"సుక్కి బాగుంటుంది" నసిగాడు అప్పలకొండ.
"బాగున్న ఆడోళ్లందరితో తొంగుంటావా? చెమడాలూడగొడతారు బాగున్నవాళ్లందరితో పడుకుంటే..." కళ్లెర్రచేశాడు గవర్రాజు.
"అదసలు నీ కళ్ల ఎప్పుడు పడింది?"
"ఓసారి... సంతకెళితే అక్కడ సూశా" గొణిగాడు.
"సూసి మోహించేశాడు. పెద్ద మొగాడు బయలుదేరాడు, ఏరా నర్సింలూ నువ్వెలా చూశావు?"
"అప్పలకొండ చూపించాడు... చూపించి..." భయంగా ఆగిపోయాడు నర్సింలు. "ఊ... ఇద్దరూ కలిసి ప్లానేసి గుడిసెలో జొరబడి లాక్కెళ్లారన్నమాట! ఎక్కడికి తీసికెవెళ్లారు? రాత్రంతా అది ఇంటికి రాలేదన్నాడు దాని మొగుడు. ఎక్కడ దాచారు దాన్ని?"
అప్పలకొండ, నర్సింలు మొహాలు చూసుకున్నారు. "ఎలిమెంటరీ స్కూలు పాకలో..." అన్నారు ఎర్రబడిన మొహాలతో.
"మీరు అక్కడికి తీసికెళ్ళడం ఎవరూ చూడలేదా?"
"లేదు, చీకటడ్డాది. ఆ స్కూలు కాసంత దూరంగా వుంది వూరికి. పోలీసోళ్లం అనగానే అంతా బయపడి మా ఎనక ఎవరూ రాలేదు."
"మరి అది తెల్లారేదాకా యిల్లు చేరలేదన్నాడు వాడు?"
"మేం యిడిసిపెట్టగానే పరిగెత్తి అరిచి గోల చేస్తుందని..." చీకటి మాటున వేడిరక్తంలో చేసిన పాపపు పని. తెల్లారి వెలుగులో చెప్పుకోవాలంటే వాళ్లిద్దరికీ మొహాలు చెల్లడం లేదు. చెప్పకపోతే మరింత శిక్షిస్తారని చెప్పకా తప్పలేదు. "కాళ్లు తాడెట్టి కట్టేసి వచ్చాం..." తలలు దించుకుని చెప్పారు.
గవర్రాజు బీడీ తీసి తుపుక్కున ఉమ్మాడు. "ఛీ... ఒక ఆడకూతురిని కట్టేసి ఆంబోతుల్లా... ఛీ ఛీ మీకు ఉరిశిక్ష వేసినా పాపం లేదు" ఛీత్కారం చేస్తూ అన్నాడు. ఇద్దరి మొహాలూ మరింత వంగాయి.
గవర్రాజు సర్వీసంత వయసున్న వాళ్లిద్దరూ చేసిన పనిని అతను క్షమించలేకపోయినా... తనకింద పనిచేసేవాళ్లు డిపార్టుమెంటుకే మచ్చపడే ఆ పని చేసిన ఆ ఇద్దరినీ బయటపడేస్తే అవమానం తమదే కదూ! జరగకూడనిదెలాగో జరిగింది. ఇప్పుడు వీళ్ల ఉద్యోగాలు పీకించి పెళ్లాం పిల్లల్ని పస్తులుంచితే ఆ పాపం తనది కాదూ! కోపం, ఆవేశం తగ్గాక అరగంటసేపు గదిలో పచార్లు చేసి ఆలోచించాడు గవర్రాజు.
* * *
ఆ పాలెంలో... వూరందరికీ తెల్లారినా పెంటయ్య ఇంట్లో తెల్లారలేదు. పొయ్యిలో పిల్లి లేవలేదు. తెల్లారి పోలీసుస్టేషన్ కి నడిచివెళ్లి కాళ్లీడ్చుకుంటూ వచ్చి, సుక్కి జాడ కానరాక దిగులుగా, నీరసంగా, నిస్త్రాణగా కుక్కిమంచంలో కుక్కిన పేనులా వాలిపోయాడు. చుక్కి తన చుక్కిని ఆ పోలీసులు లాక్కెళ్లి ఏం చేశారో, ఎందుకు లాక్కెళ్లారో, ఎంత చదువు సంధ్య లేక జ్ఞానం లేనివారయినా, రాత్రంతా రాలేదంటే అతని మనసు జరిగిన సంగతి గ్రహించగల్గింది. దిక్కుతోచనివాడిలా మంచంలో పడుకున్నవాడిని యిరుగు పొరుగు వచ్చి ఓదార్చసాగారు. పదిగంటలయ్యాక స్కూలుకెళ్లిన పిల్లలు కట్టిపడేసి వున్న సుక్కిని చూసి కట్లిప్పి పరుగున వచ్చి పెంటయ్యకా వార్త చెప్పారు.
కట్లిప్పినా, కాళ్లు రానట్టు నడవలేనట్లు నడిచివెళ్లి అందరినీ చూడలేనన్నట్లుగా చుక్కి అక్కడే కూలబడింది. పరుగున వచ్చిన పెంటయ్యకి పెళ్లాన్ని చూడగానే కడుపులో దేవినట్లయింది. చక్కని చుక్కి ఒక్క రాత్రికే చిక్కిపోయినట్లు, వాడిన తోటకూరకాడలా, పీల్చిన చెరుకుపిప్పిలా, రసం జుర్రేసిన మామిడిపండులా... చక్కని చుక్కికి దిష్టి తగలకుండా పెట్టినట్లు బుగ్గన గాట్లతో, మచ్చలతో కనిపించిన పెళ్లాన్ని చూసి - మరి చూడలేక తల దించుకున్నాడు. మొగుడ్ని చూసిన చుక్కి మొగంలో మిగిలిన రక్తం కాస్తా యింకిపోయినట్లయిపోయింది. రాత్రంతా ఏడ్చి వాచిన కళ్లు ఏడవటం ఆపి మొండికేశాక నిలువుగుడ్లు పెట్టుకు చూస్తూండి పోయింది. రాత్రంతా శతకోటి దేవుళ్లని పేరు పేరునా రక్షించమని పిలిచి పిలిచి అలిసిపోయిన ఆ నోట్లోంచి మరి మాట వూడి పడిపోలేదు. భయపడాల్సినదంత నిన్నే అయిపోయింది. ఇంకే భయం, ఇంకెందుకు భయం? భయపడాల్సింది మొగుడ్ని చూసి కాదన్నట్టు చుక్కి రెప్పవాల్చకుండా చూస్తుండిపోయింది.
చుక్కి పిచ్చిచూపులు చూడగానే పెంటయ్య "సుక్కీ, ఏటయిందే? ఏం చేశారు ఆ ఎదవలు? ఏటే అలా సూస్తావు?" అంటూ కలవరంగా అడిగాడు. నోరిప్పని సుక్కిని ఎలా మాట్లాడించాలో పెంటయ్యకి అర్థం కాలేదు.
"భయపడిపోనాదిరా ఆడకూతురు. దానిని ఇంటికి తీసుకెళ్లు. నెమ్మదించాక సెపుతుంది" ఓ ముసలాడు అన్నాడు.
"సుక్కీ, రాయే ఇంటికెడదాం!" చెయ్యి పట్టుకు నిల్చోపెట్టాడు. నిలబెడితే నిలబడింది. నడిపిస్తే నడిచింది. ఇంటికి తీసికెళ్లి కూర్చోపెడితే కూర్చుంది. ఆ వాడవాడంతా గుడిసె ముందు మూగారు. సుక్కిని చూసి కొందరు జాలిపడ్డారు. కొందరు వింతగా, కుతూహలంగా చూశారు. కొందరు చెవులు కొరుక్కున్నారు. ముసలాళ్లు కొందరు లోపలికెళ్లి చుక్కిని బుజ్జగించి, ధైర్యం చెప్పి మాట్లాడించాలని చూశారు. జరిగిందొక ఎత్తు, జరుగుతున్నది ఒక ఎత్తులాగా బతుకు బట్టబయలు అయి నలుగురి ముందు గుడ్లప్పగించి చుక్కిని నిలబెట్టినట్లు విలవిల్లాడి పోతున్నాడు పెంటయ్య. చూడొచ్చినవాళ్లని చూడద్దనలేక, పొమ్మనలేక, మా బతుకు మమ్మల్ని బతకనీయండి అని అనలేక, ఏం చెయ్యలేనివాడిలా చేతులు ముడుచుకుని గుడిసె ముందు కూర్చున్నాడు పెంటయ్య.
అదే సమయంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణే మా ధ్యేయం. న్యాయరక్షణకే మేమున్నాం అన్నట్లుగా గవర్రాజు నలుగురు పోలీసులని వెంటబెట్టుకు వచ్చాడు. ఆ ఐదుగురు బూట్ల టకటకలతో ఆ పల్లెలో ఇల్లు అదిరిపోయి కెలికిన చీమల పుట్లలోంచి చీమలు వచ్చినట్లు గుడిసెల్లోంచి జనం బయటకు వచ్చి కుతూహలంగా చూడసాగారు. గవర్రాజు మిలిట్రీ పెరేడ్ చేయిస్తున్న సైనికాధికారిలా ఇటు, అటు చూడకుండా పెంటయ్య చెప్పిన గుర్తున్నవారి దగ్గరకి వచ్చాడు. అక్కడ మూగిన గుంపు పోలీసులని చూడగానే రాయి పడిన నీళ్ల మాదిరి చెదిరిపోయారు.
