"మరి చెప్పకు." ఆవేశంతో , కందిన మొహంతో అన్నాడు వాసు, లేచి నిలుచుంటూ.
"ప్లీజ్! ఎక్స్ క్యూజ్ మీ, వాసూ! నీకు కోపం రావాలనే ఈ నిజాలు చెప్పి నొప్పించాను. అసలు నీకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాను. మీ అమ్మను సుఖ పెట్టడం నీ కర్తవ్యం. నీ దగ్గరుండే చనువుతో అన్నీ చెప్పాను. మా అమ్మా, నాన్నా నీకు డబ్బెలా వస్తుందనే సందేహంతో చచ్చిపోతున్నారు... ఏదన్నా ఉద్యోగం సంపాదించి అత్తయ్య ను తీసుకుపో. "నెమ్మదిగా అంటూన్న జయ చెయ్యి గట్టిగా పట్టి కుదుపుతూ , "థాంక్స్. నాకు కావలసిన సంగతులన్నీ చెప్పావు. మెనీ మెనీ థాంక్స్! మరి వెడతాను" అని చరచరా ఇవతలికి వచ్చాడు వాసు.
"ఈవేళ వెళ్ళిపోతానమ్మా" అన్న వాసు వైపు తెల్ల బోయి చూస్తూ, "ఎక్కడికి వెళ్ళిపోతావు? రిజల్టు రానీ" అంది మధుమతి.
"వెళ్ళి ఏదైనా ఉద్యోగానికి ట్రై చేస్తాను. చిన్న మామయ్య దగ్గరకే!"
'అలాగే వెళ్ళచ్చు. నాలుగు రోజులు ఉండు."
మరి కాదనలేకపోయాడు వాసు. కూతురు వినకుండా నెమ్మదిగా వాసు చెవిలో ఊదేసింది జానికమ్మ, తాసీల్దారు గారు ఉద్యోగం వేస్తానన్నారని , వారింటికి నిన్నో సారి రమ్మన్నారనీను.
ఓ సాయంత్రం గబగబా డ్రెస్ చేసుకుని, 'అమ్మా, అమ్మమ్మతో తాసీల్దారు గారి ఇంటికి వెళుతున్నానమ్మా" అన్నాడు వాసు. "వద్దు, వెళ్ళడానికి వీల్లేదు" అజ్ఞాపిస్తూన్నట్టంది మధుమతి.
"అలా అంటా వేమిటమ్మా! ఇంకో వారం లో రిజల్ట్స్ వస్తాయి. ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉంటుందమ్మా ఈ రోజుల్లో....."
"ఈ ఊళ్ళో .....మళ్ళీ ఆ ఆఫీసులో గుమస్తా ఉద్యోగం వద్దు, బాబూ! అయినా మామయ్య ఏమంటాడో? నీ ఉద్దేశం ఉద్యోగం చెయ్యాలని ఎందుకు మర్చుకున్నావో....నాకేం నచ్చలేదు. నువ్వింకా పైకి చదవగలవు. ఇప్పటిదాకా చదివించిన వారే చదివిస్తారు.....పైకి చదివే అవకాశముంటే నాకోసం..... ఈ దరిద్రపు అమ్మ కోసం నువ్వు ఉద్యోగం చెయ్యద్దు..." ఆమె గొంతు దుఃఖంతో పూడిపోయింది.
"అమ్మా!" అప్రతిభుడై పోయాడు వాసు.
"అంతే. నువ్వు వెళ్ళద్దు వాళ్ళింటికి.' విసురుగా వెళ్ళిపోయింది మధుమతి.
"అమ్మ కిష్టం లేదు. రానమ్మమ్మా!" అన్నాడు తెల్లని చీరగట్టి ప్రయాణమైన జానికమ్మతో.
'దాని మొహం అది బాగుపడదు! ఎదుటి వారిని బాగు పడనివ్వదు!" దురుసుగా అంది జానికమ్మ.
"పోనీ, నువ్వెళ్ళిరా. అమ్మకి కోపం వస్తుంది, నే రాను."
అయిన ప్రయాణం ఆగకూడ దాన్నట్టు గబగబా పక్కింటికి వెళ్ళింది జానికమ్మ.
* * * *
"రండి, రండి. అబ్బాయేడి?" అంటూ మర్యాదగా ఆహ్వానించారు తాసీల్దారు గారు.
"అబ్బాయి మొహమాట పడ్దాడండీ. రిజల్ట్స్ తెలిశాక అడుగుదాం లే అనేశాడు" టక్కున అబద్ద మాడింది, తివాచీ పై కూర్చుంటూ.
'అబ్బాయేడీ?" అదే ప్రశ్న తాసీల్దారు భార్య అన్నపూర్ణమ్మ వేసింది.
"ఏమిటి, హడావుడి గా ఉన్నారు? అమ్మాయి నేవరన్నా చూడ్డాని కొస్తున్నారా?' ఎదురు ప్రశ్న వేసింది జానికమ్మ.
భర్త కేదో సంజ్ఞ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ తానామే మాట విననట్టు.
'అబ్బే....ఇంకెవరు పెళ్ళివారు....మీరే!...ఊ కూర్చోండి. కాఫీ పట్రా, అమ్మా నిర్మలా, బామ్మ గారికి." నవ్వాడు తాసీల్దారు లౌక్యంగా.
"వద్దండీ. ఇప్పుడే కాఫీ అయింది."
"అబ్బాయి వస్తే మంచీ చెడ్డా ఏదో మాట్లాడి, ఏదో అడుగుదామనుకున్నాను.... ఆ అబ్బాయిని అందరం చూశామనుకొండి.... చక్కటి విగ్రహం... తెలివైన వాడిలాగే ఉన్నాడు. వయస్సెంతంటారూ?"
"అబ్బే, లేత వాడేనండి. పంతొమ్మిది .' ఓ ఏడు దాచేసింది జానికమ్మ.
"రాజశేఖరం గారిని కలిశాను... అయన చెప్పేశారు... వాళ్ళ తమ్ముడూ వాళ్ళమ్మాయికి పెద్ద సంబంధం చేసే ఉద్దేశ్యంతో ఉన్నారట. మా అమ్మాయికి పదహారు. ఈడూ జోడూ బాగానే ఉంటుంది." కూతురు వయస్సు రెండేళ్ళు మింగేశారు తాసీల్దారు.
అర్ధం ఆయీ కానట్టు చూస్తుంది జానికమ్మ కాఫీ చల్లారి పోతుంది.
అసలు విషయాని కొచ్చారు తాసీల్దారు. "ఉభయ పక్షాలూ మీరే పెద్దలు. మాకు అదోక్కర్తే పిల్ల. అబ్బాయి కన్నా కాస్త చాయ తక్కువైనా సంసార పక్షంగా మా అమ్మాయి బాగానే ఉంటుంది."
జానికమ్మ ముఖంలో రంగులు మారిపోతున్నాయి. అప్రయత్నంగా ముఖమంతా స్పోటకం మచ్చలతో, నల్లగా మబ్బులా ఉన్న నిర్మల వైపు చూసింది. చివాల్న ముఖం తిప్పుకుని లేచి నిలబడి, "పురాణానికి వెళ్ళాలి. వస్తా మరి" అంది. ఆమెకు ముళ్ళ మీద నిలుచున్నట్లుంది.
"ఒక్క అయిదు నిమిషాలు కూర్చోండి, జానికమ్మ గారూ! పెద్దలూ, నాలుగు కార్యాలు చేసిన వారునూ. మీ అమ్మాయికి, అబ్బాయికీ నచ్చచెప్పి తధాస్తనిపించండి. మా తాలుకూ భూమీ పుట్రా అన్నీ అమ్మాయివే. మేమూ వాళ్ళ దగ్గరుండేవాళ్ళమే అనుకోండి!" నవ్వాడదోలా తాసీల్దారు.
ఒళ్ళు మంటలు లేచాయి జానికమ్మకి. "తాసీల్దారు గారూ, ఇద్దరు వరసైన మేనమామ కూతుళ్ళు ఉండగా పై సంబంధం చేస్తామా? తెలిసీ అడగటం గొప్ప పొరపాటు ... వాడు ఇక్కడ ఉద్యోగం చేయ్యనంటున్నాడు." గబగబా గడప దాటేసింది. "కోరమీసాల వెధవ ఎంత ఎత్తేశాడూ! ఉద్యోగం వేయించి కూతుర్నంట గట్టిందే కాక ఇల్లరికం ఉంచుకుంటాడట. ఉప్పూ , కారం తినేవాడూ, మానం అభిమాన మున్న వాడూ ఇల్లరిక ముంటాడా! దీపం లాటి కుర్రాణ్ణి .... వాణ్ణి వీడి ఇంటికి ఇల్లరికంట...ఎంత అలుసు! వెధవలు ఎంత ఎత్తేశారు! నయం, తెలుసుకున్నాను. రేపోద్దుట పువ్వుల కొస మోస్తుంది గుంట ముండ వాణ్ణి చూడ్డానికే. కాలు విరగ్గోడతాను.' చిరాగ్గా ఇంటికి వచ్చిన జానికమ్మ, డబ్బు లడిగె కూరల మనిషి ని నానా మాటలూ అనేసింది.
"కాఫీ కప్పుతియ్. కూటికి వాచే వాళ్ళకి ఉద్యోగం వేయించి పిల్లనిస్తామంటే కళ్ళు నెత్తి కొచ్చాయి." చల్లారిన కాఫీ వైపు కోపంగా చూశారు తాసీల్దారు.
* * * *
డాబా మెట్లేక్కుతున్న వాసుకు మధురమైన గొంతులోంచి శ్రావ్యమైన పాట వినిపిస్తుంది. గబగబా నడిచి గది గుమ్మం లో నిలుచుని లోపలికి చూశాడు. అద్దానికి ఎదురుగా నిలుచుని ముంగురులు సవరించుకుంటూ పాడుతుంది జయ.
చిన్నగా దగ్గి గొంతు సవరించుకుని, "వెళ్ళుతున్నాను, జయా!" అన్నాడు వాసు.
"ఇప్పటి నుంచీ ఎక్కడికి వెళతావు?' తళతళ మెరిసే అందమైన కళ్ళతో టక్కున వేణు దిరిగి చూస్తూ అంది జయ.
లేత నీలం టేరిలిన్ చీరా, అదే కలర్ జాకెట్టు తో ఆమె శరీరచ్చాయ మెరిసిపోతుంటే రెండు క్షణాలలా ఆమె వైపు చూసిన వాసు ఆమె అందాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
"బాగుంది! మాటా పలుకూ లేకుండా అలా చూస్తున్నావు, దిష్టి తగిలెను." కిలకిలా నవ్వింది జయ.
"ఎటో ప్రయాణమై నట్టున్నావు?" అన్నాడు నవ్వుతూ.
"రిహార్సల్స్ ఉన్నాయి. రాబోయే ఫస్టు కి ఐ నాటకం వేస్తున్నాం. టైమయింది . మరి వెళతాను" అంది వాచీ చూసుకుంటూ జయ.
"నాకు అనవసరమే కాని.... జయా . మీ అమ్మా నాన్నా, నిన్నా జగపతి తో నాటకాలు వేస్తున్నారంటే.....నాకేం నచ్చలేదు."
"ప్చ్! వట్టి నటనే కదా! అయినా జగపతి నా క్లోజ్ ఫ్రెండ్, నాన్నగారికీ, వాళ్ళ నాన్నగారికీ -- అంటే వారి కుటుంబానికి, మాకూ అలాంటి అరమరికలు లేవు. మరి వెళ్ళు! మళ్ళీ ఎప్పుడొస్తావు?' అంది జయ.
"ఉద్యోగమయ్యాక."
"సంతోషం . అలా చెయ్యి" అంటూ ఇవతలికి వచ్చేసింది జయ. ఆమె వెనకే వచ్చాడు వాసు.
"నువ్వు తొందరపడి ఏ నిర్ణయానికి రాకు. మామయ్య ఏం చెయ్యమంటే అలానే చెయ్యి." హెచ్చరించింది మధుమతి.
'అలాగే, అమ్మా" అన్నాడు వాసు.
తానున్న రోజుల్లో పొడి మాటలు మాత్రమే మాట్లాడి ముభావంగా ఉండిపోయిన రాజశేఖరానికీ చెప్పాడు వెళ్ళిపోతున్నానని.
'అమ్మమ్మ చూడాలనంటుంది, ఓసారి నిన్ను రమ్మందని గోపాలానికి చెప్పరా, వాసూ." వెళ్ళిపోతున్న వాసు వైపు చూస్తూ కళ్ళు తుడుచుకుంది జానికమ్మ.
