చటపడి వెళదామంటే, "నాకు ఖాళీ లేదు. నువ్వు వెళ్ళు" అనడం! అన్నీ కలిసి వచ్చి తీరా ఇద్దరూ బయలు దేరేటప్పటికి ఏ.డి.ఎస్.పి దగ్గర నుంచో కబురు! ఏమి బతుకులు?
'ఈ మాత్రం ఉద్యోగం చూసుకునే అయన కంత అహమిక. దాని ముందు తనకేమీ విలువ లేదు. తననూ, తన సౌందర్యాన్నీ, తన సంపదనూ అంతా గడ్డి పరక కంటే హీనంగా తీసేస్తారు ఉద్యోగపు బాధ్యత ముందు. అంత ఉద్యోగాన్నే వలచి ఉంటె దాన్నే పెళ్ళి చేసుకోక పోయారా? అటు ఆ అన్నపూర్ణ గొంతు కొయ్యడం ఎందుకు? ఇటు తనను హింసించడం ఎందుకు?
'పరిస్థితులు ఇలాగే ఉండి ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోతే, ప్రతి క్షణమూ అవమానానికి గురి అవుతూ , అయన అహంకారానికి బలి అవుతూ రోజులు గడపడం చాలా కష్టం. ఆయనతో కాపరం చెయ్యడం దుర్భర నరకం." అనుకుంది జ్యోతి.
