"ఎన్ని రోజులయినా ఫరవాలేదు. అంతగా కావాలంటే ఈలోగా మరో ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు కదూ."
"అదే నేనూ అనుకొన్నాను. త్వరగా తయారవాలి మనం! తొమ్మిది గంటలకల్లా భోజనాలు చేసి బయటపడితే గాని టైం కి ఆఫీసు చేరుకోలేము" స్టౌ మీద కాఫీ డికాషన్ కిందకు దించుతూ అంది సరోజ.
"అటూ ఇటూ గదుల్లో ఎవరుంటున్నారూ?"
"ఒక గదిలో హాస్పిటల్ నర్స్ ఒకావిడ ఉంటోంది. ఇంకో గదిలో ఇంటి ఒనర్సే ఉంచుకున్నారు. అంటే వాళ్ళు మాకు దూరపు బంధువులే ."
"బాగుంది! సిటీలో ఇలాంటి గది దొరకటం చాలా కష్టం" అంది స్వరూప.
తరువాత ఇంటి పనిలో మునిగిపోయిందామే.
తోమ్మిదయేసరికల్లా ఇద్దరూ భోజనం ముగించి ఆఫీస్ కి బయల్దేరారు. బస్ స్టాప్ లో అరగంట నుంచుంటే గాని బస్ దొరకలేదు.
"ఈ బస్సులు కోసం ఎదుర్చుడటంలోనే బోలెడు టైము గడిచిపోతుంది...." అంది సరోజ.
ఆఫీస్ చేరుకొని సరోజ సీటుదగ్గరే కూర్చున్నారిద్దరూ.
సరిగ్గా టైముకి ఆఫీసరు రావడం చూసి సరోజ అతని దగ్గిరకు వెళ్ళి నుంచుంది.
"యస్ !" అన్నాడతను ప్రశ్నార్ధకంగా చూస్తూ.
"నిన్న మీకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి గురించి చెప్పానుగదండి. ఆ అమ్మాయి వచ్చిందిప్పుడు పిలవమంటారా?"
"ఓ యస్ ..... పిలవండి !"
మరుక్షణంలో స్వరూపను తీసుకొచ్చింది సరోజ.
గదిలోకొస్తూనే అతనికి నమస్కరించింది ఆమె.
"మీ సర్టిఫికెట్స్ చూపండి."
సర్టిఫికెట్స్ అన్నీ అతని ముందుంచి వివరించిందామె. అన్నీ చూసి "సరే ఒక అప్లికేషన్ రాసివ్వండి ....." అన్నాడతను. సరోజతో పాటు ఆమె టేబుల్ దగ్గిరకు నడిచి అక్కడే కూర్చుని ఒక అప్లికేషన్ రాసిందామే. టైపిస్టు దగ్గిర కెళ్ళి టైప్ చేయించి తీసుకొచ్చింది సరోజ. ఆ సాయంత్రాని కల్లా అపాయింట్ మెంట్ ఆర్డరిచ్చారామెకి.
మర్నాటి నుంచీ ఉద్యోగంలో చేరాలి.
ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది స్వరూప.
15
మర్నాడు ఆమెను తీసుకెళ్ళి సెక్షన్ ఇన్ చార్జి కీ పరిచయం చేసింది సరోజ.
"మిస్టర్ సృజన్ బాబూ" పిలిచాడాయన దూరంగా కూర్చుని ఫైలు చూస్తున్నతనిని వుద్దేశించి.
సృజన్ బాబు లేచి అయన దగ్గరగా వచ్చి నుంచున్నాడు.
"చూడండి షీ ఈజ్ స్వరూప. మన సెక్షన్ లో వేకన్సీలో అపాయింట్ అయింది. మీ సీటు దగ్గిరే కూర్చోబెట్టి కొంచెం ట్రయిన్ చేయండి ....."
సృజన్ బాబు ఆ పేరు వింటూనే త్రుళ్ళిపడ్డాడు. ఎదురుగా స్వరూప కనిపించేసరికి అతనికి మతిపోయింది. ఆమె ముఖంలోకి చూడాలంటేనే భయం వేస్తోంది.
"అలాగేనండి ......." అతికష్టం మీద అని ఆమె వంక చూసి "రండి" అన్నాడు తను ముందుకు నడుస్తూ.
అతన్ని అనుసరించింది స్వరూప.
"మధ్యాహ్నం లంచ్ టైము;లో నేనే వస్తాలే ......" అంటూ అక్కడి నుంచీ వెళ్ళిపోయింది సరోజ.
సీటు దగ్గరకు చేరుకొని " ఇలా కూర్చోండి " అన్నాడు ఓ కుర్చీ తన టేబుల్ కెదురుగా లాగుతూ.
బిడియంగా కూర్చుంది స్వరూప. ఆ సెక్షన్ లో మరో ఇద్దరమ్మాయిలు పనిచేస్తూ కనిపించారామెకి.
సృజన్ బాబు వంక చుసిందామే. అతను ఏదో ఫైలు తెరచి అందులోకి చూస్తున్నాడు.
అతన్ని ఎక్కడో చూసినట్లనిపించిందామెకి. ఎక్కడో మాత్రం గుర్తుకు రావడం లేదు. "అయినా కొంతమంది ముఖలాలాగే ఉంటాయ్" అనుకొందామె. అంతకు ముందెప్పుడూ చూడకపోయినా గానీ ; పరిచయమున్నట్లు అనిపించింది. సృజన్ బాబు గుండెలు వేగంగా కొట్టుకుంటున్నయ్. అయితే స్వరూపని సురేంద్ర వదిలేశాడా? ఆమె మీద ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? పెళ్ళి జరిగిం తర్వాత తను తిరిగి వచ్చేస్తుంటే "అన్ని వివరాలూ - తరువాత తెలియజేస్తాలే " అన్నాడు. చాలా రోజులు ఎంతో ఆత్రుతతో అతని దగ్గర నుంచీ ఉత్తరం కోసం ఎడుర్చూశాడు తను.
ఎలాంటి ఉత్తరమూ రాకపోయే సరికి తనే అతనికి ఉత్తరం రాశాడు. జరిగిందంతా వెంటనే తెలియజేయమనీ. తనకు పూర్తిగా మనశ్శాంతి కరువైందనీ......
దానికీ జవాబు రాలేదు.
ఆ తరువాత తనూ రాయలేకపోయాడు. అక్కడ సురేంద్ర యెలాంటి పరిస్థితి లో ఉన్నాడో - ఎంతటి క్షోభ అనుభవిస్తున్నాడో -- స్వరూపని ఏం చేశాడో -- అన్న ఆలోచనలు, వీటన్నీటికీ కారణం తనేననే భావం -- ఉత్తరం రాయలేకపోవడానికి తోడ్పడినాయ్.
ఇప్పుడు , తన మనసుని తోలిఛి వేస్తోన్న ప్రశ్నలన్నీటికి సమాధానం తనేదురుగా ఉంది. తను చేసిన దారుణానికి ఫలితం తన కెదురుగా కూర్చుంది. ఆమె ముఖంలోకి చూశాడు సృజన్ బాబు. ఆమె మొఖంలో అదివరకటి అందం లేదు. నిర్లిప్తత చోటు చేసుకొంది. ఆమె కళ్ళల్లో అదివరకటి మెరుపు లేదు. వైరాగ్యం తొంగి చూస్తోంది.
ఇంతకూ ఈమె తనని గుర్తించలేదా? ఇద్దరు ఒకటే కాలేజీలో చదివిన విషయం మర్చిపోయిందా? ఆమె జీవితం ఇప్పుడిలా అవడానికి, సురేంద్రతో వివాహం అలా ముగిసిపోవడానికి కారణం తానేనని తెలుస్తే ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది? తననెంత అసహ్యంగా చూస్తుంది? అసలీ ఉద్యోగమే వదలీ పారిపోతుందేమో ? తనలాంటి నీచుడి దగ్గర పని చేయటం కంటే ఆత్మహత్యే మంచిదనుకొంటుందేమో! స్వరూపకి విసుగ్గా ఉంది.
