Previous Page Next Page 
కౌసల్య పేజి 24

 

                                     15
    అనంతపురం లో ట్రెయినింగు పూర్తీ చేసుకుని ఆనందం పుల్లేటి కుర్రు చేరుకొనేటప్పటికి జానకి కూడా పి.యు.సి పరీక్ష వ్రాసి సెలవులకు ఇంటికి వచ్చింది. పది పదిహేను రోజులు గడిచి అంతా స్థిమిత పడ్డాక నలుగురూ కూర్చుని సంసార పరిస్థితుల గురించి ముచ్చటించుకున్నారు.
    ఆ ఏడు పండిన పంట అమ్మి అప్పులన్నీ తీర్చి వేయగా ఇంక మిగిలింది అయిదారు వందల కంటే ఎక్కువ లేదు. ఆ అయిదారు వందలు చేత బట్టుకుని వ్యవసాయం వీరి గాడికి అప్పగించి ఆనందానికి ఉద్యోగం రాబోయే ఊరికి వెళ్ళడం మంచిది అని నిర్ణయించుకున్నారు. అలా వెళ్ళడం వల్ల తనకు ఆర్ధికమైన స్వేచ్చ ఉండదనీ, ప్రతి పైసకూ అక్కయ్య మీదో, తమ్ముడి మీదో ఆధారపడి ఉండాలని ముందే గ్రహించాడెమో , ముకుందం అందుకు అంగీకరించలేదు. ఏటా తన సొంత ఖర్చుకు మూడు నాలుగు వందలిస్తే ఆ పద్దతికి తను అంగీకరిస్తాననీ, లేకపోతె వ్యవసాయం అమర్చడం గిమర్చడం ఏమీ లేకుండా, తనే వ్యవసాయం చేస్తూ ఒక్కడూ అక్కడే ఉంటాననీ, తక్కిన వాళ్ళు ఎవళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళవచ్చునని నిష్కర్షగా చెప్పాడు. కొంతసేపు అలోచించి, సొంత వ్యవసాయం చేసి పది పదిహేను వందలు తగల పెట్టడం కన్నా, ఇలా ఏడాది కో మూడు నాలుగు వందలు పాడు చెయ్యడమే మంచిదని నిర్ణయించు కొని ముకుందం షరతు కి అంగీకరించారు విశాలాక్షి, ఆనందమూను.

                                        
    ఇంతలో ఆనందానికి కాకినాడ కు ఇరవై ముప్పై మైళ్ళ దూరం లో ఉన్న తుని లో ఉద్యోగం వేసినట్టు ఆర్డరు వచ్చింది. దానితో ఆనందం ఆలోచనలో పడ్డాడు మళ్ళీ. ఇప్పటి వరకూ తనకు ఖచ్చితంగా కాకినాడ లోనే ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నాడు. అందుకు తగ్గట్టు ప్రయత్నం కూడా చేశాడు. పై అధికారులను కలుసుకున్నాడు కూడా. "ఖాళీలు ఉన్నాయి అలాగే తప్పకుండా వేస్తాము." అని మాట ఇచ్చి చిబరికి ఇలా చేశారు. ఇప్పుడేమిటి చేసేది? అంతా తుని  వెళ్ళడమా? అలా అయితే అంతా ఒకచోటే ఉండవచ్చు. కాని జానకీ చదువు? పోనీ, పెళ్లి చేసి, అత్తారింటికి పంపించేద్దామంటే చేతిలో తగిన డబ్బు లేదు. పెళ్ళీ చెయ్యక, చదువూ చెప్పించక దానిని ఇంట్లో కూర్చోమనడం మంచిది కాదు. పి.యు.సి పాస్ అయితే ఏ బి.ఎ లోనో చేరుతుంది. ఈ మూడేళ్ళూ చదివే లోగా డబ్బు సర్దుబాటు చేసుకుని మంచి సంబంధం ఒకటి చేసెయ్యవచ్చు.
    ఇంక జానకిని నిరుడు లాగే హాస్టల్ లో చేర్పించడమా, కాకినాడ లోనే ఓ ఇల్లు చూసి అక్కయ్యనూ, అన్నయ్య నూ కూడా అక్కడే ఉండమని ఏ వారం పది రోజులకో తనోమారు తుని నుంచి కాకినాడ వెళ్ళి వాళ్ళను చూస్తూ ఉండడమా?
    ఇలా ఆలోచించగా , ఆలోచించగా ఆనందానికి రెండవ పద్దతే మంచిదని తోచింది. జానకి పి.యు.సి పాస్ అయ్యాక, కాలేజీ లు తెరుస్తూ ఉండగా ఆ ప్రకారం కాకినాడ లో ఉంచాడు ఆనందం -- విశాలాక్షి, ముకుందం, జానకి--- ఈ ముగ్గురినీ.
    ఉద్యోగం లో చేరాక, నెలా పదిహేను రోజుల దాకా పని రద్దీ వల్ల ఊరు వదలడానికి వీలులేక పోయింది. తర్వాత ఓ రోజున తీరిక చేసుకుని కాకినాడ వెళ్ళాడు. గుమ్మం మెట్లు ఎక్కుతుండగా , గది లోపలి నుంచి జానకిది కాకుండా ఇంకో అమ్మాయి గొంతు కూడా వినిపించింది ఆనందానికి.
    తీరా గదిలోకి ప్రవేశించేటప్పటికి ఓ కొత్త అమ్మాయి జానకి తో మాట్లాడుతూ కనిపించింది. అతణ్ణి చూసి ఇద్దరూ లేచి నిలబడ్డారు. సహజ సౌందర్యంతో పాటు నాగరికత కూడా కలిసి ఆమె అందాన్ని ద్విగుణీకృతము చేస్తున్నది. అపురూప లావణ్య రాశి అయిన ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది చెప్మా అనుకుంటూ ఆటే చూస్తూ ఉండి పోయాడు ఆనందం. ఆనందాన్ని చూడగానే మనస్సులో వెల్లి విరిసిన సంతోషాన్ని వీలైనంత వరకూ ముఖంలో కనపరచకుండా తల వంచుకొని నిలబడి పోయింది జ్యోతి.
    "అదేమిటి మామయ్యా, తెల్లబోయి అలా చూస్తావు? జ్ఞాపకం లేదూ? జ్యోతి. పెద్దాపురం మాధవరావు గారి అమ్మాయి."
    ఆనందం చిరునవ్వు నవ్వి "అవునవును. జ్ఞాపకం వచ్చింది." అన్నాడు.
    "ఇక్కడ కాలేజీ లో బి.ఎస్. సి చదువు తోంది."
    'ఆహా! బావుంది. కూచోండి. నిలబడ్డారేం? అమ్మేదీ? పెద్ద మామయ్య ఇంట్లో లేడా?"
    "రెండు రోజులయింది పెద్ద మామయ్య ఊరెళ్ళి. ఏదో హైస్కూల్లో నాటక పోటీలు జరుగుతున్నాయట, జడ్జీగా వెళ్ళాడు."
    "బాగానే ఉంది. మరి అమ్మ?"
    "ఇప్పుడే పురాణం వినడానికి వెళ్ళింది గుడికి."
    "ఉహు!" అంటూ ఆనందం ఓ ఈజీ చెయిర్ లో కూర్చున్నాడు.
    "మంచినీళ్ళు కావాలా, మామయ్యా?' అంది జానకి.
    "కొంచెం తెచ్చి పెట్టు."
    జానకి లోపలికి వెళ్ళింది. జ్యోతి ఇంకా అలాగే నిలబడి ఉంది. అది చూసి "కూచో జ్యోతీ! అంత మన్నన దేనికి?" అన్నాడు ఆనందం. కన్నులు ఎత్తి అతనికేసి చూసింది జ్యోతి. ఆనంద్ కూడా సరిగా అదే సమయంలో జ్యోతి కన్నులలోకి చూశాడు. జ్యోతి సిగ్గుపడి కంగారుగా తల వంచేసుకుంది. ఆమె సిగ్గు ఆనందం మనస్సులోని కోరికలకు మొగ్గ తొడిగింది.
    తటపటాయిస్తూ అడిగాడు : "జ్ఞాపకం ఉన్నానా?"
    "అది నేను అడగవలసిన ప్రశ్న .' సుతారంగా అంటించింది. ఆనంద్ ఏదో బదులు చెప్పబోయాడు. ఇంతలో జానకి వచ్చేసింది. వస్తూనే ఇద్దరినీ పరకాయించి చూసి "ఏమిటి? ఇద్దరూ మౌనం గానే ఉన్నారేమిటి? ఏం జ్యోతి? మనిషి కనిపిస్తే సరి, మాట్లాడకుండా వదలవు -- ఇలా మధుర మౌనం వహించావేమిటి?' అంది.
    జ్యోతి ఏమీ సమాధానం చెప్పలేదు.
    ఆనంద్ మాత్రం నవ్వుతూ అన్నాడు. "కొందరు మౌనం గానే ఎన్నో సంగతులు మాట్లాడతారు."
    "అదేమిటి?" జానకి ఆశ్చర్యంగా అంది.
    "అవును. మాటకి అర్ధం పరిమితం. మౌనానికి మాత్రం అపరిమితం.
    జానకి నవ్వింది. జ్యోతి ఆమె వేపు కొరకొరా చూసింది.
    వెంటనే జానకి, "ఆడవాళ్ళ చూపులు ఆడవాళ్ళని భయపెట్ట లేవు." అంది ప్రతి అక్షరం తూచి తూచి ఉచ్చరిస్తూ.
    పాత సంగతి జ్ఞప్తి కి వచ్చి జ్యోతి పకాలున నవ్వింది. అ నవ్వులో వెన్నెలలు విరిసి మల్లెలు వికసించినట్లు అనిపించింది ఆనందానికి.
    "ఊ! ఈ మాటు ఎలా ఉంది?' అంది జానకి.
    "ఆ! ఏలా అయితేనేం అప్ప చెప్పావులే --- మాట!" మూతి ఇటూ అటూ తిప్పింది జ్యోతి.
    'అందుకని, ఎదుట వాళ్ళని అనేటప్పుడు కొంచెం జ్ఞాపకం ఉంచుకో, అదే మనకీ తిరిగి తగులుతుందని."
    "ఈ మాటు జ్ఞాపకం ఉంచుకుంటాలే ------ఇప్పటిదాకా నువ్వింత జాణవని నాకు తెలియదు."
    "అవును. నెరజాణ స్నేహం చేశాక ఆమాత్రం జాణనేనా కావద్దూ?"
    ముచ్చటగా ఉన్న తగువులాట వింటూ నవ్వుతూ కూర్చున్నాడు ఆనంద్. వాళ్ళ తగువు లాటకు పూర్వ సంబంధం ఏమీ అర్ధం కాలేదు అతనికి.
    "అసలు విషయం ఏమిటి?' అన్నాడు కుతూహలంగా.
    "అబ్బే! ఏమీ లేదు మామయ్యా" అంది జానకి.
    "అలా  దాస్తావెందుకు? చెప్పు" అంది జ్యోతి కళ్ళలో కొంటె తనాన్ని కనబరుస్తూ.
    "దాచడాని కేముంది?"
    "మరయితే చెప్పడానికి జంకుతా వేమిటి?"
    "చెప్పు జానకీ!" అన్నాడు ఆనంద్.
    ఇద్దరూ కలిసి తిలక్ కాఫీ కి ఆహ్వానిస్తే అతని గదికి వెళ్ళడం మొదలైన విషయాలు చెప్పారు.
    ఇంతలో విశాలాక్షి పురాణం నుంచి వచ్చింది. వస్తూనే ఆనంద్ ను చూసి "ఎంత సేపయిందిరా, వచ్చి? రెండు నెలల క్రితం మమ్మల్నిక్కడ ఉంచి ఏం వెళ్లాడమో అంతే. మళ్ళీ అయిపూ ఆజా లేదు?' అంది.
    "ఏదో పనుల ఒత్తిడి వల్ల ఆలస్యం అయిపొయింది , అక్కయ్యా. ఎలాఉంది ఇక్కడ? కాలక్షేపం ఒకటి అవుతుంది , మన ఊళ్ళో లాగ కాకుండా . కానయితే పాలూ మజ్జిగ పసిపడవు."
    "ఏం కాలక్షేపం పోనిద్దూ! ఏ పురాణానికో అని అలా ఓమాటు వెళితే తెలిసిన మొహం ఏదో ఒకటి కనిపిస్తుంది. తల కొట్టేసినంత పని అవుతోంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS