Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 27


                                '... ప్రియురాలు ఎంత కఠినం?'

    'తేరే బినా హమ్ జీ నహి సకితే, తేరే బినా క్యా వజాద్ మేరా.'
    'నీవు లేకుండా బతకలేను. నీవు లేకపోతే నా ఉనికేముంది?'
    నా ప్రేమా నీవే, నా విరహానివీ నీవే,
    నా బాధా నీవే, నా ఓదార్పువీ నీవే.'
    ఎంత అద్భుతమైన ఆవేదన దాగివుంది ఆ వాక్యంలో. ఆ గొంతులో ఎంతో విరహం, వేదన దాగుంది. ప్రేమ, విరహం, బాధ...
    ప్రేమ ఎంత మధురం - ప్రియురాలు అంత కఠినం. ఎంత గొప్ప విరహబాధ వ్యక్తపరిచారు ఎందరో కవులు.
    వీధివైపు బాల్కనీలో, చీకటి మాటున పేం కుర్చీలో కూర్చుని, పక్కన మంద్రస్థాయిలో టు ఇన్ వన్ మధురగీతాలు ఆలపిస్తుంటే... బయటపడుతున్న తుంపర, తనతోపాటు చల్లని పిల్లతెమ్మెరనీ తెచ్చి పన్నీరు చిలకరించినట్టు చిరుజల్లు మండుతున్న మనసుని ఓదారుస్తున్నట్టు చల్లగా తాకుతూ పులకరింపచేస్తూ... వీధి లైట్ల వెలుగులో కరెంటు తీగలనించి ఒకో నీటిబొట్టు జారుతూ పుడమి తల్లి దారంలో ముత్యాలు గుచ్చుకుంటున్నట్టు నీటి వెలుగు పడి మెరిసే నీటిముత్యాలు... తలంటి పోసుకుని కురులు ఆరబెట్టుకుంటున్నట్టు గాలికి చిరురెమ్మలు ఊగుతూ, వంటిని మురికి దుల్చుకున్నట్టు నవనవలాడే ఆకులు... రాలిపోతామేమోనన్నట్టు బెంగగా తలలు వాల్సిన మందారాలు, నందివర్ధనాలు, సగం రాలిన రేకులను చూసి కన్నీటిబొట్లు రాలుస్తున్నట్టు గులాబీనించి జారిపడే నీటిబొట్లు... చీకటిలో ప్రకృతి అందాలు చూపెడుతున్నా చూడండి అని వెలుగులు చిమ్మే మెరుపులు... ఆ వాతావరణం... ఓహ్, చూడగలిగిన మనసుంటే ప్రకృతి ఎన్నెన్ని అందాలు చూపెట్టి పరవశింపచేస్తుంది! ఆ అందాలకి కరిగిపోయి పరవశించే మనసుని ఆ విరహగీతం...
    మనసుని తట్టి, కుదిపి, లేపి, ఎన్నెన్ని జ్ఞాపకాలని కళ్లముందు పరిచి, మూగబోయిన మనసు ద్రవించి కళ్ల ముందు పలచటి నీటిపొర. ఆ తెరలోంచి ముగ్ధమనోహరరూపం నవ్వుతూ చేతులు చాచి పిలుస్తుంటే, వివశుడై అందుకోవాలని ఆరాటంగా చేతులు చాచి ముందుకు వెళుతూంటే, ఊరిస్తూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ, నన్నందుకోలేవు, దొరకను నీకు అన్నట్టు మరింత వెనక్కి వెళ్లి మాయమయి, రిక్తహస్తాలతో నిలబెట్టి అందకుండా వెళ్లిపోయింది. ఎటు వెళ్లిందో తెలుసు, ఎక్కడుందో తెలుసు. కాని, తను చేరుకోలేని అగాధం మధ్య సృష్టించి వెళ్లిపోయింది. ఊరించి, మురిపించి, ఓలలాడించి, తనివితీరా కరిగిపోదామనుకునే వేళకి కబురేనా చెప్పకుండా, తన తప్పేమిటో కూడా తెలియనంత అయోమయంలో పడేసి మాయమయింది.
    కల ఏమోనన్న భ్రమలో కొన్నాళ్లు, తిరిగి వస్తుందేమోనన్న ఆశ కొన్నాళ్లు, వస్తే ఎంత బాగుండు అన్న కోరిక, యింక రాదు అన్న నిరాశ, మిగిల్చిన జ్ఞాపకాల వేదన. విరహంతో కొన్నాళ్లు, మనసు దిటవు పరుచుకోడానికి ప్రయత్నిస్తూ కొన్నాళ్లు... ఆవేదనలోంచి పుట్టిన కసి, కోపం, ఎవరి మీద చూపలేక తనని తాను శిక్షించుకుంటూ, గుండె చెదిరి, మనసు పరితపిస్తూ బతుకుమీద నిరాసక్తతతో... ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం - అంత గొప్పగా చెప్పిన కవులు తన కోసమే రాశారేమో! ఇలాంటి రాత్రులు - ఎన్నెన్ని అందాలు, ఆనందాలు, అనుభూతులు, పరవశాలు, మైమరుపులు, వెన్నెల రాత్రులు, వర్షపు రాత్రులు యీ బాల్కనీలో! జీవితం యింత అందంగా వుంటుందా అనిపించిన క్షణాలు అన్నీ మూటగట్టి తీసికెళ్లి, తనకేం మిగల్చకుండా దగాచేసి పోయింది.
    "నాన్నా! ఏమిట్రా యిది? ఇలా అయిపోతున్నావు? నేను చూడలేక పోతున్నానురా. వదిలేయ్, అలాంటి మనిషి కోసం యీ దిగులు, వేదన ఏమిటి? నీ విలువ, నీ ప్రేమ విలువ కాలదన్నిపోయినవాళ్ల కోసం నీవెందుకు యింత దీనంగా బాధపడడం? నీ వ్యధ, బాధ, ఆవేదన అర్థం చేసుకోక వెళ్లినదానికోసం యింత తపన... వద్దురా. నా మాట విను నాన్నా! నీవింక యిలా వుంటే నే చూడలేను. మీట వినకపోతే నేనింక యిక్కడుండను. వెళ్లిపోతాను." తలమీద చెయ్యి వేసి ఓదార్పుగా తల నిమిరే తల్లి గుండెల్లో తలదాల్చుకుని "అమ్మా..." అంతకంటే మాటలాడలేక నడుం మీద చెయ్యి మరింత బిగించాడు.
    ఆ రోజుల్లో, ఆవేదనలో అమ్మ కనక తోడు లేకపోతే ఏమయ్యేవాడో? తన బాధ అర్థమయినట్టు మాట్లాడకుండా పక్కన కూర్చుని చేయి నిమురుతూ, నీకు నేనున్నానని ధైర్యం చెప్పినట్టు కూర్చునేది. అన్నం కలిపి చిన్నపిల్లాడిలా ఒకో స్పూను అదును చూసి పిల్లాడి నోట్లో కబుర్లు చెపుతూ తినిపించినట్టు యీ మాట ఆ మాటా చెప్పేది. దగ్గిర కూర్చుని స్కూలికి వెళ్లనని మారాం చేస్తూ నిద్రలేవని పిల్లాడిలా లేపుతూ, తన బట్టలు తీసిపెట్టి, టిఫిను తింటుంటే బలవంతంగా ఇంకో ఇడ్లీ తినిపిస్తూ... గుమ్మం వరకూ వచ్చి ఆఫీసుకి సాగనంపేది. అమ్మకంతా తెలుసు. అందుకే తన బాధ అర్థం చేసుకుంది. కాలం గాయాన్ని మాన్పుతుందని ఓపిగ్గా ఎదురుచూసింది.
    ఆర్నెల్లకి కాస్త మామూలు అయ్యాడు. జ్ఞాపకాల మీద దుప్పటి కప్పి మూటకట్టి అటకెక్కించగలిగాడు.'ఛా తనంటే లెక్కలేనిదానికోసం యింత ఫూలిష్ గా, యింత నిస్సహాయంగా ఏడవడం ఏమిటి, సెంటిమెంటల్ ఫూల్. ఛా... ఛా... తల విదిలించి, జ్ఞాపకాలని విదిల్చికొట్టాడు. కాదు కొట్టాననుకున్నాడు. రోజులు ఫరవాలేదు దొర్లిపోతున్నాయి అనుకునే వేళకి దెబ్బమీద దెబ్బ కొట్టింది. ఒక్కగానొక్క ఆత్మబంధువు తల్లిమీద హార్ట్ ఎటాక్ రూపంలో. తిరిగి ఆవిడ మామూలు మనుషుల్లో పడడం వింతే అన్నారు డాక్టర్లు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS