Previous Page Next Page 
కౌసల్య పేజి 25

 

    "అవును మరి , నువ్వు కొన్నాళ్ళు ఈ ఊళ్ళో కాపురం చేశావుగా?"
    "నేనూ, నా కాపురమూనూ! అంతా ఒక కల.' విశాలాక్షి నిట్టుర్చింది. జానకి బెంగగా విశాలాక్షి కేసిచూసింది. ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచక జ్యోతి నేలకేసి చూస్తూ ఉండిపోయింది. ప్రస్తావన మార్చే ఉద్దేశంతో అన్నాడు ఆనందం.
    'అయితే అన్నయ్య ఇంకా ఈ కవిత్వపు పిచ్చి వదిలెయ్య లేదన్న మాట! ఊరు వెళ్ళాడటగా?"
    విశాలాక్షి కళ్ళు తుడుచుకుని "ఊరు! ఒక్కమాటేమిటి? లక్ష సార్లు వెళ్ళాడు. అసలు ఇంటి పట్టున ఉంటేగా? వచ్చినప్పుడు మాత్రం ఆ సభలకి వెళ్ళాలి, ఈ సన్మానాలకి హాజరు కావాలి అంటూ పదులూ, పాతికలూ పట్టుకు పోతూ ఉంటాడు" అంది.
    "బాగానే ఉంది."
    "ఇంట్లోకి ఏం కావాలి అని  అడగడం తేవడం ఏమీ లేదు. అగ్గిపెట్టె కావాలంటే, ఆడదాన్ని, దాన్ని పంపించి తెప్పించు కోవలసి వస్తోంది. నువ్వా? పోరుగూళ్ళ లో ప్రవాసాలు చేస్తూ అలాగా, ఇంటి పట్టున ఉండకుండా వాడిలాగానూ! నేనోక్కత్తేనూ ఎలాగరా , ఈ సంసారం ఈదేది?"
    "బాధపడకు , అక్కయ్యా. నేను త్వరలో ఈ ఊరు బదిలీ చేయించుకుంటాను."
    "ఏం చేయించుకుంటావో ఏమో?"
    అప్పటిదాకా వాళ్ళ మాటలు వింటూ ఎంతో ఇబ్బంది గా కూర్చున్న జ్యోతి "ఇంక నేను వెళ్ళి వస్తానండి." అంది విశాలాక్షి తో.
    "ఉండు అమ్మా, వెళ్ళుదువు గాని. మా కబుర్ల లో నీ సంగతి మార్చే పోయాను. ఈ అమ్మాయిని చూశావా, ఆనందం? మన జానకి స్నేహితురాలు. మీ అత్తారి ఊరే -- పెద్దాపురం " అంది విశాలాక్షి ఒక్క గుక్కలో.
    ఆనందం ఏమీ జవాబు చెప్పకుండా ఆలోచిస్తూ ఉండి పోయాడు.
    "ఈ సంగతి విన్నావా? అసలు నీకోసం బాబయ్య మొదట చూసింది ఈ అమ్మాయి నేట. మరి ఎలా నచ్చిందో అతనికి -- ఇంత బంగారు బొమ్మని కాదని ఆ కురూపి ని చేశాడు."
    జరిగినదంతా స్మ్రుతి పధం లో , ఒక్కమారు మెదిలి బరువుగా శ్వాస వదులుతూ "ఎలా నచ్చడం ఏమిటి, చెయ్యాలని చేసినదానికి?" అన్నాడు. ఆ మాట లంటుంటే ఆనందం పళ్ళు పటపటలాడాయి. బాబయ్య లోని అసహనం, కౌటిల్యం , అన్యాయం రూపు కట్టి మనోనేత్రం ముందు కదిలాడాయి.
    "మమ్మల్ని పుల్లేటి కుర్రు లో ఉంచి నువ్వు అనంతపురం ట్రెయినింగు కి వెళ్ళావు చూశావా? ఆ టైము లో మీ మామగారు వచ్చారు."
    "ఊ!" ఆ కబుర్లు వినడం ఇష్టం లేనట్లుగా అన్నాడు.
    "బాబయ్యా , తనూ కలిసి చేసిన అన్యాయం మనకి తెలియదని అనుకుంటున్నాడు కాబోలు -- "పిల్లని ఎప్పుడు తీసుకు వెళ్తారండి, కాపురానికి,' అంటూ అడిగాడు.
    "ఇప్పుడవన్నీ ఎందుకులే అక్కయ్యా?' అంటూ చీదరించుకొని ఇంకో గదిలోకి వెళ్ళి పోయాడు ఆనందం.
    "ప్చ్! ఎంత అన్యాయం జరిగిందిరా, నీకు నాయనా! ఇంక ఏ పిల్లనో చేసి ఉంటె ఈ పాటికి హాయిగా చిలకా గోరింకలలా కాపురం చేస్తూ ఉందురా? ఇందువల్ల పెళ్ళి అయినట్టూ, కాదు, కానట్టూ కాదు. ఎన్నాళ్ళిలా బ్రహ్మచారిగా ఉండి పోవడం?' అంది తనలో తను అనుకున్నట్లుగా పైకి.
    "చీకటి పడిపోయింది. వస్తానండి. మళ్ళీ వార్డెన్ కేకలు వెయ్యకుండా వెళ్ళాలి." అంది జ్యోతి.
    "ఉండమ్మా . చీకట్లో ఒక్కోత్తేవూ ఎలా వెళ్ళుతావు? నువ్వు కూడా వెళ్ళు జానకీ సాయం."
    "వచ్చేటప్పుడు జానకి ఒక్కత్తే రావద్దు టండీ?" జ్యోతి నవ్వుతూ అంది.
    "మరే! నా మతి మండినట్టే ఉంది. ఉండు. ఒరేయ్ , ఆనందం! జ్యోతిని కాస్త వాళ్ళ హాస్టలు దాకా దిగబెట్టి రా." ఆమె కేక విని ఆనందం ఇవతల గదిలోకి వచ్చాడు.
    "ఎందుకండి. మీకు చాదస్తం గాని? తరుచు తిరిగేదానికి ఇవాళ కొత్తేమిటి?"
    "పోనీలే , అక్కయ్యా. అలా బలవంతం పెడతావు ఎందుకూ? తనతో ఎవరూ రావడం ఇష్టం లేదేమో" అన్న ఆనందంతో "బాగానే ఉంది. అలా అయితే రండి." అంది జ్యోతి.
    పదిగజాలు నడిచి వచ్చాక "రిక్షా కట్టించనా?' అన్నాడు ఆనంద్, తమ ఇద్దరి మధ్యా అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ.
    "ఏం? మీకు కాళ్ళు పీకుతున్నాయా?"
    "అబ్బే-- మీకు వార్డెన్ వల్ల...."
    "ఫరవాలేదు లెండి. ఆ సంగతి నేను చూసుకుంటాను."
    "ఓ! అయితే ఇంక నెం? నడవండి. కాని ఒక్క విషయం. పోలీసు వాళ్లతో సమానంగా నడవడం అంటే మాటలు కాదు."
    "ఏం భయం లేదు. అంతగా ఎక్కడ నడవ లేకపోతె అక్కడే రిక్షా కట్టించుకోవచ్చు లెండి."
    కొంతసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.
    "ఒక్క విషయం అడుగుతాను, చెబుతారా?' అంది తల వంచుకుని నడుస్తూ.
    "అడగండి " అన్నాడు ఆనంద్.
    "చెబుతారా?"
    "ఊ!"
`    "ఒట్టేయండి" అంటూ చెయ్యి చాపింది.
    ఆనంద్ కొంచెం సేపు తటాపటాయించాడు.
    "ఊ!" సందేహిస్తూ , ఆమె చేతిలో చెయ్యి వేశాడు.
    జ్యోతి చట్టున అతని చేతిలోంచి తన చెయ్యి తీసేసుకుంది. ఆనంద్ తప్పు చేసిన వాడిలా తొట్రు పడ్డాడు. కొంతదూరం ఇద్దరూ మౌనంగా నడిచారు. అతనితో మాట్లాడటానికి ఆమె ఎంత జంకుతున్నదో , ఆమెతో మాట్లాడటానికి అతనూ అంతే భయపడుతున్నాడు.
    చివరకు ఎలాగో అలాగ ధైర్యం తెచ్చుకుని "కోపం వచ్చిందా ?' అంది.
    "ఎందుకు?' అన్నాడు ఆనంద్.
    దానితో జ్యోతి హృదయం తేలిక పడింది. 'అబ్బే -- ఊరికే" అంది కింద పెదవి పంటితో నొక్కి పెడుతూ.
    "జ్యోతీ!" అన్నాడు ఆనంద్.
    ఆలోచనల బరువుతో అన్యమనస్కగా నడుస్తున్న జ్యోతి ఉలిక్కిపడి అతని కేసి చూసింది.
    "ముక్కూ మొహం తెలియని ఒక అపరిచితుడునితో ఇలా అర్ధరాత్రి వేళ ఒక్కత్తేవూ బయల్దేరడానికి సాహసించావు కదా, ప్రమాదం కదూ?' అన్నాడు.
    కనుబొమలు ఎత్తి ఆసక్తి తో కూడిన ఆశ్చర్యం తో "ఏమిటా ప్రమాదం?' అంది.
    ఏమి సమాధానం చెప్పాలో ఆనంద్ కు తోచలేదు.
    'ఆహా!అది కాదు."
    "మరి?"
    "అదే....నేను మర్యాదస్తుడ్ని కనక సరిపోయింది....."
    "లేకపోతె నన్నేదో అవమానం చేసి, అభాసు పాలు చేసి ఉందును అంటారు. అంతేనా?"
    "కాదు మరి?"
    "పెద్ద మనుషులయి మీరు చేసింది ఏమిటి?"
    "నేనా?"
    "అవును. ఇందాక చేతులో చెయ్యి వెయ్యమన్నప్పుడు...."
    ఆనందాని కామాట కొరడా తో "చళుక్ ' మని పించినట్లయింది. నిజమే. తనను తానె మరిచిపోయిన ఆ ఉద్రేకమయిన క్షణాల్లో తనేమీ చేశాడో , ఎలా ప్రవర్తించాడో తనకే తెలియదు. బహుశా తనలో కలిగిన ఈ సంచలనం ఆమె అర్ధం చేసుకో గలిగినంత స్పష్టంగా తను ప్రవర్తించి ఉంటాడు. అది తలుచుకుంటే అతనికి సిగ్గు వేసింది.
    "అవును, నిజమే " అన్నాడు తన తప్పు ఒప్పుకొంటున్నట్లు.
    "అందువల్ల , బలహీనతకీ పెద్దా , చిన్నా తారతమ్యం ఏమీ లేదని ఒప్పుకుంటారా?"
    "అదెలాగ?"
    "ఏం?"
     "నేను బలహీనుడ్ని కావచ్చు. నాలాగే పైకి పెద్ద మనుష్యులమని చెప్పుకొనే వాళ్ళందరూ బలహీనులు కావచ్చు."
    "పైకి చెప్పడమే కాదు. నిజంగా తమని తాము నమ్మించుకునే వాళ్ళ మాటా అంతే."
    "కావచ్చు . కాని.....నిజమైన పెద్ద మనుష్యులు అంటూ కొందరుంటారు. వారు ఎంతటి బలహీన పరిస్థితి లో కూడా లొంగి పోరు."
    "లొంగి పోరు అనకండి. వారు లొంగి పోయేటంతటి పరిస్థితులు వారికి రాలేదు అనండి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS