అతనేదురుగా కూర్చుని గంటసేపు అవుతోంది.
ఇంతవరకూ అతను తనతో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఆఫీస్ ని గురించి చెప్పనూ లేదు.
ఎందుకని?
తనిక్కడ ఉద్యోగం చేయటం ఇష్టం లేదేమో. ఈ ఉద్యోగం అతని తాలూకూ బంధువుల కేవరికయినా ఇప్పించాలనుకున్నాడేమో!
"నాలాగా కొత్తగా చేరిన వాళ్ళ మూలాన మీ పనికి బోలెడు అంతరాయం కలుగుతుందను కుంటాను ----" అందామె నవ్వుతూ.
కలవరపడిపోయాడు సృజన్ బాబు.
"అబ్బే ..... అలాంటిదేమీ లేదు లెండి. పని ఎవరయినా --- కొత్తలో నేర్చుకోవలసిందేగా." నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు. ఆమె మాటల్లోని అర్ధం బోధపడిందతనికి. ఆమెనలా వూరికే కూర్చుండ బెట్టడం ఆమెకు అయిష్టంగా ఉంది.
"ఇదిగో ఈ ఫైల్స్ చదవండి! ఇవాళ్టి కి పని చాలు! కొంత అయిడియా ఏర్పడుతుంది..." అన్నాడు. కొన్ని ఫైల్స్ ఆమె ముందున్చుతూ . ఒక్కొక్క ఫైలే తీసుకొని చదవసాగింది స్వరూప. చాలా విషయాలు అర్ధం కాక పోయినా అతన్నాడగకుండా ఊరుకుండిపోయింది! ఆరోజే అతన్ని విసిగించడానికి మనసంగీకరించలేదు.
లంచ్ టైం అవుతుండగా సరోజ వచ్చి ఆమె పక్కన కూర్చుంది.
"ఎలా వుంది ?" అనడిగింది నవ్వుతూ.
"ఏదీ ఇంతవరకూ ఇంకా "అ ఆ "లు మొదలు పెట్టలేదు ...."
"వాటికంత తొందరేం లేదులే, మన ఆఫీస్ పనికి "ఆ ఆ " ల నుంచి మొదలుపెట్ట కూడదు. "అం అః ' ల నుంచి ప్రారంభించాలి ." అంది సరోజ నవ్వుతూ. ఆమెతో పాటు సృజన్ బాబు కూడా నవ్వేశాడు.
ఇద్దరూ ఆఫీస్ ఆవరణలోనే ఉన్న కాంటిన్ లోకి నడిచారు. స్త్రీల కోసం ప్రత్యేకంగా ఓ గది ఉంది.
కాఫీ టిఫినూ తీసుకొన్నాక కాసేపు గార్డెన్ లో కూర్చున్నారు.
"ఏమయినా చెప్పాడా అతను?" అడిగింది సరోజ.
"ఊహు! వట్టి మొద్దబ్బాయిలాగున్నాడు. గంటసేపు నా వంకయినా చూడకుండా ఏదో ఫైల్లో తలదూర్చి కూర్చున్నాడు. చివరికి నేనే విసుగుపుట్టి అడిగాను. అప్పుడు జ్ఞానోదయం కలిగినట్లుంది. ఓ అరడజను ఫైల్స్ నా ముందు పడేసి చదువుకోమన్నాడు. ఇవాలంతా అవే చదివితే , రేపటి నుంచీ పని చేయించడం ప్రారంభిస్తాట్ట...."
"నాలుగయిదు రోజులు, అంతే! ఆ తరువాత ఇంక అతనేం చెప్పనవసరం లేదు. అయినా నేనివాళ కొన్ని ఫైల్స్ ఇంటికి తీసుకోస్తున్నాను. అవెలా "డీల్" చేయాలో చెప్తాను. దాంతో సగం పని నేర్చుకున్నట్లే ." మరి కొద్ది సేపు ఏవేవో పిచ్చాపాటి మాట్లాడారిద్దరూ.
టైమవగానే మళ్ళీ టేబుల్ దగ్గర కూర్చుంది స్వరూప.
అతను సాయంత్రం నాలుగయ్యే వరకూ తన సీటు దగ్గరకే రాలేదు. ఎవరెవరితోనో మాట్లాడుతూ ఆఫీసంతా తిరిగాడు.
ఆ తరువాత వస్తూనే "సారీ! ఇవాళ నేను పూర్తిగా "ఆఫ్ మూడ్' లో ఉన్నాను. అందుచేత కనీసం మీ వివరాలు కూడా తెలుసుకోలేదు! నా పేరు సృజన్ బాబు! ఈ ఆఫీస్ లో అయిదేళ్ళ సర్వీస్ పూర్తయ్యింది....." అన్నాడు ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ.
"నా పేరు స్వరూప! ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళేవారూ లేరు సరోజ తప్ప! ఆమెతోనే ఉంటున్నాను. అసలు నాకీ ఉద్యోగం తనే రికమెండ్ చేసి ఇప్పించింది ....."
ఆమె ఇంకేమయినా వివరాలు చెపుతుందని ఆశపడ్డాడతను. కాని స్వరూప అక్కడితో అపివేయడంతో నిరాశ పడిపోయాడు. ఆమె వివాహం తాలూకూ గొడవలన్నీ తెలుసుకోవడం అంత తెలికయినా విషయమేమీ కాదు! తానెంతో సన్నిహితుడైతే తప్ప ఆమె అలాంటి విషయాలు తనతో చెప్పదు. సరోజకు తప్పక చెప్పే వుంటుంది. కాని, సరోజ మాత్రం తనతో ఎందుకు చెప్తుంది? వాళ్ళిద్దరి మధ్యా రహస్యాలు వాళ్ళ మధ్యే ఉండిపోతాయ్. ఇంకేం మాట్లాడటానికి తోచలేదామెకి. తిరిగి ఫైల్స్ చూడసాగింది. సాయంత్రం అయిదయ్యే వరకూ అలాగే కూర్చుండిపోయారిద్దరూ.
:ఇంక వెళ్దాం పదండి!" అన్నాడతను టైం చూచుకొని లేచి నిలబడుతూ.
ఫైల్స్ అన్నీ టేబుల్ మీదకు సర్దేసింది స్వరూప.
"బహుశా మీకు అర్ధం కానివి చాలా ఉంటాయందులో ! అవన్నీ రేపు చెప్తాను!" అన్నాడతను తలూపిందామే.
"మీరూ మీ ఫ్రెండ్ సరోజ దగ్గర కెళ్ళాలనుకొంటాను. మరి నేను శలవు తీసుకుంటాను...." వెళ్ళబోయి మళ్ళీ ఆగిపోయాడతను. "చూడండి మీకిక్కడ ఎవరూ లేరన్నారు కదా! మీకెలాంటి సహాయం కావాలన్నా సరే సందేహించకుండా నన్నడగండి. ఆఫ్ కోర్స్ సరోజ గారూ కూడా ఉన్నారనుకోండి! అయినా కూడా నా అవసరమేమయినా ----"
"థాంక్యూ " నవ్వుతూ అంది స్వరూప.
అతను వెళ్ళిపోయాడు.
సరోజ సీటు వేపు నడిచింది స్వరూప. అప్పుడే సరోజ అల్మారా మూసి తాళం వేస్తోంది.
"ఇప్పుడే నీ దగ్గర కొద్దామనుకొంటున్నా " అంది స్వరూప వంక చూసి నవ్వుతూ.
