(1).jpg)
"ఎక్కడి నుంచి రావడం?' చిరునవ్వుతో ప్రశ్నించాడు ప్రసాదరావు.
"అమ్మ దగ్గరి నుంచి,' బట్టలు మార్చుకుని బాత్ రూమ్ వైపు నడుస్తున్న వాసు జవాబు.
"ఓ! అంతా బాగున్నారా?"
ఈ నాలుగు సంవత్సరాల్లో అమ్మ దగ్గిరి నుంచి వస్తున్నానని చెబితే మౌనం వహించే ప్రసాదరావు , ఆప్రయట్నంగా 'అంతా బాగున్నారా?" అని ప్రశ్నించాడు.
"బాగున్నారు, నాన్నా!" అన్నాడు తండ్రి వైపు సంతోషంగా చూస్తూ.
ఫ్లాస్కు లో కాఫీ గ్లాసు లో వంచి ఆ గ్లాసందిస్తూ ."తీసుకో......అలా నీరసంగా ఉన్నావే? మధ్యాహ్నం ట్రెయిన్ లో ఏం తీసుకోలేదా?' అని అడిగాడు ప్రసాదరావు.
"భోజనమే చేశాను, " కాఫీ సిప్ చేస్తూ వాసు జవాబు.
"బాగా వ్రాశావా? క్లాసు వస్తుందా?"
'అనుకుంటున్నాను.' చిన్నగా నవ్వి అన్నాడు వాసు.
కొన్ని నిమిషాల తరవాత గుండె అరచేత్తో అదిమి దగ్గబోతున్న ప్రసాదరావు వైపు కలవర పాటుగా చూస్తూ, "మళ్ళీ దగ్గు వస్తుందా?' అన్నాడు వాసు.
'అబ్బే....ఈమధ్య బాగానే ఉన్నాను. మళ్ళీ నాలుగు రోజులై ....' మళ్ళీ దగ్గు తెర అడ్డు వచ్చింది.
"ప్చ్! మీకు చాలా నిర్లక్ష్యం శరీరమంటే.... ఇదిగో, కొంచెం కాఫీ తాగండి." అతని నోటికి కాఫీ గ్లాసందించాడు వాసు.
మధుమతి మినహా అందరి యోగక్షేమాలు ప్రశ్నించాడు ప్రసాదరావు.
'అమ్మ ఎందుకనో బాగా పాడై పోయింది, నాన్నా!" తనకి తానె చెప్పాడు వాసు. ఒక క్షణం వాసు వైపు చూసి మొహం తిప్పుకున్నాడు ప్రసాదరావు.
ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు ప్రసాదరావు నుంచి వస్తాయని ఆశించిన వాసుకి అసంతృప్తే ఎదురైంది. ఆ క్షణం లో "నేను మినహా మరెవ్వరూ అమ్మ గురించి పట్టించుకోరు. ఆమె ఎవ్వరికీ అక్కర్లేదు.' అనుకున్న వాసు హృదయం కదిలి కళ్ళు చెమ్మగిల్లాయి. చప్పున మొహం తుడుచుకుని, "మందు వాడుతున్నారా?" అని అడిగాడు.
"ఆ వాడుతున్నాను." ఆ జవాబు లో నిర్లక్ష్యం.
తల్లీ, తండ్రి ఇద్దరి అంతర్యం అర్ధం కాని వాసు అయోమయంగా శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.
రాత్రి వాసుకి భోజనం, ప్రసాదరావు కి చపాతీ టేబులు మీద పెట్టాడు నౌకరు కుర్రాడు.
"మీరు భోజనం చెయ్యరా?' అడిగాడు వాసు.
"అరగడం లేదు, వాసూ! ఓ వయసొచ్చాక రాత్రి భోజనం మానెయ్యడం మంచిదన్నారు డాక్టరు."
కొన్ని క్షణాలేమో ఆలోచించిన వాసు -- "ఓ వంట మనిషిని ఏర్పాటు చేసుకుంటే?.... కాదు, హోటలు భోజనం కన్నా ఆరోగ్యం కదూ?" అన్నాడు ప్రశ్నార్ధకంగా ప్రసాదరావు వైపు చూస్తూ.
మౌనంగా చపాతీ ముక్క విరిచి నోట్లో కుకున్నాడు ప్రసాదరావు.
"ఏమంటారు?' రెట్టించాడు వాసు.
"చూద్దాం లే!" అన్నాడు ప్రసాదరావు తేలిగ్గా నవ్వేస్తూ.
ఉదయం షాపు కి వెళుతున్న ప్రసాదరావు వెనక తానూ నడిచాడు వాసు.
"ఆ అకౌంట్లేవో నే చూస్తాను. మీరు రెస్టు తీసుకోండి." అంటూనే తన చేతిలో అకౌంట్ బుక్సు లాక్కున్న వాసు వైపు తృప్తిగా చూస్తూ, "నీకేం తెలుస్తాయి, బాబూ, ఇవన్నీ" అని వారించబోయాడు ప్రసాదరావు.
"తెలియనివి మీరు చెప్పవచ్చుగా?' నవ్వేశాడు వాసు.
కొన్ని కొన్ని వివరాలు మాత్రమే అడిగి తాను చూడవలసిన అకౌంట్లు , బాలాన్సు లూ చకచకా ఆరోజు తను పూర్తీ చెయ్యాలనుకున్న పని కొన్ని గంటలలో పొరపాట్లు లేకుండా పూర్తీ చేసిన వాసు సామర్ధ్యానికి వివశుడై ఆనందించాడు ప్రసాదరావు.
సంతోషంగా , హుషారుగా నవ్వుతూ మాట్లాడే ప్రసాదరావు , ముభావంగా , అన్యమనస్కంగా ఒకటి రెండు పొడి మాటలు చెప్పే వాసు. నాలుగు రోజులు దొర్లిపోయాయి.
రిజల్డ్స్ చూసిన ప్రసాదరావు ఉక్కిరిబిక్కిరై పోయాడు సంతోషంతో. అడిగిన వారికీ, అడగని వారికీ "మావాడి నెంబరిదిగో . ఫస్టు క్లాసులో పాసయ్యాడు." అంటూ చెప్పేస్తున్నాడు. "డిన్నారివ్వాలి...అధమం మంచి పార్టీ అన్నా ఇవ్వాలి." వాసు పాసై నందుకు అభినందిస్తూ "ఈవేళే పార్టీ ఇయ్" అంటున్నారు స్నేహితులు, పరిచయస్థులునూ.
"సాయంత్రం మూడు గంటలకి ఫలానా హోటలు లో మీ అందరికీ పార్టీ!' అని ఆహ్వానించాడు వారందరినీ.' పరీక్ష ఫస్టు క్లాసులో పాసయినందుకు సంతోషం కన్నా, ఉద్యోగం ఎలా సంపాదించాలనే దీర్ఘాలోచనలో పడిపోయిన వాసు- "బాబూ, మామయ్యా కి ఉత్తరం రాద్దాం అక్కడ యూనివర్సిటీ లోనే అప్లై చేద్దాం..... ఈవేళే కంపెనీకి ఆర్డరు ఇస్తాను-- స్కూటరు తీసుకుందాం. జాగ్రత్తగా నాలుగు రోజులు ప్రాక్టీసు చేశావంటే...." అంటూ ఇంకా ఏమో అనబోతున్న ప్రసాదరావు తో- "మరి చదవను, నాన్నా!" అన్న వాసు గొంతు విని, ఉలిక్కిపడి "ఏమంటున్నావు?' అన్నాడు.
"మరి చదవను." తల వంచి కూర్చున్న వాసు వైపు పరిశీలనగా కొన్ని క్షణాలు చూసిన ప్రసాదరావు కి ఏమీ అర్ధం కాలేదు.
"ఎందుకు చదవవు? చదివి తీరవలసిందే. ఎన్ని అడ్డంకు లోచ్చినా నువ్వు ఐ.ఎ.ఎస్. ఆఫీసరు అయ్యే దాకా నా మాట వినవలసిందే.' అజ్ఞాపిస్తున్నట్టు దృడమైన గొంతుతో గట్టిగా అన్నాడు ప్రసాదరావు.
తలెత్తి ఒక్కసారి ప్రసాదరావు వైపు బాధగా చూసి మళ్ళీ నెమ్మదిగా తలవాల్చి నేల చూపులు చూస్తూ "క్షమించండి . మరి చదవలేను." అన్నాడు ధైర్యాన్ని పుంజుకుంటూ వాసు.
"కారణం?" ప్రసాదరావు కనుబొమలు ముడి పడ్డాయి.
ఏమో అనబోయి ప్రసాదరావు వైపు చూసిన వాసు భయంగా తల వాల్చేశాడు. "ఇప్పటివరకూ తండ్రి ప్రసన్న వదనాన్నే చూసిన వాసు జేవురించిన ప్రసాదరావు వదనాన్ని చూసి, 'అబ్బా, కోపంలో ఉన్న నాన్న ఎంత భయంకరంగా ఉంటారు!" అనుకున్నాడు. అతని గుండెలు పీచుపీచు మంటున్నాయి.
"బాబూ, ఎందుకు చదవలేవు?" అతను భయపడుతున్నాడని గ్రహించిన ప్రసాదరావు లాలనగా అడిగాడు.
"నేను ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను." కలవరపడే గొంతుతో తడబాటుగా అన్నాడు వాసు.
గొల్లున నవ్వి, "శభాష్, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడా లనుకుంటున్నావు!" అని నొక్కి నొక్కి నిరసనగా అని, మళ్ళీ నవ్వాడు ప్రసాదరావు.
ఆ నవ్వు మామూలు నవ్వు కాదు. క్షణ క్షణం ఓడిపోతున్న మనిషి మొండిగా నవ్వే నవ్వు. మనుషుల్నీ ప్రపంచాన్నీ ఖాతరు చెయ్యని నవ్వు.
బెదిరే గుండెల్ని అదిమి పెడుతూ, చెదిరే ధైర్యాన్ని చిక్కబడుతూ , మౌనంగా బిత్తర చూపులు చూస్తూన్నాడు వాసు. అన్నీ సమకూర్చి చదవమని ప్రోత్సహించే తండ్రి, దీనాతి దీనంగా రోజులిడ్చే తల్లి. అతని మనస్సు పెనుగాలికి లతలా ఊగి పోతుంది.
ఓనాడు చదివించమని ఏడ్చిన కొడుకు ఈనాడు తాను చదువుకోమంటే తిరస్కరిస్తున్నాడు. సహించలేని ప్రసాదరావు మనస్సు ఉడికి పోతుంది. ఉడికి పోయే మనస్సు వివిధ కోణాల్లో ఊహించింది. తననుంచి తన కొడుకు నెవరో దూరంగా బలవంతంగా లాక్కు పోతున్నట్టు బాధపడ్డాడు. నిగ్రహం కోల్పోయిన ప్రసాదరావు అదిరే పెదవులతో "అలా ఎందు కనుకుంటున్నావు? నీకేం లోటు చేశాను నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి ? నా డబ్బు తినడం అంత తప్పు పని అనిపిస్తుందా? నీకే నా డబ్బూ, నేనూ అవసరం లేక పోయినప్పుడు నాకీ వ్యాపార మెందుకు? వ్యవహరమెందుకు? నువ్వు ఐ.ఎ.ఎస్ ఆఫీసరు వై భార్య పిల్లలతో కళకళలాడాలనీ , నీ చేతుల మీదుగా నా తనువూ వెళ్ళాలనీ ఆశించానే! నేనేం పాపం చేశానూ? మీరందరూ నాతొ ఇలా ఎందు కాడుకొంటున్నారు? నన్నెందుకు కేడిపిస్తారు? అసలు..... అసలు ఒంటరిగా , ఏదో వెధవలా బ్రతికే నా దగ్గరి కెందు కొచ్చావు? కాదు, మోసపోయాను..... ఇదంతా ఓ కుట్ర..... మీరంతా కలిసి నన్ను ఫూల్ ని చేశారు.... నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డమంటే నాకు దూరంగా పోవాలనే కదూ?" అంటూ రాళ్ళ వర్షం లా కురిపించే ఆ వాగ్ధాటి కి కొయ్యబారి నిశ్చేతనంగా ఉండిపోయిన వాసు -- "కాదు, నాన్నా' అన్నాడు వణికే గొంతుతో.
