వరండాలో టక్కున లైటు వెలిగింది. చీకటి చీల్చుకు వచ్చిన వెలుగు ఒక్కసారి భరించలేక "లైటార్పేయ్ సౌమ్యా!" అన్నాడు.
"చూడండి, ఎవరొచ్చారో మీ కోసం?" అంది.
కళ్లు తెరిచాడు. జిగేల్ మన్నాయి. ఎదురుగా 'ఊహ' నవ్వుతూ. ఇంకా అందంగా, యింకా చనువుగా "ఏమిటి చీకట్లో తపస్సు? ఇంకా ఎవరికోసం?" అంది.
"నే కాఫీ తెస్తా. మాట్లాడుతుండండి." సౌమ్య నెమ్మదిగా అని వెళ్లింది.
చనువుగా పక్కనున్న కుర్చీ లాగి కూర్చుంది. "ఏమిటి ఎలా వున్నావు? అబ్బ! ఎన్నాళ్లయిందో నిన్ను చూసి? సంవత్సరం అయిపోయింది గదా! చెప్పు సంగతులేమిటి? ఏం చేస్తున్నావు? ఎలా వున్నావు? కింద మీ అమ్మగారు కనిపించారు."
'అమ్మకి బుద్ధి లేదు. తిన్నగా పైకి పంపించడం ఏమిటి?' అనుకున్నాడు గౌతమ్.
"ఆవిడ చెప్పారు నీకు పెళ్లయిందని. మీ ఆవిడని చూపించారు."
ఏం మాట్లాడాలో తెలియదు. మౌనం. ఎంత హాయిగా, నవ్వుతూ, ఏం జరగనట్టు, రోజూ కలిసే 'ఊహ'లా మాట్లాడేస్తోంది.
"ఏమిటి మాట్లాడవు? కోపమా? ఇంకా నామీద కోపం తగ్గలేదా?"
"నీమీద కోపం ఎందుకు? కోపం వచ్చిందని ఎందుకనుకున్నావు?" మనసులో ఏదో చిన్న కసి. తనను లెక్కచెయ్యనిది, నిర్దాక్షిణ్యంగా చెప్పా చెయ్యకుండా వదిలి వెళ్లి, యిప్పుడేం జరగనట్టు ఈ నంగనాచితనం ఏమిటి? తననో వెధవని చేసి ఆడించాలని వచ్చిందా? తనెంత గొప్పగా, సంతోషంగా వున్నానో చూపించి కుళ్లించి, ఏడ్పించాలనుకుంటోందా? ఆ జాణతనం చూశాక ఆమెతో మాట్లాడకూడదనుకున్నా "ఎందుకు కోపం?" అన్నాడు.
"అలా... నేను నిన్ను పెళ్లిచేసుకోనందుకు?" ఆమె గొంతులో కాస్త అనుమానం, రవంత నిరాశ.
"నీ యిష్టం వచ్చినవాళ్లని చేసుకుంటే నాకెందుకు కోపం?" నిర్లక్ష్యంగా అన్నాడు గౌతమ్.
ఊహించని ఆ జవాబుతో ఆమె మొహం కాస్తంత రంగు మారింది. తరువాత ఏదో ఓదారుస్తున్నట్టు "గౌతమ్! అంతా ఏమిటో నాకే తెలియనంత వేగంగా జరిగిపోయింది. అమ్మావాళ్లు ఆ అబ్బాయిని పెళ్లి చూపులకి పిలిచినట్టు తెలియనే తెలియదు. అబ్బాయికి నచ్చడం, పెద్దవాళ్లు నచ్చచెప్పి వప్పించడం, ఏమీ ఆలోచించి, చెప్పే అవకాశం నాకివ్వలేదు. అక్కడికీ అమ్మతో అన్నా 'గౌతమ్ కి ఏమని చెప్పాలి?' అని. 'చెప్పడానికి ఏముంది? అవన్నీ స్నేహాలు, పెళ్లంటే ఎన్ని చూసుకోవాలి? అమెరికా, డాలర్ల జీతం, అక్కడి సుఖాలు, అక్కడి స్టేటస్... యివన్నీ చెప్పి..." ఊహ ఏవో సంజాయిషీలు ఇవ్వబోయింది.
"అన్నీ చెప్పి వప్పించారు కదా! అంటే అమ్మానాన్న మాటకి ఎదురుచెప్పలేక చేసుకునే రకం అమ్మాయివి పాపం! ఆ ఉద్యోగం, స్టేటస్, డాలర్లు, అమెరికా... అన్నీ ఒక త్రాసులో పెట్టి తూకం చూసుకునుంటావు..." గొంతులో ఎంత కసి చూపించాలో అంతా చూపించాడు.
"నీవు ఆడపిల్లవయితే తెలిసేది..."
"వద్దు, నీలాంటి ఆడపిల్లలా ఉండడం మాత్రం నాకు వద్దు. అంతా మంచే జరిగిందిలే." మళ్లీ కసి... ఇంకేమంటే ఇన్నాళ్లూ మనసులో గూడు కట్టుకున్న దుఃఖం, వేదన, కరిగి బయటికి వస్తాయోమో, అంతా వెళ్లగక్కి నీవంటే నాకేం లెక్కలేదు, నీవు లేక నేనేం చచ్చిపోలేదన్నది ఆమెకి అర్థం అయ్యేట్టు చెయ్యాలన్న తాపత్రయం. కాని మాటలు కలిసి రావడం లేదు. చెప్పాల్సినంత తీక్షణం లేదు.
"గౌతమ్, ప్లీజ్... నీకు తెలియదు, ఎంత బాధపడ్డానో, ఎలా చెప్పాలో తెలియక, చెప్పలేక..."
"అవును, ఒక ఫోను చేసి సంగతి యిది అని చెప్పే సంస్కారం కొరవడినదానికోసం ఏడ్చి నేనేం పిచ్చివాడిని, దేవదాసుని కాలేదులే."
"గౌతమ్, నీ బాధ అర్థం అయింది. ఈ ఏడాదిగా ఎన్నిసార్లు నిన్ను తలుచుకుంటూ..."
"ఆ కట్టుకున్న మొగుడికి ద్రోహం చెయ్యకు యిలాంటి మాటలు చెప్పి."
"అర్థం చేసుకో, నమ్మవు గాని నిజం..." ఏదో చెప్పబోయింది.
"అయితే వచ్చేయ్. ఇద్దరం విడాకులు యిచ్చేసి పెళ్లిచేసుకుందాం!" మాటల్లో వ్యంగ్యం. "ఏమిటి, అంత గాభరాపడుతున్నావు. ఆ మొహం అలా మాడిందేమిటి? అంత ప్రేమ వున్నదానివి రావచ్చుగా అన్నా అంతే..."
"ప్లీజ్, ఇలాంటి మాటలతో నన్ను బాధపెట్టకు. నిన్ను చూడాలని, ఇప్పుడెందుకు అని మావారు అన్నా వచ్చా" భుజం మీద చెయ్యి వేసి అంది.
"చెయ్యి తీయి ముందు. నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు" కటువుగా అని... "నీవల్ల, నీవు చేసిన యీ పనివల్ల సౌమ్యలాంటి అమ్మాయి నాకు దొరికింది. థ్యాంక్స్ టూ యూ. ఐ యామ్ హ్యాపీ, నీకోసం అలమటిస్తూ కుమిలిపోతుంటాననే అపోహ వుంటే తుడిచేయి."
"ఇలా మారిపోతావనుకోలేదు. నేనుండే యీ పదిహేను రోజులు నీతో సరదాగా గడపాలని... ఎంతో ఎదురుచూస్తూ వచ్చాను."
"హోదా కోసం, డాలర్ల కోసం ఒకడు, సరదాకోసం ఒకడా? ఇండియా కాలక్షేపంగాడిగా పనికొస్తాననుకుని... ఓ, థాంక్ యూ నీ అభిమానానికి... నన్నిలా వదిలేయ్. నీ భర్తకి ద్రోహం చేసే ఆలోచనలు నీకున్నాయేమో గాని, నా భార్యకి ద్రోహం చేసే ఆలోచన నాకు లేదు. చాలా చీకటి పడింది. కార్లు, డ్రైవర్లు వున్నా యింత ఆలస్యంగా వెళితే అమ్మా, నాన్న తిట్టరూ." కుర్చీలోంచి లేచాడు కోపంగా చూస్తూ.
"ఐ హేట్ యూ. రావడం నాదే తప్పు." ఎర్రబడ్డ మొహం తిప్పుకుంది.
"మంచిది, ఇప్పటికన్నా గ్రహించావు" అనగానే విసవిసా వెళ్లిపోయింది.
భోంచేస్తుండగా అమ్మ గౌతమ్ మొహంలో భావాలు వెతికింది. 'వళ్లు చేసింది కదూ ఊహ!" అంది.
"అమెరికా నీళ్లు, డాలర్లు... బరువు పెరిగిస్తాయి" నవ్వాడు.
సౌమ్య చిరునవ్వు నవ్వింది.
భోజనం అయ్యాక సౌమ్య వంటింట్లో అన్నీ సర్దడానికి వెళ్లగా చూసి "నేను మీ యిద్దరినీ వంటరిగా వదలమని సౌమ్యకి చెప్పి పైకి పంపించాను, ఇప్పటికన్నా భ్రమల పొరలు తొలగిపోతాయన్న ఆశతో" అంది.
తల ఆడించాడు గౌతమ్.
"సౌమ్య చాలా మంచి అమ్మాయి. ఇంకా ఆ అమ్మాయి సహనాన్ని పరీక్షించకు నాన్నా!" నెమ్మదిగా అంది అమ్మ.
సరే అని తల ఊపాడు.
మళ్లీ బాల్కనీలో కుర్చీ ఆశ్రయించాడు. లైట్లన్నీ ఆర్పుతూ "ఇంకా పడుకోవా గౌతమ్?" అంది సౌమ్య.
"ఆ, కాసేపుండి వస్తా, నీవు పడుకో."
ఓ అరగంటో, గంటో తరువాత గదిలోకి వెళ్లాడు. పక్కమీద అటు తిరిగి నిద్రపోతున్న సౌమ్య. తలగడలు సర్దుకుని పడుకుని, సౌమ్యకి దగ్గరగా జరిగి, ఆమె నడుం వంపులో చెయ్యి వేసి, పొదువుకుంటున్నట్టు దగ్గరకి జరిగి పడుకున్నాడు నిశ్చింతగా. చాలాసేపటికి ఆమె చెయ్యి అతని చేతిమీద వేసింది, చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోతున్న గౌతమ్ ని అర్థం చేసుకున్నట్టు.
* * * *
