గదిలో పాల గ్లాసుతో ప్రవేశించిన పద్మజ, "వాసూ , నీకు ఈ వేళ నుంచీ రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు శాంక్షను చేశాం." అంది నవ్వుతూ.
"ఎందుకు పద్మజా! వద్దని చెప్పు." మంచం మీద లేచి కూర్చున్నాడు వాసు.
"ఇటు పైన చాలా దూరం వెళ్ళి చదవాలిగా! అబ్బాయి గారు చిక్కి పోతారని కాబోలు. నాకేం తెలియదు. ఇచ్చి రమ్మన్నారు నాన్న."
"సరే, ఇచ్చేయ్!' చెయ్యి ముందుకి చాచాడు వాసు.
"పంచదార వేశానో, లేదో?' అంటూ కొంచెం గ్లాసు పెదవులతో స్పృశించి , కొంచెం పాలు పీల్చి, "తియ్యగా ఉన్నాయి. పంచదార వేశాను. అరె, ఎంగిలి చేశానే!' అంది నొచ్చుకుంటూన్నట్టు నటిస్తూ.
"ఫర్వాలేదు. ఇచ్చేయ్' అన్నాడు ఆమె చేతిలో గ్లాసు తీసుకుంటూ.
"ఎంగిలి కాదా?" ఒక్కసారి అతని వైపు చూసి చూపులు తిప్పుకుంది.
ఆమె చూపుల్లోని ఆరాధన అర్ధం కాని అతడు ఎంగిలి చేసినందుకు నొచ్చు కుంటుందనుకున్నాడు. ఆమె కావాలని ఎంగిలి చేసిందని అతనికేం తెలుసు? "మామయ్య కూతురివి నువ్వు. నీ ఎంగిలి నాకేం నిషేధం కాదు' అంటూ కొంచెం తాగి, "అయ్ బాబోయ్! ఇన్ని పాలు తెచ్చావు. మొట్టమొదటి రోజు తాగలేను. టేబిలు మీద గ్లాసుంది. ఇలా తే" అన్నాడు వాసు.
గ్లాసతని చేతి కిస్తూ, "వాసూ, నీకో గుడ్ న్యూస్" అంది పద్మజ అతని వైపు చూస్తూ.
"ఏమిటది?" తన గ్లాసులో పాలు ఆమె తెచ్చిన గ్లాసులో సగం వంచేస్తూ, నవ్వుతూ అడిగాడు.
"నా కేమిస్తావ్?"
"ఏమిటి కావాలి?"
క్షణం తరువాత "చెప్పనా?' అంది.
"నీ ఇష్టం.... తొందరగా చెప్పు, మరి!' ఆమె వైపు అర్ధం కానట్టు చూస్తూ అన్నాడు.
"ఏమీ నీ దగ్గర నుంచి ప్రజెంటేషన్ తీసుకోకుండా చెప్పకూడదనుకుంటున్నాను."
"సరే, తీసుకో. నువ్వు చెప్పే మాటలో సారముందో లేదో కాని, ఈ పాలల్లో బోలెడు విటమినులు ఉన్నాయి" అంటూ పాల గ్లాసు ఇవ్వబోయాడు.
గలగలా నవ్వేసి, "అత్తయ్య రేపు ఇక్కడికి వస్తుంది. ఇక మన దగ్గరే ఉండిపోతుంది." అంది పద్మజ.
"ఫో అబద్దం!"
"నిజం."
"ఎవరు చెప్పారలా?"
"నాన్నగారన్నారు. కావాలంటే అడుగు."
ప్రసన్న దృక్కులతో సంతోషంగా చూస్తూ, చెయ్యి ముందుకి చాచాడు వాసు.
అతని చేతి కామె చెయ్యి కలిపింది. "థాంక్స్...." అంటూ ఆమె చెయ్యి మృదువుగా నొక్కి వదిలేశాడు వాసు.
'అత్తయ్య చాలా మంచిది. నాకెంతో సంతోషంగా ఉంది. స్టేషను కి వెళదామా?"
"అలాగాలే" అంటూ ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు వాసు.
ఆమె ఇంకేమిటో మాట్లాడుతుంది. అతనికి వినిపించలేదు. ప్రసాదరావు తనతో 'మీ అమ్మ ఇబ్బంది పడకుండా బ్రతికే ఏర్పాటు నేను చేస్తాను" అన్న మాట గుర్తొచ్చింది. తృప్తిగా, తేలిగ్గా నిట్టూర్చాడు.
* * * *
ఆఫీసు రూమ్ లో కాగితాలు చూసుకొంటున్న గోపాల్రావు , "మామయ్యా!" అని నెమ్మదిగా పిలిచిన వాసు గొంతు విని తలఎత్తి చూశాడు ప్రశ్నార్ధకంగా.
"పద్మజ చెబుతుంది-- అమ్మ ఇక్కడికి రాబోతుందని, నిజమా?"
"నిజమే , వాసూ! చెప్పాలను కుంటున్నాను. రేపు సాయంత్రం పాసింజరు లో వస్తుందట. ఇదిగో , లెటరు. స్టేషను కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటావు కదూ?" వాసు చేతిలో కార్డు ఇస్తూ అడిగాడు గోపాల్రావు.
"నువ్వు వ్రాశావా? తానె వస్తుందా?"
వరండాలో, గదిలో మరెవరూ లేనట్టు గమనించి, నువ్వు వచ్చిన రోజే మీ నాన్న దగ్గిర నుంచి నాకు ఉత్తరం వచ్చింది. ఇదివరకు నువ్వు మా ఇంట్లో ఉన్నందు కేదో కొంత పంపిస్తూ వచ్చాడు నే వద్దన్నా కూడా. ఇప్పుడేమనుకున్నాడో-- మీ అమ్మని కూడా నా దగ్గర ఉంచుకోమనీ, ఆమె కయ్యే ఖర్చు తాను భరిస్తాననీ వ్రాశాడు. ఆమెను తాను భరిస్తున్నట్టేగా!క్ అలా అలా దగగ్రవుతున్నాడు మనకు మీ నాన్న. కదూ, వాసూ? ఏదో నీధర్మమా అని కుమిలిపోయే మా అక్కయ్య సంతోషంగా బ్రతికితే మేం ఎవ్వరం సాధించలేని విజయాన్ని నువ్వు సాదించావనుకుంటాం.... ఒరేయ్! నువ్వు గొప్ప వ్యవహారవేత్తవు సుమీ!" అంటూ నవ్వి, "వాసూ! నిన్నెలా అభినందించాలో , నాకెంత సంతోషంగా ఉందొ-- మాటలు చాలవురా చెప్పడానికి...." అన్నాడు.
"అయితే రేపు స్టేషను కి వెళతాం. మామయ్యా. పద్మజ, శ్రీనూ నా కూడా వస్తారు." అంటూ ఇవతలికి వచ్చాడు వాసు.
* * * *
స్టేషనుకి వచ్చిన వాసూ, పద్మజా, శ్రీనూ -- అందర్నీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని చెమ్మగిల్లిన కళ్ళు వత్తుకుంటూ , చిన్నగా నవ్వి, బాగా చదువుకుంటున్నారు కదూ, బాబూ? పదండి, పోదాం" అంది మధుమతి. ఆనందమో, డుఖమో , మరే భావాల ఒత్తిడో ! ఆమె గొంతు రుద్దమయింది.
"నువ్వు మా దగ్గరికి వచ్చేస్తావని నాన్నగారు చెప్పేసరికి నాకెంత సంతోషమయిందో తెలుసా, అత్తయ్యా?" మధుమతి చెయ్యి పట్టి ఊపుతూ ఆప్యాయత నిండిన గొంతుతో అంది పద్మజ.
"పిచ్చిపిల్ల! ఎందుకమ్మా నేనంటే నీ కంత ప్రేమ! ఈ అత్తయ్య ఏమివ్వగలదు?" ఆమెను రెండు చేతులతో దగ్గరకు తీసుకుని తల ముద్దు పెట్టుకుంది మధుమతి.
"అమ్మమ్మా, మామయ్యా అంతా క్షేమమా? ట్రయిన్ ఎన్ని గంటల కొచ్చింది ఆ ఊరు?" ఇలాటి మాటలతోనే ఇంటికి వచ్చారు నలుగురూ.
"నన్నూ, అమ్మనీ చేరోకరూ పంచుకొన్నారు కదూ, గోపాలం?" చిన్నబోయిన వదనంతో నేలచూపులు చూస్తూ, రుద్ద కంఠంతో అడిగింది మధుమతి.
'ఛ, ఛ! నీకేం ఖర్మ మేం పంచుకోవడానికి? నీ కొడుకు దగ్గర నువ్వుంటావని నా దగ్గరకు పంపించమని అన్నయ్యకు వ్రాశాను. మరి, అమ్మ ఒక్కతే వేరెందుకు! అన్నయ్య దగ్గరో, నా దగ్గరో , నీడగ్గరో , ఆమె ఇష్టమైన చోట ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు, ఆవిడ ఇష్టం , ఉంటుంది.' లౌక్యంగా అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ గోపాల్రావు.
"అదేమన్న మాట, గోపీ! నా కొడుకు తినేవాడే కాని, సంపాదించే వాడు కాదుగా! ఇద్దరం -- తల్లీ కొడుకూ, ఈ రోజుల్లో ఇద్దర్నీ భరించడం కష్టం కదూ!"
"ప్చ్.... నేనేం భరిస్తున్నాను? ...భగవంతుడు భారిస్తున్నాడు. నువ్వేం అనవసరంగా బాధపడకు. భగవంతుడు ఉన్నాడు. ఈ ఇంట్లో నీకు స్వతంత్రముంది. హాయిగా ఉండు. ఆ లే.... ప్రయాణం చేసి వచ్చావు. లక్ష్మీ పిలుస్తూన్నట్టుంది. వెళ్ళు, కాఫీ తీసుకో" అంటూ తన గదికి వెళ్ళిపోయాడు గోపాల్రావు.
కాలేజీ కి వెళ్ళే పిల్లలకు భోజనం, కాఫీ, టిఫినూ తొందర, తొందరగా స్వయంగా తానె అమరుస్తూ, వాళ్ళు కాలేజీ కి వెళుతుంటే వీధి గుమ్మం చివర నిలుచుని తృప్తిగా చూసేది మధుమతి.
పద్మజా, శ్రీనూ బస్సు స్టాండు వరకు నడిచి వెళ్ళేవారు. గేటు లోపల నుంచే వాసు స్కూటర్ బర్ మని రోడ్డెక్కి దూసుకుపోయేది. ఆమె గుండెలు దడదడ లాడేవి. ఏవేవో , ఎన్నెన్నో ఏక్సిడెంట్లు గుర్తుకు వచ్చేవి. భయపడుతున్న మధుమతి ఓరోజు గోపాలరావు ను హెచ్చరించింది -- "వాడికి స్కూటరెందుకు? అందరిలా బస్సు మీద పోతాడు. నువ్వే వాడుకో, గోపాలం" అంటూ - "యూనివర్శీటీ చాలా దూరం అక్కయ్యా? నా ఆఫీసు పక్క వీధి లోనే. నా కేందుకూ?"
"అది కాదు, తమ్ముడూ!"
"ఫరవాలేదు. వాడికి తెలుసు ఎలా రన్ చేయాలో. మరేం భయపడకు" అన్నాడు గోపాల్రావు.
రెండూ రెండూ చొప్పున ఎనిమిది చీరలు మధుమతి కిచ్చాడు గోపాల్రావు.
"ఏదో చిన్నప్పుడు, బాగా బతికిన రోజుల్లో ఈ చీరలంటే మోజు పడేదాన్ని. ఈ రంగు లేంతో ఇష్టమయ్యేవి. ఆనాటి నన్ను గుర్తు పెట్టుకుని ఇంత డబ్బు పోసి ఈ చీర లెందుకు తెచ్చాడు? నాకెలాంటి చీర కట్టుకుంటే మాత్రం రోజు వెళ్ళక పోతుందా? ఒకప్పుడు సంతోషంగా కట్టుకున్న ఇలాటి అందమైన చీరలు ఇప్పుడే మొహంతో కట్టుకోగలను! తమ్ముడుతో ఎలా చెప్పడమో! బాకు సిగ్గవుతుంది, లక్ష్మీ. నువ్వు చెప్పు, ఈసారి మామూలు నేత చీరలు నాకు చాలని." అభిమానంతో, సిగ్గుతో కుంచించుకు పోయింది మధుమతి గొంతు.
"ఆ చీరలే మీకు బాగుంటాయి. ఎందుకు కట్టుకోకూడదు? బొత్తిగా అరవై నెంబరు నేత చీర లేం బాగుంటాయి? రేపు కలెక్టరు తల్లి కాబోతున్నారు కదా...ఫాషన్ , కాదు, మెత్తగా ఉంటాయని తెచ్చారు...అససలలాంటి ముతక చీరల్లో మిమ్మల్ని నేను చూడలేను , బాబూ!" చమత్కారంగా నవ్వేసింది లక్ష్మీ.
"నా బొంద ...ఎవరి తల్లినైతే మాత్రం? మరో మాట ఇవతలికి రాబోయి పెదవులు దాటకుండానే ఆగిపోయింది. "ఏమిటో, ఏమి అర్ధం కాకుండా పోతుంది. ముప్పై నలభై రూపాయలు ఖరీదు చేసే చీరలు ఎనిమిది....స్కూటర్.... జమిందారు బిడ్డలా తిరిగే వాసూ......ఇదేమి గారడీయో! కలో, వాస్తవమో! నాకేమీ బోధపడ్డం లేదు....ఏ బండ పడబోతుందో నా నెత్తిన!" ఉస్సూరని నిస్సహాయంగా నిట్టూర్చింది మధుమతి.
ఆ ఇద్దరి సంభాషణా విన్న వాసూ -- "అమ్మకి ఇష్టమైన చీరలు గుర్తు పెట్టుకుని అవే కొన్నారు నాన్న' అనుకొన్నాడు. అతని హృదయం తృప్తి పడింది.
ఒడిదుడుకులు లేక సాఫీగా , సంతోషంగా సాగిపోయే సంసారం, అభిమానం, ప్రేమా ఉన్న తమ్ముడు, ఆదరించే మరదలు, క్షణం తనని వదలకుండా 'అత్తయ్యా' అని ఆప్యాయంగా నోరారా పిలిచే పిల్లలు. తనని ఉక్కిరిబిక్కిరి చేస్తూ రూపం, విద్య పుంజుకు ఎదిగి పోతున్న కొడుకు-- గతం నింపిన చీకటి లో వెలుగు రేకలు. మధుమతి కేదో తృప్తిగా ఉంది. వాసు వైపు పూర్తిగా ఆకర్షితురాలై అతన్ని ఆరాధించే పద్మజ, చిలిపిగా అల్లరి చేసే శ్రీను. చలన రహితంగా ఏకాగ్రత దృష్టి తో తన గమ్యం , తన ధ్యేయం , తన భవిష్యత్తు ఏదో తాను సాధించాలనే దృడ సంకల్పంతో చదువు కుంటున్నాడు వాసు.
రోజులు దొర్లిపోతున్నాయి క్షణాల్లా.
