ఇది కొంతవరకూ నచ్చిందామెకి.
"ఏమోనమ్మా! మీ నాన్నగారిని కూడా అడగాలిగా!" అంది ఆలోచిస్తూనే.
"నాన్నదేమిందిలేవే? నువ్వు చెప్తే కాదంటారేమిటి ?" సంతోషంగా అంది స్వరూప. ఆమెకు చాలా వుత్సాహంగా, ఆనందంగా వుంది తల్లి ఇంత తేలిగ్గా వప్పు కొంటుందని ఊహించనైనా లేదు. తనక్కావలసింది, ముందీ వాతావరణం నుంచి బయట పడటం అంతే.
సాయంత్రానికల్లా బట్టలన్నీ సూట్ కేస్ లోకి సర్దుకుంది. రాత్రికి బయల్దేరాలనే ఉందామెకి. సాయంత్రం అయిదున్నరనుంచే తండ్రి కోసం ఎదురుచూస్తూ వీధిలో నుంచుంది.
"ఏమిటి? ఇవాళేనా వెళ్ళటం !" ఆత్రుతగా అడిగింది తల్లి. ఆమెకు స్వరూప ప్రయాణమావడానికి సిద్దపడటం కొంచెం దిగులు కలిగిస్తోంది.
"అవును! త్వరగా వెళ్తేనే అ ఉద్యోగం దొరుకుతుంది. లేకపోతే మరేవరయినా చేరిపోయే అవకాశం వుందిట....."
ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోయింది.
మరి కాసేపట్లో స్వరూప తండ్రి రానే వచ్చాడు. ఈ వార్తా వింటూనే ఆశ్చర్యపోయినా వెంటనే అందుకు వప్పుకున్నాడు. తనే స్వరూపను తీసుకెళ్ళి బస్సేక్కించాడు.
అక్కడ ఒక్కర్తేవీ సరోజ ఇల్లు కనుక్కోగలవో లేదో ....." సందేహంగా అన్నాడాయన.
"ఫరవాలేదు నాన్నా! తేలిగ్గానే కనుక్కోవచ్చు. అని రాసింది గదా. ఒకవేళ అంతగా కష్టమయితే ఆమె ఆఫీస్ కెళతాను! ఆఫీస్ కనుక్కోవడం తేలికే...."
ఆయనేమీ మాట్లాడలేదు.
బస్ బయల్దేరింది. అలాగే నుంచుని కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకొంటున్న తండ్రిని కనుమరుగయెంతవరకూ చూస్తుండిపోయింది స్వరూప. ఆమెకు దుఃఖం ఆగలేదు. ఇంతకాలానికి ఈ ఊరు వదిలేసింది తను. మళ్ళీ తల్లిదండ్రులతో కలిసి వుండడం సాధ్యమౌతుందో లేదో! తన జీవితం ఎన్ని మార్పులు చెందబోతుందో ?హైదరాబాద్ లో కొత్త జీవితం, కొత్త స్నేహితురాండ్రు, కొత్త వాతావరణం.
చీకట్లో నుంచి దూసుకుపోతుంది బస్.
పక్క సీట్లోని అమ్మాయి పలుకరించింది. "ఎందాకా వెళ్తున్నారు ?"
"హైదరాబాద్ -మీరో?"
"నేనూ హైదరాబాదే ! అక్కడ రేపు ఇంటర్వు కి ఎటెండ్ అవాలి."
"బాగుంది నేనూ వుద్యోగం కోసమే వెళుతున్నాను " నవ్వుతూ అంది స్వరూప.
"హైదరాబాద్ ఎవరెళ్ళినా వుద్యోగం కోసమే. లేకపోతే మనలాంటి మధ్య తరగతి కుటుంబాల కక్కడెం పని వుంటుందని? మన టౌన్స్ లో మనకి వుద్యోగావకశాలు బొత్తిగా లేవు. నన్నడిగితే మన ప్రభుత్వం తప్పు పని చేస్తోందంటాను కొన్ని కాకపొతే కొన్ని ఇండస్ట్రీస్ అయినా ప్రతి టౌన్ లోనూ పెడితే ఎంతో అభివృద్ధి - ఎన్నో వుద్యోగవకాశాలకూ - తోడ్పడతాయి . అన్ని హైదరాబాద్ లో పెట్టటం మూలాన మనం అక్కడి కెళ్ళి వుద్యోగం చేయాలంటే అన్నీ సమస్యలే. ఆర్ధికంగా మన కుటుంబాలకి మనం సహాయమూ చేయలేము ...." వుద్వేగంతో అందామె.
ఆమె చెప్పిందంతా సబబుగానే కనిపించింది స్వరూపకి. ఆ తరువాత ఇద్దరూ ఇంకేవేవో విషయాల్లోకి దిగిపోయారు.
అర్ధరాత్రి దాటాక సీట్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది స్వరూప. మధ్య మధ్యలో మెలకువ వచ్చినా తిరిగి వెంటనే నిద్ర అవహించేసేది. తెల్లవారిపోతుండగా పూర్తిగా నిద్ర వదిలిపోయింది. హైదరాబాద్ లోకి ప్రవేశించింది బస్సు. ఖాళీగా వున్న విశాలమైన రోడ్లూ- అందమయిన భవనాలూ.
మరి కొద్ది సేపట్లో బస్ స్టాండ్ చేరుకొంది బస్.
అంతవరకూ నిద్రావస్థలో వున్న వారంతా మేల్కోవడంతో బస్ లో హాడావుడి మొదలయింది. సూట్ కేస్ తో బస్ దిగి నుంచుంది స్వరూప తన పక్కన కూర్చున్న అమ్మాయి కూడా దిగి నుంచుంది.
"మీ పేరేమిటి ?" అడిగిందా అమ్మాయ్.
"స్వరూప."
"నా పేరు రాజ్యం స్వరూపగారూ! మళ్ళీ ఎక్కడో చోట కలుసుకోకపోము లెండి ...... నవ్వుతూ అని వెళ్ళిపోయిందామె.
స్వరూప పర్స్ లోంచి సరోజ అడ్రస్ వున్న కాగితం బయటకు లాగింది.
"రిక్షా కావాలమ్మా?" ఓ రిక్షా వాడు ఆమె దగ్గరగా నడుస్తూ అడిగాడు.
"లకడీకాపుల్ వెళ్ళాలి...."
"రెండు రూపాయలు ."
"సరే పద."
రిక్షాలో కూర్చుంది స్వరూప.
అడ్రస్ లో ఉన్న ప్రకారం అతనికి గుర్తులు చెప్పింది . ఇంటి నెంబరు తేలిగ్గానే దొరికింది. తలుపు తట్టేసరికి ఓ ముసలాయన వచ్చి తలుపు తీశాడు.
"ఎవరు?" అన్నాడు ఆశ్చర్యంగా స్వరూప వంక చూస్తూ.
"నా పేరు స్వరూప అండీ. సరోజ కోసం వచ్చాను."
"ఇదిగో -- ఈ మెట్లెక్కి మేడమీదికి కెళ్ళు. రెండో గది సరోజది."
మెట్లెక్కింది స్వరూప.
వరుసగా మూడు గదులున్నాయక్కడ.
రెండో గది తలుపులు తెరిచే ఉన్నాయ్. నెమ్మదిగా లోపలకు తొంగి చూసింది.
సరోజ స్టౌ ముందు చిన్న కుర్చీలో కుర్చుని ఉంది. అటు వేపుకు తిరిగి ఉండటం మూలానా స్వరూప ను గమనించలేదు. సూట్ కేస్ చప్పుడు కాకుండా గడపలో వుంచి అడుగులో అడుగేసుకొంటూ వెనుకనుంచి వెళ్ళి ఆమె కళ్ళు మూసి పట్టుకొంది స్వరూప.
"ఎవరో నాకు తెలీదు ....." అంది సరోజ నవ్వుతూ.
"ఊహించి చెప్పు ...." అంది స్వరూప తనూ నవ్వేస్తూ.
ఆమె గొంతూ గుర్తుపట్టేసింది సరోజ.
"స్వరూప" అంది ఆనందంతో లేచి నిలబడుతూ.
చేతులు తీసేసింది స్వరూప.
"ఇప్పుడేనా రావటం?" అడిగింది సరోజ.
"అవును ! బస్ దిగి సరాసరి వచ్చేశాను ."
"ఇల్లు కనుక్కోవటం ఇబ్బందయిందా?"
"ఏమీ ఇబ్బంది లేదు ! ఆ రిక్షా వాడెవడో అఖండుడి లాగున్నాడు. ఒకరిద్దరిని అడిగి సరాసరి ఇంటిముందు తీసుకొచ్చి దింపాడు ."
"నువ్వు వస్తావనే అనుకొంటున్నాను . కానీ ఇవాళే వచ్చేస్తావనుకోలేదు."
"నీ ఉత్తరం చూసిన తరువాత నాకొక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ది కాలేదు. అమ్మకీ, నాన్నకీ ఎలాగోలా నచ్చజెప్పి బస్సెక్కేశాను."
"మంచి పనిచేశావ్! నిన్ననే మా ఆఫీసరుకి మరోసారి గుర్తుచేశాను నీ విషయం. తప్పకుండా నీకే ఇస్తానన్నాడు. కాకపోతే ఆ ఉద్యోగం ఎన్నాల్లుంటుందో చెప్పలేం."
