Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 27

 

    "అవునట! ఏదో పనిమీద తిరుగుతున్నట్లు చెప్పారు. బలవంతం చేసి హోటల్ కి తీసుకెళ్ళి కాఫీ టిఫినూ ఇప్పించారు....."
    కాసేపు శ్రీపతి గురించి ఏవేవో మాట్లాడాడతను.
    ఆ మర్నాడే తిరిగి సరస్వతి వాళ్ళింటి కెళ్ళింది శాంతి. వాళ్ళింట్లో ఏదో పూజ ఉండటం చేత సరస్వతి ఆహ్వానించిందామెను అదీ గాక అజ్ఞాతంగా వినోద్ తో సరదాగా మాట్లాడాలన్న కోరిక కూడా చోటు చేసుకొందామెలో. ఒకోసారి మనకు వ్యతిరేకంగా ఉండే వారిపైనే గౌరవం పెరుగుతుంటుంది.
    "స్త్రీల మీద మీ అభిప్రాయాలు ఏమయినా మారినాయా?" అడిగింది శాంతి నవ్వుతూ.
    "ఊహూ! నా అభిప్రాయాలు ఏ పుస్తకాలో చదివి ఎర్పరచుకోన్నవి కాదు శాంతి గారూ! అనుభవం -- పరిశీలనల వల్ల ఏర్పరచుకొన్నవి , అంచేత అవేప్పటికీ తప్పుకావు! మారవు!"
    "సరే! చూద్దాం లెండి! ఏదొక రోజు మీరే వప్పుకొంటారు. అవన్నీ తప్పని " కవ్విస్తూ అందామె . ఎందుకో అతనితో వాదించటం చాలా సరదాగా ఉందామెకి.
    "ఈ మాట మీరన్నారు గనక ఊరుకొంతున్నాను. ఇదే మా సరస్వతి అయినట్లయితే చెంపలు పగలుకొట్టే వాణ్ణి...."
    "నేనూ అంతే! ఈ అభిప్రాయాలన్నీ మీరు వెలిబుచ్చారు కనుక సరిపోయింది. ఇదే సరస్వతి అయినట్లయితే " నవ్వాపుకోలేక నవ్వేసిందామే.
    అంతవరకూ సీరియస్ గా ఉన్న అతను కూడా నవ్వేశాడు.
    "మీరూ మా యింటికోసారి రావాలి! మా అన్నయ్య తీసుకురమ్మన్నాడు మిమ్మల్ని ....."అంది శాంతి.
    "వస్తాను! మీ ఇల్లు నాకు తెలుసు! మొన్న నేనూ సరస్వతి ఆటోలో వెళ్తోంటే సరస్వతి చూపించింది."
    "రండి! మా అన్నయ్యయితే గాని మీ వాదనలన్నీ తప్పని నీరూపించ లేడు...."
    "అతని వల్ల కాదు! మీ అన్నయ్య అభిప్రాయాలే తప్పని ఒప్పిస్తాను చూస్తుండండి" అతను వెళ్ళిపోయాడు నవ్వుతూ.
    "మరేమీ లేదు వాడికి చాలా ఇంటర్ వ్యూలయినాయ్! అన్నిటిలోనూ మొగాళ్ళకంటే స్త్రీలే ఎక్కువమంది సెలక్ట్ అవడంతో వళ్ళు మండిపోయింది. మా యింటి వెనుకే ఓ మహారాష్ట్రులమ్మాయ్ ఉంది. వాళ్ళకి చాలా డబ్బుంది. ఇంట్లో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. బ్యాంకు లో ఇంటర్వ్యూ వస్తే అన్నయ్య వెళ్ళాడు అ అమ్మాయి కూడా వెళ్ళింది. ఆ అమ్మాయి సెలక్టయింది. అన్నయ్య సెలక్టుకాలేదు. ప్రతినెలా జీతం రాగానే ఆ అమ్మాయి నాలుగు చీరెలు, ఖరీదయిన స్నోలు - పౌడర్లూ- లిప్ స్టిక్కులు ఇలాంటివన్నీ తెచ్చేసుకొంటుంది. అదీ అన్నయ్యకు కోపం - అదే ఉద్యోగం తనకు దొరికినట్లయితే ఆ జీతం మా  యింటిల్లి పాదికి సరిపోతుంది కదా -- ఇప్పటిలాగా కష్టాలు పడకుండా గడపొచ్చు -- అని అంటూంటాడు...." అంది సరస్వతి.
    శాంతి ఇంటికి చేరుకునేసరికి సృజన్ బాబు -- శ్రీపతి కూర్చుని మాట్లాడుతూ కనిపించారు. గుండెలు ఝల్లుమన్నాయ్ శాంతికి. అతను తమ వివాహం గురించే మాట్లాడానికొచ్చాడా ? లోపలి కెళ్ళిపోయి తలుపు వెనుక నుంచి వారి మాటలు వినసాగింది.

                                                     14


    సరోజ దగ్గర్నుంచీ ఉత్తరం వచ్చింది స్వరూపకి.
    వెంటనే బయల్దేరి వచేట్లయితే ఒక టెంపరరీ ఉద్యోగం దొరికే అవకాశం ఉందని రాసిందామే. అది చదవటం తోనే ఆమెకు ప్రాణం వచ్చినట్లయింది. ఏ ఉద్యోగమైనా ఫరవాలేదు. చిన్నదో- పెద్దదో టెంపరరీయో- పర్మినెంటో అదంతా తరువాత చూసుకోవచ్చు. ముందోసారి ఉద్యోగంలో కాలు పెడితే తరువాత అది కాకపొతే మరోటి చూసుకునేంత ధైర్యం- ఆర్థిక స్థోమత ఉంటాయ్! ఈ జీతం మీద ఆధారపడే వారెవరూ లేరు,  కాని ఈ విషయం చెప్తే తల్లిదండ్రులేమంటారో అన్న బెరుకు మొదలయినదామెలో. ఏమయినా సరే! తను తీసుకొన్న నిర్ణయం మాత్రం అమలు జరగాల్సిందే. కాని వీలయినంత వరకూ తల్లి దండ్రులకు నచ్చజెప్పి ఈ ఊరు వదలడమే మంచిది లేకపోతే వాళ్ళకు మళ్ళీ మనః క్లేశం.
    తల్లి పడకుర్చీలో పడుకొని కళ్ళజోడులో నుంచి భగవద్గీత చదువుతోంది. తన జీవితం ఇలా అయిపోయిన దగ్గర్నుంచీ ఆవిడకు మనశ్శాంతి బొత్తిగా కరువయిపోయింది. అంచేత ప్రతిరోజూ భగవద్గీత చదవడం అలవాటు చేసుకుంది. ఆమె దగ్గరకు నడిచి నేలమీద కూర్చుంది స్వరూప. చేతులు రెండూ కుర్చీ చెక్కల మీదుంచి "అమ్మా" అంది నెమ్మదిగా. భగవద్గీత చదవడం ఆపి కుతూరి వంక చూసిందామె.
    "మా ఫ్రెండ్ సరోజ లేదూ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తోంది చూడు అది ఉత్తరం రాసిందమ్మా అక్కడే మరో ఉద్యోగం ఖాళీ వచ్చిందట. కావాలంటే వచ్చి చేరమని రాసింది -- " తల్లి ముఖంలో మారుతున్న భావాలను పరీక్షగా చూస్తూ అంది స్వరూప.
    "వుద్యోగామా?" ఆశ్చర్యంగా అడిగిందామె. "కాని హైదరాబాద్ లో ఒంటరిగా ఎలా ఉంటావ్?"
    "ఒంటరిగా ఎందుకమ్మా. సరోజతో పాటు వుంటాను. లేదా ఇలా ఒంటరిగా వుండదల్చుకున్న ఆడాళ్ళ కోసం హాస్టల్స్ వున్నాయ్. అక్కడయినా వుంటాను."
    ఆమె ఆలోచనలో పడింది.
    ఎటు మాట్లాడటానికీ తోచటం లేదు. నిజానికి ఆడపిల్ల అంతదూరం పోయి ఒంటరిగా వుద్యోగం చేయటం తనకిష్టం లేదు. కాని గుండెల మీద కుంపటిలా స్వరూప ఎదురుగ్గా వుంచుకొని ఆమెతో పాటు తామూ మానసికంగా బాధ పడడం కూడా ఇష్టం లేదు.
    "అది పర్మనెంటు ఉద్యోగం కాదుటలే అమ్మా! తాత్కాలికమైనదే కాబట్టి, ఉన్నన్నాళ్ళు చేస్తాను ఆ తరువాత మళ్ళీ ఇక్కడే వుంటానుగా--"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS