"అంటే ఈ లోకంలో మహాత్ములు లేనేలేరం'టావా?"
"లేరని కాదు -- ఉన్నారు. కాని వాళ్ళు అలా ఎందుకు ఉండిపోయారు అంటే మాత్రం దానికి కారణం నేనే చెప్పిందే -- తను బలహీనతని బహిరంగ పరిచేటంతటి బలమైన సన్నివేశం వారి కెప్పుడూ రాలేదన్న మాట!"
"అలా అంటే నేనొప్పుకోను."
జ్యోతి నీరసంగా ఓ నవ్వు నవ్వి "నేనూ మీలాగే అనుకుంటూ ఉండేదాన్ని, ఇందాకటి దాకా. కాని మీరు నా చేతిని స్పృశించి నప్పుడు నాలో కలిగిన సంచలనాన్ని సమీక్షించుకుంటే నాకప్పటి దాకా ఉన్న గర్వం అంతా పోయి, ఈ నిజం గోచరించింది." అంది.
అది విని ఎంత ఆశ్చర్యపోయాడో , అంత ఆనందించాడు ఆనంద్. అంటే తనమీద ఆమెకు మమత ఉన్నట్లే కదా? బాబయ్య చేసిన అన్యాయం వల్ల ఇలా జరిగింది కాని, లేకపోతె జ్యోతీ , తనూ భార్యాభర్తలు కావలిసింది.
ఇప్పుడు మాత్రం వచ్చిన అడ్డేముంది? మనసులేని మనువు మనువే కాదన్నారు. ఆ మాటకు వస్తే తను అసలు అన్నపూర్ణ ను పెళ్ళే చేసుకోలేదు. ఎలాగా ఆమెను తీసుకువచ్చి ఏలుకో దలుచు కోలేదు తను. వదిలిపోయిన సంబంధం ఎలాగా వదిలిపోయింది. జ్యోతిని ఎందుకు అందుకో కూడదు తను? మళ్ళీ పెళ్ళా? సంఘం ఒప్పుకోవద్దూ? సంఘం మాట దేవుడేరుగును! ముందు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవద్దూ?..... అందరి కంటే ముందు అక్కయ్య చేత ఊ అనిపించాలి. అది చాలా కష్టమైన విషయం. పోనీ, అక్కయ్యను కూడా ఒప్పించా మయ్యా-- మాధవరావు గారు అంగీకరించవద్దూ? తన కూతురి కి రెండవ పెళ్ళి ఒప్పుకుంటాడా? అందులో మొదటి భర్య బతికి ఉండగా? ఒక్కనాటికీ ఒప్పుకోడు. పైగా అన్నపూర్ణ తన స్నేహితుని కూతురాయెను. అసలు ఒప్పుకోడు. నైతిక విలువలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తీ అయన. లాభం లేదు. పోనీ అని వీళ్ళ ఎవరి ఒప్పుదలా లేకుండా పెళ్ళి చేసుకుందామా అంటే తీరా అంతా సిద్దం అయాక ఆ రామదాసు తన కూతురిని తీసుకు వచ్చి "ఇదిగో, నా కూతురు . దీన్ని మొదట పెళ్ళాడాడు ఈ ఆనంద్." అంటూ గొడవ పెడితే , గవర్నమెంటు తన మీద చర్య తీసుకుంటుంది. ఆపైన ఉద్యోగం కూడా పోవచ్చు.
ఇలా ఆలోచిస్తూ వస్తున్న ఆనంద్ ను చూసి "ఏం, అలా నెమ్మదిగా నడుస్తున్నారు? పాపం! ఇన్ స్పెక్టర్ గారికి కాళ్ళు పీకుతున్నట్లున్నాయి. ఉండండి. రిక్షా పిలుస్తాను" అంటూ అతని సమాధానం కోసం వేచి ఉండకుండా రిక్షా పిలిచేసింది జ్యోతి.
"నువ్వు నడిచి వస్తే నేను రిక్షాలో రానా?" అన్నాడు ఆనంద్.
"ఎందుకు ? నేనూ రిక్షాలోనే వస్తాను. మీకు అభ్యంతరం లేకపోతె."
ఈమాటు ఆనందం కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఎమిటంత చురుగ్గా మాట్లాడేసి చకచక నిర్ణయం చేసేస్తుంది? తనేమి అంటున్నదో, దాని పర్యవసానం ఏమిటో ఏమైనా ఆలోచించిందా? అనాలని అందా, లేక ఏదో అనేసిందా?
"ఏమిటి ఆలోచిస్తున్నారు? మీకేమైనా అభ్యంతరమా?"
"అభ్యంతరం ఏమీ లేదు...."ఆనందం ఇంకా వాక్యం పూర్తీ చెయ్యకుండానే "మరింకేం" అంటూ వచ్చి పక్కన కూర్చుని "పోనియ్యవోయ్." అంది.
జ్యోతి ప్రవర్తన ఆనంద్ కు ఎబ్బెట్టు గా అనిపించింది. అబ్బే! ఆడది ఇంత మరీ మొండి కెత్తి పోకూడదు. మనస్సు లో కొంచెం విసుక్కున్నాడు ఆనంద్. ఉండబట్టలేక అనేశాడు: "మనిద్దరం ఇలా ఒక రిక్షాలో వెళ్ళడం చూస్తె ఎవరైనా ఏమనుకుంటారు?"
"ఏమనుకుంటారు? స్నేహితులు అనుకుంటారు."
"ఆ! అనుకుంటారు."
జ్యోతి నవ్వి "పోనీ, భార్యా భర్తలు అనుకుంటారు . సరా?" అంది.
"నీది ఎలాగయినా చాలా దురుసు స్వభావం సుమా! ఒక్కొక్కప్పుడు ప్రమాదానికి దారి తీస్తుంది."
'అలా ఏదో ఒక ప్రమాదమో, ప్రమోదమో తీవ్రమైనది రావాలి కాని, చప్ప చప్పగా ఏమిటీ జీవితం?"
ఆమెను చూస్తె ఆనందానికి ఒక్క క్షణం భయం వేసింది. ఆ ఇరుకు రిక్షా లోనే కొంచెం ఎడంగా కూర్చున్నాడు. అతని భయం చూసి జ్యోతి నవ్వుకుంది. పాపం! ఎంతైనా మగవాడు! తన ధైర్యం అతని కేలా ఉంటుంది?
రిక్షా గతుకుల్లోంచి పోయినప్పుడు ఆనందం మళ్ళీ జ్యోతి కి దగ్గరయ్యాడు. ఈమాటు జ్యోతి దూరంగా జరిగి కూర్చుంది. కూర్చోవాలనే. ఆనంద్ లో కోరిక రెక్కలు కట్టుకుంది. నెమ్మదిగా ఆమె వేపు జరిగాడు. ఆమె తనలో తనే నవ్వుకుంది. వెనక నుంచి చెయ్యి వేసి దాదాపు ఆమెను పొదివి పట్టుకున్నట్టు కూర్చున్నాడు. జ్యోతి ముఖంలో గర్వంతో కూడిన విజయరేఖ పొడసూపింది.
ఫరవాలేదు. ఆనంద్ మరీ భయస్తుడు కాదు. తను ఊహించినట్లే సాహసం, ధైర్యం ఉన్నవాడు. సంప్రదాయాలు అనే కొన్ని సంకెళ్ళు అజ్ఞాతంగా ఇతని స్వేచ్చను అపు చేస్తున్నాయి. కానీ, లేకపోతె ఎంతకేనా సిద్దపడే వాడే. కట్టుకున్న అన్నపూర్ణ ను కాదనడానికి పూనుకున్నాడా? మొదట్లో అనుమానించినా, తన పొత్తు కోసం తహతహ లాడడం ప్రారంభించాడా? ఇలాగే ఇంకా ఇంకా తనవాడుగా చేసుకుంటే, తన ఊహల్లో ఉన్న పురుష మూర్తికి ఇతడు రూపకల్పన.
ఎన్.సి.సి. డ్రెస్ లో ఫోటో ద్వారా తనకు పరిచయమైనప్పుడే తనను అతనికి అర్పించుకోంది. తనకు అతనితో వివాహం నిశ్చయం అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలన్నీ నిరాశలు కాగా, తనతో ఏమాత్రమూ సరితూగని అన్నపూర్ణ తన పెన్నిధి ని తస్కరించి ఆనందించబోయింది. అది తనకు తల కొట్టిసినట్టు అయింది. ఊళ్ళో అందరూ "జ్యోతి నచ్చక, అన్నపూర్ణ ను చేసుకున్నారట" అంటూ అనుకుంటుంటే తనకు భరించరాని అవమానం అయిపొయింది.
అంతా సహించి పైకి నవ్వుతూ ఇన్నాళ్ళూ కాలక్షేపం చేసింది తను. ఇన్నాళ్ళ కు ఈ అవకాశం దొరికింది. ఇంత కింతా కక్ష తీర్చుకోవాలి తను! ఎవరి మీద? ఎవరి మీదేమిటి? అందరి మీదాను. లోకం మీద. తను సుఖ పడుతుంటే లోకం అంతా ఏడవాలి. అసూయతో, అవమానంతో ప్రపంచం అంతా సంక్షుభితం అవుతుంటే తను నవ్వుతూ, ఆనందించాలి.
జ్యోతి ఇలా ఆలోచిస్తుండగానే హాస్టలు వచ్చేసింది. "అప్పుడే వచ్చేసిందా?' అన్నాడు ఆనందం. అతని మాటలు విని జ్యోతి నవ్వింది.
"థాంక్స్ . వస్తానండి. అన్నట్టు ....వచ్చే నెల పదిహేనో తారీఖున టౌను హాలులో నా డాన్సు ఉంది. కాంప్లిమెంటరీ పంపుతాను, వస్తారా? లేకపోతె అంతదూరం తుని నుంచి రావడం దేనికని బద్దకించి ఊరుకుంటారా?"
"అబ్బెబ్బే-------తప్పకుండా వస్తా."
"చూస్తాగా!"
"చూస్తావుగా! గుడ్ నైట్."
"గుడ్ నైట్" అంటూ జ్యోతి హాస్టలు లోకి వెళ్ళింది. ఆనందం వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు.
16
ప్రత్యేకం జ్యోతి డాన్సు చూడటానికి సెలవు పెట్టివచ్చాడు ఆనంద్. ఆనంద్ తో పాటు జానకీ కూడా బయలుదేరింది టౌను హాలుకు. వాళ్ళు చేరుకొనే టప్పటి కే హాలంతా కిటకిట లాడుతూ ఉంది. వరసగా ఎక్కడేనా రెండు సీట్లు ఉన్నాయేమోనని వెతికారు. లాభం లేకపోయింది. అందువల్ల జానకి ఓ సీటులో కూర్చుండ బెట్టి కొంచెం దూరంలో ఖాళీ గా ఉన్న ఇంకో సీటులో తను కూర్చున్నాడు ఆనంద్. కొంచెం సేపటికి ప్రదర్శన ప్రారంభం అయింది.
అది పార్వతి తపస్సు. పార్వతి వేషంలో జ్యోతి ముగ్ధ మోహనంగా ఉంది. తపస్వి నికి తగినట్లు విరలంకారగా, కాషాయంబరాలూ , రుద్రాక్ష లూ ధరించి రంగప్రవేశం చేసింది. ఆహార్యానికి తగ్గట్టు అభినయం కూడా మేళవించి, జ్యోతి చూపిస్తున్న నటనా వైదగ్ధ్యానికి సదస్సు లందరి తో పాటు ఆనంద్ కూడా పరవశుడయ్యాడు. తలిదండ్రుల ప్రార్ధన పెడచెవిని పెట్టి, మహేశ్వరుని చేపట్టే మహాత్సంకల్పం తో తపస్సు చేసిన ఆ జగజ్జనిని తనుముండు సాక్షత్కారించిందా అన్నంతగా ఆనందిస్తున్నారు ప్రేక్షకులు.
కపట బ్రహ్మచారి రూపం లో శివుడు ప్రవేశించి ఆమెతో వాగ్వాదం ప్రారంభించినపుడు పార్వతి గా జ్యోతి ప్రదర్శించిన త్రాప, దైన్యం ఆగ్రహం మొదలైన వివిధ మనః ప్రవృత్తులు, ముఖ కవళికల్లో , భ్రుకుటి నిక్షేపాల్లో , హస్త విన్యాసం లో , లయానుగతిక రస జగత్తు లో , ప్రకృతి పులకించే ఆ గంబీర ప్రేక్షక మహా మౌని సాగరం లో తాను కూడా ఒకడై ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు ఆనంద్.
పార్వతి చెయ్యి తటాలున శివుడు పట్టుకునే ఘటం వచ్చింది. సరిగా ఆ సమయంలో జానకి పక్క సీటులోనే కూర్చుని ఉన్న ఒక యువకుడు ప్రేక్షకులలో నుంచి లేచి నిలబడి "కంగ్రాచ్యులేషన్స్ -- తపస్సు ఫలించింద'ని అరిచి తిరిగి కూర్చున్నాడు. ఆ సమయంలో అలా జరిగిన రస భంగానికి అంతా విసుక్కున్నారు. ఆనంద్ పక్కకు తిరిగి చూశాడు. ఆ యువకుడికి ఇరవై ఏళ్ళు ఉంటాయి. తెలివైన ముఖం, చురుకైన కళ్ళు. ఖరీదయిన దుస్తుల్లో మగవాళ్ళ కే ఆకర్షకంగా ఉన్నాడు. తెర వాలింది. ఆనంద్ ఆ అబ్బాయి కేసే చూస్తున్నాడు. అతను పక్కనే ఉన్న జానకి తో ఏదో మాట్లాడుతున్నాడు. జానకి నవ్వుతున్నది. ఆనంద్ కు ఏమీ అర్ధం కాలేదు. ఎవరో ఆ అల్లరి కుర్రాడితో తను నవ్వుతూ మాట్లాడుతుందేమిటి? ఆనంద్ ఆటే చూస్తున్నాడు. జానకి అతనితో మాట్లాడుతూ మధ్య మధ్య తన వేపు వేలు పెట్టి చూపిస్తున్నది. ఇలా కొంతసేపు జరిగాక జానకి అతన్ని తీసుకుని ఆనంద్ వేపు వచ్చింది.
"ఈయనే మా మామయ్య. పోలీసు ఇన్ స్పెక్టరు. ఈయన తిలక్. రోటరీ క్లబ్ లో ప్రిజువచ్చింది అన్నాను?" అంటూ ఇద్దరినీ ఒకళ్ళ కొకళ్ళకు పరిచయం చేసింది జానకి.
"అలా బయటకు వెళ్ళి వద్దాము రండి" అన్నాడు తిలక్. ముగ్గురూ రోడ్డు మీదకు పోయి డ్రింక్స్ తీసుకున్నారు.
"మీ గురించి జానకి చెబుతూ ఉంటుందండి!" అన్నాడు తిలక్. ఆనందం చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
"మీరు ప్రస్తుతం తునిలో పని చేస్తున్నారా?"
"అవునండి . త్వరలో కాకినాడ రావచ్చు."
"ఆహా! వెరీ గుడ్. చప్పున రండి, బాబూ! మాలాంటి కుర్రకారు విద్యార్ధులకు మీవంటి మిత్రు లొకరు పోలీసు డిపార్టుమెంటులో ఉండటం ఎంతైనా అవసరం."
"ఏం?" అన్నాడు ఆనంద్.
"ఎంతైనా , కుర్రాళ్ళం చూడండి! ఏ మీటింగు లోనయినా కొంచెం చలాకీ గా ఉన్నా, ఏ రాత్రి వేళో లైటు లేకుండా సైకిలు మీద వెళ్ళినా ఈ పోలీసు వాళ్లతో చాలా చిక్కుగా ఉంది. ఇంక మీరీ ఊరువచ్చాక అంటారా? ఫలానా ఇన్ స్పెక్టరు గారు మా స్నేహితులు , పోవోయ్! అని పోలీసు వాళ్ళను కొంచెం డబాయించవచ్చు."
"అలా అని నామీద ఆశలు పెట్టుకొని అల్లర్లు చేశారంటే చిక్కుల్లో పడతారు. జాగ్రత్త. సమయం వచ్చేటప్పటికి నేను మిమ్మల్ని అదుకోక పోవచ్చు."
"ఏం?"
"ఆనంద్ నవ్వుతూ "మరేం లేదు. పోలీసులను నమ్మరాదు. వాళ్ళు స్నేహితులకే ఎసరు పెడతారు, అవసరం అయితే " అన్నాడు.
తిలక్ నవ్వుతూ "ఫరవాలేదు లెండి. మీ విషయంలో అది జరగదని నాకు నమ్మకం ఉంది లెండి" అన్నాడు.
"ప్రదర్శన అయిపోతూ ఉంటుంది. లోపలికి వెళదాం రండి" అంది జానకి. ముగ్గురూ లోపలికి వెళ్ళారు. అప్పటికే శివతాండవం మంచి రస కందాయంలో ఉంది. శివుని తాండవం, పార్వతిలాస్యం ఎంతో అందంగా ఉన్నాయి. పార్వతి గా జ్యోతి తన శక్తి నంతా ఉపయోగించి అద్భుతంగా నటిస్తున్నది. అందానికి సరిపడిన ఆహార్యం, ఆహార్యానికి దీటైన అంగ విన్యాసం వీటన్నిటినీ మించి పాత్రలో లీనమై నటిస్తున్న అద్భుత విధానం చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకుల మనస్సులను ఉర్రూతలూగించి కొన్ని క్షాణాలపాటీ లోకాన్ని మరిపించి తుదకు సమాప్తం అయింది. ప్రేక్షకుల కరతాళధ్వనులు మిన్ను మిట్టాయి.
జనం అంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయాక ఆనందం, తిలక్, జానకి గ్రీన్ రూమ్ దగ్గరికి వెళ్ళారు. ఆనంద్ వచ్చినందుకు జ్యోతి ఎంతో సంతోషించింది.
"మొత్తం మీద మీరు సభా ముఖంలో నన్ను కంగ్రాచ్యులేట్ చేశారు , పందెం నెగ్గారు." అంది జ్యోతి తిలక్ తో.
"ఒకసంగతి" అంది జ్యోతి. అంతా ఆమె కేసి చూశారు.
"రేపు ఆదివారమే కనక, మనం నలుగురమూ సముద్రపు ఒడ్డుకు వెళ్ళాలి షికారు. సరిగా నాలుగు గంటలకి జగన్నాధ పురం వంతెన దగ్గర గంట స్తంభం సమీపంలో కలుసుకోవాలి-- ఏం?"
"ఇప్పుడా వంతెనా, గింతేనా ఏమీ లేదు . పడగొట్టేశారు."
"ఆహా! నేనీ మధ్య అటు వెళ్ళలేదు. పోనీ ఆ ప్రాంతం లో అనుకో -- నేనేల్లాగో మా వార్డెన్ పర్మిషన్ తీసుకుని వస్తాను" అంది.
అంతా "సరే" అంటే "సరే" అన్నారు.
