వాణి చేతిలో ఇత్తడి పూలకుండి చూసి కాస్త బెదిరాడు. కాని అంతలోనే 'ఏడ్చింది, ఊరికే బెదిరిస్తూంది కాని కొడ్తుందా, అంత ధైర్యం ఎక్కడుంది?' అనుకుంటూ ఒక్క అడుగు ముందుకు వేశాడు.
అతను గుమ్మంవైపునించి తనవైపు పూర్తిగా రానిచ్చి వాణి ఒక్క ఉదుటున గుమ్మంవైపు వురికింది. వాణి గడియ తీసేలోపల రాజారావు అది గుర్తించి ముందు కురికి వాణి చెయ్యి పట్టుకున్నాడు. వాణికి మరో దారి కనబడలేదు. కసిగా కటుక్కున రాజారావు ముంచెయ్యి కొరికింది. రాజారావు "అబ్బా" అనుకుంటూ పట్టు వదలగానే వాణి ఒక్క విసురులో పూలకుండీ విసిరి తలుపుతీసి బయటికి ఉరికింది.
రాజారావు తలుపు దగ్గరకి వచ్చేలోగానే బయటి నించి గొళ్ళెం పెట్టేయగల్గింది. ఒక్కక్షణం అదురుతున్న గుండెలని రెండు చేతులతో అదిమి పట్టుకుని మరి వెనక ముందు ఆలోచించకుండా మెట్లవైపు పరిగెత్తింది.
లోపలనించి రాజారావు తలుపులు దబదబ బాదడం, రంకెలు వేయడం వినిపిస్తూనే వుంది. అతను ఏ క్షణంలో వెనకనించి పరుగెత్తి వస్తాడోనన్నట్టు వాణి పరిగెత్తి మెట్లుదిగి వీధి తలుపు వేసి వీధిలో పడింది- యిప్పుడుగాని రాజారావు చేతిలో చిక్కిందా యింక తను బయటపడడం కల్ల-పరిగెడ్తూనే వాణి ఆలోచిస్తూంది- అర్దరాత్రి- చీకటి వంటరితనం-కొత్త చోటు- యివేమీ రాజారావు కంటే భయం అన్పించలేదు ఆమెకి-అసలు ఎక్కడికి వెడ్తుందో ఆ అర్దరాత్రి వంటరిగా చీకట్లో ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో ఓ ఆలోచన లేకుండా, వెనక్కి తిరిగికూడా చూడకుండా కాలికొద్ది పరిగెత్తింది. ఎంత దూరం వెళ్ళిందో, అలుపు, ఎగఊపిరి రాగానే వెనకాతల ఎవరూ రావడంలేదని రూఢి అయ్యాక అప్పుడు ఎదురుగా కనబడిన ఓ పెద్ద బండరాయిమీద కూర్చుంది- అలుపు తగ్గాక చుట్టూ చూసేసరికి అప్పటికి భయం తెల్సింది- వెన్నెల రాత్రులు కావడంవల్ల చీకటిగా లేదుగాని, అంతరాత్రి, నిర్జనమైన ప్రదేశంలో నడిరోడ్డుమీద తను ఒక్కర్తే! ఆమాట తల్చుకోగానే వాణి గుండె ఝల్లుమంది. ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళేటట్టు?
ఎంత అనాలోచితంగా అర్దరాత్రి యిలా వంటరిగా యిల్లు వదిలింది-రాజారావునించి తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప మరోటి తోచలేదు.
యిలా వచ్చేయడమే మంచిదేమో-లేకపోతే అక్కడ నించి ఎప్పటికీ తప్పించుకోలేకపోయేదేమో-సరే జరిగిందేదో జరిగింది యిప్పుడెక్కడికి వెళ్ళాలి-కిషోర్ తప్ప యీ ప్రాంతాల్లో తనకి తెల్సినవాళ్ళెవరున్నారు! కిషోర్ గుర్తు రాగానే ఆమె గుండెలమీద నించి పెద్ద బరువు దించినట్లయింది కిషోర్ -కిషోర్ ఒక్కడే తనని యీ ఆపదనించి గట్టెక్కించగలడు! అక్కడికెళ్ళాలి, అంతకుమించి దారిలేదు- వాణి ఆలోచనలు ఓ రూపు చేరాయి-అప్పటికి ఎంత దూరం వచ్చిందో తెలియదు-యింకెంత దూరం వెళ్ళాలో? యీ చీకట్లో యిలా వంటరిగా తనని ఎవరన్నా చూస్తే-మనుషుల మాట ఎలా వున్నా పాము, పుట్ట అయినా తప్పేదేం వుంది- గుండె దిటవు పరుచుకుని వాణి లేచి నిలబడింది-భయంతో, ఆందోళనతో, అలసటతో చలిక్కూడా ఆమె వళ్ళంతా చెమట పట్టింది. మరింత ఆలోచించకుండా గబగబా నడుస్తూ కాసేపు-కాసేపు పరిగెడ్తూ-మరి కాసేపు ఆగి నడుస్తూ.....మరో గంట నడిచింది వాణి-నడుస్తున్నంత సేపూ తనని చూసి కిషోర్ ఏం అంటాడో! తనిలా రాజరావు నించి తప్పించుకు వచ్చేసిందంటే సంతోషిస్తాడా? రేణు ఏం అంటుందో! రాజారావుని పెళ్ళాడడం లేదంటే సంతోషిస్తుంది- పీడ వదిలింది హాయిగా మా వదిన అయిపో అంటుందేమో! ఆ ఊహకి అంత ఆదుర్దాలోనూ వాణి సిగ్గుపడింది-కిషోర్ ఏమంటాడో! నిజంగా అలా జరిగితే....ఎంత బాగుంటుంది! సహృదయులు, సంస్కారులు మధ్య అన్యోన్యానురాగంతో.....అంతకంటే ఏం కావాలి! వెధవ డబ్బు ఎందుకు? హాయిగా ఆనందంగా మనశ్శాంతితో బతకగలదు! రాజారావుని పెళ్ళాడాలనుకున్న తన నిర్ణయం తారు మారవడానికి భగవంతుడే తనచేత యీ ప్రయాణం పెట్టించాడేమో! కిషోర్ లాంటి సహృదయుడ్ని చేపట్టే అదృష్టం కల్గించడానికే యిదంతా జరుగుతుందేమో! తన ఆలోచనలకి తనే సిగ్గుపడింది, వాణి.
ఆలోచనల మధ్య ఎంతదూరం నడిచిందో గుర్తించలేదు-ఊరు వచ్చిన గుర్తుగా ఒక యిల్లు కనపడడం మొదలు పెట్టింది. వీధుల్లో దీపాలు కనిపించగానే వాణి ప్రాణాలు కుదుటపడ్డాయి- ఫరవాలేదు. ఏ అపాయంలో పడకుండా చేరగల్గింది- తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది వాణి.
* * * *
అర్ధరాత్రి మంచి నిద్రలోవున్న కిషోర్ ఉలిక్కిపడి లేచాడు తలుపు చప్పుడు విని కుప్ప నూర్పిడి అయి ధాన్యం యింటికి చేరింది కనక రెండు రోజులనించి కిషోర్ యింట్లోనే పడుకుంటున్నాడు....యీ అర్దరాత్రి... ఎవరు వచ్చారు చెప్మా-తలుపు మరోసారి చప్పుడవగానే కిషోర్ చటుక్కున లేచి తలుపు తీశాడు- బెడ్ లైటు వెలుగులో గుమ్మం దగ్గిర నిలబడిన స్త్రీమూర్తిని పోల్చుకోలేక ఆశ్చర్యంగా చూస్తూ "ఎవరూ?" అన్నాడు.
వాణి రాజారావు వెనకనించి తరుముకొస్తున్నట్లుగా ఒక్క ఉదుటున గదిలోకి వచ్చింది-కిషోర్ ఆశ్చర్యచకితుడయ్యాడు.
"వాణీ! మీరు....మీరా?" అన్నాడు. అప్రయత్నంగానే అలమారులో గడియారంవంక చూశాడు.
రెండుగంటలయింది.
ఈ అర్దరాత్రి వంటరిగా.... వాణి....ఆశ్చర్యంనించి కోలుకోలేక అపనమ్మకంగా వాణిని చూసి... "మీరు.... మీరు ఏమిటిది?" అన్నాడు తెల్లపోతూ.


