ఒక అరగంట తర్వాత ముత్యాలు వచ్చి 'అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారండమ్మా' అంది. మళ్ళీ ఎందుకు చెప్మా అనుకుంటూనే కిందకి వెళ్ళింది వాణి.
"వీళ్ళందరూ నీ పాట వింటామంటున్నారు. నీవు బాగా పాడ్తావని చెప్పాను- ఏది పాడి వినిపించు" అన్నాడు రాజారావు ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో.
ఏది ఏమాత్రం పాడతావో పాడు చూద్దాం అన్నట్టు చూస్తున్నారు అందరూ సగం కుతూహలం, సగం హేళన మిళాయించి-పాట- వీళ్ళకి తన పాట కావాలా? వీళ్ళందరి ముందు తను పాడాలా-వీళ్ళని చూస్తేనే అసహ్యం అనిపించే యీ మనుష్యుల ముందు తనేం పాడగలదు- వాణికి ఎంత మాత్రం పాడాలనిపించ లేదు.
"క్షమించండి- యిప్పుడు పాడలేను- గొంతు బాగులేదు" అంటూ వెనుదిరిగి రాజారావు మాటకి ఎదురుచూడకుండానే గదిలోంచి వెళ్ళిపోయింది.
మిత్రుల ముందు వాణి నిర్లక్ష్య వైఖరి రాజారావుకి తల కొట్టేసి నట్లనిపించింది.
"వుండండి-వస్తాను-ఎందుకు పాడదు-పిలుచుకువస్తా" లేచి చరచర మేడమీదకి వెళ్ళాడు-విసవిస వచ్చిన రాజారావుని చూసి వాణి బెదిరింది మనసులో-అయినా నిబ్బరం నటిస్తూ అతని వంక చూసింది.
"వాళ్ళంతా నీ పాట వింటారని పాడమంటే పాడకుండా వచ్చేస్తావా? నీ కెంత నిర్లక్ష్యం నా మాట అంటే" తీక్షణంగా చూస్తూ అన్నాడు.
"క్షమించండి-నేను పాడలేను వాళ్ళ ముందు- "వాణి తల వంచుకుని అంది.
"ఏం- ఆరోజు మహా చక్కగా గానాబజానా సాగించావే మహా హుషారుగా, ఇవాళ ఏం వచ్చింది?" కటువుగా అన్నాడు.
"ఊర్లో మర్యాదస్థుల యిళ్ళ ఆడవాళ్ళముందు పాడితేనే యిది సానికొంపా అని అడిగారు, యివాళ్ళ వీళ్ళమధ్య ఎలా పాడమని అడుగుతున్నారు?" సూటిగా చూసింది వాణి.
"అంటే....వీళ్ళు మర్యాదస్థులు కారనా నీ ఉద్దేశం" కోపంతో రాజారావు గొంతు వణికింది.
"అది నేను చెప్పక్కర లేదు- ఆడదాన్ని గౌరవించాలని. స్నేహితుని కాబోయే భార్య అనికూడా చూడకుండా హేళనగా చిన్న చూపు చూసేవారిని, డబ్బుతోనే లోకం వుందని అదిలేని వారిని గౌరవించక్కరలేదని అనుకునే వారిని సంస్కారులుగా మర్యాదస్థులుగా భావించలేను నేను అలాంటివారి ముందు వళ్ళుమరచి తాగి పేకాడేవారిముందు పాడి సంగీతాన్ని మలినపరచుకోలేను-నేను పూజ్యభావంతో ఓ తపస్సులా సాధనగా వరంగా భావించే నా సంగీతాన్ని యిలాంటి అసభ్య వాతావరణం మధ్య మలినపరచను" వాణి ఖచ్చితంగా అంది.
ఆమె నిర్లక్ష్యానికి, తమందరిని తాగుబోతులు, కుసంస్కారులు అని తెగేసి చెప్పేసిన వాణి ధైర్యానికి అతని మొహంలో కోపం బుస్సున పొంగింది.
వాణి మీద మీదకి వస్తూ-"నీకెంత పొగరు-ఏం చూసుకుని నీ మిడిసి పాటు-యింత గర్వమా- కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించడం నాదే పొరపాటు అప్పుడే నీ కళ్ళకింత పొరలు కమ్మాయా-నన్నే ఎదిరిస్తున్నావా- యీ జమీందారి తిండి నాల్గురోజులు వంట బట్టేసరికే నీకింత కండకావరం బలిసిందా- నేను తల్చుకుంటే నీ గతి మళ్ళీ యధాస్థితికి వస్తుందని తెలుసుకో- నిన్ను యీ క్షణంలో మెడబట్టి గెంటగలను" రాజారావు చాలా దూకుడుగా, గర్వంగా వాణిని బెదరగొట్టాలని అన్నాడు.
వాణి అదోలా నవ్వింది- "మీరు ఆ పనిచేస్తే నాకంటే సంతోషించేవారు ఎవరూ వుండరు - నా అదృష్టం కొద్ది యింకా మీకు భార్యని అవనందుకు సంతోషిస్తున్నాను నాకు శలవిప్పిస్తే యీ క్షణంలో వెళ్ళడానికి సిద్దంగా వున్నాను-మీ హోదాకి అంతస్థుకి సరిపోయే ఆమెని తెచ్చుకోండి, నేను వెళ్ళుతున్నాను" వాణి ప్రశాంతంగా చెప్పదలచింది చెప్పేసి రాజారావుకి నమస్కారం చేసి గదిలోంచి వెళ్ళిపోయింది.
వాణి మాటలు అర్ధమయ్యేసరికి ఒక నిమిషం పట్టింది రాజారావుకి.
"ఆగు" చర చర గుమ్మం దగ్గిరకి వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టి- "నీకెంత ధైర్యం-ఎంత పొగరు- నన్ను కాదని వెళ్ళగలననే అనుకుంటున్నావా-ఇదంతా నీకెవరు నేర్పారో నాకు తెలుసు- ఎవరి అండ చూసుకుని యింతకి తెగించావో నాకు తెలుసు- వాడ్ని - ఆ కిషోర్ ని నామరూపాలు మిగలకుండా చేస్తాను. వెళ్ళడం మానడం అంతా నీ యిష్టమేననుకుంటున్నావా- ఇక్కడినించి అడుగు కదిపావంటే జాగ్రత్త" పళ్ళు కొరుకుతూ తీవ్రంగా అన్నాడు.
"మీరెందుకు అనవసరంగా ఆ కిషోర్ ని ఆడిపోసుకుంటారు? అతను చెప్పకపోతే నాకు చూసే కళ్ళు- ఆలోచించే మనసూ లేదనా మీ ఉద్దేశం-ఇక్కడికి వచ్చి మీ గురించి విని, స్వయంగా చూశాక కూడా మీలాంటి దురహంకారిని, వ్యసనపరుడ్ని, స్త్రీ లోలుడ్ని ఎంత గతిలేని ఆడదికూడా అంగీకరిస్తుందను కుంటున్న్జారా- అందుకే ఆ పద్మావతిగారు వెళ్ళిపోయిందన్న సంగతి నాకు తెలియదనుకున్నారా?"
ఆమె నోట తన గురించిన నిజాలు విని భరించలేక పోయాడు రాజారావు-అతని అహం దెబ్బతింది-కోపం పట్టలేక "ఏమిటి కూశావు-నీకెంత ధైర్యం-గతిలేని దానివి నీ కెంత పొగరు" అంటూ వాణి చెంప చెళ్ళుమనిపించాడు.
ఆ దెబ్బకి వాణి దిమ్మెరపోయింది - అతను కొడ్తాడని ఎదురు చూడని వాణి ఆ దెబ్బకి అదిరిపోయింది- పెళ్ళన్నా కాలేదు - తనమీద చెయ్యిచేసుకుంటాడా? ఆవేశంలో పెదాలదురుతూండగా "కొట్టారా? మిస్టర్ రాజారావు నన్ను ఎవరనుకొని కొట్టారు! మీ కెవరిచ్చారీ అధికారం నేనింకా మీ భార్యని కాలేదన్న సంగతి మరిచిపోయారా, నా వంటిమీద చెయ్యి ఏ అధికారంతో వేశారు?" దెబ్బ తిన్న ఆమె ఆత్మాభిమానం తిరగబడగా, పౌరుషంగా అంది.
