కోడి పెట్ట ఎప్పుడు గుడ్డెడతదా అని సూసినట్టు యీ ఎదవ ఏ ఆడది నీళ్లాడిందా అని డేగ కళ్ళతో సూసి ఆ దొంగ సచ్చినోడు వచ్చినప్పుడు సెప్పడం యీడి డూటీ అయిపోనాది - నెలకోసారి జీపేసుకొచ్చి నీళ్లోసుకున్న ఆడదాని విషయం తెలియగానే అడ్వాన్సు డబ్బులు యీడి చేతిలో పెట్టి పోతాడు. ఆనక ఆ మొగుడ్ని పిలిచి బేరాలు మొదలెట్టి రేటు కుదుర్చుకుంటాడు. యీ దొంగ నాకొడుకులకి యిదో బిజినెస్సయి పోనాది - యిలా అటు వెళ్లిన ఆడపిల్లలని అనాదలని చెప్పి పెంపకాలకి యిచ్చేస్తారుట డబ్బులు తీసుకుని - ఈళ్ల మొహాన ఐదారు వేలు కొట్టి ఏభై వేలకి, తెల్ల దొరలకైతే లచ్చకి కూడా అమ్ముతారంట. పిల్లలు అందంగా బొద్దుగా వుంటే రేటు పెరుగుతుందట! ఆ పిల్లని నిజంగా పెంచుకుంటారో ఆనక అల్లతో ఏటిసేస్తారో ఆ భగవంతుడి కెరిక. ఇదో కొత్త వేసారం మొదలైంది. ఎప్పుడు కనివినీ ఎరగని పాపం. డబ్బుల కాశపడి పెళ్లాలని కావాలని కడుపులు చేసి, కానుపులు సేయించి తల్లిని బిడ్డను వేరు సేసి పాపం సుట్టుకుంటున్నారు. యీ మగ ఎదవలు. డబ్బుల కోసం ఎన్ని కానుపులయినా కనిపిస్తున్నారు మొగాళ్ళు. పాపం కిందటేడు నర్సిగాడి పెళ్లాం ఆరో కానుపులో సచ్చి బతికి బయటపడింది. వంట్లో పానం లేదు. ఏటా కానుపులు నర్సిగాడు తాగుబోతు ఎదవ. డబ్బుల కోసం పెళ్లాన్ని ప్రతి ఏడాది పురిటి మంచం ఎక్కిస్తా అన్నాడు. యీ ముత్తాలు పొలం అప్పు యిడిపించుకోడానికి పండంటి బిడ్డనిచ్చేశాడు. అప్పటి నుంచి డబ్బు రుచి మరిగిన ఎదవలు. యిప్పుడు ఆడది ఎప్పుడు నెల తప్పుతదా అని ఎదురు సూడ్డం అయిపోయింది మూడేళ్లుగా యీ వాడలో.
వెంకటమ్మకి తల్చుకుంటే భగ్గున మండుతూంది. యీ ఘోరం ఆపడం ఎట్లా, యీ ఎదవలందరిని పోలీసుల కప్పచెప్పాలని జైల్లో కూచో పెట్టాలని అనిపిస్తుంది. కాని పోలీసులకి ఎలా చెప్పాలి. అది ఆమెకు తెలియదు. చుట్టుపక్కల చిన్న పల్లెలు తప్ప పెద్ద వూర్లు లేవు. పోలీసుస్టేషను తాలూకాలో వుంటుందని వింది. అది ఎంత దూరమో ఎలా వెళ్లాలో కూడా ఆమెకి తెలియదు. ఆ కుగ్రామంలో పట్టుమని నూరిళ్లు కూడా లేవు. ఓ పడిపోతున్న పాక ఎలిమెంటరీ స్కూలు. దాన్లో పంతులు ఏడాదికి రెండు నెలలన్నా వుండరు. అలాంటి చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలకి కలిపి ఓ పోలీసు స్టేషను వుంటుందట. వెళ్లాలంటే మెయిన్ రోడ్డు కాడ కాపు కాస్తే ఆ బస్సు ఎప్పుడో వస్తది. ఒక్కర్తి, ఆడది మొగుడికి తెలీకుండా తనెట్లా వెళ్లగలదు. ఆమె ఆలోచనలవి. ఏదో చేసి ఈ అరాచకాన్ని ఆపాలని వుంది గాని, ఏం చెయ్యాలో, ఎవరితో చెప్పాలో ఆమెకు తెలియదు.
'అప్పా'. మర్నాడు పది గంటల వేళ మగవాళ్లు యింట్లోలేని సమయంలో ముత్యాలు భార్య చుక్కమ్మ వచ్చి వెంకటమ్మని చుట్టుకుని బావురుమని ఏడ్చింది. "ఏందే, ఏటే ఏం జరిగిందే. ఏం చేశాడే, కొట్టాడా' వెంకటమ్మ చుక్కమ్మని విడిపించుకుని ఏడుస్తున్న ఆమెని చూస్తూ ఓదార్పుగా అంది. వెక్కివెక్కి ఏడుస్తూ - 'అప్పా, మళ్లీ యీ బిడ్డని కూడా అమ్మడానికి డబ్బుచ్చుకున్నాడే ముత్యాలు - యింక సాలు పిల్లలన్నా వినకుండా ఆ వెధవకి అమ్మడానికి మళ్లీ నెల తప్పించాడే" వెక్కిళ్లు పెడ్తూ అంది.
'యీళ్ల జిమ్మడ - మనం మడుసుల్లా కనపడ్డం నేదు గాబోలు' - పిల్లల్ని కనే మిసను లనుకుంటున్నారా యీ సచ్చినోళ్ళు.
'అక్కా... సచ్చి బతుకుతూ మనం కనడం - ఈళ్ళు పుట్టినోళ్లని, పాలు తాగుతున్న పసి వోళ్లని గుంజుకు పోయి డబ్బులు తెచ్చుకోడానికెగపడ్తున్నారు. మనం ఎన్నాళ్ళిట్టా యీ బాధలు పడాలప్పా. కనాలంటే భయమేస్తుంది. యీ సచ్చినోళ్లకి కష్టపడనక్కర లేకుండా డబ్బులొస్తన్నాయని, ఇదే బాగుందనుకుంటున్నారప్పా' - కళ్లు తుడుచుకుంటూ అంది.
'సుక్కీ - మనం యీ వెదవలకి బుద్ధి సెప్పాలే - ఏటి సెయ్యాలో తెలీడం లేదే' విచారంగా అంది.
'అక్కా మన తండాలో ఆడవాళ్లం అంతా కలిసి పట్నం వెళ్లి పోలీసులకి సెపుదామా'
'ఎట్టా వెడతామే - యీ ఎదవలకి తెలిస్తే సంపుతారు గందా - బస్సెక్కి పోవాల్న పట్నం ఎల్లాలంటే - సుక్కి రేపు ఆడోళ్లం అందరం కలిసి ఏదన్నా ఉపాయం ఆలోచిద్దాం.
వుండప్పా, రేపుదాకా ఎందుకు, యిప్పుడే ఎల్లి అందరిని పోగేసుకొస్తా... సుక్కి పావుగంటలో పదిమంది ఆడాళ్ళని వెంటపెట్టుకు వచ్చింది. అందరిలోకి ఎక్కువ మంది పిల్లల్ని అమ్మిన నర్సిగాడి భార్య వరమ్మకి మరీ కక్షగా వుంది. 'అప్పా అందరం కలిసి తిరగబడితే యీల్లేటి సేస్తారు. నా వల్లు గుల్లయిపోనాది - యీసారి కాన్పు అయితే మరి బతకవని పట్నంలో డాక్టరమ్మ బండ బూతులు తిట్టింది. కిందటిసారి కాన్పు కష్టమయితే బండిలో వేసుకు, సాపు బ్రతుకులలో ఆస్పత్రికి తీసికెళ్లారు. ఆపరేషను చేసి బిడ్డను ఆఖరి నిముషంలో తీసి రక్షించారు వరమ్మని. లచ్చుమమ్మ ముందుకు వచ్చి 'అప్పా, నేనో ఉపాయం సెప్పనా, నా సెల్లి పట్నం ఆసుపత్రిలో నర్సు ఉద్యోగం సేస్తంది గదా, నన్ను సూసిపోడానికి నిన్న వచ్చింది. మళ్లీ రేపెళ్ళి పోతుంది. దానిసేత కబురెడదామా పోలీసోల్లకి"- ఉపాయం చెప్పింది - 'పిలు, పిలు మీ సెల్లిని పిల్చకరా' అంతా ఉత్సాహంగా అన్నారు. రత్నం మెట్రిక్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని స్కాలర్ షిప్పుతో నర్సు కోర్సు చేసింది. ఎస్ టి క్లాసు కింద ఉద్యోగం సుళువుగా దొరికింది. తన చెల్లి చదువుకొందని ఉద్యోగం చేస్తుందని లచ్చిమికి గర్వంగా వుంటుంది. రత్నం అందరి మధ్య నాయకురాల్లా కూర్చుంది. - సంగతి అక్క ద్వారా అప్పటికే విని వుందేమో కోపంగా 'అసలు మీరంతా ఎలా వూరుకొంటున్నారు. యింత అన్యాయం, ఘోరం జరుగుతుంటే అంది. ఏటి సెయ్యమంటావమ్మా కట్టుకున్నాడే యింత అన్యాయం సేస్తంటే ఎవరికి చెప్పాలి.
'ఎదురు తిరగాలి అంతా...... రత్నం వాళ్లందరినీ చూస్తూ తిరగబడాలి. యిలా పిల్లల్ని అమ్ముతున్నారని పోలీసులకి చెప్పామని బెదిరించాల్సింది'.
"కుళ్ల బొడుస్తారు. పోలీసులకు సెపితే యీళ్లు తనని తగలేస్తే మాకేటి దిక్కు, యీ సంటి పిల్లల్ని పెట్టుకుని ఏడకి పోవాలి మేము'.
అదీ నిజమే. తిరగబడితే పరిణామాన్ని ఎదుర్కొనే శక్తి వీళ్లకెక్కడ వుంది. రత్నం ఆలోచించి 'చూడండి. మీరేమీ తెలీనట్లుండండి. నేను ఊరెళ్ళాక మా వూర్లో కలక్టరమ్మకు జరిగేది సెపుతా. ఓ ఉత్తరం రాసి యిస్తాను. నేను రాసి తెస్తాను. మీరంతా వేలి ముద్రలు వేసివ్వండి - నేను మీ అందరి పేర్లు రాసి అప్లికేషను యిస్తా - మిగతాది ఆళ్లే సూస్తారు - కలెక్టరు మన ఆడదే గనక మీకు జరిగే అన్యాయం చూస్తూ వూరుకోదు. నేను గట్టిగా చెపుతా" అప్పటికప్పుడు అక్కడ కూర్చుని కలెక్టరు పేర ఫిర్యాదు రాసి అక్కడున్న ఆడవాళ్లందరి చేత వేలిముద్రలు పెట్టించింది. 'మీరెక్కడా నోరు జారద్దు - ఎవరన్నా వచ్చి ఏదన్నా వాకబు చేస్తే అప్పుడే మీకు తెలిసినట్లుండండి. పోలీసులు గాని, గవర్నమెంటు ఆఫీసర్లు గాని వస్తే జరిగింది చెప్పండి అంతే -' అందరికీ చెప్పింది. అంతా తలలాడించారు సంతోషంగా.
పదిహేను రోజుల తర్వాత - ఆ చిన్న కుగ్రామంలోకి రెండు జీపులు, ఓ అంబాసిడర్ కారు వచ్చి ఆగాయి. వూర్లో సర్పంచ్, తాలూకా ప్రభుత్వోద్యోగులు, డవాలా బంట్రోతు, పోలీసు ఇనస్పెక్టరు, కలక్టరమ్మ క్యాంపు కొచ్చిందిట అంటూ జనం వింతగా మాట్లాడుకున్నారు. గ్రామ పంచాయితీ ఆఫీసు దగ్గర కలక్టరమ్మ కూర్చుంది. సర్పంచి ద్వారా కొండయ్యకి కబురెళ్లింది. తనని ఎందుకు పిలిపించారో తెలియక భయంగా వచ్చి చేతులు కట్టుకు నిల్చున్నాడు కొండయ్య. 'కొండయ్యంటే నీవేనా - పిల్లల్ని అమ్మే బ్రోకరు పని చేస్తున్నావా' ఉపోద్ఘాతం లేకుండా సూటిగా అధికారికంగా అడిగింది కలెక్టరు. బిక్క చచ్చిపోయాడు కొండయ్య. అతను ఎదురుచూడని సంఘటన యిది.
'ఏమిటి మాట్లాడవు - పుట్టిన పిల్లలని ఓ కాంట్రాక్టరుకి అమ్ముతూ బ్రోకరు పని చేస్తున్నది నిజమేనా - నిజం చెప్పు. లేకపోతే జైల్లో కూర్చుంటావు - ఎవరా కాంట్రాక్టరు!? పేరేంటి - ఎక్కడుంటాడు? ప్రశ్నలు గుప్పించింది అధికారం ప్రదర్శిస్తూ. బిక్కమొగం వేసి 'తెలియదండి' చేతులు నులుముకుంటూ వినయంగా అన్నాడు. 'అంటే, పేరు, ఊరు తెలియకుండానే యిద్దరూ కల్సి పిల్లల వ్యాపారం చేస్తున్నారన్న మాట - నిజం చెపుతావా, పోలీసులని పిలిపించాలా -
కొండయ్య చటుక్కున వంగి కలెక్టరు కాళ్ళు పట్టుకున్నాడు. 'సత్తెపెమానకంగా నాకు తెలియదండి - పేరడగలేదండి ఎప్పుడూ'. వీడి మొహం చూస్తే నిజమే చెప్తున్నాడనిపించింది కలక్టరుకి. లే ముందు,వాడి సంగతి తరువాత ముందు 'నీ సంగతి చెప్పు. ఎంతమంది పిల్లలని అమ్మావు. యింతవరకు వాడికి. ఈ బేరం ఎప్పటి నుంచి సాగుతున్నది. అసలు యిదంతా ఎలా ఆరంభించావు.'
అప్పటికే వూర్లో వున్న జనం చుట్టూ మూగారు. ఆడవాళ్లంతా కలక్టరమ్మ పక్కకి వచ్చి నిలబడ్డారు. అందరి ముందు పరువు పోయినట్టు దోషిలా తలదించుకున్నాడు కొండయ్య. నీళుల నమిలాడు జవాబు చెప్పకుండా.
'ఊ.. చెప్పు తొందరగా. చెప్పకపోతే పోలీసులని పిలిస్తే లాఠీదెబ్బలు రుచి చూస్తే నీవే చెపుతావు - ఇది ఎలా ఆరంభించారు. నాకన్ని సంగతులూ తెలియాలి. ఇక్కడ యిలా పిల్లల అమ్మకాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి తెలిసి విచారణ జరిపించమని నన్ను పంపించారు" కోపంగా అంది. కొండయ్యకి ఈ సంగతి బయటికి ఎలా తెల్సిందో ఎవరు చెప్పారో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు.
'ఓపాలి... ముందస్తుగా ఆ కాంట్రాక్టరు బాబు వచ్చాడండి. ఊరి పొలిమేరలో నేను కనిపిస్తే పిలిచాడండి. ఈ వూర్లో మంచి చంటి పిల్లలు పెంపకానికి ఎవరన్నా వున్నారా, నాకు పిల్లలు లేరు చక్కగా వున్న ఓ ఆడపిల్లని పెంచుకోవాలనుకుంటున్నాను డబ్బు బాగా యిస్తాను. వుంటే సెప్పు వెళ్లి మాట్లాడతానన్నారండి.
