Previous Page Next Page 
కౌసల్య పేజి 23

 

    రిక్షా కదిలింది. జానకి రిక్షాలో నుంచి వెనక్కు తిరిగి వెళ్ళొస్తా అన్నట్లు మందహాసం చేసింది. తిలక్ నవ్వుతూ తల ఊపాడు. రిక్షా సందు మొగ తిరిగాక, తిలక్ బరువైన ఆలోచనలతో గదిలోకి తిరిగి వచ్చాడు.
    జీవితంలో తనకీ రోజు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. తనకు ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ళు ఉంటాయి. జ్ఞానం బాగా వచ్చిన తర్వాత -- ఈ అయిదారు ఏళ్ళలోనూ, తన ఈడు లో ఉన్న ఏ స్త్రీ తోటీ మాట్లాడలేదు ఇంత చనువుగా. అందుకే వారిద్దరితో గడిపిన ఆ కొద్ది క్షణాలూ తన కెంతో హాయిగా మధురంగా ఉన్నాయి. తనకు తెలియని ఒక రకమైన కంగారూ, కంఠం వణుకూ, మాటలో బెదురూ ఇవన్నీ విచిత్రంగా ఇబ్బంది గా ఉన్నా, హాయిగానే ఉంది. ఇంకా కొంచెంసేపు వాళ్ళు ఉంటె బాగుండుననీ వాళ్ళతో ఇంకా స్వేచ్చగా నిర్భయంగా మాట్లాడాలనీ ఉంది తనకు.
    వాళ్ళిద్దరూ భిన్న ప్రకృతులు కలిగిన వాళ్ళుగా కనిపించారు. జ్యోతి జానకి కన్నా అందగత్తె గడసరి. చాకచక్యంగా మాట్లాడగలదు. తన చురుకుదనంతో , చురుక్కు మనిపించే మాటల చెళుకులతో ఇతరుల మనస్సు లను ఇట్టే గారడీ చెయ్యగలదు. అంతస్తుల మీద నుంచి తుళ్ళింతలు పడే జలపాతం అందం జ్యోతిది. నిండుదనం, మాట పొందిక, హృదయానికి ప్రశాంతత నిచ్చే చిరునవ్వు, లోకాల పాపాలు ఏమీ ఎరగని స్నిగ్ధ ముగ్ధత్వం తో జానకి చూసేవాళ్ళ హృదయాలను తన వైపు మళ్ళించుకొంటుంది. ఆమె అందం మంద్ర గంబీరంగా ప్రవహించే నిండు గోదావరి లాంటిది.
    ఇలా ఆలోచిస్తూ, బట్టలు మార్చుకొని భోజనానికి బయలుదేరుతూ కిటికీ తలుపులు వెయ్యబోయాడు. కిటికీ లో కవరు కనిపించింది. పై దస్తూరి , పోస్టు ముద్ర చూశాడు. సందేహం లేదు. అమ్మ దగ్గర నుంచే . భోజనం చేసి వచ్చి చదవవచ్చు అనుకున్నాడు.
    భోజనం చేసి వచ్చాక పడక కుర్చీలో పడుకొని కవరు చింపాడు.
    "చివంజీవి బాబును ఆశీర్వదించి ---
    నాయనా, నువ్వు పెద్ద వాడివయ్యావు . వయస్సు పెరిగిన కొద్దీ వయస్సు తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయనేది ఇంకా నువ్వు గ్రహించక పోవడం చాలా దురదృష్టం.
    నీమీదే దృష్టి పెట్టుకొని, ఆశలన్నీ నీమీదే కేంద్రీకరించి నీ ఉజ్వల భవిష్యత్తు లోనే తన ఆనందాన్నీ, సౌఖ్యాన్నీ ఊహించు కొంటున్న ఈ నీ తల్లి ప్రాణాన్ని ఉసూరు మనిపించడం మంచిది కాదు నీకు.
    ఇప్పుడు నేను ఏం చేశాను అంటావా? మనిషికి శీలం ముఖ్యం. ఋజువర్తనా, నిజాయితీ లేని వ్యక్తీ ఎంత చదువు చదివినా , ఎన్ని వేలు సంపాదించినా ఏం ఉపయోగం లేదు. మంచి సంపద కన్నా మంచి గుణాలు అవసరం మనిషికి. అన్ని మంచి గుణాలూ ఒకే ఒక్క గుణాన్ని బట్టి వచ్చేస్తాయి. అదే, డబ్బు పొదుపుగా వాడుకోవడం. డబ్బు విషయంలో జాగ్రత్త గా ఉన్న వాడికి తక్కిన గుణాలు వాటంతట అవే అబ్బుతాయి.
    అదేం పాపమో కాని, నీకు డబ్బు విషయంలో ఏమీ జాగ్రత్త లేదు. మంచి నీళ్ళకన్నా అన్యాయంగా ఖర్చు పెడతావు. అవసరం వచ్చినప్పుడు వందలు కాదు, వేలు ఖర్చు పెట్టు. వద్దు అనను. అసలు ఈ ఆస్తి అంతా ఎవరి కోసం దాస్తున్నాను? ఇది అంతా ఎవరిది? నీది. నీలాగే తాతయ్యా, నేనూ కూడా ఖర్చు పెట్టి ఉంటె -- ఇలా ఖర్చు పెట్టడానికి ఈ ఆస్తి మిగిలి ఉండేదా నీకు?
    నేను అన్నాననీ కాదు -- కాకినాడ వెళ్ళాక నీకు ఖర్చు ఎక్కువైంది. మరి ఎందువల్ల అవుతున్నదో, ఏమిటో నాకేమీ అర్ధం కావటం లేదు. ఒక్కొక్కప్పుడు నీ గురించి ఆలోచిస్తే భయం వేస్తున్నది కూడా. వ్యసనాలలో దిగిన వాడికి తప్ప ఇంత ఖర్చు అవసరం లేదు.
    నా కొడుకు వ్యసనాల్లో దిగేటంత మూర్ఖుడు కాదని నాకు తెలుసు. అయితే, ఈ వెర్రి ఖర్చు ఏమిటి? ఇంత క్రితం డబ్బు విచ్చలవిడిగా వాడుకుంటూ ఉండేవాడివి. అంతేకాని, అబద్దాలు చెప్పడం ఎరగవు. ఇప్పుడిది కూడా వచ్చింది. నాలుగు నెలల క్రితం కాలేజీ లో కొన్ని లేబరేటరీ లకు కొత్తగా డిపాజిట్టు లు కట్టాలి అంటూ మూడు వందలు తెప్పించు కున్నావు. ఆ నెలలోనే నీకు మాములుగా పంపే రెండు వందలూ మనియార్డరు చేస్తే, నాలుగు రోజులు వెళ్ళకుండా ఉత్తరం వ్రాశావు-- 'మనియార్డరు తీసుకుని డబ్బు అంతా పర్సు లో పెట్టుకొని వెళ్ళితే చిన్న మసీదు దగ్గర పర్సు పళంగా ఎవరో కొట్టేశార'ని . మళ్ళీ రెండు వందలు తెప్పించు కున్నావు. అంటే ఆ నెలలో నీకు మాములుగా పంపే రెండు వందలు కాక అయిదు వందలు ఎక్కువ పంపాను.
    తీరా వాకబు చేస్తే , నువ్వు చెప్పిన ఆ మూడు వందల డిపాజిట్ అబద్దం అని తెలిసింది. దీన్ని బట్టి నీ పర్సు పోవడం కూడా అబద్దమే అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఈ అయిదు వందలు తెప్పించుకొని ఏం చేశావు? నాకా వివరాలన్నీ ఏమీ దాచకుండా దేవుడి ముఖం చూసి వ్రాయి. నాకు తెలియబరచడానికి సిగ్గుపడే ఖర్చు అందులో కొంత నువ్వు చేసి ఉండవచ్చు. ఉంటావనే నా భయం. ఆ నా భయాన్ని భయంగానే ఉంచి నిజం కాకుండా చెయ్యమని కూడా భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
    అది ఎటువంటి ఖర్చు అయినా సరే, నువ్వు నాకు నిజాన్నే తెలియబరచాలి. అమ్మ బాధ పడుతుందేమో అని అబద్దం మాత్రం వ్రాయకు. అయిదారు వందలు నువ్వు ఖర్చు పెట్టావని కాదు నా బాధ. చంచలమైన ఆ పాపిష్టి డబ్బు మీద నుంచి, నీ కాలు ఎక్కడికి జారిందో అనేదే నా వ్యధ. నిజం చెబితే, జారిన కాలు కూడదీసుకోవచ్చు. భవిష్యత్తునైనా చక్కదిద్దు కోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు నా నుంచి నిజాన్ని దాచావంటే కొన్నాళ్ళు పోయేటప్పటికి , చేసిన తప్పు దిద్దుకొనే అవకాశం కూడా చెయ్యి జారిపోతుంది మనకు.
    ప్రతి చిన్న విషయాన్నీ నేనిలా అరా తియ్యడం నీకు ఇష్టం ఉండటం లేదు ఈ మధ్య. నేను కనిపెడుతూనే ఉన్నాను. కాని ఏం చెయ్యను? తప్పదు. నీ బాధ్యత నువ్వు గుర్తించి నిజంగా నువ్వు పెద్దవాడివయేదాకా, నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం లేకపోయినా ఇది తప్పదు.
    ఆ అయిదు వందలకు సంబంధించిన ఖర్చు నువ్వు చెప్పేదాకా నాకు మనస్థిమితం ఉండదు. వెంటనే తెలియ పరుచు.

                                                                                                  ఆశీస్సులతో,
                                                                                                     అమ్మ."
    ఉత్తరం పూర్తీ చేసి తిలక్ కొంచెం సేపు అలాగే ఉండిపోయాడు. పాపం! అమ్మ ఎంత బాధపడుతున్నది! తను ఏ దుర్వసనాలకో ఈ డబ్బు అంతా ఖర్చు పెట్టాడనుకుంటున్నది. ఈ డబ్బు ఒక మనిషి జీవితం నిలబెట్టిందనీ, ఒక వ్యక్తికీ ఉపాధి కల్పించిందనీ తెలిస్తే, ఎంత సంతోషిస్తుంది! సొమ్ము సద్వినియోగం కావడం అమ్మ కెంతో ఆనందం కలిగిస్తుంది.
    అయితే ఐ చిక్కు అయన ఎవరు? ఏ ఊరు? నిజంగా అయన కా డబ్బు అవసరమా? ఈ వివరాలన్నీ తెలుసుకోకుండానే సహాయం చేసేశాడంటే అమ్మ ఒప్పుకోదు. నమ్మదు కూడా. పోనీ, బాబుగారి వివరాలు అడుగుదామంటే , అయన చెప్పలేదు. గవర్నమెంటు వారి పట్టాలో అయన పేరు వివరాలు ఉన్నాయేమో చూద్దామంటే తన కా అవకాశం చిక్కలేదు.
    ఏమంటే అసిస్టెంటు కలెక్టరు గారు తన స్నేహితుని తండ్రే లని చెప్పి, తీరా తను బాబుగారిని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళేటప్పటికి , ఆయనా, ఈయనా బాల్య మిత్రులై ఊరు కొన్నారు. అ అయిదెకరాల బంజరు సంగతీ తను ప్రస్తావించబోయేసరికి అసిస్టెంటు కలెక్టరు గారు మధ్యలో అడ్డుకొని "అదంతా నేను చూసుకుంటాను. ఇంక నువ్వేమీ బాధ్యత పడక్కర లేదు. నీ గదిలో ఇంకా మా వాడి సరుకు లేమైనా ఉన్నాయా? లేవు కదా? మంచిది. నేనే నా జీప్ లో రెండు రోజులు పోయాక సర్పవరం తీసుకు వెళ్ళి అంతా రైటు చేయిస్తాలే" అన్నారు. దానితో తన బాధ్యత తీరిపోయింది. ఇద్దరి దగ్గరా సెలవు తీసుకుని వచ్చేశాడు.
    పది హీను రోజులు గడిచే టప్పటికి బాబుగారు తనకో ఉత్తరం వ్రాశారు. అది చూసుకొని ఓరోజు సాయంత్రం సర్పవరం వెళ్ళాడు తను. అయిదెకరాల బంజరు భూమికీ దగ్గర లోనే ఉన్న చిన్న పాకలో ఉంటున్నారు బాబుగారు. ఆయనతో పిచ్చాపాటీ కబుర్లు చెబుతుంటే , ఆయన మాటల్లో తనకు అర్ధం అయింది ఏమిటంటే, అధమ పక్షం అయిదు వందలైనా లేనిదే బంజరు సాగులోకి రాదని.
    మర్నాడే అమ్మకు అబద్దాలు వ్రాసి డబ్బు తెప్పించాడు. బాబుగారికి ఇవ్వబోతే అయన మొదట్లో తీసుకోలేదు. "నా దగ్గర ఉంది కనక ఇస్తున్నాను. పోనీ, అప్పుగా నైనా తీసుకోండి." అని తను బతిమాలగా తీసుకున్నారు. ఆ డబ్బుతో భూమి బాగు చేయించి ఈ ఏడు పంటకు తీసుకు వస్తానన్నారు . ఏమి చేశారో, ఏమో?
    'పాపం! ఆయన్ను చూసి కూడా రెండు మూడు నెలలు కావస్తున్నది. ఓ మారు వెళ్ళి తేనో?' ఇలా అలోచించి, మర్నాడు ఆదివారం కావడం వల్ల పొద్దుటే స్నానం చేసి సర్పవరం బయలుదేరాడు తిలక్.
    వానలు వెనక పడ్డాయేమో ఆకాశం నిర్మలంగా, స్వచ్చంగా ఉంది. అక్కడక్కడ మాత్రం ఒకటి రెండు తెల్లటి మబ్బులు నీలాకాశం లో తేలిపోతూ, గంబీరమైన సముద్రం మీద నాట్యం చేస్తున్న నురుగుల్లా చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి. పక్కన కాలువ. కాలువ లో నిండుగా ప్రవహిస్తున్న నీరు. కాలవ గట్టున తారు రోడ్డు. రోడ్డు మీద తాపీగా పోతూన్న తిలక్ మోటారు సైకిలు. కనుచూపు దూరంలో ఎవ్వరూ లేరు. అప్పుడే ఉదయించిన లేత సూర్యుని నునువెచ్చటి కిరణాలు , చల్లని గాలి-- ఇవన్నీ శరీరానికో వింత సుఖం ఇస్తుంటే తిలక్ కు ఏవేవో ఊహలు రాసాగాయి.
    తానీ లోకంలో ఒంటరి వాడుగా ఉన్నట్లు అనిపించింది. తన కేవళ్ళూ లేరు. అమ్మ కూడా. ఈ కాలువలో నీళ్ళు లాగే అనంతంగా వేగంగా గడిచిపోతున్న కాలం. కాలానికి ఎదురొడ్డి జీవించాలని తను పడే తాపత్రయం. ఇలా ఉండగా బాబుగారి వెచ్చటి వచనాలు హృదయానికి చైతన్యాన్నిస్తుంటే , జానకి చల్లని చూపులు మల్లె పువ్వుల జల్లు లాగ తన మది కెంతో సుఖాన్నిస్తున్నాయి. తన చుట్టూ ఉన్న వాతావరణం తో తన జీవితాన్నిలా పోల్చుకోవడం బలేగా అనిపించింది తిలక్ కు. కాని ఇంతట్లో నే 'ఇదేమిటి? ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను?" అనిపించింది.
    'నేను ఒంటరి వాడి నేమిటి? అమ్మ లేకపోవడం ఏమిటి? ఏమీ సంబంధం లేని బాబు గారి అండదండ లేమిటి తనకు? జానకి చూపులేమిటి? ఇదంతా పిచ్చి కాక మరేమిటి? పోనీ, జరిగిపోయిందంతా జ్ఞాపకం వచ్చిందయ్యా అంటే జానకే జ్ఞాపకం రావడమేమిటి? ఆమెతో వచ్చిందే కదా జ్యోతి కూడా? ఆమె జ్ఞాపకం రాకూడదూ? జ్యోతి దాదాపు తన వయస్సు ది కావడం వల్ల తన ఊహల్లో ఆమెకు చోటు లేదా? ఏమిటో పిచ్చి.
    ఇలా ఆలోచిస్తున్న తిలక్ సర్పవరం ప్రవేశించడం , తనకు తెలియ కుండానే వెంకట్రామయ్య ఉంటున్న పాక దగ్గర సైకిలు ఆపడం జరిగింది. అప్పుడే పాతాళ భావన్నారాయణస్వామి దర్శనం చేసుకుని వస్తున్న వెంకట్రామయ్య తిలక్ ను చూసి ఓ చిరునవ్వు నవ్వాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS