Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 24

"మీరు చేసేదా బొగ్గుల వ్యాపారం! అంటే నిప్పు అన్నమాట. మీ మిత్రుడు చేసేది ఉప్పు, పప్పుకి సంబంధించిన వ్యాపారం. ఆ కొట్లోని ఉప్పు వెళ్ళి ఈ కొట్లో నిప్పు మీద పడితే ఏమవుతుంది? చిటచిట లాడుతుంది. మీరిద్దరూ మిత్రులయినా, మీరు చేసే వ్యాపారం పరస్పరం విరుద్ధమైనది కావటంతో ప్రయాణంలో అడ్డంకులు తప్పవయ్యా! ఉప్పు, నిప్పు వల్లనే ఈ అవరోదాలు అనుకో." పుండరీకాక్షయ్య అలా అనంగానే, ఇరువురూ పడీ పడీ నవ్వారు.
"మీరు భలే తమాషాగా మాట్లాడుతారు!" అని కూడా మెచ్చుకున్నారు.
"నిజం చెప్పాలంటే ఇవన్నీ కాలక్షేపం కబుర్లు. నేను ఎప్పుడు ఏ వూరు ప్రయాణమయి వెళ్ళినా, ఏ అడ్డంకీ రాలేదు. మరి ఈతఫా ఇలా ఎందుకు జరిగిందంటే ఏం చెబుతాం" అన్నాడు పుండరీకాక్షయ్య.
"దానికీ ఒక కారణం వుందిలేండి!" అన్నాడు పర్వతరావు.
"కారణమా?" నిజంగా అర్థంకాకనే అడిగాడు పుండరీకాక్షయ్య.
"మీరు మాతో కలసి ప్రయాణం చేస్తున్నారు కదా. అదన్న మాట విషయం! మా ఇది మీకు కూడా అంటుకున్నదండి! చూశారా! మా జాతకాలు ఎంత గొప్పవో!"
పర్వతరావు చెప్పింది విని, పుండరీకాక్షయ్య పడీ పడీ నవ్వాడు ఈ తఫా.
"అనుకోకుండా కొన్ని జరుగుతూ వుంటాయి. అంత మాత్రం చేత ప్రతిసారీ అలా జరగాలని లేదు. నమ్మకం అనేది కూడా ఒక రకమైన చాదస్తమే." వీళ్ళ సంభాషణ వింటున్న నాలుగో వ్యక్తి కల్పించుకుని అన్నాడు.
అతని వయస్సు నిండా ముప్ఫై కూడా లేదు.
అతని వేష భాషలు చూడంగానే చదువుకున్న వాడిలాగా తెలిసిపోతున్నాడు. అతని పేరు గోవర్ధన్.
"ఒకే రకంగా ఒకటికి పదిసార్లు జరుగుతూ వుంటే అది వుందో, బూచో అని నమ్మకుండా ఎలా వుంటాం? మావూళ్ళో ఒక ఇల్లుంది. ఆ యింట్లో ఎవరు అద్దెకి దిగినా, ఆర్నెల్లు పూర్తికాకుండానే అద్దెకి దిగిన కుటుంబంలోని ఒక శాల్తీ ఎగిరిపోతుండేది. అలా నాలుగు కుటుంబాలకి జరిగింది. దాంతో ఆ యింట్లో ఎవరు అద్దెకి దిగాలన్నా భయపడుతూండే వారు. ఆ యింట్లో దిగినవారు చావటం ఖాయం అని తెలిసిన తరువాత చూస్తూ చూస్తూ ఎవరు మాత్రం ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. చివరకి ఎవరు అద్దెకి రాకపోయేసరికి, ఆ యింటిని అద్దెకి ఒక గోడౌన్ కి ఇచ్చేశారు" అని చెప్పాడు పర్వతరావు.
"గోడౌను అద్దెకి తీసుకున్న వాళ్ళెవరూ చావలేదా?" పుండరీకాక్షయ్య అడిగాడు.
"ఎవరూ చావలేదు. ఆ యింట్లోవున్న పిశాచానికి సవ్యంగా సంసారం చేసుకునే వాళ్ళు వుండడం ఇష్టంలేక పోయిందేమో!"
"పిశాచాలు వున్నాయని మీరు నమ్ముతున్నారా?" ఈ తఫా గోవర్ధన్ అడిగాడు.
"పిశాచాలు వున్నాయో, లేదో నేనెప్పుడూ చూడలేదు గానీ, నా మటుకు నాకు కొన్ని అనుభవాల ద్వారా నమ్మకాలు ఏర్పడ్డాయి."
"ఏమిటవి?"
మా ఇల్లు కాస్త పెద్దదే. తొమ్మిది గదులు, మెస్ వున్న వరండా చూడచక్కగా వుంటుంది. వరండాలో పడుకున్నా, ఆరుబయట పడుకున్నా మా యింట్లో వున్న ఎనిమిది గదుల్లో పడుకున్నా, ఎక్కడ పడుకున్నా హాయిగా నిద్రపోతాను. కానీ ఉత్తర దిక్కున వున్న మరో గదిలో పడుకుంటే మాత్రం చచ్చినా నిద్ర పట్టదు. ఆ గదికి నేను తొమ్మిదో గది అని పేరుపెట్టాను. ఆ గదిలో పడుకుంటే నోరు ఆర్చుకుపోవటం, పీడకలలు రావటం, నిమిషానికి ఒకసారి ఉలికిపాటుతో లేవటం, మనసంతా ఏదో దిగులుగా వుండటం, ఇలా జరగటమే కాక, 'ఈ గదిలోంచి లేచి అవతలకి వెళ్ళి పడుకుందాం. ఈ గదిలోంచి లేచి అవతలకి వెళ్ళి పడుకుందాం.' అని రాత్రంతా అనిపిస్తూనే వుంటుంది. "ఇది నా అనుమానమో, భ్రమో అని ఎన్నిసార్లో అనుకున్నాను. నాది భ్రమకాదు. కించిత్ మార్పు కూడా లేదు. ఇలా జరుగుతూ వుంటే నమ్మక చస్తానా!" అన్నాడు ముత్యాలరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS