ఆ కోపానికి రాజారావు బెదరలేదు.
"నేను ఎవడినా? నీ కాబోయే మొగుడ్ని నోరుమూసుకుని పడివుండు, పెళ్ళాడడం,మానడం,వెళ్ళడం అంతా నీ యిష్టమే ననుకుంటున్నావా, అడుగు కదిపావంటే కాళ్ళిరగకొడ్తాను. చచ్చినట్లు వుండు, నిన్నే కిషోర్ ఆదుకుంటాడో చూస్తాను" అంటూ వాణిని రెక్క పట్టుకుని చర చర లాక్కెళ్ళి మంచంమీద పడేసి, "కింద వాళ్ళుండి బతికి పోయావు యీ గదిలోనే పడివుండు, నీ పని తరువాత పడుతా- అరిచినా చచ్చినా నిన్నెవరూ ఆదుకోరు ఇక్కడ" అంటూ గదిలోంచి బయటికి వచ్చి తలుపు గడియ పెట్టేశాడు-గలాభా విని వరండాలో నించుని ఆశ్చర్యంగా చూస్తున్న సీతమ్మ, ముత్యాలుతో "యీ తలుపు ఎవరూ తీయడానికి వీలులేదు- నేను చెప్పేవరకు యీ గది దరిదాపులకి ఎవరూ రాకూడదు -ఊ- వెళ్ళండి- ఏం చేస్తున్నారు- పొండి" కసిరాడు.
ఒక్క ఐదు నిమిషాలలో జరిగిన యీ సంఘటనలో రాజారావు అహం బాగా దెబ్బతింది- కింద వాళ్ళుండబట్టి అంతటితో ఆగాడు కాని లేకపోతే ఏం జరిగేదో- వాళ్ళు వెళ్ళనీ దీని పొగరు అణుస్తా- దిక్కులేనిదానికి ఎంత తలపొగరు" కసిగా అనుకొని పళ్ళు కొరికి తల పంకించి ఓ తాళం కప్ప తీసుకొచ్చి నొక్కి కిందకి వెళ్ళాడు.
"సారీ ఫ్రెండ్స్, ఆవిడగారు తెగ సిగ్గు పడ్తూంది. ఇప్పుడు కాదు మరోసారి పాడుతుంది లెండి" అని సర్దిచెప్పాడు.
సీతమ్మ ద్వారా సంగతి విని అనసూయమ్మ ఆందోళనగా "అయ్యయ్యో" అంటూ గోలపెట్టింది. నిస్సహాయంగా ఆందోళన పడడం మినహా ఏం చెయ్యలేకపోయింది.
కొడుకుని తిట్టుకుంటూ, వాణిమీద జాలిపడుతూ, తనేం చెయ్యాలో తెలియక మధనపడింది ఆమె.
తాను గదిలో బందీ నయ్యానన్న సంగతి రెండు నిమిషాలకి కాని అర్ధం కాలేదు వాణికి, రాజారావు యింతకి తెగిస్తాడని ఆమె ఊహించలేదు. ఇప్పుడేం చెయ్యడం?
వాణికి దిగులుతో, భయంతో ఏడుపు వచ్చింది. ఏడుపు గొంతుతో "సీతమ్మా, తలుపు తీయి సీతమ్మా" అంటూ దీనంగా పిలిచింది తలుపు కొడ్తూ.
వాణి పిలుపులు అనసూయమ్మ విని సీతమ్మను ధైర్యం చెప్పమని అక్కడకు పంపింది.
"అమ్మగారూ-అయ్యగారు తాళం వేశారు- పెద్దమ్మ గారు తరువాత వాళ్ళంతా వెళ్ళాక అయ్యగారిని పిలిచి మందలిస్తామని చెప్పమన్నారు, మీరేం భయపడకండి. ఏం ఫరవాలేదు" అంది సీతమ్మ వాణికి ధైర్యం చెపుతూ.
వాణి చేసేదేంలేక నిస్సహాయంగా సోఫాలో వాలిపోయింది.
* * *
అర్దరాత్రివరకు డిన్నరు, పేకాట, తాగుడు పూర్తయి పన్నెండు దాటాక అందరూ పక్కలు చేరారు. అందరికి గుడ్ నైట్ చెప్పి, పన్నెండు దాటాక తూలుకుంటూ మేడ ఎక్కాడు రాజారావు. వాణి గదిముందునుంచి వెడుతుండగా తాళం చూశాకగాని వాణి సంగతి గుర్తుకు రాలేదు అతనికి. ముందు కాసేపు వాణిని మనసులో తిట్టుకుంటూ, గది తాళం తీశాడు.
సాయంత్రంనించి వంటరిగా బందీ అయి ఆలోచనలతో దిక్కుతోచక, రాత్రి ఆకలితో శారీరకంగా, మానసికంగా అలసిపోయి అప్పుడే కళ్ళు మూసింది వాణి.
నిద్రలో కూడా కలతపడిన ఛాయలు కన్పిస్తున్నాయి ఆమె మొహంమీద. బాగా జరిగింది కసిగా అనుకున్నాడు రాజారావు. అలా చూస్తూంటే ఏదో పైశాచిక ఆలోచన మెదిలింది అతనిలో.
ఇదే మంచి అవకాశం- తన పగా చల్లారుతూంది. వాణి రోగమూ కుదురుతుంది; కసిగా నవ్వుకున్నాడు రాజారావు వాణివైపు అడుగులువేస్తూ.
మంచి నిద్రలోవున్న వాణి ఘాటు అయిన విస్కీ వాసన, సిగరెట్ వాసన ఒక్కసారి మొహంమీదకి కొట్టి నట్లయి ఉక్కిరి బిక్కిరి అయి కళ్ళు తెరిచింది.
తన బుజాలను రెండుబలమైన చేతులు అదిమిపెట్టి మొహంలో మొహం పెట్టిన బరువుకి తనెక్కడ వుందో, ఏం జరుగుతుందో కూడా అర్ధంకాక అయోమయంగా చూస్తూ ఆ బలమైన చేతులమధ్య ఊపిరి అందనట్టు ఉక్కిరి బిక్కిరి అయి పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది.
లైట్ వెలుగులో తన మంచంమీద తనమీదకి వంగి తనని అదిమిపెడుతున్న రాజారావుని చూసి చకితురాలై "కెవ్వు" మంది. గాభరాపడి ఒక్క ఉదుటున లేచి కూర్చుని అతన్నించి విడిపించు కుంటూ "మీరు....మీరు....ఏమిటిది వదలండి....ఛీ....వదలండి ముందు" సగం ఏడుపు, సగం ఏహ్యత కల్సిన గొంతుతో అంటూ గింజుకుంది.
రాజారావు వికటంగా నవ్వి- వాణిని లేవకుండా బలవంతాన అదిమిపెట్టి పెదాలందుకోబోయాడు.
అతని ఎర్రబడ్డ కళ్ళు- తూలీపోతున్న అతని నడక, ఆ మాట చూసి తనెలాంటి ప్రమాదంలో పడిందో వాణికి అర్ధమయి గుండాగి పోయింది, తలుపువంక చూసింది-తలుపు గడియపెట్టి వుంది.
అతనెంత నీచానికి దిగజారాడో గ్రహించగానే వాణి వళ్ళు ఉడికిపోయింది. ఆవేశంతో శరీరం కంపించింది. అతని పట్ల ఏహ్యత, జుగుప్స మరింత పెరిగాయి.
వాణి విసురుగా రాజారావుని ఒక్క తోపు తోసి యిటు అటు చూసి మూల టేబిల్ మీద వున్న యిత్తడి పూలకుండి కనపడగానే అది చేతిలోకి తీసుకుని భద్రకాళిలా "మిస్టర్ రాజారావు ఆడదంటే అబల అనుకోకు. ఇష్టంలేని చోట రాక్షసి అవుతుంది. జాగ్రత్త! మర్యాదగా పైకి వెళ్ళు" తర్జని చూపించుతూ బెదిరించింది.
