అన్వేషి
-ఎ. రాధారాణి

శ్రీవారికి సెలవు దొరకనందు వల్ల విజయవాడ నే నోక్కర్తినే బయలుదేరవలసి వచ్చింది. పగటి పూట ప్రయాణం . ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి పదింటి కల్లా విజయవాడ చేరుతుంది. ఇక్కడ ఆయనగారు రైలెక్కిస్తున్నారు. అక్కడ తమ్ముడు స్టేషన్ కు వస్తాడు. టెలిగ్రాం టైముకి అందక వాడు రాలేకపోయినా ఫర్వాలేదు. అది నేను పుట్టి పెరిగిన చోటే! మొదటి అట సినిమా చూసి వచ్చే సమయానికి ఇంటికి చేరుకుంటాను.
"మళ్ళీ వారం రోజుల్లో రావాలి సుమా! నీవు లేకపోతె నాకు తోచదు" అన్నారాయన. ప్లాస్టిక్ బుట్ట నిండా ఏవేవో పళ్ళు కొని తెచ్చారు. ఫ్లాస్కు లో కాఫీ కూడా ఉంది.
"బిస్కెట్ పాకెట్లు తేనా?"
నేను నవ్వాను. అతిశయోక్తి కాదు గాని ఆయనకు నేనంటే చాలా ప్రేమ. ఆఫీసు లేని సమయాల్లో ఎక్కువగా ఇంట్లో నాతోనే గడుపుతారు. చిన్న చిన్న బహుమతులూ, అడపా దడపా సినిమాలూ -- చెప్పేదేముంది? ఆంధ్ర దేశంలోని అన్యోన్యమైన సంసారాల్లో మాదోకటి!
"ఏమీ వద్దు, స్వామీ! ఒకటి రెండు పత్రికలేవైనా తెచ్చి ఇవ్వండి, చాలు!"
అయన వెళ్ళి ఇన్ని పత్రికలూ తెచ్చారు.
"మరి ఆఫీసుకు వెళ్ళాలి, రాణీ! అవసరమైన పని ఉంది."
"వెళ్ళి రండి!"
"ఎక్కడికి రాను?"
"బుద్దిగా ఇంటికి."
"వెళ్ళగానే ఉత్తరం."
"వ్రాస్తాను.
"వారం రోజుల్లో ---"
"తిరిగి వస్తాను."
"మరి వెళ్ళిరానా?"
చిరునవ్వుతో తల ఊపాను. అయన లేచి ఒక్కసారి నన్ను...ఏమని వర్ణించను? వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళిపోయారాయన. నేను సామానులు ఎక్కడేవి ఉన్నాయో ఒకమారు చూసుకుని స్థిమితంగా కూర్చుని రైలు కదలడం కోసం నిరీక్షిస్తున్నాను.
మా పుట్టింట్లో మా వాళ్ళ దగ్గర కొన్నాళ్ళుండి రావటానికి నా ఈ ప్రయాణం. ఫ్లాట్ ఫారం మీద ప్రయాణికులనూ, హడావుడినీ చూస్తున్నాను. నేనున్నది మొదటి తరగతి భోగీ అవడం వల్ల రద్దీ మాట అలా ఉంచి ఇప్పటి వరకూ నేను తప్ప ప్రయాణీకులు లేరు. ఎవరైనా వస్తే బాగుండును. కాస్త కాలక్షేపం అనుకుంటున్నాను.
ఇంతలో ఒక వ్యక్తీ సూట్ కేస్ తో వచ్చి నా కెదురుగా కూర్చున్నాడు. వయస్సు ముప్పై సంవత్సరాలు ఉండచ్చు.
సూట్ కేసు సీటులో పడేసి, "మేడమ్ ! ఇది కాస్త చూస్తుండండి.! ఇప్పుడే వస్తాను" అని నాతొ చెప్పి వెళ్ళాడు. అయిదు నిమిషాలు కాకుండానే "హిందూ ', 'బ్లిట్జ్' పత్రికలతో తిరిగి వచ్చాడు.
అవి చూస్తూ కూర్చున్నాడు. నేనూ నా పత్రికలలో ఒకటి తెరిచి తిరగేస్తూ "కార్టూన్స్ ' చూస్తున్నాను.
రైలు కొద్ది నిమిషాల్లో కదలబోతుందన్న హెచ్చరిక వినిపించింది.
మరి ,కాసేపట్లో కూత వినిపించింది. రైలు నెమ్మదిగా కదిలింది. మా పెట్టెలో కింకే ప్రయానికులూ రాలేదు. హేండ్ బ్యాగ్ లో నుంచి నళిని వ్రాసిన ఉత్తరం తీసి మళ్ళీ ఒక మారు చదివాను.
"రాధీ! నేనూ, ప్రేమా, జయా, శారదా, వసూ అందరం తమాషా గా ఒకే మారు పుట్టిళ్ళ కు వచ్చాం! నీవు కూడా రావే! అందరం ఒకమారు పాత రోజులు తిరగ దొడుకుని అల్లరి చేద్దాం. మీ ఇంటికి వెళితే అమ్మగారు తన క్కాస్త సుస్తీగా ఉందనీ, నిన్ను చూడాలనుందనీ , రమ్మని వ్రాశామనీ చెప్పారు. అసలే గుండె జబ్బు మనిషీ! మా కోసమైనా, ఆవిడ కోసమైనా -- అందరి కోసమైనా తప్పక రావే, చిట్టి తల్లీ!"
"హలో, కృష్ణా!" ఆ కేకకు ఉలిక్కిపడి చూశాను.
నా ఎదురుగా కూర్చున్న వ్యక్తీ గుమ్మం దగ్గరికి పరుగెత్తాడు.
"కృష్ణా! నేను గిరిధారిని! బాగున్నారా అంతా?" అంటూ అరిచాడు.
"బాగున్నాం సార్!" నీలం నూటు లోని యువకుడు గిరిధారిని చూసిన ఆనందంతో రుమాలు ఊపుతున్నాడు.
నేను కిటికీ లోంచి చూస్తున్నాను.
'అపర్ణా, కస్తూరీ అంతా --బాగేగా?"
"కస్తూరీ భర్త -- మిలిటరీ ఆఫీసర్! ఆమెను తీసుకెళ్ళాడు."
"అపర్ణ?"
రైలు బాగా స్పీడందుకుంది. ఫ్లాట్ ఫారం వదిలి పెడుతుంది కూడా. ఆ నీలం సూటు యువకుడు కృష్ణ-- ఫ్లాట్ ఫారం చివరకు పరుగెత్తు కొచ్చాడు. అతని వెనకాల యువతి అతనితో సమంగా పరిగెత్త లేక వెనకపడింది.
కృష్ణ ఆకాశం లోకి చూపిస్తున్నాడు. రెండు చేతులు ఏమీ లేదన్నట్లు ఊపుతూ ఎడం చేతితో నుదుటి మీద కొట్టుకుని , కుడి చేతితో రుమాలు ఊపుతూ గిరిధారికి వీడ్కోలిస్తున్నాడు.
ఫ్లాటు ఫారం చివర కనిపించే కృష్ణను కనిపించినంత వరకూ చూసి లోపలకు వచ్చి కూర్చున్నాడు గిరిధారి.
అతని ముఖ భంగిమలు మారిపోయాయి. చూస్తుండగానే కళ్ళలో ఏదో విషాదం గూడు కట్టింది. ముఖంలో నిగ్రహించుకోలేని వ్యధ ప్రస్ప్తుటమౌతుంది. అతను చాలా అస్థిమితంగా అవస్థ పడుతున్నాడు.
ఎవరా అపర్ణా? ఆమె ఏమైంది? ఆమెకూ, ఇతనికీ గల సంబంధం ఏమిటి? నాలో సుడులు తిరుగుతున్న ప్రశ్నావాహిని పత్రికల పై దృష్టిని నిలవనీయడం లేదు.
అతను అపరిచితుడు. ఏదో భాద పడుతున్నాడు. ఈ స్థితిలో ఆ బాధను అర్ధం చేసుకోగల ఎవరికైనా చెప్పుకుంటే కాస్త ప్రశాంతత దొరుకుతుంది. అందుకొక తోడు కావాలి! నాకైతే అతను చెపితే వినాలనే ఉంది. కాని నాకై నేను ఎలా అడగను? ఎలా ప్రారంభించను? తన ముఖంలోని భావాలు నేను చూడడం ఇష్టం లేనట్లు అతను అటు వైపు కిటికీ లో నుంచి బయటకు చూస్తున్నాడు.
నేను పెట్టెలో నుంచి ట్రాన్సి స్టర్ తీసి ట్యూన్ చేశాను. నా కిష్టమైన అష్టపది భానుమతి అమృత గాన వాహిని వెలువడుతుంది. కొంచెం పెద్దది చేశాను. ప్రకృతిని దూసుకు పోయే రైలు కిటికీ లో నుంచి చూస్తూ ఆ పాట వినటం నాకెంతో ఆనందంగా ఉంది. ఆమె కంఠనికి తెలియకుండానే కూనిరాగం తోడైంది. "సా విరహే....తవ.....దీనా.....'
'మేడమ్ ! ప్లీజ్....రేడియో ఆపేస్తారా?"
శబ్దం కొంచెం తగ్గించి అతని వైపు చూశాను.
"క్షమించండి! ఇది నా కిష్టమైన పాట! చిన్నగా చేసి వింటాను. అంతగా మీరు భరించలేక పొతే ఈ పాట అయిపోవగానే తీసేస్తాను."
"మేడమ్ , ప్లీజ్! తోటి ప్రయాణికుడి బాధ కలిగించకండి!"
"ఇంకేమనను? అతనంతగా బతిమాలుతుంటే , ఉసూరుమంటూ తీసేశాను.
అతను ఎంతో మేలు చేసినంత కృతజ్ఞతగా నా వంక చూస్తూ "థాంక్స్" చెప్పాడు.
"మీకు అష్టపది ఇష్టం లేదా? లేక భానుమతి కంఠన్ని భరించ లేరా?"
"అదేదీ కాదు. ఒక వ్యక్తికీ, నాకూ మధ్య గల అవినాభావ సంబంధం నా గుండెలను పిండి వేస్తుందీ సమయంలో."
"ఎవరా వ్యక్తీ? అపర్ణయేనా?"
"అవును. ఇందాకా నా మాటలు విన్నారనుకుంటాను."
తల ఊపాను.
"మీ రెంతవరకూ--"
"విజయవాడ."
"నేనూ అక్కడికే! ఈ రైలు జంక్షన్ లోనూ, జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ తప్ప ఎక్కడా ఆగదు. పదింటికి చేరుకుంటాం. ఒంటరిగా మొదటి తరగతి బోగీలో స్త్రీలు ప్రయాణం చేయటం అంత సురక్షిత మైన పని కాదు."
నేను నవ్వాను. "పగలేగా?" ఫరవాలేదు లెండి! మా వారు వినరు-- ఏం చేయను?" ఫ్లాస్కు తెరిచి కాఫీ రెండు మూటల్లో పోసి ఒకటి అయన కందించాను.
ముందు మొహమాట పడినా తాగారాయన.
"మీ కభ్యంతరం లేకపోతె ఆ అపర్ణ విషయం వినాలనుంది."'
అతను నవ్వాడు. విషాదం లో నుంచి వచ్చిందా నవ్వు!
"అవును. ఎవరికైనా చెప్పుకోవాలి! జీవితంలో ఎవరి కెవరమో? ఇప్పుడు ఒకరి నొకరు ఎరగని మనం విజయవాడ వరకూ కలిసి ప్రయనిస్తున్నాం. జీవితమూ అంతే. ఎవరేప్పుడూ కలుస్తారో, ఎలా విడిపోతారో , ఆ మధ్యలో కాలమూ , పరిస్థితులూ ఎలాంటి పరిణామాలు కలిగిస్తాయో జరిగిందాకా తెలియదు. అలాగే ఒకప్పుడు నా జీవితాని కేదురైన పవిత్రమూర్తి అపర్ణ." అతను భారంగా నిట్టూర్చాడు.
"చెప్పండి! నన్ను మీ ఆత్మీయురాలిగా భావించి జరిగింది జరిగినట్టు ఏమీ దాచకుండా చెప్పండి! ప్లీజ్...."
'అలాగే! మీ పేరు?"
"రాధారాణి."
"రాధారాణి గారూ! మధ్యలో అడ్డు వచ్చి నా అనుభూతికి అంతరాయం కలిగించకుండా జాగ్రత్తగా వినండి! ఏనాడో జరిగిపోయిన అగాధం లోని మధురమైన అనుభూతిని మళ్ళీ ఒక్కమారు అనుభవించనివ్వండి!"
'అలాగే! అడ్డు రాను. చెప్పండి!"
"ఆ కధలో నేనూ పాత్రనే అవుతాను. నా పేరు గిరిధారి...."
గిరిధారి ప్రారంభించాడు. నేను వింటున్నాను. అనటం కంటే, ఆ గాధలోని దృశ్యాలను నా మనో నేత్రంతో చూస్తున్నాను అనడం న్యాయమైన నిర్వచనం.
