వీధి వరండా లో పచార్లు చేస్తున్న గోపాల్రావు స్కూటర్ దిగుతున్న వాసునీ, పద్మజ నీ చూసి చిరునవ్వుతో "ఎలా ఉంది సినిమా?" అని ప్రశ్నించాడు.
"నాన్నగారే, అనుకోలేదు." తేలిగ్గా గుండెల నిండా గాలి పీల్చుకుంది పద్మజ.
"చాలా బాగుంది. చూడవలసిన పిక్చర్ . నువ్వూ ఓసారి చూడు , మామయ్యా" అన్నాడు వాసు.
ఇద్దరికీ వడ్డన చేస్తూ, "ఎలా ఉంది సినిమా? మీరు వెళ్ళేసరికి బిగినయి పోయిందా?" అని అడిగింది మధుమతి.
"నీ కోడుకన్నీ అబద్దాలే చెబుతాడు.... ఒకటే బోరు. ఓ పాటా లేదు, డాన్సూ లేదు.... ఎలక్షన్లూ, గొడవా-- ఇతను చాలా ఆసక్తిగా చూశాడు లే." కొంటెగా వాసు వైపు చూస్తూ అంది పద్మజ.
"ఓహ్! నీకు నచ్చలేదన్న మాట..... ఆ పక్క హల్లో సినిమాకి పంపిద్దును సుమా! నీ కలాంటి ప్రేమా, డాన్సు లూ ఉన్న సినిమా ఇష్టమని నాకు తెలియదు."
"నిజంగా చెప్పు. తలనొప్పి రాలే?"
"రేపు మళ్ళీ చూస్తాను."
నవ్వింది గలగలా పద్మజ.
కాలేజీ , సినిమా , షికారు నిరభ్యంతరంగా వాసు స్కూటర్ మీద వెళుతుంది పద్మజ. అప్పడప్పుడు శ్రీనూ వెళుతున్నాడు. పద్మజ అతని దగ్గర చదవడం లేదు. శ్రీను చదువుతున్నాడు.
* * * *
"నువ్వు నా కోసం వెయిట్ చెయ్యకు, వెళ్ళిపో, వాసూ! నేను బస్సు మీద వెళతాను."
పద్మజ గొంతు విన్న వాసు-- బూటు తాళ్ళు ముడి పెట్టు కుంటున్నవాడు తలఎత్తి చూశాడు ప్రశ్నార్ధకంగా!
వెనక్కి తిరిగి నాలుగడుగులు ముందుకు వేసింది పద్మజ.
"ఏం, పద్మజా! ఈవేళ ఎందుకు ఇలా చెప్పావు? ఇంట్లో ఏదన్నా పనుందా? కాలేజీ కి లేటుగా వెళతావా?' అడిగాడు వాసు.
ఆమె జవాబివ్వలేదు. చిన్నబోయిన వదనంతో నిలుచుంది.
"ఎవరన్నా తప్పుగా అనుకుంటున్నారా? ఆహా ఎందుకనుకుంటారు? ఓ దగ్గర ఉన్నవాళ్ళం. అక్కా తమ్ముల పిల్లలం...." కంగారుగా గబగబా అన్నాడు వాసు.
"మా కాలేజీ వాళ్ళే... చాలా అసహ్యంగా, వ్యంగ్యంగా , నవ్వులూ అవీ నన్ను చూడగానే....నాకేమో కష్టంగా ఉంది." ఆమె కళ్ళ నిండుగా నీళ్ళు తిరిగాయి.
"ప్చ్! ఎంత చదివినా మనవాళ్ళ మనస్తత్వం మారదేమో! అన్నా చెల్లెళ్ళయినా, స్నేహితులయినా వారెటువంటి వారో గ్రహించకుండా ఇష్టమొచ్చినట్టూ అనేయ్యడమే!" నొచ్చుకున్నాడు వాసు.
ఆరోజు మొదలు ఒక రకంగా అతనికి దూరంగా, ఉండిపోతుంది పద్మజ. బస్సు చార్జీ అక్కర్లేకుండా వాసూ, శ్రీను స్కూటర్ మీద కాలేజీ కి వెళుతున్నాడు.
గటగటా సంగోతు పైగా పాలు తాగేసిన వాసు, వెళ్ళిపోతున్న మధుమతిని , "అమ్మా!" అని పిలిచాడు .
"ఏం పిలిచావు?' నిలుచుంది మధుమతి.
"ఈ పాలు పద్మజ కిచ్చెయ్."
యాంత్రికంగా అతని చేతిలో గ్లాసందుకుంటూ అర్ధం కానట్టు చూసింది మధుమతి.
"ఏం, తను తేలేదు? చూశావా? ఆ రోజు మొదలు చాలావరకు నాతొ మాట్లాడడమే మానేసింది.
'అది చాలా మంచి పిల్లరా, వాసూ . అలా మాటలు మనస్సులో పెట్టుకు బాధపడే మనిషి కాదు.... రోజూ తనే తెచ్చి ఇస్తుంది, పాపం! ఈవేళ కాస్త జ్వరం తగిలింది. కాలేజీ కి వెళ్ళలేదు. అలా పడుకునే ఉంది."
"డాక్టర్ని పిలిచారా?' కంగారుగా అడిగాడు వాసు.
"జలుబు చేసింది. అందునుంచి వచ్చిన జ్వరం కాబోలు. మరి వస్తా... తాను తాగకపోతే నువ్వే తాగాలి... శ్రీను తాగడు....పైగా ఎంగిలి చేశావు!" అంటూ వెళ్ళి పోయింది మధుమతి.
నాలుగు రోజుల తరవాత కాని నార్మల్ కి రాలేదు పద్మజ జ్వరం..
నెయ్యి అన్నం లో కలిపి బీరకాయ ముక్క అద్ది ఆ అన్నం నోటికి అందిస్తున్న మధుమతి వైపు కృతజ్ఞతగా చూస్తూ, "వాసు ఊళ్ళో లేదా, అత్తయ్యా. నా జ్వరం కాదు కాని హైరానా పడిపోయావు నాకోసం. నే తింటాలే" అంటూ మధుమతి చెయ్యి పట్టుకుంది పద్మజ.
"నిన్నా మొన్నా అడిగాడమ్మా నీ జ్వర మెలా ఉందని.... పాలు నీకు డాక్టరివ్వద్దన్నారని కూడా చెప్పాను.....వాళ్ళేవో ఎలక్షన్ల లో పడ్డట్టుంది." కొడుకు ఆమెను పలకరించినందుకు సర్దుబాటుగా మాట్లాడింది మధుమతి.
ఆరోజు పాలగ్లాసు తీసుకుని రాత్రి ఎనిమిది గంటల వేళ నెమ్మదిగా వాసు గదికి వెళ్ళింది పద్మజ. వాసూ, శ్రీను గలగలా నవ్వుతూ కబురు చెప్పుకుంటున్నారు. 'శ్రీనుతో ఎంత హాయిగా మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా, నిర్మలంగా నవ్వుతున్నాడు! నాతొ మాట్లాడే వేళ్ళల్లో ఈ నవ్వులూ, చలోక్తు లూ ఎమైపోతాయో! నన్ను చూస్తేనే సీరియస్ గా, గంబీరంగా మారిపోతాడు. నేనేం పాపం చేశానని! నాలుగు రోజులు ఒళ్ళు తెలియని జ్వరంతో పడి ఉన్నానే, కనీసం ఎలా ఉంధనన్నాపలకరించాడా? ఇతనికి నేనెందుకు పాలగ్లాసందించాలి! నాకేం పట్టింది!" పెదవులు వణికాయి. కనురెప్పలు తడిశాయి. రెండు క్షణాలు మౌనంగా నిలుచుండి పోయిన పద్మజ గబగబా గదిలోకి వచ్చి టేబిలు మీద గ్లాసు ఉంచి చప్పున వెనుదిరిగింది.
ఒక్కసారి అక్కడి వాతావరణం నిశ్శబ్దమయింది. వెళుతున్న పద్మజ వైపు చూస్తూ, "నాలుగు రోజుల జ్వరానికే ఇంత చిక్కిపోయావు. అమ్మ తెచ్చేదిగా . లేకపోతె నేనే వచ్చే వాణ్ణి.... నువ్వెందుకు వచ్చావు?" అన్నాడు వాసు.
"నిన్ను పలకరించాలని.... నిన్ను చూడాలని " రోషంగా అతని వైపు చూస్తూ అంది పద్మజ.
తెల్లబోయి ఆమె వైపు చూసిన వాసు క్షణం లో ఏదో అర్ధమయినట్టు, "సారీ, పద్మజా! ఒక్కసారి నీ జ్వర మెలా ఉందొ చూడాలనే అనుకున్నాను...కాని...." అన్నాడు.
"ఎందుకులే అని మానేశావు! అవునా?"
"అతను డాక్టరేమిటి? నిన్ను చూసి మాత్రం ఏం చేస్తాడూ?" అన్నాడు జవాబు గా శ్రీనూ.
"ఎస్, కరెక్ట్....' చిన్నగా నవ్వి అన్నాడు వాసు.
ఈసారి నవ్వేసింది పద్మజ.....' నాకు వచ్చిన జ్వరం ప్లూ...మీకు రావచ్చు....అప్పుడు...."
"నువ్వు చూడ్డం మానేయ్." పకపకా నవ్వుతూ అన్నాడు శ్రీను.
ఆ కుటుంబ సభ్యులందరికీ చివర వాసుకీ వచ్చింది జ్వరం. జ్వరం పడ్డ మధుమతి ఇంకా పద్యం తీసుకో లేదు. లక్ష్మీ కి ఇంట్లో పనులతో సరిపోయేది. నీరసంగా , నిస్త్రాణగా పడి ఉన్న వాసు సంరక్షణ పద్మజ పై వేశాడు గోపాల్రావు. 'జాగ్రత్త , పద్మజా . డాక్టరు చెప్పిన టైం ప్రకారం మందిస్తావు కదూ.... వాసూ , ఫరవాలేదు. ఏం కావలసినా పద్మజ తో చెప్పు" అని హెచ్చరించి ఆఫీసు కి వెళ్ళేవాడు గోపాలరావు.
ఆమె ఇవ్వబోయే మందూ, పళ్ళ రసం , బార్లీ ఏదన్నా-- బొత్తిగా ఓపిక లేని వాసు నోరు తెరిచే వాడు. అతని నోటి కలా గ్లాసు అందిస్తూ అతన్ని చూస్తూ ఏవో తియ్యని అనుభూతులతో చలించేది ఆమె.
జ్వరం తగ్గి కోలుకున్న తరవాత కూడా అదొక అలవాటైంది వారిద్దరికి. ఆమె టిఫిన్ తెస్తే, కలం, కాగితం వదలకుండా నోరు తెరిచేవాడు వాసు. మంచి నీళ్ళ గ్లాసు కూడా అతని నోటి కందించి, "ఏం, తిన్నావు, చెప్పు!" అని కవ్వించి నవ్వేది పద్మజ.
"ప్లీజు..... నాకు తెలియదు. తరవాత చెపుతాను. నన్ను డిస్టర్బ్ చెయ్యకు." విసుక్కునేవాడు వాసు.
అతని దృష్టి లో ఆమె నుంచి మనస్సున్న మామయ్య కూతురు. ఒక ఆత్మీయురాలు. ఆమె దృష్టి లో అతను ఆమె జీవన జ్యోతి. ఏనాటి కైనా అతనికే తన సర్వస్వం అర్పిస్తుంది. అతని రూపం, మాటా, నవ్వూ, అతని ప్రతి కదలిక ఆమెను ఆకర్షిస్తున్నాయి.
* * * *
"వంట మనిషిని ఏర్పాటు చేసుకున్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. మీ అందరి క్షేమం గోపాలం ఉత్తరం వ్రాస్తున్నాడు. నువ్వు పూర్తిగా చదువులో పడిపోయావనుకుంటాను సంతోషమే. కాని...బాబూ! అహర్నిశలూ నీకోసం, నీ ఉత్తరం కోసం తపించిపోయే మనిషొకడున్నాడని మర్చిపోకు. అది నేను సహించలేను. చాలా కాలమైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావో! ఓసారి చూడాలని ఉంది. వీలు చూసుకుని వస్తావు కదూ?" అని వ్రాసిన ప్రసాదరావు ఉత్తరానికి వారం రోజుల్లో వస్తున్నానని జవాబు వ్రాశాడు వాసు.
సూట్ కేసు లో బట్టలు సర్దుకుంటున్న వాసుని, "ఎక్కడికి ప్రయాణం, ఇదిగో మిఠాయి చూడు. అత్తయ్య ఎంత బాగా చేసిందో!" అంది పద్మజ.
"ప్రయాణమయ్యేటప్పుడు ఎక్కడికని అడక్కూడదు తెలుసా? చూశాను. చాలా గుడ్రంగా ఉంది."
"ఛ, ఫో! హాస్యం.... మహా రాచకార్యం చెడిపోదు కాని.... ఎక్కడికి? ఎక్స్ కర్షనా?"
"ఆ-- బతికించావు...అదే....మిఠాయి చేశారీ వేళ ఏమిటి విశేషం?"
"నా బర్త్ డే. "సిగ్గు పడుతున్నట్టు తల వంచింది పద్మజ.
"అయిదేళ్ళ కొక్కసారి వస్తుందా? ఆహా కాదు. పుట్టిన రోజు పండుగ చేసుకుంటావా?" కొంటెగా నవ్వాడు వాసు.
"ఇదివరకెప్పుడూ నీకు చెప్పలేదు. ఈవేళ నువ్వు అడిగావు గనుక చెప్పాను.' తానూ నవ్వుతూ చెప్పింది పద్మజ.
"అన్నంలో తింటాను, పద్మజా. ఇప్పుడు చేతులు ఖరాబవుతాయి. అలా వెళ్ళి రావాలి.... ప్రయాణం తెల్లవారు ఝామునలే."
"ఏదీ....నోరు తేరు." అతని నోటిలో మిఠాయి కుక్కి మంచి నీళ్ళ గ్లాసు చేతి కిచ్చి నవ్వుతూ వెళ్ళిపోయింది పద్మజ.
వంటగది వైపు వస్తూ "అమ్మా' అని పిలిచాడు వాసు.
"బాబూ, పిలిచావా?' అంటూ ఇవతలికి వచ్చింది మధుమతి.
"ఈ వేళ పద్మజ బర్త్ డే ట కదూ?" నెమ్మదిగా అన్నాడు.
"అవును, నేనే మివ్వగలను? మిఠాయి చేయ్యమంది. చేశాను" అంది మధుమతి చిన్నబోయిన వదనంతో.
"ఇవ్వలేక పోవడమేమిటమ్మా! ఇదిగో, ఇచ్చేయ్" అంటూ ఓ పాకెట్ ఇచ్చాడు వాసు.
పాకెట్ విప్పి చూసిన మధుమతి "మాధవరం పట్టు కదూ!' అంటూ వాసు వైపు పరిశీలనగా చూసింది. ఆమెకు కావలసింది 'ఈ చీరెకు డబ్బెక్కడిది' అనే ప్రశ్నకు జవాబు. కాని ఆమె ఏమీ ప్రశ్నించలేదు.
"నేను తెచ్చానని అత్తయ్యకు చేప్పి పద్మజ కిచ్చేయ్యమ్మా!" అంటూ వెళ్ళిపోయాడు వాసు.
రాత్రి భోజనం చేస్తూ, తాను తెచ్చిన కొత్త చీరలో ఉన్న పద్మజ వైపు చిరునవ్వుతో చూస్తూ, "చీర బాగుందా , పద్మజా! నీకు నచ్చిందా?' అని అడిగాడు వాసు.
"నువ్వు తీసుకొస్తే ఏదైనా నాకు బాగానే ఉంటుంది.' అతని చూపులు మాములుగా ఉన్నా, ఆమె భావాలు వేరు కాబట్టి సిగ్గుగా కనురెప్పలు వాలిపోయాయి.
ఏవేవో డబ్బాలు తెచ్చి బాగ్ లో కూరింది లక్ష్మీ. "ఏమిటివి?' అని అడగబోయే వాసుకు -- "వండించుకు తింటున్నాడట . ఊరగాయ కాబోలు, తీసుకెళ్ళు" అని చెప్పాడు గోపాల్రావు.
* * * *
