Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 25

 

    "నాన్నా....నీకెందుకు  నాన్నా....నాన్నను మించిన..... పోగరుబోతు మీ అమ్మ ఉంది."
    "నాన్నా!" సహించలేనట్టు బాధగా అన్నాడు వాసు.
    గబగబా మాట్లాడిన ప్రసాదరావు కి పొడి దగ్గు వచ్చి గుండె చేత్తో అదుముకున్నాడు. అతని గొంతు నెమ్మదిగా రాస్తూ, "ఆవేశపడి నన్నన్ని మాటలతో నొప్పించారు. మీరు బాధ పడిపోతున్నారు. ఇదిగో, నోరు తెరవండి. కొంచెం మంచినీళ్ళు తాగండి. మీకు దూరంగా ఇంకెలా పోగలను? తెలియని వయస్సు లో దూరంగానే బ్రతికాను" అంటూ ఓ గ్లాసు మంచి నీళ్ళు ప్రసాదరావు గొంతులో పోశాడు వాసు.
    కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఈజీ చెయిర్లో  జారబడి, ఆయాసం, ఆవేశం తగ్గిన ప్రసాదరావు కళ్ళు తెరిచాడు. ఎర్రబడిన కళ్ళూ, తడిసిన కనురెప్పలూ. గబగబా రుమాలుతో మొహం తుడుచుకున్నాడు వాసు. ఆ పితృ హృదయం కరిగిపోయింది కొడుకుని చూసి. "తల్లీ తండ్రి లేని వాణ్ణయినా, ఈ వయస్సు లో ఇంత బాధ పడలేదు నేను.' గొణిగినట్టన్నాడు ప్రసాదరావు.
    "నేనేం పాపం చేశాను? ఏం తప్పు చేశాను? నన్ను ఎందుకిలా హింసిస్తున్నారు మీరూ, అమ్మా కూడా! అసలు మీకు పుట్టడమే నా పోరపాటంటారా?....ఒక్కసారి పీక నులిమి చంపేస్తే పోలే?"
    "బాబూ!" జలజలా కన్నీళ్లు చెక్కుల మీంచి జారిపోతుంటే నిలువునా కంపిస్తూ నిలుచున్న వాసుని కదిలిపోయే హృదయానికి బలంగా హత్తుకున్నాడు ప్రసాదరావు. గండి తెగిన ఏరులా గుండెల్లో నిండిన దుఃఖం కళ్ళ లోంచి ప్రవహించసాగింది వాసుకి. "ఛ , ఛ! అదేమిటి? ';నేనేం ఆడపిల్లనా?" అన్నావు ఓసారి. ఇప్పుడు అచ్చం ఆడపిల్లలా కనిపిస్తున్నావు నాకు.... మీ అమ్మ..... మీఅమ్మ ఉద్యోగం చేయ్యమందా? నా దగ్గర ఏ విషయం దాచకూడదు. మీ అమ్మ ఉద్యోగం చేయ్యమంది కదూ?" వాసు కన్నీళ్లు వత్తి అతని మొహం తన చేతుల్లోకి తీసుకుని, ఆ కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు ప్రసాదరావు. తల అడ్డంగా ఊపాడు వాసు.
    "మరి?" అతన్ని వదిలేస్తూ కనుబొమలు చిట్లించి అడిగాడు ప్రసాదరావు.
    మౌనంగా తల వంచుకున్నాడు వాసు.
    "నేను పంపే డబ్బు చాలకనా? నీకేం కేమన్నా డబ్బు అవసరమయ్యే అలవాట్లు ఉన్నాయా?"
    "అలా అడుగుతా రేమిటి, నాన్నా?' నవ్వబోయాడు వాసు. కోపంతో కొద్దిగా మొహం కందింది.
    "మరి, కారణం?....నువ్వు ఉద్యోగం చెయ్యవలసిన అవసర మేమిటి? ఫస్టు క్లాసులో పాసైన నీకు ఉత్సాహం, శక్తీ లేవంటే ఎలా నమ్మగలను?.... నా కొడుకు కైతే....ఆ రాజు....నీకమవుతాడు రాజశేఖరం మాట చెల్లు చెయ్యి..... కండక్టరు కొడుకు కూడా కలెక్టరవగలడని రుజువు చెయ్యి..... ప్రొద్దు వాలిపోతుంది.....నా జీవితం....నా ఈ నిస్సారమైన బ్రతుకు కాల గర్బం లో లీనమయ్యే లోపున , నా తనువు రాలిపోయే క్షణం లో నన్నాఈ బస్సు కండక్టర్ ....ఇల్లరికపు అల్లుణ్ణి ....వారి ఎదుట ఒడి కుక్కలా బ్రతికినవాణ్ణి.....ఒక్కసారి.... ఒక్కసారి..... తలెత్తనీ!గర్వంగా వారి మధ్య క్షణం దొర్లని నా బ్రతుకు! రాజు.....నీ పెద్ద మామయ్య ఎదుట కలెక్టరు తండ్రిగా ప్రత్యక్షమవుతాను నేను...." ఆవేశంగా పచార్లు చేస్తూ అంటున్న ప్రసాదరావు వైపు చూస్తున్నాడు వాసు.
    క్షణం అలసినట్టు ఊపిరి పీల్చి వదిలి, "మీ తాత హోదా, మీ తాత ఇంటి ఐశ్వర్యం , మీ అమ్మ..... మీ అమ్మ అహం, అనుమానం, కక్ష, ఈర్ష్య, అసూయ, నిర్లక్ష్యం, గర్వం -- ఇన్నీ కలిసి  కసిగా జీవితంతో ఆడుకున్నాయి, బాబూ! ఫలితం ఆ ఇంటి నుంచి తరమబడ్డ నేను, చావడానికి సాహసం లేక, పొట్ట కోసం వేషం మార్చి బస్సు కండక్టరు నయ్యాను. తప్పా? అది ఉద్యోగం కాదూ?....పోనీ... అలా గనుక ఉండకపోతే గుమస్తా గానే జీవితం ఈడ్చేవాడిని. అప్పుడు నిన్ను పెద్ద చదువులు చదివించడం కూడా కష్టమే! అన్నీ ఓ మంచికే, ఏమంటావు?' అని తన్ను తాను సమర్ధించుకున్న ప్రసాదరావు తేలిగ్గా నిట్టూర్చి , చిన్నగా నవ్వి అన్నాడు.
    'ఇలా విడిపోయారు' అని వారూ , వీరు అనుకునే మాటలు గుర్తు వచ్చిన వాసు మౌనంగా తల వాల్చేశాడు.
    "ఈనెలలో స్కూటరు కొంటాను..... యూనివర్శిటీ మామయ్య గారి ఇంటికి చాలా దూరమనుకుంటాను. లే మొహం కడిగేసుకుని కాస్త కాఫీ తాగు. తరవాత మాట్లాడు కుందాం. నాకేమిటో ఒక్కోసారి పిచ్చెక్కేస్తుంది కాబోలు వాగేస్తుంటాను." అంటూ గబగబా కన్నీళ్ళ తో మొహం కడుక్కున్నాడు ప్రసాదరావు.
    కాఫీ కప్పు అందిస్తూ, "చదవమంటే విసుగ్గా ఉందా, వాసూ?' అని నవ్వుతూ తన ఆప్యాయమైన మామూలు గొంతుతో అడిగాడు ప్రసాదరావు.
    "చదువు విసుగేమిటి? చదివించే వాళ్ళ దయ చల్లగా ఉండాలి దానికి" ఉదాసీనంగా అన్నాడు వాసు.
    "నా మీద కోపం వచ్చింది కదూ?"
    "కోపం వచ్చి నేనేం చెయ్యగలను"
    "చదువు మానేసి ఉద్యోగం . అదే నన్ను శిక్షించడానికి ఆయుధం."
    "మీ ఇష్టమే జరగనీయండి నాన్నా!
    ప్రసాదరావు హృదయం ఉప్పొంగి పోయింది. తన మాటను గౌరవించే తన కొడుకు. "హోటల్లో పార్టీ ఇస్తానన్నాను కదూ? అందరూ చూస్తుంటారు. వెళదాం తయారవు.' అంటూ బాత్ రూమ్ వైపు నడిచాడు ప్రసాదరావు.
    సందడిగా పార్టీ ముగిసింది. ప్రసాదరావు ని ఘనంగా పార్టీ ఇచ్చినందుకూ, ఫస్టు క్లాసులో పాసైనందుకు వాసునీ అభినందించారు అతిధులు. ఏమ్. ఏ కూడా ఫస్టు క్లాసులో పాసవాలని ఆశీర్వదించారు.
    తల్లిని సుఖ పెట్టడానికి ఉద్యోగం చేస్తాననే నిశ్చయం క్షణం లో యెగిరి పోయింది. మళ్ళీ యూనివర్శీటీ చదువూ, ఉస్సూరని నిట్టూర్చాడు వాసు.
    షాపు ఓనరు తో ఏదో తన వ్యాపార విషయాలు మాట్లాడుతున్న ప్రసాదరావు టక్కున ఏదో గుర్తు వచ్చినట్టు వాసుకి కబురు చేశాడు.
    "నాన్నా, పిలిచారట?" ప్రసాదరావు ప్రైవేట్ రూమ్ లోకి వస్తూ అన్నాడు వాసు.
    "ఆ, వచ్చావా! నిన్న మన షాపులో కేవో మంచి పాంటు బట్టలు వచ్చాయట. క్రితం సంవత్సరం నాలుగు జతలు తీసుకున్నావు. మరి కొనలేదే! ఏదో మంచి రకాలు చూసి నాలుగు జతలు తీసి టైలరు కిచ్చెయ్." అంటూ అలాగే మౌనంగా ఉండిపోయిన వాసుని చూసి చిన్నగా నవ్వుకుంటూ, "నాకు తెలుసు లేవోయ్! అందరి పిల్లలూ కావాలని మారాం చేస్తే నా కొడుకు వద్దని మారాం చేస్తాడు. ఎంత ఖరీదన్నా నీ ఇష్టం వచ్చిన బట్టలు తీసుకో....ఈ వారం లో మన వాటాకి పాతిక వేలు లాభం వచ్చింది....నువ్వు దర్జాగా ఉండాలి. పది రూపాయలు ఖర్చంటే భయపడేలా కనిపించకూడదు." అన్నాడు ప్రసాదరావు.
    "నన్ను నన్నులా బ్రతకనీయండి , నాన్నా!' చివాల్న వెనుదిరిగి "బాబూ, వాసూ, నాన్నా!' అంటూన్న ప్రసాదరావు పిలుపు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు వాసు.
    చిరాగ్గా టేబిలు మీద పుస్తకాలన్నీ దొంతర పెట్టి, ఆ గదికి టక్కున తాళం నొక్కాడు ప్రసాదరావు.
    
                                                   *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS