జ్యోతి ఏదో చెప్పబోయింది.
"ఉండు. నేను చెప్పేది పూర్తిగా విను. నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు. అందుకు ప్రతిగా నా ఇష్టం వచ్చినట్లు నేను కూడా వ్యవహరించవచ్చు. కాని పెంచిన మమకారం వల్ల , నేనల్లా ఏమీ చేయటం లేదు. ఏనాడో నీ పేర మూడవ వంతు ఆస్తి వ్రాసేసి ఉంచాను. అది తీసుకొని వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో. నువ్వు మళ్ళీ ఈ గడప తొక్కడానికి వీలులేదు. అలా ప్రయత్నించి మాధవరావు జ్యోతిని గెంటించేశాడనే పేరు నాకు రానియ్యకు. వెళ్ళు."
కన్నీళ్ళ తో "డాడీ!" అంది జ్యోతి.
"ఇంక అలా నన్ను పిలవకు. ఎవరి పిల్లవో నువ్వు. ఏదో ఋణానుబంధం ఉండి మా ఇంట్లో పెరిగావు ఇన్నాళ్ళూ. ఎలా వచ్చావో, అలాగే వెళ్ళి పోతున్నావు. మంచిది." విద్యుద్ఘాతం లా తగిలిన ఆ మాట విని జ్యోతి కదలకుండా గుడ్లప్పగించి మాధవరావు కేసి చూస్తూ ఉండిపోయింది.
"ఆశ్చర్యంగా ఉందా? అవును. అనాధ శరణాలయం లో పెరుగుతున్న నిన్ను నేను తీసుకు వచ్చి పెంచు కొనేటప్పటికి నీకింకా జ్ఞానం రాలేదు. అంత చిన్న పిల్లని తీసుకు వచ్చి ఇంత చేసినందు కూ, కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమతో పెంచు కున్నందు కూ ఫలితం బాగానే దక్కించావు. వెళ్ళు, వెళ్ళు, తల్లీ! చాలా సంతోషం. ఇవిగో , నీ పేర వ్రాసిన ఆస్తికి సంబంధించిన కాగితాలు."
జ్యోతి మౌనంగా అలాగే నిలబడి ఉండిపోయింది.
"నువ్వు అడిగినా, అడక్కపోయినా ఒక్క సలహా చెబుతున్నాను. ముందు వెనకలు బాగా ఆలోచించ కుండా ఎప్పుడూ ఏ పనీ చెయ్యకు. తొందర లో తీసుకున్న నిర్ణయాలకు సావకాశంగా విచారించ వలసి వస్తుంది. ఉద్రేకం ఒక్కటే కాదు జీవితాన్ని నడిపించేది. నిదానమైన నడవడి, నిశ్చలమైన ఆలోచన -- ఈ రెండూ అలవరచు కుంటే ఇక ముందైనా ఇలాంటి తప్పటడుగులు వెయ్యకుండా జాగ్రత్త పడవచ్చు. ఇంక నువ్వు వెళ్ళచ్చు. ఊ! నాకు ఇంకా లోపల బోలెడు పని ఉంది. నువ్వు వెళ్ళితే తలుపులు మూసుకుంటాను. శాశ్వతంగా నీలాంటి దూరదృష్టి లేని దురదృష్ట జీవులకు దూరంగా ఉండటం కోసం."
విధిలేక బయలుదేరింది జ్యోతి.
"కాగితాలు కూడా తీసుకు వెళ్ళు. అవిగో!"
"మీ అభిమానం లేనప్పుడు మీ ఆస్తి మాత్రం నాకెందుకు?"
"అభిమానం ఉన్నా లేకపోయినా , లోకం లో హాయిగా జీవించవచ్చు. ఆస్తి లేకపోతె మాత్రం అణా కాసులు మారవు. పౌరుషాని కేం గాని పట్టుకేళ్ళు."
"సరే" అని జ్యోతి కాగితాలు తీసుకొని గడప దాటబోతూ "మమ్మీతో చెప్పి వెళ్ళుదామంటే ఊళ్ళో లేదు....తమ్ముడు...." అని శేఖర్ జ్ఞాపకం వచ్చి కంఠం రుద్డం కాగా, ఆ పైన చెప్పలేక పోయింది.
"వాళ్ళు ఈ సమయంలో ఇక్కడ లేకపోవడం వాళ్ళ అదృష్టం ."అంటూ, ఆమె ఇంకా గడప దాటబోతుండగానే , తలుపు వేసేశాడు మాధవరావు.
వచ్చిన దారినే వెనక్కు బయలుదేరింది జ్యోతి. కాకినాడ నుంచి వచ్చేటప్పుడు తను పెద్ద లక్షాధికారి కూతురు. ఎమ్.ఎల్.ఎ గారి గారాబు బిడ్డ. తను ఏమి కోరితే అది చెల్లించే డాడీ, తను ఏది కావాలంటే అది ఇచ్చే మమ్మీ, తన సంతోషం లో పాలు పంచుకునే ఒక చిన్న తమ్ముడు ఉన్నారు. తన జీవితం తన కెంతో గర్వంగా నూ, చూసేవాళ్ల కు అసూయ గానూ ఉండేది.
ఇప్పుడో? తన కెవ్వరూ లేరు. తల్లీ, తండ్రి ఎవ్వరో తెలియని ఒక అనాధ. ఒక శరణాలయం లోని బిడ్డ. నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేని ఏకాకి. ఎంతలో ఎంత మార్పు!
ఇందంతా ఎందుకు జరిగింది? తను ఆనంద్ ను తొందరపడి వివాహం చేసుకోవడం వల్లే కదా? అతని కోరిక ననుసరించి అతని పేరు రహస్యంగా దాచడం వల్లే కదా? తన తండ్రికి ఆనంద్ అంటే ఇష్టమే. అందువల్ల అతన్ని చేసుకున్నానని అంటే సంతోషించి ఉండేవాడేమో? అబ్బే, తన వెర్రి కాని అలా ఒక్కనాటికి అంగీకరించడు. పైగా ఆ సంగతి రామదాసు కు తెలియ పరిచి ఎలాగో అలాగ అన్నపూర్ణ నూ, ఆనంద్ నూ కలిపి ఉండును.
తన కింక ఎవ్వరూ లేరు. ఎవ్వరికీ తను జంక నక్కరలేదు. భయపడ నక్కరలేదు. ఇంత క్రితం దాకా ఫలానా మాధవరావు గారి అమ్మాయి అని ఎక్కడ అనుకుంటారో నని కొంత ఆలోచించవలసి వచ్చేది. ఇప్పుడా శంక ఏమీ అక్కరలేదు . తన ఇష్టం పూర్తీ స్వేచ్చ లభించింది. దానికి తోడూ చేతి నిండా డబ్బు , హాయిగా ఆనంద్ తో కలిసి నిశ్చింత అయిన జీవితం గడపవచ్చు. అతను కూడా తుని నుంచి కాకినాడ బదిలీ చేయించేసుకున్నాడు. ఇంకెప్పుడూ తన దగ్గరే ఉంటాడు. అతన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండవలసిన అవసరం లేదు తన కింక.
తన కింక ఎవరి భయమూ లేనప్పుడు తమ వివాహం మాత్రం ఎందుకు రహస్యంగా ఉంచాలి? రహస్యంగా జీవించవలసిన కర్మ ఏం పట్టింది తనకు? ఏమి తప్పు పని చేస్తున్నామని?
ఆనంద్ వీల్లెదన్నా సరే, తనకూ ఆనంద్ కూ ఉన్న సంబంధాన్ని లోకానికి తెలియ పరచాలి. ఆనంద్ లాంటి భర్తను సంపాదించిన తన అదృష్టం చూసి లోకం అంతా ఆశ్చర్య పోతుంటే తను ఆనందించాలి.
ప్రపంచానికి తెలియని ,లోకం గుర్తించని సంతోషం, ఆనందం తనకు ఎంత ఉంటె మాత్రం ఏం లాభం? అందరికీ తెలిస్తే ఏం? ఆనంద్ ఎందుకు భయపడడం? ధైర్యం లేక పొతే సరి. ఏమైనా సరే -- వెళ్ళగానే ఆనంద్ ను ఈ విషయం లో ఒప్పించాలి. ఈ దొంగ బతుకు తను ఇంక ఒక్క క్షణం కూడా భరించలేదు. తనకు స్వేచ్చ కావాలి. సంపూర్ణ స్వేచ్చ కావాలి. లోకం అంతా ఈర్ష్యా పడేంత స్వేచ్చా సౌఖ్యాలుండాలి తనకు. అప్పుడే తనకు ఆనందం, అప్పుడే తను పొందుతున్న అమరానుభూతులకు సార్ధకత. అప్పుడే తనకు నిజమైన సంతృప్తి. అంతవరకూ తనకు శాంతి లేదు. అంతవరకూ తనకు విశ్రాంతి లేదు.
మర్నాడే ఆనంద్ కు చెప్పి ఒప్పించి తమ వివాహాన్ని లోకానికి చాటాలి! మిత్రులకూ, స్నేహితులకూ, అందరికీ ఒక పెద్ద వివాహపు విందు ఏర్పాటు చెయ్యాలి. విందుకు వచ్చిన అతిదులందరూ తననూ ఆనంద్ నూ, అభినందిస్తుంటే గర్వంతో తను ఆనంద్ కేసి చూడాలి.
ఆ క్షణం తనకు కావాలి. తక్షణం అది రావాలి. ఇలా అనుకుంటూ జ్యోతి కాకినాడ చేరింది.
19
రోజులు గడుస్తున్న కొద్ది జానకి, తిలక్ ల మధ్య అనుబంధం దృడం కాజొచ్చింది. తిలక్ కు జానకి ని కలుసుకొనే అవకాశాలు తక్కువయినా, ఆనంద్ మాత్రం ఏదో రకంగా వాళ్ళిద్దరూ ఒకచోట సమావేశం కావడానికి తగిన అవకాశాన్ని కల్పిస్తూనే ఉండేవాడు. ఒక్కొక్క రోజున తిలక్ ను తమ ఇంటికి టీకి ఆహ్వానించే వాడు. ఒక్కొక్క మాటు తిలక్ గదికి జానకిని తీసుకుని వెళ్ళేవాడు.
తన వివాహ రహస్యాన్ని తిలక్ ఎవ్వరికీ చెప్పకుండా, ఆఖరికి జానకి చెవినైనా వెయ్య్యకుండా కాపాడుకొని వస్తున్నందుకు తిలక్ మీద ఆనంద్ కు గౌరవం, కృతజ్ఞత ఎక్కువయినాయి. రహస్యాన్ని కాపాడి తనకు అతను చేసిన మేలుకు అతణ్ణి , జానకి నీ సన్నిహితులు చేసి వాళ్ళిద్దరి కీ వివాహం అయేటట్లు చేస్తే, ప్రత్యుపకారం చేసినట్లు అవుతుందని అనుకున్నాడు.

కూతురు వారానికి మూడు నాలుగు సార్లు, ఇల్లు వదిలి వెళ్ళి , రెండేసి మూడేసి గంటలు గడిపి రావడం విశాలాక్షి కి ఇష్టం లేదు. కాని ఒక్కత్తే వెళ్ళడం లేదు; ఆనంద్ కూడా ఉంటున్నాడు కదా అని ఒక తృప్తి. క్రమక్రమంగా ఆమె గ్రహించిన దేమిటంటే -- తన కాలానికీ, ఈ కాలానికీ ఎంతో మార్పు వచ్చిందనీ, ఈ మార్పు ఇష్టం లేకపోతె చూసీ చూడనట్లు ఊరుకోవాలే కాని, సరిదిద్దాలని ప్రయత్నం చెయ్యడం వృధా ప్రయాస అనీను. అందుకే ఇంట్లో జరుగుతున్న మార్పులన్నీ చూస్తూ ఊరు కుంటున్నదే కానీ, మునుపటి లాగ ఏమీ పట్టించు కోవడం లేదు.
ఆనంద్ కు కాకినాడ బదిలీ అయినప్పటి నుంచి అతనిలో కూడా మార్పు కనిపించసాగింది విశాలాక్షి కి. పొద్దుటే బట్టలు వేసుకొని డ్యూటీ కంటూ బయలు దేరుతాడు. మధ్యాహ్నం ఒక్కొక్కప్పుడు భోజనానికి వస్తాడు. ఒక్కొక్కప్పుడు రాడు. ఏ సాయంత్రం సమయం లోనో కొంచెం టీ తాగడానికి మాత్రం ఇంటికి వస్తాడు. అంతే. తిరిగి ఇంటికి చేరుకొనేటప్పటికి అర్ధరాత్రి దాటుతుంది. ఒక్కొక్కప్పుడు అదీ లేదు. ఒక్కోసారి రెండేసి రోజులకు కాని ఇంటి మొహం చూడడు. "ఏమిరా" అంటే, "కాంప్స్" అంటాడు. ఇలా ఓమారు జరిగితే జానకిని పోలీసు స్టేషన్ కు పంపించి వాకబు చేసింది ఊళ్ళోనే ఉన్నాడట. ఇంకోసారి జ్యోతి ఇంటిలో ఉండి పోయాడట! అదైనా జానకి యధాలాపంగా అటు వెళ్ళడం వల్ల తెలిసింది.
ఇంటికి వచ్చాక "ఏమిటిది?' అని అడిగితె, తాడిఎత్తున ఎగిరాడు. ఆరోజున ఇంట్లో అంతా చిరచిరలూ, విసుగూ, కేకలూను. ఇంట్లో ఏ సంగతీ పట్టించు కోడు. జీతంలో కూడా డెబ్బై , ఎనభై రూపాయలు సొంత ఖర్చుకు కావాలంటూ వాడుకుని మిగిలిందే ఇస్తున్నాడు. చూడగా చూడగా , ఆనంద్ కంటే ముకుందమే నయమనిపిస్తున్నది విశాలాక్షి కి. ఏమీ తిరిగినా తన కవిత్వమూ, సమావేశాలూ, డబ్బు ఖర్చు పెట్టుకోవడం పిచ్చే కాని, ముకుందానికి ఆనందం అంత స్నేహాలు, టీ పార్టీల గొడవ లేదు. సొంత ఖర్చుకు పది రూపాయలిస్తే చాలు, పరమానందం అయిపోతుంది ముకుందానికి. ఇంక ఆరోజున ఇంట్లోకి ఏమి తేవాలో, ఏమి చెయ్యాలో -- ఇవన్నీ కనుక్కుంటాడు. జానకీ చదువు సంధ్యల గురించి పరామర్శిస్తాడు. ముకుందం భోళా మనిషి , కోపం వచ్చి ఏమైనా నాలుగు అన్నా పడతాడు.
ఆనందం వ్యవహారం అలా కాదు. తన ఇష్టం వచ్చినట్లు తను అన్నా, ఎవరూ నోరు ఎత్తకుండా పడి వుండాలి. ఇలా ఆలోచిస్తే, విశాలాక్షి కి ఆనందం ప్రవర్తన మీద అనుమానం వెయ్యసాగింది. జ్యోతితో ఏదో గ్రంధం సాగిస్తున్నట్లుగా అనుమానించింది. ఆ విషయంలో జానకిని కదిపి చూసింది. "వివరంగా నాకేమీ తెలియదు కాని, జ్యోతి, చిన్న మామయ్య చాలా చనువుగా ఉంటారు. జ్యోతి ఒక్క క్షణం మామయ్యా ని వదిలి ఉండలేదు. ఎంతమంది ఎడురుగానైనా సరే వాళ్ళు ఎంతో స్వేచ్చగా వ్యవహరిస్తారు. చూసేవాళ్ళకి భార్య భర్తలేమో అన్నంత అనుమానం కలుగుతుంది." అంది జానకి.
