Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 23


                                         కంచె మేసిన చేను

    అదొక పల్లెటూరు! దేశం నిండా అలాంటి పల్లెలు కొల్లలు. ఆ పల్లెలకి సంరక్షకుడిలా నాలుగైదు పల్లెల మధ్య ఒక టౌను. ఆ టౌనును సంరక్షించడాని కన్నట్టుగా మధ్యలో ఒక పోలీసు స్టేషను.
    ఊరంతా తెల్లారినా ఇంకా ఆ పోలీసు స్టేషనులో తెల్లారలేదు. ఊళ్లో కోడి నాలుగు గంటలకే కూసింది. పాలవాళ్లు, పనివాళ్లు, పనున్నవాళ్లంతా తొలి వార్నింగ్ కే లేచారు. ఇంకా లేవనివాళ్లని లెండంటూ రెండో కూత పెట్టింది కోడి. ఆ పోలీసు స్టేషనులో చక్కగా రెండు బెంచీలు దగ్గరగా కలిపి పక్కేసుకుని ఫేను కిందకి లాక్కుని గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు నైట్ డ్యూటీ కానిస్టేబుల్ గవర్రాజు.
    ఆ గవర్రాజు బంగారంలాంటి నిద్ర చెడగొడుతూ ఎవరో తలుపులు దబదబ బాదారు. గవర్రాజు కళ్లిప్పితే మళ్లీ నిద్ర పట్టదన్నట్టు ఒక కన్ను సగం తెరచి గోడనున్న గడియారం చూశాడు. ఇంకా ఐదున్నరే చూపిస్తుందా గడియారం - గవర్రాజుకి బెదిరినట్టు. మళ్లీ తలుపులు బాదారు.
    "ఎవడ్రా అని యింత పొద్దున్నే నీ యమ్మ సిగ తరగా" తిట్టుకుంటూ వూడిపోతున్న లుంగీ సవరించుకుంటూ యింక తప్పదన్నట్టు లేచాడు గవర్రాజు. లేచి నిలబడ్డ గవర్రాజు గజరాజులా వున్నాడు. ఆరడుగులు పొడుగు, ఆ పొడుక్కి ఎక్కువే అయినంత లావు, ముందుకి జారి కిందపడ్తానని బెదిరించే పొట్ట,వంటికి సరిపోయిన పెద్ద మొహం, ఆ మొహంలో కనపడని ఏనుగు కళ్లు, కనపడే తొండంలాంటి పొడుగు ముక్కు, వీడికి పెదాలు లేవా అన్నట్టు కప్పేసే మీసాలు, గంజి పెట్టిన కాకీ నిక్కరు వేసి షర్టు టక్ చేసి, లాఠీ పట్టి కాకీ స్టాకింగ్స్ తో టకటకలాడే బూట్ల చప్పుడు చేస్తూ నడుస్తుంటే పోలీసంటే యిలా వుండాలి భయపడేట్టు అనుకుంటారు. కానిస్టేబుల్ అయిపోయాడు కాని ఇన్ స్పెక్టర్ అయితే ఇంకెంత ఠీవిగా వుండేవాడో అన్పించేది అందరికీ... ఆ గవర్రాజు దర్జా ఇప్పుడు లుంగీతో కాస్త తగ్గింది కాని, గజరాజు చచ్చినా, బతికినా వెయ్యి వరహాలే అన్నట్టు లుంగీలో వున్న కానిస్టేబులూ కానిస్టేబిలే కదా! ఆ కానిస్టేబుల్ గారు నిద్ర చెడిపోయిన కోపం తలుపుల మీద చూపిస్తూ భళ్లున తలుపులు తెరిచాడు.         
    తలుపు అవతల... తలుపు తట్టడమే నా నేరం అన్నట్టు బెదురుగా, భయంగా, దీనంగా చూస్తున్న ఆ మనిషికి వయసు ఎంతో చెప్పడం కష్టం. ముప్ఫై వుండచ్చు, నలభై వుండచ్చు, యాభై వుండచ్చు. జుత్తు పీకేసిన తాటిటెంకలా వుంది. గడ్డం గీసుకోడానికి, గీయించుకోడానికి డబ్బుంటే దాంతో నాలుగుల్లిపాయలు కొనుక్కుందును అన్నట్టు బాగా మాసి వుంది. తింటున్న తిండి బుగ్గలదాకా యెక్కడ చేరుతుంది అన్నట్లు దవడలు పీక్కుపోయి వున్నాయి. రంగు నలుపయినా ఆ రంగులో నిగారింపు కాకుండా చర్మం ఎండి, పొడలు పొడలుగా వుంది. కట్టుకున్న పంచె 'వెర్ అండ్ టేర్' అన్నట్టు వుతుకు చూసిన పాపాన పోయినట్టు లేదు. తొడుక్కున్న బనీనులో గుడ్డ కంటే చిరుగులే ఎక్కువున్నాయి. రాత్రంతా పరిగెత్తి వచ్చినట్టు ఆయాసంగా రొప్పుతున్నాడు.
    ఆ మనిషిని చూడగానే అణా కానికి చెల్లనివాడని అర్థం అయిపోయింది గవర్రాజుకి. అలాంటి ఆఫ్టరాల్ గాడు వచ్చి నిద్ర చెడగొట్టినందుకు, నిద్ర చెడగొట్టేంత ధైర్యంగా తలుపు తట్టినందుకు కోపం కంటే ఆశ్చర్యం ఎక్కువేసింది. ఆశ్చర్యపడ్డం అయ్యాక మళ్లీ కోపం ముంచుకు వచ్చింది. "ఎవడ్రా నువ్వు? నీ యమ్మ... పొద్దుటే ఏం కొంపలంటుకున్నాయిరా?" చూపులతో భస్మం చేసేటట్టు ఆపాదమస్తకం చూస్తూ అడిగాడు గవర్రాజు.
    ఆ చూపుకే వణుకుతూ నీళ్లు నమిలాడు ఆ మనిషి. "బాబూ! మా ఆడదాన్నట్టుకొచ్చారండి" ఆ అనడంలో తన తప్పున్నట్టు నసుగుతూ బెదురుచూపులు చూస్తూ అన్నాడు.
    గవర్రాజు ఆశ్చర్యంగా, వింతగా, అర్థం కానట్లు చూశాడు. ఏ దొమ్మీ కేసో, ఏ పొలాల తగూలో, కొట్టుకున్న కేసో, ఏ గేదో, ఎద్దులో ఎవరో పట్టికెడితే కంప్లైంట్ యివ్వడానికి వచ్చాడనుకున్నాడు గవర్రాజు.
    "ఆడదాన్నట్టుకొచ్చారా? ఎవర్రా? ఏటంటున్నావు అసలు..." తీవ్రంగా అడిగాడు.
    "తవరేనండీ..." బెదురుగా చూస్తూ అన్నాడు.
    "ఏట్రా... నంజకొడకా, తాగొచ్చావా? నీ ఆడదాన్ని నేనట్టుకొచ్చానా? ఏట్రా పేలుతున్నావు? మక్కెలిరగ్గొట్టగలను" గవర్రాజు నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది వాడి మాటలకి.
    "మీరంటే మీరు కాదు బాబూ, పోలీసోళ్లు తీసికెళ్లిపోనారండి..."
    "పోలీసులు తీసికెళ్లారా? ఎందుకు? ఏట్రా నీ గోల... ఏటంటావసలు - ఏటి జరిగింది. వుత్తిపున్నానికి పోలీసోళ్లు నీ ఆడదాన్నెందుకు తీసికెడతార్రా?" గవర్రాజుకి కోపం తగ్గి కుతూహలం పెరిగింది.
    "ఏటోనండి. నేనింటికాడ లేనండి. సాయంకాలం ఇద్దరు పోలీసోళ్లు దాన్ని లాక్కెళ్ళినారంట. రాత్రికాడంతా సూశాను బాబూ! అందరన్నారూ టౌనెళ్లి పోలీసు టేషను కాడ అడుగు అంటే పరుగెత్తి వచ్చాను బాబూ! మా చుక్కిని ఇప్పించండి. అసలదేటి సేసింది దొరా, వుత్తిపున్నానికి దాన్నెందుకు లాక్కొచ్చారు బాబూ!" ఎంత వినయంగా అన్నా వాడి గొంతులో ఆగ్రహం, బాధ ధ్వనించింది.
    "మళ్లీ అదే మాట, ఎవడ్రా అట్టుకొచ్చాడు - నేను నీ పెళ్లాన్ని తీసుకొచ్చినట్టు దబాయిస్తున్నావేటిరా? ఏ లంజకొడుకు అట్టుకెళ్లారో ఆళ్లనడుగు. పో... ఇక్కడినించి. బంగారంలాంటి నిద్ర సెడగొట్టి పైగా పెళ్లాన్ని అట్టుకొచ్చానంటావు. ఫో ముందు. నేకపోతే నిన్ను లాకప్పులో పడేయిస్తాను. ఎళ్లరా... అదెవరితో పడుకోడానికి పోయిందో? రాత్రి నీలాంటి మొగుడు ఏ ఆడదానికి కావాల్రా? అంచేతే యెవడితోనో పోయుంటుంది. తెల్లారి వచ్చివుంటుందిలే. ఫో..." తిక్కరేగి కసిరాడు గవర్రాజు.    
    ఆ మాటలకి ఆ మనిషి మొహం ఆకాశంలో మబ్బేసినట్లు నల్లబడింది. తరువాత ఒక్క మెరుపు మెరిసినట్లు కళ్లల్లో ఒక్కక్షణం కోపంతో తళుక్కుమంది. ఆ తరువాత చినుకులు రాబోతున్నట్టు వాడి కళ్లు తడి అయ్యాయి. "బాబూ! మేం కూటికి పేడయినా, గుణానికి కాదండి. మా సుక్కి అలాంటిది గాదండి. మీ పోలీసోల్లు లాక్కెళ్ళినారని మా గూడెం అంతా సెప్పినారు బాబూ! కావలిస్తే మా వోళ్లని అడగండి బాబూ! ఓ ఆడకూతురిని బలవంతంగా ఎందుకు లాక్కెళ్ళినారో మీ పోలీసోల్లని పిలిచి అడగండి దొరా! దాని తప్పేటి సెప్పండి బాబూ!" గవర్రాజు మాటలకి ముందు బాధగా, ఆ తరువాత కోపంగా, పౌరుషంగా అడిగాడు.
    అప్పటికి గవర్రాజుకి యిదేదో కొట్టిపారేసే విషయం కాదని అర్థం అయి వాడి మాటల తీక్షణతకి తగ్గాడు. 'ఓరి వీడి దుంపతెగ! వంట్లో వూపిరి లేనట్టున్నా మాటలు జోరుగా వస్తున్నాయే' అనుకున్నాడు.
    "ఏ పోలీసులు తీసికెళ్లారు? ఆళ్ల పేరీటి? అసలు నువ్వెవరు? ఏటీ గొడవ?" ఇదేదీ తొందరగా తేలే వ్యవహారంలా కనపడక అక్కడి కుర్చీ లాక్కుని కూర్చుని బీడీ తీసి వెలిగించాడు.
    "ఆళ్ల పేర్లు మాకేటి తెలుస్తాయి బాబూ! గుడిసెలో కూడొండుతున్నదాన్ని, గుడిసెలో జొరబడి 'నీ మొగుడు దొంగతనం సేసి గుడిసెలో డబ్బు దాచాడట. పదవే పోలీసుస్టేషన్ కి' అంటూ లబోదిబోమని ఏడుస్తున్నదాన్ని లాక్కెళ్లినారండి. గుడిసెల్ల అంతా ఆడోళ్లే. మగాల్లంతా పనికి పోనారు. ఆడోళ్లు అడ్డుపడితే అందరినీ లాఠీతో బెదిరించి లాక్కెళ్లిపోనారు బాబూ! నేనింటికాడకొచ్చేసరికి ఆడోళ్లంతా యిసయం చెప్పారు. నే దొంగతనం సేయడం ఏటి, డబ్బేటి, దాన్ని లాక్కెళ్లడం ఏటి? ఏటి బాబయ్య ఈ గొడవంతా? బాబూ, ఇన్ స్పెక్టరు బాబుకి యిసయం సెప్పాలని వచ్చాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS