కంసావతారాలు
తారు రోడ్డు దిగి మలుపు దగ్గర కచ్చా రోడ్డు వెంట జీపు గతుక్కుల్లో పడి ప్రయాణం చేస్తుంది. రెండు మైళ్ల దూరం కచ్చా రోడ్డులో వెళ్లాక ఆ గ్రామం వచ్చింది. జీపు ఓ పాక ముందు ఆగింది. డ్రైవరు హారన్ మోగించాడు. హడావిడిగా పంచ సర్దుకుంటూ ఓ వ్యక్తి లోపల్నించి వచ్చాడు - 'దండాలు దొరా....' అన్నాడు జీపులో కూర్చున్న వ్యక్తిని చూసి... 'ఏం కొండయ్యా బాగున్నావా.. రా జీపెక్కు అలా వెడతాం' అన్నాడు. 'ఒక్క నిముషం సారూ' లోపలికెళ్లి చొక్కా తగిలించుకుంటూ వచ్చి జీపెక్కి వెనకాల కూర్చున్నాడు. అలవాటయిన చోటన్నట్టు డ్రైవరు వూరు బయటకి తీసి వెళ్లి ఆపాడు. 'ఏమిటి సంగతులు - ఏదన్నా బేరం తగులుతుందా ఈ నెలలో అయినా' సిగరెట్టు వెలిగిస్తూ అన్నాడు కాంట్రాక్టరు వెంకటరత్నం -
'మన ముత్యాలు భార్య నెలతప్పినట్లుందండి - మా ఆడదంటంది'
'ఇదివరకెంత మంది పిల్లలు - మన ఖాతాలోదా, కొత్త కస్టమరా? ఆరా తీసాడు.
'గుర్తులేదా, ఇదివరకు మూడేళ్లక్రితం ఆడపిల్లని తీసుకెళ్లారు గదా'
'ఓ.. ఆ ముత్యాలా వాడి పొలం అప్పుల్లోంచి విడిపించాం. వాడేనా'
'ఆ.... ఆ... ఇదివరకే వాడికి ఓ కూతురు, ఓ కొడుకున్నారు. ఇది నాలుగో కాన్పు'
"బేరం బయటికి పోనీమాకు. అడ్వాన్స్ ఇచ్చేయి ముందస్తుగా - ఓ వెయ్యి కొట్టి బుక్ చేసేయ్. కాదు కూడదంటే ఇంకో వంద రెండొందలు ఎక్కువ పడేయ్ - ఆ పిల్ల తెల్లగా ముద్దుగా బాగుంది - ధర బాగా పలికింది' ఆశగా అన్నాడు.
'ఆడి పెళ్లాం చక్కటిదిగా మరి - పిల్లలంతా బాగానే వుంటారు మరి'
'అందుకే మరీ ఆలస్యం చేయకుండా అడ్వాన్స్ యిచ్చేసి ఆడ్ని వప్పించేయ్ - అదొక్కటే కేసా, యింకెవరూ లేరా' ఆశగా చూశాడు వెంకటరత్నం.
'తెలియదండి. వుంటే బయటికి వచ్చేదే గాని లోపలికి పోయేది కాదు గదా - అల్లే వచ్చి చెపుతారు, డబ్బులు రుచి మరిగారు లెండి...' వెకిలి నవ్వు నవ్వాడు కొండయ్య.
జేబులోంచి డబ్బులు తీసి వెయ్యి కట్ట, వేరే వంద నోటొకటి తీసి కొండయ్య చేతిలో పెట్టాడు. 'అడ్వాన్స్ యిచ్చేయ్ ముత్యాలుకి - ఇంద, వంద తీసుకో నీవు' ఉదారంగా అన్నాడు. కొండయ్య మరో వెకిలి నవ్వు నవ్వి వంద తీసుకోకుండా 'ఇంట్లో సరుకులు నిండుకున్నయి. ఆడవి కట్టుకోను కోకలు లేవని గోలెడుతుంది. ఐదొందలన్నా యిప్పించాలి దొరా...' వినయంగా అన్నాడు. 'ఒరే, నీకాశ పెరిగిపోతోంది. నా యీక్ నెస్ కనిపెట్టి డబ్బులు గుంజుతున్నవు తెలివి మీరావురోయ్...' అంటూ మరో వంద తీసి చేతిలో పెట్టాడు. 'ఇంకో గుడ్ న్యూస్ సెప్పు అప్పుడు సూద్దాం..... ఊ. బెట్టుసేయకు తీసుకుని జీపెక్కు' - గంభీరంగా అని జీపెక్కాడు వెంకటరత్నం. బుర్రగోక్కుని డబ్బుని జేబులో పెట్టుకొని జీపెక్కాడు. గుడిసెలోకి వచ్చిన మొగుడిని చురచుర చూసింది వెంకటమ్మ ;ఎవడు, ఆ పాపిష్టోడేనా మళ్లీ వచ్చిండు' అంది కోపంగా. కొండయ్య జేబులోంచి ఓ వంద రూపాయలు నోటు తీసి పెళ్లాం చేతిలో పెట్టాడు. నోటు విసిరి కొట్టింది. 'థూ.... నోరులేని పసి పిల్లలని అమ్ముకుని సంపాదించే యీ పాపిష్టి డబ్బు నాకొద్దు - నీవే వుంచుకొని మరి రెండు బుడ్లు కొనుక్కుని తాగి చావు - పాపిష్టోడా'.
'నోరుముయ్యే - డబ్బు పాపిష్టిది కాదే - గంజికి నేక మాడేవాళ్లం - పెంచలేక పిల్లలని కడుపు మాడ్చి సంపే కంటే సుఖంగా వుండే చోటికి పిల్లలని యివ్వడం పాపమేటే. పిల్లలు ఎక్కడున్నా సుఖంగా బతికితే ఆ పున్యం మనదే - మన దగ్గరేటి వుంది. గంజి నీల్లు. పెంచుకున్నోళ్ళు గొప్పోళ్ళు అయితే అల్లు సుఖంగా బతకుతారు. నే సేసేది పాపపు పనేటి. సాలా మంచి పని - మన గూడెంలో బతికే పిల్లల్ని సూత్తన్నాంగా, దిస మొలలతో గంజి నీళ్లు తాగి ఓ అచ్చరం ముక్కయినా సదూలేక మనలాగే కూలి నాలి చేసుకు బతుకుతున్నారు. అలా బయటికి వెళ్లిన పిల్లలు సుకంగా మా రాజుల యింట్లో బతుకుతున్నారట - ఏదో మనం సేసే సాయానికి ఉత్తినే ఎవడు సేస్తాడు - నే సేయక పోతే ఆ పని మరోడు సేసాడి - "యిప్పుడు జవాబు చెప్పు అన్నట్టు ధీమాగా చూశాడు. వెంకటమ్మ తిరస్కారంగా చూసింది. హేళనగా ఓ నవ్వు నవ్వి 'సేస్తున్న ఎదవ పని సమజీయించుకుంటే సరిపోదు. పిల్లల్ని కన్నాక పెంచలేక గొప్పోళ్ళకి పెంపకం యివ్వడం తప్పు కాదురా - కాని, పెంపకాల కియ్యడం కోసం పిల్లలని కని పెంచి అమ్ముకోడం తప్పురా - ఎదవ బ్రోకరు పని సేస్తూ చేసిన తప్పు కప్పేట్టుకుందామని సూస్తే సరిపోదు. దేముడి దయవల్ల నీవాపరేషను సేయించుకుని నే బతికిపోయాను. నేకుంటే ఏడాదికో బిడ్డని కనిపించి అమ్ముకునే వోడివి' ఛీత్కారంగా అంది.
'అదేనే, నే సేసిన పెద్ద పొరపాటు, నాకేటి తెలుసు. ఇలాంటి బేరాలు తగులు తాయని. నేకుంటే ఈపాటికి ఎన్నివేలు సంపాదించేవోడినో, ముగ్గురు పిల్లలు సాలని పోరెడితే పోనీ అని ఆపరేసను సేయించుకుంటి' మంచి అవకాశం పోగొట్టుకున్నానన్న బాధ కొండయ్య గొంతులో ధ్వనించింది. "పిల్లలని అమ్ముకోడం అంటే పాపం అని కూడా అనిపించదు యీ పాపిష్టోడికి' 'ఏటే పాపం. కష్టపడి పొలం దున్ని, విత్తేసి పంట చేతికొస్తే అమ్ముకోడం లేదూ - విత్తేసి చెట్టున కాయో, పండో కాస్తే మనం వేశాం అని అన్నీ మనమే తింటున్నామా - మనకెక్కువయినవి బజారున అమ్ముకోవడం లేదా పాపం ఏమిటి. అదీ డబ్బుకోసమే, ఇదీ డబ్బుకోసమే...' లా పాయింటు దీసి మాట్లాడుతున్న మొగుడ్ని నోరెళ్ళబెట్టి చూసింది వెంకటమ్మ.
'ఓరి సచ్చినోడా - సెట్టున కాయో, పండో కోసి అమ్ముకోడం ఆడది నవమాసాలు మోసి నరకయాతన పడి బిడ్డని కనడం నీకొగలాగే కనపడతందా. మీ మగాళ్లకేం తెలుస్తదిరా బిడ్డని కనడంలోని బాధ - కడుపున పడ్డ దగ్గర నుంచి ఏయిళ్ల బాధ - నెలలు నిండిన కొద్ది గుండెలని బిడ్డ తన్నే బాధ - కాన్పులో పెగులన్నీ మెలిపెట్టే బాధ, శరీరాన్ని చీల్చుకుని బిడ్డ బయటికి వచ్చే నరకం, చెట్టున కాయ కోసినంత తేలిగ్గా మాటాడే మీ మొగాళ్ళకేటి తెలుస్తుంది. బిడ్డ పుట్టనిచ్చి బలం రావడానికి రెన్నెళ్లో మూన్నెళ్లో తల్లిపాలు తాగిపించి అప్పుడు కోడిపెట్ట బాగా బలిసిందనో, మేక పిల్ల కండ పట్టిందనో అమ్మడానికి తయారయ్యే కసాయి నా కొడుకులకి ఆడదాని పేగు బాధ ఏటి తెలస్తందిరా - ఈ బ్రోకరు ఎదవ పని మానకపోతే సూడి, యింకే ఆడదాని కన్నా కన్న కడుపుకి ఎసరెట్టావో యీ కొరకం బెట్టి నిన్ను తగలపెడతా - పో, నాకు నీ మొగం సూపకు తీక్షణంగా మండుతున్న కట్టెపేడు చూపి బెదిరించింది. నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు కొండయ్య. పొయ్యి ముందు కూర్చున్న వెంకటమ్మ... నలుగురు పిల్లలని కన్నతల్లి గుండె మంట పొయ్యి మంటకి తీసిపోదు.
* * * * *
