Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 26

 

    "మన వాసు ఉత్తరం వ్రాశాడే , మధూ?' అడిగింది జానికమ్మ.
    "ఇక్కడున్నప్పుడే కబుర్లు. అక్కడికి వెళ్ళాక వాడికి అమ్మ గుర్తు ఉండదు. పోనీలే. ఈ అమ్మ పెట్టాలా, పోయ్యాలా?' నిష్టూర స్వరంతో అని కళ్ళు తుడుచుకుంది మధుమతి.
    "రిజల్ట్స్ వచ్చాయట, ఫస్టు క్లాసు వచ్చిందట.
    "ఎవరుచేప్పారు?" అత్రతగా అడిగింది మధుమతి.
    "రాజు, పెళ్ళాం అనుకుంటున్నారు. జయ నడిగితే నిజమే అంది."
    తల్లి మాట పూర్తీ కాకుండానే ఆ ఇంట్లో ఓ భాగం లో ఉంటున్న రాజశేఖరం ఇంటికి వెళ్ళింది పేపరు కోసం మధుమతి.
    "జయా, పేపర్లో బి.ఎ రిజల్డ్స్ పడ్డాయా?" అడిగింది మధుమతి.
    "అవునత్తయ్యా . వాసు ఫస్టు క్లాసు లో పాసయ్యాడు. నీకు తెలియదా?' అంటూ పేపరిచ్చింది జయ.
    "రిజల్ట్స్ పడి నాలుగు రోజు లయిందన్న మాట! ప్చ్! ఒక్క కార్డు ముక్క వ్రాస్తే ఏం? సంతోషించమా.... తండ్రీ , ఏడు కొండల వాడా , నా బాబుని నువ్వే రక్షిస్తున్నావు!" అంటూ కళ్ళు మూసుకు చేతులు జోడించింది మధుమతి.
    "నువ్వు నంబరు చూసి ఉంటావనుకుని ఉంటాడు.
    తా నేక్కడున్నాడో, పాపం! ఉద్యోగానికి ట్రై చేస్తానన్నాడుగా?' అంది జయ.
    "ఇదే నేను గొప్పదాన్నయితే పార్టీ ఇవ్వమని గోల చెయ్యవూ, జయా!" అప్రయత్నంగా మధుమతి కళ్ళు చెమ్మగిల్లాయి.
    "ఓహో! వదిలేశాననుకున్నావేమిటి? నీ కొడుకు రానీ. పార్టీ ఏం ఖర్మ! డిన్నరు చేయ్యమంటాను.' నవ్వింది జయ.
    వెంటనే దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించి మనసారా దేవుణ్ణి ప్రార్ధించింది మధుమతి.

                        *    *    *    *
    తలుపు తెరిచిన వాసు కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి. మొహం పీక్కుపోయింది. బాగా ఏడ్చి ఉన్నట్టు అతని రూపం చెపుతుంది.
    "ప్చ్! ఏమిటో? నీకు క్లాసోచ్చిందనే సంతోషాన్నీ, గర్వాన్నీ నాలోంచి తుడిచి పెట్టేస్తున్నావు. నన్ను కంగారు పెట్టేస్తున్నావు! నువ్వెందు కిలా బాధపడి పోతున్నానో నాకు అర్ధం కాకుండా ఉంది." అంటూ ఈజీ చెయిర్లో పడుకుని కణతలు బలంగా రాసుకున్నాడు ప్రసాదరావు.
    "నేనేమీ బాధపడ్డం లేదు, నాన్నా!" నవ్వబోతూ అన్నాడు వాసు.
    "నన్ను తృప్తి పరచాలని ప్రయత్నించకు! 'నన్ను నన్నుగా బ్రతకనీయండి' అంటే అర్ధమేమిటి? అసలు నీ మనస్సులో ఉద్దేశ్యం చెప్పు, బాబూ! అది నాకు ఇష్టం కాకపోయినా తప్పకుండా నీ కోసం నా ఉద్దేశాలు మార్చుకుంటాను. నీకేం కావాలో , నన్నేం చెయ్యమంటావో చెప్పు. నేను బ్రతికి ఉండగా నీ కంట్లో నీరు తిరిగిగే సహించలేను. నీ ఉద్దేశ్య మెలాంటి దైనా, నీకూ నాకూ సంబంధించినదైతే , భయం, సంకోచం, దాపరికం లేకుండా చెప్పు. నే చెయ్యగలిగిన దంతా చేస్తాను. అంతేకాని.....'అంటూ కుర్చీలో సరిగ్గా సర్దుకు కూర్చున్నాడు ప్రసాదరావు.
    గోడకి చేరబడి తల వాల్చి నిలుచున్న వాసు ఒక్కసారి ప్రసాదరావు వైపు చూసి, "నిజం చెప్తున్నాను  నేను....మొన్న....మొన్న...." అని మళ్ళీ ఊరు కున్నాడు వాసు.
    "ఆ! మొన్న! ఏం జరిగింది? చెప్పు, బాబూ?" అత్రతగా వాసు మొహం లోకి చూస్తున్నాడు ప్రసాదరావు.
    "అమ్మను చూశాక నా మనస్సదోలా బెంగగా ఉంది, నాన్నా!"
    "ఓస్! అదా! ఏదో సుస్తీ అయి ఉంటుంది. గోపాలానికి ఉత్తరం వ్రాస్తాను. డాక్టరు కి చూపించమని. చిన్న మామయ్య ఓసారి వెళ్ళి వస్తాడు."
    "ఎంత ఆలోచించీ సరి పెట్టుకోలేక పోతున్నాను, నాన్నా! అమ్మ వాళ్ళూ వీళ్ళు ఇచ్చిన పాత చీరలు కట్టుకుంటుంటే , నేను ఖరీదైన కొత్త బట్టలు కట్టుకుంటున్నాను. అమ్మ అన్నానికి వాచీ పోతుంటే, నేను ఐ.ఎ.ఎస్ చదవాలి. నాకోసమే కదా అమ్మ బాధలు పడి బ్రతుకుతుంది? తను పడే ఇబ్బందులు నాకు తెలియనివ్వదు అమ్మ. పసివాణ్ణి కానుగా! గ్రహించాను కొంత. మిగతా వివరాలు జయ చెప్పింది. నా బట్టలు వేషం చూసిన పెద్ద మామయ్య కన్ను కుట్టింది. మంచి మంచి బట్టల్లో తిరిగి అమ్మకు అపకారం చేశాను. నాకు రహస్యంగా డబ్బు పెడుతుందని అపోహ పడ్డ పెద్ద మామయ్య తన భాగం పంటా, ఏబై రూపాయలు వచ్చే ఇంటి అద్దె ఇవ్వడం మానేశాడు. ఈ సంగతి చిన్న మామ్మయ్య కు తెలియ నివ్వలేదు. అమ్మ ఎండుగా పుల్లలా అయిపొయింది, నాన్నా! నాకోసం బ్రతుకుతున్న అమ్మ అలా శుష్కించడం నాకు గుండె కోతగా ఉంది" ఆగాడు వాసు.
    "అమ్మ!" అని వాసు నోటంట వినగానే గతం ఎదలో కదిలి కోపారుణితమైనలోచనాలు క్రమం గా ప్రశాంత కాంతిని పుంజుకోగా దీర్ఘంగా నిట్టూర్చి, మౌనంగా తల వంచుకున్నాడు ప్రసాదరావు.
    "నేను దురదృష్టవంతుణ్ణి , నాన్నా! ఏ చికాకు ఇంట్లో వచ్చినా ఎవ్వరూ అడ్డు రాకుండా గదిలో పెట్టి బాదేసేది నన్ను అమ్మ. గది తాళం బిగించి వెళ్ళిపోయేది. అప్పుడు ఏమనుకుని ఏడ్చే వాడినో తెలుసా? నాకు నాన్న ఉంటె అమ్మ నిలా కొట్టనిచ్చేవారా అని. నా తోటి వారందరికీ నాన్న ఉన్నందుకూ నాకు లేనందుకూ ఎడ్చేవాడిని -- అమ్మ కొట్టిందని కాక. తరవాత మళ్ళీ ఆ అమ్మ గుండెల్లోనే ఓదార్పు లభించేది. నన్ను కొట్టిన రోజు ఉపవాసం ఉండేది. ఆ అమ్మని నేను మోసం చేస్తున్నాను." దోసిట్లో మొహం దాచుకున్నాడు వాసు.
    "ఛ! ఛ! చేతులు తియ్యి....నువ్వేం చేశావు మోసం! అంత సున్నితమైన మనస్సు మగవాడికి పనికిరాదు. వాసూ. నేను చేశానేమో మోసం? నేను నీ చేత  చేయిస్తున్నాను కాబోలు మోసం. ఇది మోసమెలా అవుతుంది?"
    రోషంగా ప్రసాదరావు మాట పూర్తీ కాకుండానే, "అది సరే! మీరేం చేశారని అడగడం లేదిప్పుడు. మీ  డబ్బుతో చదువుకుంటూ, మీరిచ్చే కానుకలతో కులుకుతూ, మీ ఉనికినే అమ్మకు చెప్పకపోవడం మోసం కాదా? ఈ ఖరీదైన బట్టలూ, వాచీ, రింగూ --ఇవన్నీ ఎక్కడివనే ప్రశ్న అమ్మను వేదించదా? స్కాలర్ షిప్ లనీ, మామయ్యా కుట్టించాడనీ , అన్నం పెట్టడానికే ఆలోచించే మామయ్య లు ఇవన్నీ ఇస్తున్నారనీ అంటే నమ్మగలదా అమ్మ! కాని....అమ్మ నోరు....అలా అనే నోరు ముందే కట్టేశాను. నా భవిష్యత్తు కోరేదాని వైతే ఇవెక్కడివని, డబ్బు ఎలా వస్తుందని ప్రశ్నించ వద్దన్నాను. పూర్వం మీకు చెప్పానేమో ఓసారి! ఈ నాలుగు సంవత్సరాలలో అమ్మ నన్ను తృప్తిగా చూడ్డం మినహా ఏమీ ప్రశ్నించలేదు. ఎన్ని రోజులు అమ్మని మోసం చెయ్యమన్నారు? నిజం తెలిసిన తరువాత కుమిలి పోదా? ఇన్ని సంవత్సరాలు అమ్మకు తెలియనివ్వకుండా .... అబ్బా! నా గుండెలు మండిపోతున్నాయి , నాన్నా! మాట్లాడరేం? చెప్పండి నాన్నా! మీ డబ్బుతో చదువు కుంటున్నానని, మీ దగ్గరకు వస్తున్నాననీ  ఎన్నాళ్ళు అమ్మకు తెలియకూడదు?" అన్నాడు వాసు.
    ఆవేశంతో ఆపుకోలేని కన్నీటి తో కంపించి పోయే వాసుని దగ్గరగా తీసుకుంటూ, "ఎప్పుడైనా మీ అమ్మకు నేనే చెప్పాలి, బాబూ!... నేరమంతా నాదని చెబుతాను. సరా!... ఇప్పుడు మీ అమ్మ ఇబ్బంది పడుతుందనేగా బాధ! మీ అమ్మ ఇబ్బంది లేకుండా బతికే ఏర్పాట్లు నేను చూస్తాను" అన్నాడు ప్రసాదరావు. ఆ క్షణం లో మానవత్వం నింపుకున్న పరిపూర్ణ వ్యక్తిగా, అమృత హ్రుదయుడి గా కనుపించిన వాసు తల నిమిరి, ఓదార్చాడు ప్రసాదరావు తృప్తిగా.
    కొన్ని క్షణాలు తృప్తిగా దొర్లిపోయాయి. ఇద్దరి మధ్యా భరించ లేనంత నిశ్శబ్దం. ఏదో ఆలోచనలో మునిగిపోయిన ప్రసాదరావు బాధగా నిట్టూర్చి, "మీ అమ్మ స్వభావం నాకు బాగా తెలుసు. ఆమెకు తెలియడం నీ భవిష్యత్తు కి గొడ్డలి పెట్టు. ఇప్పుడామె స్వభావం ఎలా మారిందో మనకు తెలియదు గా? ఆమె గురించి మరి బాధపడకు. ఏదో ఏర్పాటు నే చేస్తాను" అన్నాడు.
    "థాంక్స్ ....నన్ను క్షమించండి నాన్నా!" అన్నాడు వాసు తృప్తిగా, హాయిగా గుండెల నిండా గాలి పీల్చుకుంటూ.
    ఆ రాత్రి ఏదో నిశ్చయంతో హాయిగా నిద్ర పోయారు.
    "ఇంటి కెందుకు పట్టించుకు వచ్చారు? మీ సెలక్షను బాగుంటుందే! మీ రెంచి తెస్తే పోలే?' అన్నాడు పాక్ చేయించి తెచ్చిన పెద్ద మూట వైపు చూస్తూ.
    "జాగ్రత్తగా తీసుకు పోగలవా? ఈ బట్టలు హోల్దాల్లో సర్దేస్తా మనుకో!" జవాబుగా అన్నాడు ప్రసాదరావు. బట్టలు తెచ్చిన వ్యక్తీ వెళ్ళిపోయాడు.
    "ఇన్ని బట్టలెం చేసుకోవాలి?" నవ్వాడు వాసు.
    ఎనిమిది చీరలూ, జాకెట్ బట్టలూ మధుమతి కి కావలసిన బట్టలు, నాలుగు జతలు వాసువి హోల్దాల్లో సర్ది కట్టేస్తూ, "గోపాలానికి లెటరు వ్రాస్తాలే. నీ బట్టలు తీసుకుని మిగతావి మామ్మయ్య కియ్యి." అన్నాడు ప్రసాదరావు.
    "అలాగే" అన్నట్టు తల ఊపాడు వాసు.
    "మా మనిషి నిచ్చి స్కూటరు పంపిస్తాను. అతను చెపుతాడు. ప్రాక్టీసు చెయ్యి జాగ్రత్తగా."
    'అలాగే కాని....మీకు అక్కయ్యలూ, చెల్లెళ్ళూ అలాంటి బంధువు లెవరూ లేరా, నాన్నా?"
    తాననుకొని ప్రశ్న! నవ్వుకుంటూ , "ఎందుకు, వాసూ?' అన్నాడు ప్రసాదరావు.
    "మీకు వండి పెడతారని. పోనీ, వంట మనిషిని ఏర్పాటు చేసుకోండి, నాన్నా!"
    "వంట మనిషి, హోటలు వాళ్ళూ పెట్టె తిండి తృప్తి నిస్తుందా, ఆకలి తీరుస్తుంది కాని? నర్సమ్మ గోరు ముద్దలు మొదలు పాతికేళ్ళు వయసొచ్చేదాకా నా ఆకలెరిగి అన్నం పెట్టేది. అయిదు సంవత్సరాలు మధుమతి అమృతమే తినిపించింది.' మళ్ళీ బరువేక్కబోయే మనస్సు మరొక్క వైపు త్రిప్పుకున్నాడు ప్రసాదరావు --" అట్లాగే చేస్తాలే" అంటూ వాసుకి సమాధానం చెప్పుతూ.

                           *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS