17
జానకి తప్ప అందరూ అనుకున్న ప్రకారం బయలుదేరారు సముద్రపు ఒడ్డుకు. తలనొప్పి గా ఉందని చెప్పి ఇంట్లో ఉండిపోయింది జానకి. ఆనందం జ్యోతి తో అంత చనువుగా ఉండటం ఆమెకు ఇష్టం లేదు. అలా అని నిష్కర్ష గా పైకి చెప్పడానికి ధైర్యమూ లేదు. అవకాశం అంత కంటే లేదు. దాదాపు ఏడెనిమిదేళ్ళ చిన్నదయిన తను చిన్న మామయ్యా తో ఏమి చెబుతుంది? అలా అని వాళ్ళిద్దరూ మరీ సన్నిహితంగా మసులుతూ ఉంటె చూస్తూ సహించి ఊరుకోనూ లేకపోతున్నది. అందుకే వంకపెట్టి ఉండిపోయింది. ఆమెలోని ఇబ్బంది ని కనిపెట్టాడేమో , ఆనందం కూడా రమ్మని అట్టే బలవంతం చెయ్యలేదు. పైగా జానకి లేకపోతేనే జ్యోతి తో ఇంకా స్వేచ్చగా మాట్లాడవచ్చు.
జానకి రాలేదని జ్యోతి కొంత నిరుత్సాహపడింది. కాని ఆనంద్, తిలక్ అయినా వచ్చారు కదా అని తృప్తి పడింది. ఆనంద్, జ్యోతి చెరొక రిక్షా లో వస్తుంటే వెనకాలే మోటారు సైకిలు మీద వస్తున్నాడు తిలక్.
"ఇది పట్టుకొచ్చారు ఎందుకు? కొంత దూరం వెళ్ళాక, దిగి నడవ వలసి వస్తుంది ఇసక లో. అప్పుడు దీన్ని మొయ్యాలి" అన్నాడు ఆనంద్.
తిలక్ నవ్వుతూ 'అక్కర్లేదు . మీ రిక్షాలు ఆగిన చోటే దీన్ని అట్టి పెట్టవచ్చు" అన్నాడు. ముందు రిక్షా లో ఉన్న ఆనంద్ మాటలు వెనక ఉన్న జ్యోతి కి , తిలక్ కూ వినిపిస్తున్నాయి. కాని, జ్యోతి, తిలక్ మాట్లాడేవి మాత్రం ఆనంద్ కు వినిపించడం లేదు.
తిలక్ ఏదో అన్నాడు. జ్యోతి వెనక్కు తిరిగి విరగబడి నవ్వుతున్నది. తిలక్ తన సైకిల్ ను జ్యోతి రిక్షా దగ్గరగా నడిపిస్తున్నాడు. ఏదో మాట్లాడు కుంటున్నారు వాళ్ళు. మధ్య మధ్య వాళ్ళ నవ్వులే కాని, మాట లేమీ వినిపించడం లేదు ఆనంద్ కు. "ఏమిటి నవ్వుతున్నారు." అంటూ రెండు మూడు సార్లు గట్టిగా కేకవేసి అడిగాడు. వెనక నుంచి తిలక్ ఏదో సమాధానం చెప్పాడు. వినిపించలేదు. ఆనంద్ ఏమీ వినిపించడం లేదని మూగ చేష్టలు చేశాడు. అది చూసి జ్యోతి నవ్వింది. తిలక్ కూడా నవ్వాడు. వాళ్ళిద్దరూ కలిసి తనను చూసి నవ్వడం ఆనంద్ కు దుర్భరం అయింది. వాళ్ళు తనను వేరు చేస్తున్నట్లు భావించాడు. వాళ్ళతో రావడం చాలా తెలివి తక్కువ అనుకున్నాడు. పోనీ ఇప్పుడు వెనక్కు వెళ్ళిపోతే? బాగుండదు. తను మరీ తెలిపోయినట్లుంది. జ్యోతి కి తిలక్ తో మంచి పరిచయం ఉన్నట్లుంది. అందుకే అతనితో మాట్లాడుతున్నప్పుడు ఏ లోకం లోనో తేలిపోతున్నట్లు సంతోషంగా ఉంటుంది. అంటే --- అతనికి తన మనస్సు ఇచ్చిందా? ఈ ఆలోచన రావడంతో తల తిరిగినంత పని అయింది. తిలక్ నే కనక అంత అభిమానించి ఉంటె, ఆ రోజున రిక్షా లో ఆమె ప్రవర్తించిన విధానానికి అర్ధం ఏమి చెప్పుకోవాలి? ఆ! ఇలాంటి స్త్రీల ప్రవర్తనకు అర్ధం కూడా ఉంటుందేమిటి? సీతాకోక చిలుకల్లాగా సింగారించుకొని మూర్ఖులైన మగాళ్ళ మనస్సులు పాడు చెయ్యడం తప్ప' వాళ్లకు వేరే ఉద్దేశం అంటూ ఏముంటుంది?
.jpg)
రిక్షాలు సముద్రం దగ్గరకు వచ్చి ఆగాయి. తన సైకిలు కూడా అపు చేసి , రిక్షా వాళ్ళను అక్కడే ఉండండని చెప్పి, పెద్ద ఫ్లాస్కు పట్టుకుని జ్యోతి, ఆనంద్ లతో కలిసి ఇసుకలో నడవడం ప్రారంభించాడు తిలక్. ఆనందం మౌనంగా ఉన్నాడు. ఎదురుగుండా ఘోషిస్తున్న సముద్రంతో సమానంగా పోటీ పడుతున్నది అతని హృదయం.
"కాకినాడ కు బీచ్ ఏమిటి -- అంటారు కాని ఎంత బాగుందో ఇక్కడ , ప్రశాంతంగా!" అంది జ్యోతి గాలికి ఎగురుతున్న ముంగురులు సర్దుకుంటూ.
"బాగుండడం అనేది ప్రదేశం మీద ఆధారపడి ఉంటుందా, మనస్సు మీద ఆధారపడి ఉంటుంది కాని?" అన్నాడు తిలక్.
"రెండింటి మీదా."
"ఉహూ.!"
"మరి?"
"మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది."
"నేనొప్పుకొను. పోనీ ఆనంద్ ని అడుగుదాం -- ఏమండీ-- మీరేమంటారు?" అంది ఆనంద్ వేపు చూస్తూ.
"ఏమిటి?" అన్నాడు ఆనంద్.
"భలేవారే . మీరీ లోకంలో లేరన్నమాట ! ఉండండి. అలాగే ఉండండి. నిజమే, ఇంతటి ప్రశాంతమైన వాతావరణం లోకి వచ్చి కూడా ఇందులో లీనం అయిపోకుండా మన వాడ ప్రతివాదా లేమిటి?" అంది జ్యోతి.
"ఇవాళ కొత్త అయితే కదా?"
"ఇవాళ కొత్తే కావాలి" అంది గంబీరమైన కంఠం తో జ్యోతి. ఆనంద్ ఆమె ముఖంలోకి చూశాడు. తనకేమీ అర్ధం కాలేదన్నట్లు భుజాలు ఎగరేసి చప్పరించి ఊరుకున్నాడు తిలక్.
"ఆ! ఇక్కడ బాగుంది. ఇలా కూర్చుందాము" అంది జ్యోతి. ఆనందం, తిలక్ జేబురుమాళ్ళు పరుచుకొని కూచో బోతున్నారు.
"నేను బిస్కెట్లు పట్టుకొచ్చాను" అంది జ్యోతి.
"నేను కాఫీ " అన్నాడు తిలక్.
"అరె-- నేనేం తేలేదే మరి?' అన్నాడు ఆనంద్.
"ఫరవాలేదు . బిస్కెట్లు తిని కాఫీ తాగుదాము" అంది జ్యోతి.
"అబ్బే-- స్వీటు లేకపోతె అందులో అందమే లేదు. ఇకపోతే కిళ్ళీ లు. లేత తుని ఆకులూ వేసి కట్టిన మిఠాయి కిళ్ళీలు" అన్నాడు తిలక్.
"కోరికలు బాగానే ఉన్నాయి. కాని అవన్నీ ఇప్పుడెలా వస్తాయి? ముందేనా చెప్పవలసింది."
"ఎంత? మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను నా వాహనం మీద వెళ్ళి అయిదు నిమిషాల్లో తెస్తా." అన్నాడు తిలక్ కాఫీ ఫ్లాస్కు పక్కన పెట్టి.
జ్యోతి కది ఇష్టం లేకపోయింది. "అక్కర్లేదు" అంది. తిలక్ వినిపించుకోలేదు.
"పోనీ, వెళ్ళనీ-- మోటారు సైకిల్ ఉందిగా? ఒక్క నిమిషంలో వెళ్ళి వచ్చేస్తాడు." అన్నాడు ఆనంద్. తిలక్ వెళ్ళిపోయాడు.
శరవేగంతో వెళ్ళిపోతున్న తిలక్ మోటారు సైకిలు చూసి ఒక్క వేడి నిట్టుర్పు వదిలింది జ్యోతి.
"పాపం! కుర్రాడు! ఉత్సాహం కాని, శ్రమ తెలియదు."
"అతనికి లేని బాధ నువ్వు పడుతున్నా వేమిటి?" అర్ధస్పూర్తి తో అన్నాడు ఆనంద్.
"అది కాదండి! అతను చాలా కుర్రాడు."
"పాపం నువ్వు చాలా పెద్దదాని వయినట్టు!" దానితో జ్యోతికి అర్ధం అయింది తను ఏమంటున్నది. అతనికంటే తను ఏమంత పెద్దదని? అతనికీ తనలాగే దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు ఉంటాయి. మహా అయితే తనో నెలో, రెండు నెలలో పెద్దదయి ఉంటుంది. అంత మాత్రానికే అతడ్నో పసివాడిలాగా , తనేదో వయస్సు ముదిరిన అనుభవ శాలిలాగానూ ఊహిస్తే ఎలా? అయినా తన దృష్టి లో అతను పసివాడే. అసలీ పసితనం మగవాళ్ళ కందరికీ ఉంటుందేమో? పదిహేను పదహారేళ్ళ వయస్సు వచ్చే టప్పటికి తల్లితండ్రులను వదిలి పరాయి ఇంట్లో, కొత్త వాళ్ళ మధ్య మసులుతూ కాపురం చెయ్యడానికి తగిన ప్రౌడిమ స్త్రీ కి వచ్చేస్తుంది. కాని అదే వయస్సు లో ఉన్న పురుషుడి కింకా ప్రపంచ జ్ఞానం పూర్తిగా రాదు, మంచీ చెడ్డా, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో ఇవన్నీ స్త్రీ గ్రహించినంత సూక్ష్యంగా పురుషుడు గ్రహించలేడు. ఇలా ఆలోచిస్తూ అప్రయత్నంగా ఆనందం కేసి చూసింది. ఇసుకలో గులకరాళ్ళు ఏరి ఒకచోట పెడుతున్నాడు.
"ఇదా, మీరు ఇందాకటి నుంచి మౌనంగా చేస్తున్న పని?' అంది.
"అవును మరి. నువ్వేదో ఆలోచిస్తూ, కూర్చున్నావాయే! నేనం చెయ్యను?" అన్నాడు ఆనందం.
"ఆలోచించడమా? అవును. మన గురించే ఆలోచిస్తున్నాను.
"మన గురించా?"
"అవును. మీ గురించీ, నా గురించీను."
"ఏమిటది?"
"ఎంత చిన్నాపిల్లాడి ప్రశ్న వేశారండి? మన గురించి వేరే ఏం ఆలోచిస్తాను?"
"అంటే?"
"వివాహం అయి మీరూ, కాక నేనూ ఒకే స్థితిలో ఉన్నాం కదా? పరిస్థితులన్నీ కలిసి వచ్చి అంతా సవ్యంగా జరిగితే ఏమయి ఉండేది?"
జ్యోతి మాటలు మళ్ళీ అశాలతను చిగురింప చేస్తున్నాయి ఆనంద్ లో. అమృతపు జల్లులా వినిపిస్తున్న ఆమె మాటలు వింటూ ఉండిపోయాడు ఆనంద్.
"మీరేప్పుడేనా ఇలా ఊహించారో, లేదో నాకు తెలియదు కానీ , నేను మాత్రం రెండేళ్ళ క్రితం మీ ఫోటో చూసినప్పటి నుంచీ మీ గురించే తలుచుకొంటున్నాను. ఇప్పటికీ మీ ఫోటో ను భద్రంగా నా పెట్టెలో దాచుకున్నాను."
సంతోషం పట్టలేక "జ్యోతీ, నిన్ను నా హృదయం లోనే దాచుకున్నాను" అన్నాడు ఆవేశంతో ఆనంద్.
"నిజంగా?' అంది ఆశ్చర్యంగా జ్యోతి.
"ఒట్టు జ్యోతి" అంటూ ఆమె రెండు చేతులూ పట్టుకున్నాడు. జ్యోతి తన్మయ స్థితిలో కొంతసేపు అలాగే ఉండిపోయింది. ఆనంద్ వెనక్కు తిరిగి చూశాడు. దూరంగా రిక్షా వాళ్ళు పిట్టల్లాగా కనిపిస్తున్నారు. సముద్రం వారనే రెండు మూడు మైళ్ళ దూరంలో కాని బెస్త వాళ్ళు ఎవరూ లేరు. తిలక్ ఇంకా వస్తున్న జాడ లేదు. సంఘమూ, దేవుడూ, న్యాయమూ, మంచీ, అనే సముద్రం ఎదురుగా ఘోషిస్తుంటే , భయమూ ఉద్రేకమూ , స్వార్ధమూ , అశాంతీ అనే మహా నగరం వెనకాల ఘూర్లిల్లుతూ ఉంటె, మంచికీ చెడుకూ మధ్యగా , అంక్షలకూ కాంక్షలకూ అవతలగా తనూ, జ్యోతి ఈ ప్రశాంత గంబీర వాతావరణం లో , తామెవరో, తామేం చేస్తున్నారో తెలియని ఒకానొక విచిత్ర స్థితిలో , ఆనందమో, విషాదమో అర్ధం కాని పరిస్థితిలో కొన్ని క్షణాలు గడిపారు.
వాళ్ళిద్దరూ ఈ లోకంలోకి వచ్చేటప్పటికి బాగా చీకటి పడింది. తన చుట్టూ ఉన్న చీకటిని చూసి ఒళ్ళు పులకరించేటంతగా భయపడింది జ్యోతి. ఆమె కంగారు చూసి ఆనంద్ జ్యోతిని దగ్గరగా తీసుకుని పొదివి పట్టుకున్నాడు. తనకా క్షణం లో వేసిన భయాన్ని సమీక్షించుకొని "ఆనంద్, మనం వివాహం చేసుకుంటేనో!" అంది జ్యోతి.
"అలాగే."
"ఎప్పుడు?"
"నీ ఇష్టం."
"రేపు"
"రేపే?"
"ఏం-- నీకేమిటి అభ్యంతరం?"
"అభ్యంతరం కాదు, జ్యోతీ! రేపే పెళ్ళి అంటే ఎలాగ? ఎన్ని ఆలోచించు కోవాలి? ఎంతమందికి అర్ధం అయేలాగా ఒప్పించాలి? ఎంత ప్రయత్నం చేయాలి? నువ్వు మాత్రం ? మీ నాన్నగారికీ వాళ్ళకూ తెలియ పరచవద్దూ? వాళ్ళు ఇందుకు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే ఏమిటి చెయ్యడం? ఇవేమీ ఆలోచించకుండా రేపే పెళ్ళి అంటే ఎలాగ?"
"ఈ ఒప్పుదలలూ, అంగీకారాలూ మన కెందుకు, ఆనంద్? మీకూ, నాకూ ఇష్టం అయింది. అంతే!"
ఆనంద్ నవ్వి "నిజమే అనుకో! రిజిష్టర్ మారేజీ అయితే, నువ్వు చెప్పినట్లే కానిచ్చి -- తర్వాత మీ వాళ్ళకూ, మా వాళ్ళకూ అర్ధం అయేలాగా నచ్చ చెప్పవచ్చు. కాని సంప్రదాయపద్దతిలో అయితే చాలా తంతు ఉంది. ఒకటి రెండు రోజులలో తెమిలే వ్యవహారం కాదు" అన్నాడు.
"పోనీ, అలాగే-- రిజిష్టర్ మారేజీ చేసుకుందాము."
"నీ ఇష్టం ." అన్నాడు ఏదో ఆలోచిస్తూ ఆనంద్.
"దీనికేం కావాలి? మనిద్దరం రిజిస్ట్రారు ఆఫీసుకు వెళ్ళి సంతకం పెట్టడమే కదా?"
"అంతే. కాని అయితే ఒక సాక్షిని తీసుకు వెళ్ళాలి."
"అలాగే. తిలక్ ని తీసుకు వెళ్ళుదాము."
"తిలక్ నా? ఓ విషయం మరిచి పోతున్నావు. కొన్నాళ్ళ వరకూ మన వివాహాన్ని రహస్యంగా దాచాలి. తిలక్ కి తెలిస్తే జానకికి తెలుస్తుంది. దానితో అందరికీ తెలుస్తుంది."
"మీకా భయం ఏమీ అక్కరలేదు. తిలక్ రహస్యాన్ని కాపాడేలాగా చూసే పూచీ నాది. సరేనా."
"నీకు అంత నమ్మకం అతని మీద ఉంటె అలాగే!"
"రేపు పదకొండు గంటలకి రిజిస్ట్రారు ఆఫీసు దగ్గర కలుసుకుందాము. తిలక్ ని నేను తీసుకు వస్తాను."
"సరే" అంటూ లేచాడు ఆనంద్.
"స్వీట్ల కూ, కిళ్ళీ లకూ అని వెళ్ళిన తిలక్ ఇంకా రాలేదేమిటి చెప్మా?"
"ఏమో? అతనికి మధ్యలో ఎవరు కనిపించి అపు చేశారో?" లోకం తనను అవమానపరిచి నందుకు ప్రతిగా, మంచి పని చేస్తున్నానని జ్యోతి, తనకు జరిగిన అన్యాయానికి సరియైన ప్రతీకారం చేస్తున్నానని ఆనందమూ సంతృప్తి పడ్డారు.
* * * *
