Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 23


    'డబ్బు సంపాదనకి అంతేం వుందిలెండి. పదివేల వాడికి యిరవై కావాలనుంటుంది. ఏభై వాడికి లక్ష కావాలనుంటుంది. మీ అమ్మాయీ చదువుకుంది. ఆవిడా సంపాదించొచ్చు కాస్తూ కూస్తో... మా కోసం మేం బతకాలనుకుంటున్నాం - కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి... యీ వయసు, యవ్వనం మళ్లీ రావు గదా - డబ్బు సంపాదనలో మరమనిషిలా మరిపోదల్చుకోలేదు. ఎక్స్ క్యూజ్ మీ.. వాష్ చేసుకుని బట్టలు మార్చుకోవాలి. ఆ... ఏ గదిలోకి వెళ్లాలి'. 'కావేరీ లోపలికి తీసుకెళ్లు హరీష్ ని' మామగారి ఆర్డరు. గదిలోకి వెళ్లగానే చొక్కా కాలరు పట్టుకుని 'ఏమిటీ డ్రామా' అంది తీక్షణంగా. 'నాటకం ఏమిటి, మై గాడ్ యిదంతా సరదాకన్నాననా నీ ఉద్దేశం-' అంటూ షర్టు విడిపించుకుని బ్రీఫ్ కేసులోంచి రాజీనామా కాగితం, ఆఫీసు అంగీకరించిన కాగితం చూపాను. ఆ కాగితంలాగే కావేరి మొహం తెల్లబడింది. 'యూ.. యూ... నా మీద కక్షతో, నాకు బుద్ధి చెప్పాలనే చేశావు. ఉద్యోగం రిజైనిచ్చి పెళ్లాన్ని ఎలా పోషిద్దాం అని నీ 'ఉద్దేశం' ఆవిడ చూపులు, మాటలు బాణాలయ్యాయి. 'ఏదో ఉద్యోగం దొరక్కపోదులే, లేకపోతే చదువుకున్న పెళ్లాం నీవుండగా నాకేం దిగులు-నీవు చేద్దుగానిలే' తేలిగ్గా అనేసరికి ఉక్రోషం పట్టలేక చొక్కా పట్టుకుని రెండు పిడి గుద్దులు గుండెల మీద గుద్ది 'ఇలా వచ్చానని, నాకు పాఠం నేర్పాలని గాదూ...' ఆమె చేతిలోంచి విడిపించుకుని 'డోంట్ బి సిల్లీ కావేరీ, యు కెనాట్ హావ్ ఎవ్విరీ థింగ్ - అవ్వా, బువ్వా రెండూ కావాలనుకోడం అత్యాశ' అంటూ బాత్ రూములోకి వెళ్ళిపోయాను - రాత్రి మీద చెయ్యేస్తే తోసేసింది. ఇంకోసారి ప్రయత్నించలేదు.

                                          *    *    *    *    *

    శని ఆదివారాలు గడిచి రెండు రోజులయినా వెళ్లే ప్రసక్తి తేకపోవడంతో నాలుగో రోజు దబదబ బట్టలు సూట్ కేస్ లో పడేసి 'పద, యింటికెడదాం' అంది కోపంగా - 'తొందరేం వుంది. కొన్నాళ్లు సరదాగా వుందామని వచ్చాను. ఉద్యోగం సద్యోగం లేదుగా ఎప్పుడెళ్లినా పరవాలేదు. అత్తవారింటి సరదా తీర్చుకోనీ.'
    'ఉద్యోగం లేని వాడ్నిగా, ఏమన్నా పట్టించుకోనులే' నిర్లక్ష్యంగా అన్నా - పళ్లు కొరుక్కుంది.
    పాపం అత్తగారు మామగార్ల స్థితి చూస్తే జాలేసింది - ఉద్యోగం మానిన అల్లుడ్ని ఏమనలేక, కూతురు భవిష్యత్తు గురించి బెంగ, కూతురి ప్రవర్తన వల్లే యిదంతా జరిగిందన్న ఆవేదన, అల్లుడ్ని తప్పు పట్టలేని నిస్సహాయతతో సతమతమవుతున్నారన్నది అర్థం అయింది.
    'ఆ సాయంత్రం లాన్ లో అందరం కూర్చునుండగా జనాంతికంగా 'ఈనాటి పిల్లలకేం కావాలో వాళ్లకే తెలియడం లేదు. ఆలోచిస్తే ఆడ మగ తేడా లేకుండా చదివించి పెద్ద ఉద్యోగాలకి పంపడం తప్పనిపిస్తుంది. చదవేస్తే వున్న మతి పోయినట్టు చదువుతో పాటు రావలసిన అణకువ, మెచ్యూరిటీల కన్నా అహంభావం, అహంకారం, ఎవరినీ లెక్కచేయని తెంపరితనం ఎక్కువైంది' కావేరి తండ్రి వంక చురచుర చూసింది. 'నీవలా చూసినంత మాత్రాన నిజాలు అబద్ధాలవవు - ఏం మీ ఆడపిల్లలని పెద్ద చదువులు చదివించి ఉద్యోగాలకి పంపుతున్నాం - హాయిగా మీ కాళ్ల మీద మీరు నిలబడి ఎవరి జోలి అక్కర లేకుండా లైఫ్ ఎంజాయ్ చెయ్యండి - స్వతంత్రంగా హాయిగా ఆనందంగా వుండచ్చుగా - మళ్లీ మగతోడు కావాలి - వంటరితనం భరించలేరు. ప్రేమలంటారు. పెళ్లిళ్లకి దిగుతారు. మళ్లీ ఆ మొగుడనే వాడితో సర్దుకోరు. ఊ అంటే ఆ అంటే అవమానాలు జరిగిపోయి ఆత్మాభిమానాలు దెబ్బతినేస్తాయి. మాట పడని వ్యక్తిత్వాలు మావి అంటారు. నీవెంత అంటే నీవెంత అని దెబ్బలాటలు -ఏం ఇన్నాళ్లూ మనం నలుగురం యింట్లో ఏమీ అనుకోలేదా. అభిప్రాయ భేదాలు రాలేదా, వాదించుకోలేదా, దెబ్బలాడుకోలేదా, కోపాలు అలకలు రాలేదా, ఏం మాట మాట వచ్చినప్పుడు మనం అందరం ఇల్లొదిలి వెళ్లిపోయామా. కట్టుకున్న పాపానికి, ఒక యింట్లో వున్న పాపానికి మొగుడనే వాడితో మాట మాట వస్తే ఎందుకు సర్దుకోరు.' 'అవును సర్దుకోడాలన్నీ ఆడవాళ్లే చెయ్యాలి ఎప్పుడూ' వ్యంగ్యంగా అంది. 'ఆడ మగ అని కాదు యిద్దరున్నప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి సంసారంలో - లేకపోతే ఏ సంసారం నిలవదు - ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా యింతే...' కావేరి కోపంగా లేచి వెళ్లిపోయింది. ఆయన నా చేయి పట్టుకున్నాడు. 'ఇదో మూర్ఖురాలు, కాస్త నీవన్నా సర్దుకో-'. 'సర్దుకోడానికి ఓ లిమిట్ వుండదా అంకుల్ - అన్నింటికీ అలకే! రుసరుసలే - తన మాట కాదనడానికి వీలు లేదంటే ఎలా.' అవున్నాయనా మాకు తెలుసు నిన్నేం అనలేం - భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు మీలో మీరే తీర్చుకోవాలి' అత్తగారు ప్రాధేయపూర్వకంగా అన్నారు.

                                             *    *    *    *    *

    వూర్నించి వచ్చి పది రోజులు గడిచాయి - రాత్రింబవళ్ళు ఉద్యోగం సద్యోగం లేకుండా మగాడనే వాడు యింటి పట్టున వుంటే ఎలా వుంటుందో రుచి చూశాక 'ఏమిటి యింట్లో కూచుని మూడు పూటలా తిని పడుకోడమేనా, ఉద్యోగ ప్రయత్నం ఏం చెయ్యదలచుకోలేదా.' తీక్షణంగా నిలేసింది ఓరోజు పొద్దునే.
    'చూద్దాంలే - వెధవ ఉద్యోగం చెయొచ్చు - లైఫ్ కొన్నాళ్లు ఎంజాయ్ చెయ్యనీ - నీవు కోరిన రొమాన్సులు, శృంగారాలు, పిల్లల్ని కనే యత్నాలు ఇవన్నీ అవనీ, తృప్తితీరక చూద్దాం' కావేరి గంయ్ మంది. 'ఉద్యోగం లేకుండా పిల్లల్ని కని ఏం పెట్టి పోషిద్దామని. అదొక్కటే తరువాయి. బుద్ధి లేకుండా మాట్లాడకు' అరిచింది.
    'పోనీ నీవు చెయ్యి ఉద్యోగం - హాయిగా నేను యింట్లో పని, వంట పని చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ, టి.వి. చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. ప్రామిస్ - ప్రతి పూటా నీకు వేడి వేడిగా చేసి పెడ్తాను - రాత్రుళ్లు శృంగార పాఠాలు చెపుతూ ఆనంద డోలికల్లో ఊగిస్తాను' సినిమాటిక్ గా అన్నాను.
    'షటప్. పెళ్లాం సంపాయిస్తే తిని కూర్చునే మొగుడ్ని ఏ ఆడదీ గౌరవించదని తెలుసుకో. ఏం చేస్తావో, ఎలా చేస్తావో పెళ్లాన్ని పోషించడం నీవంతు. నేనే ఉద్యోగం చచ్చినా చెయ్యను. డబ్బు సంపాదించడం నీ పని' తిరస్కారంగా అంది. 'ఎస్. మైడియర్ వైఫ్ - నౌ, యు హావ్ కమ్ టుమై పాయింట్. అవును ఉద్యోగం చేసి పెళ్లాన్ని పోషించడం మగాడి పని - మగాడు పెద్ద ఉద్యోగాలు చేసి వేలు సంపాదించాలి - బంగ్లా, కారు, ఫోన్లు, ఫ్రిజ్ లు, ఓవెన్లు, వాషింగ్ మెషీన్లు సర్వ హంగులు సమకూర్చాలి భార్యలకి, రాత్రింబవళ్ళు ఆఫీసులో గాడిద చాకిరి చేసి యింటికొచ్చి పెళ్లాన్ని షికార్లకి, సినిమాలకి, డిన్నర్లకి తిప్పాలి. మర్చిపోకుండా బర్త్ డేలు, మ్యారేజ్ డేలకి గిఫ్ట్, పార్టీలు యిచ్చి ఆనందపరచాలి - ప్రేమ అనురాగాలు ప్రదర్శించాలి - రొమాన్సులు జరపాలి. ఏం యింకేమన్నా మర్చిపోయానా లిస్టులో - యివన్నీ మొగుడనే అడ్డ గాడిద పని. మరి మీ పనేంటో - అల్సిపోయి వచ్చిన మొగుడికి కప్పు కాఫీ యివ్వడం, దగ్గర కూర్చుని కాస్త వేడిగా అన్నం పెట్టడం పాతకాలం పతివ్రతల లిస్టులో చేరిపోయినట్టు నూన్యతా భావం. ఆ మొగుడనే వాడు నోరిప్పి విసుక్కుంటే హింస పెడ్తున్నట్టు కోడై కూస్తారు. బజారు కీడుస్తారు. ఏం కోపం, తాపం అవమానాలు మీ ఆడవాళ్లు సొత్తు - కట్టుకున్న పాపానికి పాపాల భైరవుడిలా అన్ని నిందలూ మగాడి నెత్తినేనా! ఒక యింట్లో వున్నాక కోపాలొస్తాయి... మర్చిపోవాలి - కల్సిపోవాలి - సారీ చెప్పుకోవాలి - అంతేగాని సూట్ కేస్ లు పట్టుకుని పుట్టిళ్ళకి పరిగెడితే ఏ తల్లి తండ్రి ఆదుకోరన్నది గ్రహించండి. సకల గుణ సంపన్నుడుగా వుండే మగాళ్లుండనట్టే పరమశాంతమూర్తులు, సాధ్విలుగా ఆడవాళ్లూ వుండరు - ఎవరి అదుపు ఆజ్ఞలో వుండమంటే, హాయిగా సంపాదించుకుంటూ స్వేచ్చగా వుండి. పెళ్లిళ్లు లేకుండా వుండండి, సర్దుబాటు ధోరణి కావాలో - స్వేచ్చాయుత జీవనం కావాలో నిర్ణయించుకోవాల్సింది నీవు - ఇటీజ్ అప్ టూ యూ - నిర్ణయం తీసుకుని చెప్పు" చాలా సీరియస్ గా అనేసి బాల్కనీలో పేపరు పట్టుకు కూర్చున్నాను.
    పావు గంట తర్వాత వెనక నుంచి మెడ మీద చేతులు బిగించి చేత్తో గడ్డంపైకి ఎత్తి నుదుటి మీద పెదాలద్ది 'జాబ్ రిజైన్ చేయలేదులే, నాకు తెలుసు' అంది గోముగా గుసగుసగా కావేరి. 'మై గుడ్ నెస్' అనుకున్నా.
    మీరే చూశారుగా పెళ్లాలంటే ఎంత సెల్ఫిషో, ఆవిడకి కావాల్సింది మొగుడు కాదు, ఉద్యోగం అని అర్థమయిందా లేదా!
    (ఎప్పుడూ ఆడవాళ్లకేనా సమస్యలు - పాపం, పీత కష్టాలు పీతవన్నట్టు మగాళ్లనీ ఓ కంట కనిపెట్టాలి అనిపించి రూటు మార్చాను.)
                
                                                                                             (పత్రిక - దీపావళి - 2004)

                                                *  *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS