Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 30


                                      ఈ కథలు మారవా?

    పూనకం వచ్చినదానిలా ఊగిపోతూ, అలమరలోంచి షోల్డర్ బ్యాగ్ లాగి ఎవరో తరుముకొస్తున్నట్టు కూతురు బట్టలన్నీ దాన్లో చకచకా సర్దేసింది శోభమ్మ. చేతిసంచిలో తన చీరలు రెండు కూరుకుని, మరో బ్యాగ్ తీసి తెల్లబోయి చూస్తున్న కూతురు చేతికిచ్చి "నీ పుస్తకాలన్నీ ఈ బ్యాగ్ లో సర్దుకో, పట్టకపోతే అలమారులో పెట్టుకో... గబగబ సర్దు" అంది శోభమ్మ పమిట కొంగుతో చెమట అద్దుకుంటూ.
    'ఎందుకే అమ్మా, ఎక్కడికి పోవాల?" అయోమయంగా అర్థంకాక అడిగింది పదమూడేళ్ల కవిత.
    'నీవిక్కడ ఇంక ఉండకూడదు. పద మనం హైదరాబాదు పోవాలి. నీవక్కడ నీ మావ ఇంటికాడ ఉండి సదూకుందుగాని. పద, తొందరగా సర్దు."
    "ఎందుకు పోవాలి? నే పోను. నా దోస్తులందరూ ఇక్కడున్నారు. స్కూలు సదువు సక్కసెప్తుండారు. ఎందుకు హైదరాబాదు పోయి మావ ఇంటికాడుండాలి? నే పోను" ఏడుపు మొహంతో గట్టిగా అడిగింది కవిత.
    "నా తల్లివిగా, సెప్పినట్టు ఇనుకో. అక్కడ ఇంకా మంచి స్కూలుంటుంది. మావ, అత్త సక్కగా సూసుకుంటారు. దోస్తులక్కడా అవుతారు నాలుగు దినాల్లో. మాటాడకు, సర్దు త్వరగా. మనం పోదాం, పోతున్నాం. నీ మంచికే సెప్తున్నా ఇనుకో..." కూతురు భుజం మీద చెయ్యేసి కాస్త ప్రేమ, కాస్త కోపం చూపిస్తూ అంది పట్టుదలగా శోభమ్మ.
    "వద్దే అమ్మా! నాకు బాగోదే అక్కడ. ఈడనే ఉంటా" కళ్లనీళ్లు తిరిగాయి కవితకి.
    శోభమ్మ కూతురు వంక కోపంగా చూసి తనే అలమరలో పుస్తకాలన్నీ బ్యాగ్ లో కూరేసి, చెప్పులు ప్లాస్టిక్ బ్యాగ్ లో పడేసి, వాటిని బైటపెట్టి కూతురు చేయి పట్టి బయటకు లాగి, ఇంటికి తాళం పెట్టింది. తాళం పక్కింటి అవ్వకిచ్చి "ఆడోస్తే మా తమ్ముడింటికి బోతున్నానని సెప్పు. ఆడి ఒళ్లు బాగోనేదని కబురొచ్చింది అని చెప్పు. ఇదిగో వరమ్మా! పిల్లదాని సంగతి ఎత్తమాకు. నేనొక్కర్తినే బోయానని సెప్పు" అని చెప్పేసి, బయటకొచ్చి కనపడిన ఆటో పిలిచి ఎక్కేసింది. అదే ఊపుతో బస్టాండుకెళ్లి కనపడిన హైదరాబాదు బస్సెక్కేసింది పిల్లతో కలిసి.
    బస్సులో కళ్లు తుడుచుకుంటున్న కూతురుతో "నా మాటిను కవితా! ఇక్కడ మీ అయ్య నిన్ను బతకనీడు. సక్కా అక్కడుండి బుద్ధిగా సదూకో. మామకి నెలనెలా డబ్బులంపిస్తా. మంచి స్కూల్లో చేర్పిస్తాడు మావ. మీ అత్త బ్యాంకిలో అటెండరు ఉద్యోగం సేస్తది. ఆమెకి కాస్త చేదోడుగా, మంచిగా ఉండు. ఈ ఆర్మూర్ కంటే పెద్ద ఊరు హైదరాబాద్. అక్కడికెడితే నీ బతుకు బాగుపడతది. మీ అయ్య ఆ తాగుబోతు సచ్చినోడు... ఆడితో మనం నెగ్గుకు రాలేం. ఆడిచేత తన్నులింక నే తినలేను. నా బతుకెట్టాగో చెడింది. నీవన్నా సక్కా సదుకొని ఏదన్నా ఉద్యోగం సేసుకుంటూ బతకాలి. ఎదవ పెల్లికేం తొందర లేదు. మంచోడూ, నీకు నచ్చినోడూ దొరికితే సేసుకుందువులే. నా మాటిను. నా బుజ్జిగా! నేను రెండు నెలలకోసారి వచ్చి పోతూండాలే" బస్సులో కూతురికి నచ్చచెప్తూనే ఉంది శోభమ్మ.
    బస్సు ఆగగానే అదే ఊపుతో చకచక దిగి ఆటో మాట్లాడి తమ్ముడింటికి వచ్చేసింది. కూతుర్ని లాక్కొచ్చి తెల్లబోయి చూస్తున్న తమ్ముడి కాళ్లమీద పడేసింది. "అరే ఎంకటేసు, ఇంక దీని భారం నీదేరా. దీన్ని నీ ఇంటికాడ ఉంచుకుని నాలుగక్షరం ముక్కలు వచ్చేట్టు చదివించు. ఏదన్నా ఉద్యోగం సూపించి నీవే దాని బతుక్కి ఓ దారి సూపాలి. డబ్బంపిస్తా. మంచి స్కూల్లో చేర్పించరా. నా బాబు కదూ! భారం అనుకోకుండా నీ బిడ్డలా సూడరా. సిన్నప్పుడు నిన్ను నా సేతుల్లో పెంచానురా, అమ్మ పోయాక నా కొడుకు లెక్క సూసుకున్నా. నాకీ సాయం సేసి పుణ్యం కట్టుకోరా..."
    "ఏంటక్కా ఇదంతా? ముందు లే, హఠాత్తుగా ఏటిదంతా? ఏం సేసాడా తాగుబోతాడు? మళ్లా గొడవ సేసిండా?" గాభరాగా అన్నాడు.
    "అదంతా తరువాత సెపుతా. ముందు నీవు ఊ అను. దాన్నిక్కడ వుంచుకుంటానని సెప్పు." తమ్ముడు అయోమయంగా వంటింటి గుమ్మం ముందు నిలబడిన భార్య వంక చూశాడు. "ఏటే అక్కా ఈ ఇల్లు సూస్తండావుగా. ఒకటే గది. హాలు, వంటగది. మాకే సోటు లేదు. దీన్నెక్కడ పెట్టుకోనే?"
    "మా నాయనవిగా. దానికి గడులెందుకురా? హాల్లో సాపేస్తే పడుకుంటది. ఓ మూల కూకుని సదూకుంటంది. అరేయ్, నీ పెళ్లాం ఉద్యోగస్తురాలు. దానికి సాయంగా ఉంటంది. నీ పిల్లగాడిని సూసుకుంటది. కాదనకురా?"
    మళ్లీ తమ్ముడు సుజాత వంక చూశాడు. ఆమె మొగుణ్ణి లోపలికి రమ్మన్నట్టు సౌంజ్ఞ చేసి గదిలోకి పిలిచింది. వెంకటేసు లోపలికొచ్చాక "పోనీ ఉండనీయండి. నాకు సేతికింద పనికొస్తది. పిల్లగాడు స్కూలునించి వచ్చి బిక్కుబిక్కుమని ఒక్కడూ ఉంటున్నాడు. ఇంట్లో తోడుంటది. ఆడికి రెండు ముక్కలు సదూ సెపుతుంది" అంది సుజాత.
    "అక్కా, ముందే సెపుతుండా, బావగానొచ్చి గొడవెట్టుకుంటాడేమో! ఆ గోల నే పడలేను."
    "అసలు అది ఇక్కడుందని ఎవరికీ సెప్పకూడదురా. ఆడి సంగతి నేను సూసుకుంటా. నీవు ఎక్కడా మనోళ్ల దగ్గర అనమాకు. అరేయ్ సెలవలాఖరుకి ఏదన్నా స్కూలు చూసి చేర్పించరా. డబ్బులంపుతా" ప్రాధేయపడింది శోభమ్మ.
    "ఇదిగో, అది ఆడపిల్ల రేపొద్దుట ఏదన్నా జరిగితే నన్నే అనకు, మరి అది బుద్ధిగా మాటినుకుని సదూకోవాలి. అత్తకి కాస్త పనిసాయం చేస్తూ పిల్లగాడిని సూసుకోవాలి. ఎళ్లగానే దాని స్కూలు సర్టిఫికెట్లు స్కూల్లో అడిగి పంపు" అన్నాడు తమ్ముడు. తలూపింది శోభామ్మ. దిగాలుపడి కూర్చున్న కూతుర్ని చూసి "అది సూడరా! మొగం ఎట్టా మాడ్సుకుందో? దాని మంచికే నేనిట్లా సెప్తండానని దానికే తెలుస్తుంది."
    "నేనిక్కడ ఎందుకుండాలే నిన్ను వదిలి? నేను ఇక్కడ ఉండనే. ఎల్లిపోదాం. నేనిక్కడ సదవను..." ఏడుస్తూ తల్లిని వాటేసుకున్న కూతురిని బుజ్జగిస్తూ కళ్లు తుడుచుకుంది శోభమ్మ.
    రాత్రి భోజనాలయ్యాయి. కవిత పడుకున్నాక గదిలో తమ్ముడికి, మరదలికి అసలు విషయం చెప్పింది శోభమ్మ. తమ్ముడు తెల్లబోయాడు. "ఓరినీ, కన్నోడేనా ఆడు?" అంది మరదలు చీదరింపుగా.
    "ఏమిటక్కా, నీవు చెప్పేది నిజమేనా?" వింతగా చూస్తూ అన్నాడు వెంకటేశు.
    "ఒట్టురా. ఆ తాగుబోతాడికి కళ్లు బైర్లు కమ్మి కూతుర్ని కూడా ఆడదానికిందే చూస్తున్నాడు. దానికి ముద్దులెడతాడు. అది పడుకుంటే దాని పక్కలో పడుకుని కౌగిలించుకుంటాడు. అది బిత్తరపోతోంది. గింజుకుంటుంది. ఆడింకా వదలకుండా పట్టుకుంటాడు. 'ఏట్రా ఇది?' అని నేను తిడితే "నా కూతురు నా ఇష్టం' అంటాడు. కూతురని గుర్తుంటే ఏ ఎదవా ఇలా సేయడు అని నోరు నొప్పెట్టేట్టు తిడతా. దాని బాబు ఇంట్లో ఉన్నంతసేపు అది నా ఎనకే, ఎనకే తిరగతాంది, నేదంటే పక్కింటి అవ్వకాడికి పోయి కూకుంటాది. ఆణ్ణి చూసి బెదిరిపోతుందిరా. పెద్దపిల్ల అయిన దగ్గరనుంచి ఆడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఓ రోజు రాత్రి నా పక్కన పడుకున్నదాని దగ్గరికి పోయి కౌగలించుకుని నలిపేస్తుంటే అది దడుసుకుని లేచి కేకలు పెట్టింది. నే తిడితే ఎకిలి నవ్వు నవ్వి 'నీవనుకున్నా' అన్నాడు. 'ఎదవ! పెళ్లానికీ, కూతురికీ తేడా తెలియకుండా తయారయ్యావా?' అని సీపురుకట్ట తిరగేశా. నా నెత్తి బాదుకున్నా. ఆడి నెత్తి బాదాను. ఎలా కాసుకోనురా దీన్ని...?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS