Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 28


    "నాన్నా గౌతమ్! నీ కోసమే దేముడితో పోరాడి, బతిమాలి, బతికించమని వేడుకుని, నా కొడుకుని వంటరిగా చేసిపోలేనని, వాడికి తోడునీడా దొరికేవరకూ వుంచమని వేడుకున్నారా. దేముడు దయతలిచాడు." వలవల ఏడుస్తున్న కొడుకు తల నిమురుతూ అంది సావిత్రి.
    "అమ్మా, అలా అనద్దు. నీవు కూడా లేకపోతే నాకింకెవరున్నారు?" గౌతమ్ పదేళ్ల కుర్రాడయ్యాడు ఆ క్షణంలో.
    "అందుకే నాన్నా! నీకో తోడు వుండాలిరా, నిన్ను నాలా చూసుకునే అమ్మాయికి నిన్నప్పగించే వెడతాను కన్నా!" కొడుకు చేయి పట్టుకుని దృఢంగా అంది.
    ఆ తర్వాత ఆవిడ ఏ మాట మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఎవరొచ్చినా, కొడుకుకి తగ్గ అమ్మాయి కోసమే. 'అమ్మా, అన్నీ తెలిసి ఎలా ఇంకో అమ్మాయిని జీవితంలోకి ఆహ్వానించమంటావు? నా వల్ల కాదమ్మా! చేసుకుని యింకో అమ్మాయికి అన్యాయం చెయ్యలేను."
    "చూడు నాన్నా! యీ సమయంలోనే 'నీకు నేనున్నానని' భరోసా యిచ్చే వారుండాలి. నీ ఆవేదన, బాధలో పాలుపంచుకునే అమ్మాయి దొరకాలి అని కోరుకో. ఆ వెలితి పూడ్చగలిగే అమ్మాయి దొరికితే, ఆ గాయం మానుతుంది. నిన్ను వంటరిగా వదలలేను. నీవు నా మాట వినాల్సిందే! అసలు నాకీ హార్ట్ ఎటాక్ ఎందుకొచ్చింది? నీ బాధ, వ్యధ కన్నతల్లిగా చూస్తూ భరించలేక, పైకి ధైర్యం చెప్పకపోతే నిన్ను రక్షించుకోలేనని నా బాధ గుండెల్లో దాచుకున్నా. ఆ గుప్పెడు గుండె మటుకు ఎంత భరిస్తుంది? నేను నిశ్చింతగా బతకాలన్నా, చావాలన్నా నా మాట వినాలి. అంతే!" తేల్చేసింది సావిత్రి.
    అవును, యింట్లో అమ్మని చూసుకోడానికన్నా ఎవరన్నా నా అన్నవాళ్లుండాలి. ఇల్లు, అమ్మని ప్రేమగా చూసుకునే అమ్మాయి. 'నీ యిష్టమమ్మా!" అనక తప్పలేదు గౌతమ్ కి. "నీకోసం, నిన్ను చూసుకోడానికి కోడలుగా..."
    "వద్దు, అలా అనద్దు. ముందు నీ భార్య అయితేనే నాకు కోడలవుతుంది. చాకిరీ కోసం ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తానంటే కుదరదు. చాకిరీకి డబ్బిచ్చి నర్సుల్ని పెట్టు. మనస్ఫూర్తిగా 'ధర్మేచ, అర్థేచ' అని నమ్మితేనే ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి - యీ యింట్లోకి తీసుకురా."
    ఇంక అనడానికి ఏం మిగిలింది? నాలుగేళ్ల క్రితం తండ్రి గుండెపోటుతో హఠాత్తుగా పోతే, ఆఖరి సంవత్సరం ఇంజనీరింగులో వుండగా ఆ యింటికి మగదిక్కయ్యాడు. ఇల్లు, పెన్షన్ వుండబట్టి అమ్మ కష్టపడకుండా భర్త పోయినా కొడుకు అండతో రోజులు నెట్టుకొచ్చింది. తల్లికి తను, తనకి తల్లి. కొత్తగా చేరిన టి.సిఎస్. ఉద్యోగం. కుదుటపడిన తన జీవితంలోకి ఉత్సాహంగా, ఉరుకులు పరుగులు పెట్టే జలపాతంలా ప్రవేశించింది, ఒక ఊపు ఊపింది. తనేమిటో మర్చిపోయేంతగా మైమరుపులో పడేసింది. అందం, తెలివి, కలుపుగోలుతనం, మాటల గారడీ, చమత్కారం, కళ్లల్లో చూపే భావం, వయ్యారం, కులుకు, ఆడపిల్ల అంటే యిలా వుండాలి అని ఆ వయసు అబ్బాయిలందరినీ ఆకట్టుకునే ఆ చిలిపితనం... మోకరింపచేసుకుంది అందరినీ. కాని దేవత మెచ్చి వరం యిచ్చింది తనకి మాత్రమే!
    పొంగిపోయాడు, మైమరచిపోయాడు. ఆ సాంగత్యంలో రెండేళ్లు రెండు క్షణాలలా కలలో మాదిరి కరిగిపోయాయి. సినిమాలు, షికార్లు, పార్కులు, మాల్స్, హోటల్స్... తిరగని చోటు లేదు. మాట్లాడుకోని సంగతులు లేవు. పాడుకోని పాటలు లేవు. చర్చించుకోని పుస్తకాలు లేవు. ఏ విషయమైనా అనర్గళంగా అభిప్రాయాలు ప్రవాహంలా దొర్లిపోయేవి ఆమె నోట్లోంచి. ఆ తెలివి, పరిజ్ఞానం తన సొంతం అని మురిశాడు. అమ్మ చూసింది, మెచ్చింది, దీవించింది. అంతస్తులు తూగాయి. కుటుంబం నచ్చింది. కాదనడానికేముంది? అమ్మాయివాళ్లు అడగడమే తరువాయి. రేపటి గురించిన కలలు కలపోసుకుని, కలిసి గడిపే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించే ప్రణాళికలు వేసుకున్నాడు.
    ఎక్కడో, ఏదో గాడి తప్పింది. అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. వారం రోజులు 'ఊహ' కేవలం తనకి ఊహల్లోనే కనిపించింది. మాటా పలుకూ లేదు. ఫోను లేదు. ఉద్యోగానికి రాలేదు. తల్లడిల్లాడు. ధైర్యం చేసి యింటికెళ్లాడు. ఇంట్లో లేదన్నారు రెండుసార్లు.
    పది రోజుల ఎడబాటు... మనసులో దిగులు. ఏదో భయం, అనుమానం. ఏం చెయ్యాలో తెలియని అయోమయస్థితి.
    పన్నెండో రోజు మిత్రులనించి ఫోన్లు - ఆశ్చర్యంగా, అనుమానంగా, బాధగా, ఓదార్పుగా కుశలప్రశ్నల మధ్య 'ఊహ'కి పెళ్లి ఈ రాత్రి అన్న విషయం చెవిలోకి వెళ్లింది. మెదడు మొద్దుబారింది. గుండె గతి తప్పింది. కారణం ఎవరినడిగినా తెలియదన్న సమాధానమే. అమెరికా అబ్బాయి, పెద్ద ఉద్యోగం. రావడం, చూడడం, కుదరడం, పెళ్లి అంతా పది రోజులలో అయిందని ఊహకి ఆత్మీయ స్నేహితురాలు ఆఖరికి కబురు చెప్పింది.
    ఒక విధమైన నిస్సహాయత, అవమానం, దుఃఖం, బాధ, ఉక్రోషం, కోపం, నిర్వేదం... రకరకాల భావాలు ముప్పేటదాడి చేస్తే అలిసి సొలిసి వాలిపోయినవాడు యిరవై నాలుగు గంటలు అలా పక్కమీదే నిస్తేజంగా వుండిపోయాడు. తల్లి బతిమాలి, కంటనీరు పెట్టుకున్నా ఏదీ మనసుని స్పందించలేకపోయింది.
    గూడు కట్టుకుని తపోనిద్రలోకి వెళ్లిన గొంగళి కొత్తజన్మ ఎత్తి సీతాకోకచిలుకలా బయటికి వచ్చినట్టు, తన చుట్టూ అల్లుకున్న పొరలని ఛేదించుకుని రెండు రోజులకి బయటికి వచ్చి మౌనంగా పనులు చేసుకుని ఆఫీసుకి వెళ్లాడు.
    పది లంఖణాలు చేసినట్టు వాడిన మొహం, పెరిగిన గడ్డం, నిర్వేదంగా, నిస్తేజంగా ఆ చూపు తట్టుకోలేక తల్లడిల్లింది తల్లి.
    స్నేహితులు మందలించారు, ఓదార్చారు. "నిన్ను కాలదన్ని వెళ్లినదానికోసం నీవెందుకురా ఏడవడం? దాని తలదన్నే అమ్మాయిలు దొరుకుతారు. బుద్ధిలేనిదానికోసం మతి పోగొట్టుకోకు" అంటూ ఆ సమయంలో తోడయి, నీడయి స్నేహధర్మం పాటించి, మనుష్యుల్లో పడేశారు.
    అమ్మ అమ్మాయిని వెతికింది. చూసింది. నచ్చింది. చూశాడు. సరే అన్నాడు. తన 'ఊహ' నిజం కానపుడు ఎవరైనా ఫరవాలేదు. మంచి అమ్మాయి, అమ్మని, యింటిని చూసుకుంటే చాలనుకున్నాడు. తననుకున్నదానికన్నా చదువు ఎక్కువే, మంచి ఉద్యోగం, సౌమ్య పేరుకి తగ్గట్టు చదువు, ఉద్యోగం, మంచి కుటుంబం అన్నీ వున్న ఆమెలో, ఆ మొహంలో ప్రశాంతత తనకి శాంతి ఇస్తుందన్న నమ్మకం కల్గింది. పెళ్లి అయింది. అమ్మ ఆనందంగా, తృప్తిగా కోడలిని యింట్లోకి ఆహ్వానించింది.
    మొదటిరాత్రి మనసు విప్పాడు. కాస్త టైము యిమ్మని కోరాడు. నా భార్యగా నా గుండెల్లో పెట్టుకుంటాను. నీకే లోటు రాదు. ఇల్లాలిగా సర్వహక్కులూ నీవే. అమ్మని బాగా చూసుకో. నాలో భాగమవడానికి నాకు కాస్త సమయం యివ్వమని అర్థించిన భర్తని కళ్ళెత్తి చూసి "ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారా?" అంది సౌమ్యంగా సౌమ్య.
    "బొమ్మ చెరిపేశాను. కాస్త కాగితం మీద గుర్తులు వుండిపోయాయి. అవీ చెరుపుతున్నా. కాస్త సమయం పట్టచ్చు. అర్థం చేసుకో" చేయి పట్టుకుని మృదువుగా అన్నాడు. నవ్వింది, చేయిమీద చేయి వేసింది అర్థం చేసుకున్నట్టు. సౌమ్య అర్థం చేసుకుంది. అమ్మ అర్థం చేసుకోడానికి ప్రయత్నించలేదు.
    "తప్పు నాన్నా! నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని మనసారా యింట్లోకి ఆహ్వానిస్తే సరిపోదు. ఆడది కోరుకునేది యింట్లో చోటు కాదు. గుండెల్లో స్థానం."
    "చెప్పానమ్మా! అర్థం చేసుకుంది. నేనేం తనని తక్కువగా చూడను. నాకు తెలుసు. సౌమ్య మంచి అమ్మాయిలా వుంది. అన్యాయం చేసే ప్రసక్తే లేదు. ఇద్దరం ఉద్యోగాలకి వెడతాం. వచ్చేటప్పుడు వెంటబెట్టుకు వస్తాను" అన్నాడు.
    అత్తాకోడలు యింట్లో పనులు కలిసి చేసుకుంటారు. అప్పుడప్పుడు సినిమాలు, షికార్లు, స్నేహితులు... అన్నీ యథాప్రకారం జరుగుతున్నాయి. గూడు కట్టుకుంటున్న మంచు కరుగుతోంది.

                                                                                        *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS