Previous Page Next Page 
కౌసల్య పేజి 28

 

    తిలక్ కు దారిలో జానకి జ్ఞాపకం వచ్చింది. "మేము అందరమూ పిక్ నిక్ సరదా తో ఉంటె పాపం తను ఒక్కత్తే ఏమి చేస్తున్నదో ఇంటి దగ్గర? తల పోటుగా ఉందిట కూడా. పోనీ ఓ మారు వెళ్ళి చూసి వస్తే....' అనుకుని మోటారు సైకిలు అటు వైపు తిప్పాడు, జానకి చెప్పిన ఇల్లు అనమాలు జ్ఞప్తి కి తెచ్చుకుంటూ. రెండు వీధులు తిరిగేటప్పటికి ఆమె చెప్పిన అనమాళ్ళు గల ఇల్లు కనిపించింది. ఆ ఇంటి ముందు సైకిలు అపు చేసేటప్పటికి , చప్పుడు విని లోపలి నుంచీ జానకి వచ్చింది.
    వస్తూనే తిలక్ ను చూసి విస్తుపోయింది. లోపలికి ఆహ్వానించడం కూడా మరిచిపోయి అలాగే నిలబడి పోయింది. మెట్లు ఎక్కుతూ , చిరునవ్వుతో "ఎలా ఉందండీ మీ తలనొప్పి?" అన్నాడు. జానకి తడబడి "ఆ! కొంచెం నయమండి....రండి, రండి " అంది. లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుని ఇటూ, అటూ పరిశీలిస్తూ "ఇంట్లో ఎవరూ లేనట్టుననారే?" అన్నాడు. "అవునండి. మా అమ్మ పురాణానికి వెళ్ళింది. న్యాయ ప్రకారం మా పెద్ద మామయ్య ఉండాలి ఇంట్లో."
    "న్యాయ ప్రకారం అంటే!"
    "అంటే-- పాపం అన్యాయంగా అతని జీవితం సాహిత్యానికి అంకితం అయిపొయింది."
    జానకి మాటల్లోని వ్యంగ్యం గ్రహించి నవ్వుకుంటూ, తిరిగి అదే స్థాయిలో 'అదేం, పాపం?' అన్నాడు.
    "మా మామయ్య అసలు మంచివాడేనండి. ఏ పాపం ఎరగడు. బుద్దిగా భార్యతో కాపురం చేస్తూ అందరిలాగే మంచిగా ఉండేవాడు. ఇంతలో ఓ ప్రమాదం వల్ల మా అత్తయ్య పోయింది."
    "అలాగా, పాపం?"
    "దానితో, ఇలా కవి అయిపోయి ఊరు కున్నాడు."
    "అయ్యో! పోనీ మళ్ళీ పెళ్ళి అయినా చేసుకోలేక పోయారూ?"
    "అలా చేసుకుంటే ఈ ప్రమాదం జరక్కే పోవును. మా అత్తయ్య ని , కావాలని ఇంట్లో దెబ్బలాడి మరీ పెళ్ళి చేసుకున్నాడట. ఇలా అవడంతో అతని మనస్సు చెదిరిపోయింది. మళ్ళీ పెళ్ళికి ఒప్పుకోలేదు."
    "చెదిరిపోయి ఇలా కవి అయిపోయారన్న మాట!"
    "అంతేనండి. అంతే.ఈ జబ్బు ప్రవేశించాక మరీ చిక్కిపోయాడు. తన సుఖం తనకి తెలియదు. చెబితే వినడు."
    "అవును, ఈ జబ్బు లక్షణాలే అంత. కవిత్వం, సాహిత్యం లాంటి కొన్ని పదాలున్నాయి. అవి చెవుల్లో పడేటప్పటికి శివం ఎక్కుతుంది. ఇంక భోజనం సహించదు. సుఖం తెలియదు. మతి లేనట్టు ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేసి ఊరూరా తిరగడం , చుట్టపు చూపుగా ఏడాది కోమారు ఇంటికి రావడం , ఆ వచ్చినప్పుడయినా తన చుట్టూ ఏం జరుగుతుందో అనే ధ్యాసే లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా చూపులు చూస్తూ ఉండడం, ఏదో వెర్రి వెర్రి వ్రాతలు వ్రాస్తూ ఉండడం,క్షణం లో చిరాకు, క్షణం లో పట్టలేనంత సంతోషం పొందడం -- పాపం , మనలోకంలోనే ఉండరు."
    "అవే లక్షణాలు . మీరు సరిగా కనిపెట్టారే! దీనికి విరుగుడేమైనా తెలుసా మీకు?"
    "వద్దు వద్దు అంటున్నా ఓ తెలివైన అమ్మాయిని ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసెయ్యాలి.  ఆ అమ్మాయే కుడురుస్తుంది జబ్బు. అది తప్ప ఈ జబ్బుకు వేరే మందు ఏమీ లేదు."
    "చిత్తం" అంది వచ్చే నవ్వును ఆపుకుంటూ జానకి.
    "అయితే -- ప్రస్తుతం రోగి ఇంట్లో లేరన్న మాట!"
    "లేరు" అంది ఫకాల్న నవ్వుతూ జానకి. తిలక్ కూడా పకపకా నవ్వేశాడు.
    "మీరు భలేవారే?"
    "మీరు మాత్రం తక్కువా?"    
    కొంచెం సేపు ఎవరూ మాట్లాడలేదు."
    "మీరు వెళ్లలేదెం బీచికి?"
    "మీరు రాలేదని."
    "నిజంగా?"
    "ఊ!"
    జానకి కళ్ళు కృతజ్ఞత తో మెరిశాయి.
    "మీకు తలనొప్పిగా ఉందని తెలిసి వెంటనే ఇలా వచ్చేశాను."
    "ఎందుకండి నేనంటే మీకు అంత జాలి?"
    "ఏమో -- నన్ను అడుగుతా రేమిటి?"
    "ఇంకేవరిని అడగమంటారు?"
    "ఇదిగో-- ఈ ఎడం పక్క దాక్కుని ఉన్నాడు వాడిని అడగండి" అంటూ తన హృదయాన్ని చూపించాడు.
    జానకికి నవ్వు వచ్చింది. వెంటనే సిగ్గు కూడా ముంచుకు వచ్చింది. తన మనస్సు లోని మాట ఎంత తేలికగా చెప్పాడు! తిలక్ లాంటి మంచి వాడిని తనవాడు గా చేసుకోగలిగిందా , తను? ఇది నిజమే? ఆనందం, ఆశ్చర్యం ఆమెను ముంచెత్తి వేశాయి. అపరిమితమైన సంతోషంతో ఒక్క మాటయినా మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనంలో అతనికి ఎన్నో అర్ధాలు స్పురించాయి. ఆమె దగ్గర నుంచి ఏదైనా సమాధానం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు . ఎంతసేపటికి జానకి పెదవి కదపక పోవడంతో ఇలా అన్నాడు.
    "నేనిలా మాట్లాడనని మీకేమైనా కోపం వచ్చిందా?' -- జానకి కన్నులు ఎత్తి అతని కేసి ఓ మారు చూసింది.
    "కోపం వచ్చిందా?"
    "ఉహు" అంది చిరునవ్వుతో తల అడ్డంగా ఊపి.
    తిలక్ "జానకీ!' అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు. జానకి శరీరం అంతా ముచ్చెమటలు పోశాయి. ఆమెకు దాదాపు బుద్ది పని చెయ్యడం మానేసింది. ఒక్క క్షణం స్తబ్దుగా అలాగే ఉండి పోయి నెమ్మదిగా అతని చేతిలోనుంచి తన చెయ్యి తీసేసుకుంటూ "ఎవరేనా చూస్తె బాగుండదు." అంది . తిలక్ నిరాశగా కుర్చీలో కూర్చుండి పోయాడు.
    ఆదరణ, అప్యాయం కంఠం లో తొణికిస లాడుతుండగా "నేనలా అన్నందుకు కోపమా?' అంది జానకి.
    "అబ్బే, ఏమీ లేదు" అన్నాడు తిలక్.
    ఇంతలో విశాలాక్షి ఇంట్లోకి ప్రవేశిస్తూ "చీకటి పడిపోయింది. దీపం అయినా వెలిగించలేదేమే , అమ్మాయీ" అంది. వెంటనే కుర్చీలో నుంచి లేచి నిలబడ్డ తిలక్ ను చూసి "ఈయనేవరు?' అని అడిగింది.
    "మా స్నేహితులు. ఇక్కడ మెడిసిన్ చదువుతున్నారు. పేరు తిలక్."
    "ఎందు కొచ్చారు. ఇప్పుడు?"
    "ఊరికినే!"
    "ఉహు" అని లోపలికి వెళ్ళిపోయింది. జాజ్వల్యమానంగా మండుతున్న కోపాన్ని తాత్కాలికంగా అణుచుకుంటూ.
    "వస్తానండి" అని తిలక్ వెళ్ళిపోయాడు. అమ్మ ప్రవర్తన గురించే ఆలోచిస్తున్న జానకి యాంత్రికంగా అతనికి "ఊ" అని మాత్రం సమాధానం చెప్పి, బెదురుతూ బెదురుతూ లోపలికి వెళ్ళింది.
    "నిన్నే, ఇటురా" అని గర్జ్జించింది విశాలాక్షి . జానకి భయపడుతూ ఆమెను సమీపించింది.
    "ఎవరతను ? ఎందుకొచ్చినట్టు? నిజం చెప్పు."
    "నిజమే. నే చెప్పినదంతా నిజమే!"
    "ఎవరీ తిలక్? ఇంతనితో నీకెలా స్నేహం అయింది?"
    జానకి ఏమీ సమాధానం చెప్పలేదు.
    "చెప్పవేమే?' గట్టిగా అరిచింది విశాలాక్షి.
    అప్పుడే లోపలికి ప్రవేశిస్తున్న ఆనంద్ "ఏమిటది?" అన్నాడు. విశాలాక్షి ఏమీ సమాధానం చెప్పక జానకి వైపే తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది.
    జానకీ తల వంచుకొని నిలబడి ఉంది.
    "ఏమిటి అక్కయ్యా" అన్నాడు ఆనందం.
    "ఏమో? దాన్నే అడుగు."
    "ఏమిటి జానకీ!"
    జానకి ఏమీ చెప్పకుండా కళ్ళ నీళ్ళు కారుస్తూ నిలబడి ఉండిపోయింది.
    "అసలు ఏం జరిగింది?"
    "ఏమిటా? నీ మేనగోడలు కధానాయిక అయింది."
    "అంటే?"
    "ఎవర్నో తీసుకొచ్చి, ఇంట్లో కబుర్లూ, కాలక్షేపాలూను . తెలిసిందా?"
    ఆనందం గతుక్కుమన్నాడు.
    కొంతసేపటికి తనను తాను సంభాళించుకొని "నువ్వేమీ హడావుడి చెయ్యకు. నేను నెమ్మదిగా కనుక్కుంటాను." అన్నాడు. ఒక్క క్షణం ఆగి "ఎవరు జానకీ వచ్చింది?" అన్నాడు నెమ్మదిగా.
    జానకి తలెత్తి వెంటనే దించేసుకుని "తిలక్" అని సమాధానం ఇచ్చింది. దానితో ఆనందం హృదయం కొంచెం తేలిక పడింది. "ఇక్కడికి వచ్చాడా? మళ్ళీ వస్తానని బయలుదేరాడు." "అతను మంచివాడే , అక్కయ్యా! ఏదో లాంటి మనిషి కాదు."
    "ఎంత మంచి వాడయినా పెళ్ళి కాని పిల్లలు వయస్సు లో ఉన్న కుర్రాళ్ళ తో ఒంటరిగా మసలడం మంచిది కాదు. పైగా మన ఇంటా వంటా లేవు ఇలాంటి పద్దతులు."
    ఆమె మాటలు విన్న ఆనందానికి, తాను జ్యోతి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అక్క హర్షించదు. అనే ఆలోచన వచ్చింది. ఇంక అక్కడ నిలబడలేక పక్క గదిలోకి వెళ్ళిపోయాడు దోషిలాగ.
    "వాడి మాట మీద గౌరవం వల్లే నిన్ను కాలేజీ లో చేర్పించడానికి ఒప్పుకున్నాను. ఇలాంటి వేషాలు వేసేమాటయితే చదువు మానెయ్యి." అంది విశాలాక్షి.
    రాత్రి భోజనాల వేళ జానకి వింటుండగా విశాలాక్షి తో చెప్పాడు ఆనంద్. "నువ్వేం కంగారు పడకు, అక్కయ్యా. ఆ తిలక్ కూడా బుద్ది మంతుడైన కుర్రాడు. తెలివైన వాడు. ఒకవేళ జానకి కీ, అతనికీ ఇష్టం అయితే ఈ సంబంధమే చేద్దాము. ఈ విషయం నాకు వదిలెయ్యి. నేను చూస్తాను."
    "ఏం చూస్తావు? బుద్ది మంతుడయితే సరి పోయిందా? వంశం, మర్యాద, కులం, గోత్రం ఇవేమీ చూసుకోనక్కరలేదూ?"
    ఈ కాలంలోకూడా అక్కయ్య కు ఎలాంటి పట్టింపు లున్నాయో! 'కుల మేమిటి? గోత్ర మేమిటి? అంతా ఒకటే కులం' ఆని మనస్సులో అనుకోని, పైకి మాత్రం "అదంతా నాకు వదిలెయ్యమన్నాను కదా?' అన్నాడు.
    విశాలాక్షి "సరే" అంది.
    జానకి చిన్న మామయ్య కు మనస్సు లోనే నమస్కరించుకొంది.

                                     18
    తను రిజిస్టరు మారేజీ చేసుకున్నాననీ, ఎవరిని చేసుకున్నది ఎందుకు చేసుకున్నది ప్రస్తుతానికి రహస్యంగా ఉంచుతానని అతనికి మాట ఇచ్చానని జ్యోతి చెప్పేటప్పటికి మాధవరావు మ్రాన్పడి అలాగే ఉండిపోయాడు. ఇది నిజమా, కలా అన్నంత సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది అతనికి. తను జీవితంలో ఎప్పుడూ ఊహించనిదీ, తను అనుభవం లో ఏనాడూ తారసిల్లనిదీ ఈనాడు తను ఎదుర్కోవాలని, ఆ సమస్యను సక్రమంగా పరిష్కరించే సమర్ధత తనకు కావాలనీ మాధవరావు ఎప్పుడూ అనుకోలేదు. తన తెలివి తేటల మీదా, ప్రపంచ జ్ఞానం మీదా సమయస్పూర్తి మీదా అకుంఠిత విశ్వాసం ఉందేమో -- తనకు తలకు మించిన సమస్య ఏం వస్తుందిలే అనే ధీమాతో ఉన్నాడు.
    అటువంటి సమయంలో "నేనో అబ్బాయిని పెళ్ళి చేసుకున్నాను, మీకు తెలియకుండా . మీరు చెయ్య గలిగింది ఏమీ లేదు. పిల్లాడి పేరు కూడా చెప్పేది లేదు. ఇందుకేమంటారు?" అంటూ తను అల్లారు ముద్దుగా , ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న జ్యోతి వచ్చి సవాలు చేస్తే ఏమి చెయ్యగలడు?
    ఒక్క క్షణం అతనికి భూభ్రమణం ఆగినట్లు అనిపించింది. లోకం శూన్యమై అంధకార బంధురం అయినట్లు గోచరించింది. తల తిరిగిపోతున్నది. ఏమీ తోచడం లేదు. సోఫాలో కూర్చుని అలాగే ఉండిపోయాడు కొంతసేపు.
    పరిస్థితులన్నీ సమీక్షించుకొని తాను విన్నది నిజమే అని నిర్ధారించుకొనేటప్పటికి పది నిమిషాలు పట్టింది మాధవరావు కు.
    "సరే-- జరిగిపోయిన దాని గురించి ఇప్పుడే మనుకున్నా లాభం లేదు. ప్రాజ్ఞత వచ్చిన దానివి-- నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నావు. అందుకు నా ఇష్టమూ అక్కరలేదు. నాకు తెలియడమూ అవసరం లేదు. తెలుసుకోవాలని నాకు కుతూహలమూ లేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS