పుండరీకాక్షయ్య ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా లేచాడు. "ఆ బస్సు వస్తుందో, చస్తుందో ఎవరికి తెలుసు! నేను కూడా వస్తాను పదండి! ఈ బస్సులోనే వెళదాం!" అన్నాడు.
బెంచీ మీద గొడుగు చూపిస్తూ "మీరు గొడుగు మర్చిపోయారు!" అన్నాడు వారిలో ఒకాయన.
'కంగారులో మర్చిపోయాను. గుర్తుచేశావు నాయనా!' అంటూ గొడుగుని తీసుకుని అలవాటు ప్రకారం చంకలో పెట్టుకుని, పచ్చబ్యాగ్ ని చేతిలో పుచ్చుకుని వారి వెనుకనే బయలుదేరాడు పుండరీకాక్షయ్య.
గుంటూరు వెళ్ళే బస్సులు ఆగిపోవటంవల్ల, చాలామంది అడ్డదోవన వెళ్ళే ప్రయత్నంలో వుండటంవల్ల వచ్చిన బస్సు అయిదు నిమిషాల్లో నిండింది.
వీళ్ళుకూడా ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా బస్సు ఎక్కారు.
వీళ్ళు బస్సు ఎక్కటమే ఆలస్యంగా బస్సు ప్రయాణమయింది.
సరిగ్గా నాలుగు నిమిషాల తరువాత.
పోలీసులు వెళ్ళిపోవటం చూసి రాజులుగాడు లావెట్రీ నుండి బయటకి వచ్చాడు.
రాజులుగాడు కళ్ళు ముందుగా బెంచీమీద పడ్డాయి.
పుండరీకాక్షయ్య, పచ్చ బ్యాగ్ రెండూ లేవు. రాజులగాడి గుండె ఒక్కక్షణం ఆగి కొట్టుకోవటం మొదలుపెట్టింది.
పుండరీకాక్షయ్య కోసం నలువైపులా చూశాడు రాజులుగాడు.
ఇంకెక్కడి పుండరీకాక్షయ్య? అప్పటికే ఆయన ఎక్కిన బస్సు అరమైలు దూరం వెళ్ళిపోయింది.
ఎంత తెలివితక్కువ పని చేశాను? అని ఆలోచిస్తూ రాజులుగాడు అక్కడే నిలుచుండి పోయాడు.
12
"మీరు చెప్పకపోతే నాకు బస్సు సంగతి తెలిసేది కాదు!"
బస్సులో కూర్చుని క్రొత్తవారితో ప్రయాణం చేస్తున్న పుండరీకాక్షయ్య అన్నాడు.
"మాకూ తెలియదు. గతంలో ఇలాంటి అనుభవం మాకూ ఎదురయ్యింది. ఒక తెలిసిన ఆయన ఈ రూట్ గురించి చెప్పాడు. అప్పుడు మేము ఇలాగే బస్ పట్టుకుని క్షేమంగా వెళ్ళటం జరిగింది." పర్వతరావు అనే ఆయన వివరించాడు.
"నేను చూస్తున్నాను కదరా! మనిద్దరం కలిసి ప్రయాణం చేస్తే చాలు ఏదో ఒక ట్రబులు" అన్నాడు ముత్యాలరావు అనే ఆయన.
వాళ్ళిద్దరిదీ ఒకే వూరు. ఇరువురూ ప్రాణ స్నేహంగా వుంటారు. చెరోరకం వ్యాపారం చేస్తూంటారు. దానివల్ల వాళ్ళు కలిసి తిరగటానికి కూడా లేదు. అరుదుగా ఎప్పుడో ఇలా ఒకసారి కలిసి ప్రయాణం చెయ్యటమో, ఎక్కడకన్నా వెళ్ళటమో చేస్తారు. అదేం ఖర్మో వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరితే చాలు ఇలా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ వుంటుంది.
పర్వతరావు, ముత్యాలరావు కబుర్లతో గతాన్ని తిరగదోడుకుంటూ సరదాగా ప్రయాణిస్తూ వుంటే వాళ్ళ కబుర్లలో పుండరీకాక్షయ్య కూడా పాలుపంచుకున్నాడు.
"మీరేం వ్యాపారం చేస్తున్నారు?" అడిగాడు.
"నాది బొగ్గుల వ్యాపారం" చెప్పాడు ముత్యాలరావు.
"మీరేం వ్యాపారం చేస్తుంటారు?" ఈ తఫా రెండో అతన్ని అడిగాడు పుండరీకాక్షయ్య.
"ఉప్పు, పప్పు, పచారీ దుకాణం" రెండో అతను చెప్పాడు.
"అదన్నమాట విషయం." నవ్వుతూ అన్నాడు పుండరీకాక్షయ్య.
"మీరేమంటున్నారో అర్ధంకావటం లేదు!" అన్నాడు పర్వతరావు.
"దీంట్లో అర్థంకాక పోవటానికి అంటూ ఏముంది?" నిప్పుమీద ఉప్పు పడితే ఏమవుతుంది చిటచిటలాడుతుంది."
"మీ మాటలు ఇంకా అర్థం కాలేదు!" అన్నాడు పర్వతరావు.
