Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 24

      'ఓరినీ... నీకు కానిస్టేబుల్ చాలలేదురా? ఇన్ స్పెక్టర్ కావాలిరా తొత్తుకొడకా!' అనుకున్నాడు గాని అనలేదు. అంటే అసలే ఈ వెధవలు మొండి చచ్చినాళ్లు. ఆ ఇన్ స్పెక్టర్ వచ్చేవరకు కదలకుండా కూచుని మీ కానిస్టేబుల్ తిట్టాడని సెపితే సికాకు. ఇంతకీ ఈ గొడవేంటో తుది మొదలు అంతుచిక్కలేదు. పోలీసులంటే, ఎవరెళ్లారు? దొంగతనం వీడే సేశాడే అనుకున్నా, ఆడి పెళ్లాన్ని లాక్కెళ్లి రాత్రి అంతా ఎక్కడ పెట్టారు? అసలు వాళ్లు పోలీసులా? డ్యూటీలో నిన్న వున్నదెవరు? ఆళ్ల పనే ఇది. ఆడకూతురిని లాక్కెళ్లి... ఆలోచించిన గవర్రాజుకి ఏదో తట్టింది. అంతలోనే అబ్బే, అదికాదు అనుకున్నాడు. ఎవరన్నా పోలీసు డ్రస్సు వేసుకెళ్ళి దాన్ని లాక్కెళ్లారా? అర్థరూపాయికి వళ్లమ్ముకునే ఆడది దొరుకుతూండగా డ్రస్సుకి, గిస్సుకి డబ్బు తగలెట్టి అంత కక్కుర్తిపడేందుకు అది రంభా, ఊర్వశా? ఈడింత అందంగా వున్నాడు. ఆడి పెళ్లాం రంభయితే యీడితో కాపురం సేస్తుందా? ఇంతకీ యీ బుద్ధిలేని పనిసేసి పీకలమీదకి తెచ్చిన ఆ యిద్దరు తమవోళ్లే అయితే పోలీసు డిపార్టుమెంటుకే ఎంత అప్రదిష్ట? సబ్ ఇన్ స్పెక్టర్ ది అసలే ఉడుకు రక్తం. కొత్తగా వచ్చాడు. ఇన్నాడంటే ముందే సస్పెండ్ చేసి పారేస్తాడు. ఈళ్ల కక్కుర్తి మండిపోను! మనసులోనే వాళ్లని తిట్టిపోశాడు. ఎంత అనుకున్నా తన డిపార్టుమెంటోళ్లు - ఆళ్ల ఉద్యోగాలూడితే.... పెళ్లాం పిల్లలు ఏం తింటారు? స్వజన పక్షపాతంతో ఆలోచించాడు గవర్రాజు. ఈ విషయం సబ్ ఇన్ స్పెక్టర్ వరకూ వెళ్లకుండా వీడికేదో చెప్పి, అక్కడికెళ్లి మాటాడి... ఏదో చేసి కేసు, గీసు లేకుండా చెయ్యాలి. గవర్రాజు ఆలోచన అది. వీడిని తిట్టి కసిరి లాభం లేదు. మంచి మాటలతో నచ్చచెప్పాలి అనుకున్నాడు.
    "సూడు... నీ పేరేటి? ఏం చేస్తావు నువ్వు?"
    "పెంటయ్యండి. కూలి సేస్తానండి. వూడ్పుల్లో, కోతల్లో, మిల్లు కాడ, యింటికాంవకాడ ఎక్కడ కూలి దొరికితే అక్కడ సేస్తానండి."   
    "మరి నీ పెళ్లాం - దాని పేరేంటి? అదీ కూలిసేస్తుందా? నీకు పిల్లలున్నారా? నీ పెళ్లాం ఎలాగుంటుంది? ఆహా... అదికాదురా, దాన్ని గురించి సెప్పాలంటే అడగాలంటే ఎలాగుంటదో తెలియాలి కదా!"
    అంతసేపటికి పెంటయ్య మొహంలో మెరుపు వచ్చింది. "సుక్కి సుక్కనాగుంటదండి. అందరూ పెంటిగా, సన్నాసి ఎదవా, ఏదో పుణ్యం సేసుకున్నావురా, సుక్కలాటి పెళ్లాన్నిచ్చాడురా దేముడు అంటారండి. సుక్కి నల్లగుంటేనేం అండి లచ్మీదేవి కల వుందండి దాని మొహంలో." పెళ్లాం సంగతి చెప్తూ గర్వపడ్డాడు పెంటిగాడు. "అది వూడ్పులపుడు, కోతలప్పుడు కూలికెల్తదండి. ఉత్తప్పుడు యెల్దండి. మాకెంత గావాలండి, పిల్లా పీచూ లేరు..."
    "సరే, సెప్పావుగా... మావోలు డ్యూటీలోకి రాగానే అడుగుతాను. అసలేటయిందో... నువెల్లు యింటికి. నే తరువాత ఎండెక్కాక వస్తాను మీ వూరికి..." నచ్చచెప్పే ధోరణిలో అన్నాడు గవర్రాజు.
    పెంటయ్య ఒక్కక్షణం ఆలోచించాడు. తల గోక్కున్నాడు. "మరి కపిలెంటు రాసియ్యాలి గందా! మా వూర్లో ఆల్లు సెప్పారు. ఇన్ స్పెక్టరుగారికి నీ పెళ్లాంనిలా సేశారని కపిలెంటు యిచ్చిరా ఫో... అన్నారండి."
    'ఓర్నీ, యీ వెధవలు తెలివి మీరిపోయారు. కంప్లయింట్ రాసివ్వాలని తెలిసేటంత తెలివిమీరారు.' "పోరా, యిప్పుడేం రాసివ్వక్కరలేదు. నే మీ యింటికొచ్చి అందరితో మాటాడి, మా పోలీసోళ్లు నిన్న డ్యూటీలో ఎవరున్నారో ఆల్లని అడిగాక అప్పుడు నీ పెళ్లాం యింకా యింటికి రాకపోతే రాసిద్దువుగానిలే." గట్టిగా దబాయిస్తే సబ్ ఇన్ స్పెక్టర్ వచ్చేవరకు గుమ్మం ముందు కూర్సుంటాడని నెమ్మదిగానే అన్నాడు.
    అప్పుడింక తప్పదన్నట్టు, తమ దయ అన్నట్లు చేతులు జోడించి, భారంగా భారం మీదేనన్నట్టు చూస్తూ కదిలి వెళ్లాడు.

                                               *  *  *

    "ఎవడ్రా ఈ యెదవ పని చేసింది? మీ నల్గురిలో యెవర్రా చెప్పండి?" డ్యూటీకొచ్చిన నలుగురు పోలీసు జవాన్ల మీద యెగిరిపడ్డాడు గవర్రాజు విషయం చెప్పి. నలుగురూ బెదురుగా చూసి అడ్డంగా తలలాడించారు. "మీరు కాకపోతే యింకిక్కడ యెవడున్నారా? మీ నల్గురిలో యిద్దరు వెధవపని చేశారు. చెప్పండి. లేకపోతే ఎస్.ఐ.తో చెప్పి సస్పెండు చేయిస్తా. లాకప్పులో పడేయిస్తా. నీ... ఏం జన్మరా? ఆడదంటే అంత కక్కుర్తిరా? రేపుద్యోగం ఊడితే అప్పుడు తెలుస్తుంది ఆ సుకం ఏటో? సెప్పండిరా అబద్ధంసెపితే మీ పాట్లు కుక్కలు కూడా పడవు. దాని మొగుడు పొద్దుటే యిన్ స్పెక్టరు అంటూ వచ్చి కూర్చున్నాడు. ఆడ్ని ఏదో సెప్పి వదిలించుకున్నాడు. నిజం సెప్పకపోతే సబిన్ స్పెక్టర్ రాంగానే కేసు పుటప్ చేయిస్తా. మీకు తెలుసు ఎస్.ఐ. రూల్సు మనిషని. ఈ సంగతి తెలిస్తే మీ వుద్యోగాలు వెంటనే పీకిస్తాడు. ఎదవల్లారా! రేప్ కేస్ మీద కనీసం మూడేళ్లు జైల్లో కూకోవాలి. అందులో పోలీసోడు అంటే మరిన్నేళ్లు వడ్డిస్తారు జడ్జి. సెప్పండిరా దొంగనాకొడకల్లారా!" తలొంచుకుని చెక్కమొద్దుల్లా నిల్చున్నవాళ్లని చూసేసరికి గవర్రాజు తిక్క మరింత రేగింది. "ఏరా... అప్పిగా! వరేయ్, సెప్పు... నీ పనేనా యిది?"
    అప్పలకొండ నల్లబడిన మొహం, కళ్లల్లో బెదురు సూడగానే పోల్చుకున్నాడు గవర్రాజు. ఎదవపని సేసినాడి మొగంలా వుంది ఏ కోర్టులు, ఏ జడ్జీలు అక్కరలేదు నిజం లాగడానికికన్నది గవర్రాజు థీరీ. అతని సర్వీసులో దోషెవరో మొఖం చూసి పోల్చగలడు. కోర్టులో సాక్ష్యాలు కావాలంటే అది వేరే సంగతి. అప్పలకొండ దగ్గరకి వెళ్లి "ఊ...ఏరా వళ్లు కొవ్వు బలిసేందేట్రా ఎదవా? సేసినా దొరక్కుండా సేయాలిరా సన్నాసీ! పోలీసు ద్రస్సేసుకెళ్లి పబ్లిక్ గా ఆడదాన్నట్టుకెడితే ఎవరూ ఏం సేయరనుకున్నావేట్రా? రూపాయి డబ్బులకి దొరికే ఆడకూతుర్లుండగా... ఆ సన్యాసిగాడి పెళ్లాం కావలసివచ్చిందిరా? దాని మొగుడూరుకుంటాడనుకున్నావెట్రా? ఇప్పుడాల్లూ తెలివిమీరిపోనారు. కేసిడితే ఏం సేస్తావురా? ఇంతకీ రెండో వాడెవడో? ఏరా నర్సింలూ! ఇద్దరూ తోడుదొంగలయ్యారా? పదండిరా మీకు మూడిందిరా. అందుకే ఎదవ బుద్దులొచ్చాయి. సెప్పండిరా, యింతమందుండగా దానిమీద మీ కళ్లెలా పడ్డాయిరా? అంతా సెప్పండి. అబద్ధాలాడితే డొక్క చించేస్తా." గవర్రాజు చేతులు వెనక్కి పెట్టి సీరియస్ గా పచార్లు చేస్తూ అన్నాడు గవర్రాజు. లుంగీలోంచి ద్రస్సులోకి మారిపోగానే కానిస్టేబుల్ ఠీవి వచ్చింది. "డ్యూటీలో వున్నాను. అబద్ధం సెపితే లాఠీతో కీళ్లిరగ్గొడతాను. అందరినీ కొడ్తాను. ఇప్పుడు మీరు రుచి చూద్దురుగాని" నోరు మూసుకుని నీళ్లు నములుతున్న ఇద్దరినీ చూశాడు చెప్పండన్నట్లు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS